"అన్నయ్యా! చెల్లెల్ని కాపాడతానని మాటిచ్చావు. అది ఇదేనా?" మూసుకున్న రెప్పల కిందనుండి కన్నీళ్లు కారిపోతుంటే సూర్యని తలచుకుంది సులోచన.
ఏ ఇంజెక్షన్ కీ ఆగని రక్తస్రావం ఆగిపోయింది.
పరామర్శించడానికి వచ్చిన ఇరుగు పొరుగువాళ్లు అన్నారు ఆ ఇల్లు మంచిదికాదని.
"ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా రెండుమూడు నెలలకంటే ఎక్కువ వుండరు. ఏదో ఒకటి అవుతుంది. గుండ్రాయిలా వున్న ఒకాయనకి గుండెలో నొప్పొచ్చి ఉన్నపళంగా క్రింద విరుచుకుపడి పడుతూనే ప్రాణం పోయింది. మీకంటే ముందున్న వాళ్ల పిల్లాడు డాబా ఎక్కుతూ మెట్లమీదనుండి పడి చనిపోయాడు" పక్కింటి పిన్నిగారు చెప్పారు సులోచనని చూడ్డానికి వచ్చి.
"ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు పిన్నిగారూ?"
"మీకలాంటి నమ్మకాలు వున్నాయో లేదో, చెబితేమనుకుంటారోనని చెప్పలేదు"
నాలుగు రోజుల తరువాత డిశ్చార్జ్ అయ్యాడు రాజేంద్ర.
సూర్య చెప్పిన రెండు మాటల్లో ఒకటి అక్షరాలా నిజమైంది. ఒకటి నిజమై మరొకటి అబద్దం కావడానికి వీల్లేదు.
పూర్తిగా కట్లు కూడా విప్పకముందే మార్వాడీ శేఠ్ యింటికి వెళ్లాడు.
"లంకెబిందెల విషయం ఫోన్ లో అడిగారు. మీకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాము. పోలీసులకి తెలిస్తే, లేనిపోని గొడవలొస్తాయని ఏం లేదని చెప్పాను. నెలరోజులక్రితం నిజంగానే లంకెబిందెలు దొరికాయి. మా ఇంటి పక్కన పాడుబడ్డ ఇల్లొకటి అమ్మకానికి వస్తే కొన్నాం. కొత్త ఇల్లు అద్దెకివ్వచ్చునని. పునాదులు తవ్వుతుంటే గునపంతో తవ్వుతున్న మేస్త్రీకి ఖళ్ ఖళ్ మని శబ్దం వచ్చిందని చెప్పాడు. నాన్నగారికి అనుమానం వచ్చి పనివాళ్లందర్నీ పంపించివేశాడు. చీకటిపడ్డాక స్వయంగా గునపం తీసుకుని తవ్వారు. లంకెబిందెలు బయటపడ్డాయి. చప్పుడు కాకుండా తెచ్చి ఇంట్లో దాచారు. వారం రోజులవరకు బాగానే వున్నారు తరువాతే పిచ్చి పిచ్చిగా చేయడం మొదలుపెట్టారు. ధనం దొరికిందన్న సంతోషం పట్టలేక ఆయనకి పిచ్చెక్కిందేమోనని అనుకున్నాం. నేనే వచ్చి మీకీ విషయం చెబుదామనుకున్నాను. మీ ఇంట్లో ఏదో గొడవై హాస్పిటల్ లో చేరారని తెలిసింది. మీకెవరు చెప్పారు డాక్టర్.
"ఒక దేవుడు!"
సులోచనకి కొంచెం కులాసా చిక్కాక ఆమెతో కలిసి వచ్చిన రాజేంద్ర మాతో చదివిన జయసూర్యేనా అని ఆశ్చర్యపడేలా చేసావు. నువ్వు మా స్నేహితుడివై నందుకు గర్విస్తున్నాంరా!" అతడి గొంతు పట్టుకున్నట్లుగా.
"అన్నయ్య ఇచ్చే పసుపుకుంకుమ కోసం వచ్చాను అన్నయ్యా" కన్నీళ్లతో కొంగు పట్టింది సులోచన.
"ఆ రోజు ఆయన దగ్గరనే అనుకున్నాం. స్పృహ తప్పుతుంటే నిన్నే తలచుకున్నాను. ఇరుగు పొరుగునవున్న వాళ్ళంతా పరుగున వచ్చి, ఆ రౌడీమూకను అడ్డగించారు. లేకపోతే ఆయన్ని చంపిగాని కదిలేవాళ్లు కాదు. అంత ఆగ్రహంతో వచ్చారు వాళ్లు. వాళ్లతోపాటే వచ్చిన ఘనశ్యామ్ తన తండ్రికి బాగయ్యే మార్గం చెప్పమన్నాడు. ఏదో మంత్రమో తంత్రమో చేయమన్నాడు."
"మంత్ర తంత్రాలతో పనిలేదు. ఆ ముదనష్టపు సొమ్ము తీసుకుపోయి తిరుపతి హుండీలో వేయండి. వేదపండితులను పిలిచి, శాంతి హోమం చేయించండి. అంతా శుభం అవుతుంది."
"మీకీ దివ్యశక్తి ఎలా వచ్చింది సూర్యా?" రాజేంద్ర అబ్బురంగా అడిగాడు.
"అంతా పూర్వజన్మ సుకృతం. భగవదమగ్రహం" అంతకుమించి సూర్య చెప్పదలచుకోలేదు.
"కానీ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. మెడిసిన్ కు సంబందించిన డాక్టర్ గ వుండడమే నాకిష్టం. తాంత్రికుడిగానో, మాంత్రికుడిగానో ప్రచారం కావడం నాకిష్టంలేదు. నా వాళ్లకి ఆపద వస్తుంటే, మనసు పట్టలేక చెప్పానేగానీ మానవాతీత శక్తులున్నవాడిగా, ప్రపంచానికి చాటుకోవాలని లేదు."
సూర్య చేతుల నుండి సారె, చీర అందుకుని, తృప్తిగా కారెక్కుతున్న సులోచనతో అన్నాడు సూర్య "పండంటి పాపాయిని ఎత్తుకుని మరోసారి వస్తావమ్మా!"
ఊరు దాటుతూనే హరితవర్ణపు తివాసీ పరచినట్లుగా వరిపైరులు, పైరుల మధ్య ఒడ్డుల మీద నడవడం అంటే ఇష్టం సూర్యకి. నడిచి నడిచి చివరికి నది ఒడ్డుకు చేరుకున్నాడు సూర్య.
సూర్యస్తమయం వేళ ప్రకృతిని తిలకించడమంటే మాహా ఇష్టం సూర్యకి.
అవే కొండలు, గుట్టలు, అదే నది ఒడ్డు! అవే పిట్టలు, కొంగలూ, సాయం సంధ్యలో వాటి అందంవేరు. ఆ శోభ హృదయానికి గాలం వేస్తున్నట్లుగా వుంటుంది.
ఒంటరిగా నిశ్శబ్దంగా రేవు మెట్లమీద కూర్చున్నాడు సూర్య.
చేప కోసం నీటిమీద ఎగురుతోంది లకుముకి పిట్ట. బాతుల గుంపు ఏటి అంచున చేపల షికారు ముగించి, ఇళ్లకి బయల్దేరుతున్నాయి. తెల్లచీర కట్టుకుని, రాజహంస కూర్చుందేమో అన్నట్లుగా నీటిలో తేలిన ఒక రాయి మీద కూర్చుని, నీళ్లల్లోకి రాళ్లు విసురుతోంది ఒక యువతి.
"ఓ! చంద్ర కదూ!"
"ఏమిటి సంగతి!నీకూ కావలసి వచ్చిందా ప్రకృతి శోభ?" చనువుగా, హాస్యంగా అడిగాడు సూర్య.
"ఏం నేను మనిషిని కాదా? మనిషి జన్మ ఎత్తినవాడికి ఏం కావాలో అవి అన్నీ నాకూ కావాలి."
"ఎత్తింది మనిషి జన్మేఅయినా ఇప్పుడు జీవిస్తున్నది పిశాచిరూపంలో కదా!"
"పిశాచినెందుకయ్యాను? నీవల్లేకదా! నిన్ను చంపి, నీకూ నా రూపం వచ్చేలా చేద్దాం అనుకున్నాను. ఏదీ? ఎప్పుడూ నీవెంట ఒక కోతి వుంటుంది. పెద్దకోతి. నిన్నేమయినా చేద్దాం అనుకునేంతలో ఆ కోతి తోకతో ఎత్తి నేలకేసి్ కొడుతుంది. నాకు తెలిసింది నిన్ను ద్వేషించి లాభం లేదని, నీతో స్నేహమే మేలని, అందరి ఛీత్కారాలు తింటూ, చీపురు దెబ్బలు తింటూ పిశాచిగా వుండాలని నాకేం లేదు. ఇప్పుడు నీ దగ్గర గొప్ప శక్తి వుంది. అది యోగశక్తి తిమ్మడిగా వున్నప్పుడు నువ్వు సంపాదించిన యోగశక్తి .ఆ శక్తిని ఉపయోగించి, నన్ను బంధవిముక్తి చేయి ఈ పిశాచి రూపం నీవల్లే తొలగాలి"
"ఏం చేస్తే నీకీ పిశాచిరూపు పోతుంది?"
"ఒక అనాథ శవంలా నీ మనుష్యులతో రాత్రికి రాత్రే నీ బంగళా వెనుక మామిడితోటలో పూడ్పించావు. ఒక్కనాడు కూడా కూడు, నీళ్లు ఎరుగను. ఆకలితో, దాహంతో ఎంత అలమటించిపోయానో నీకేం తెలుసు. ఒక్క కన్నీటి బొట్టుకు కూడా నోచుకోలేదు. నేను చస్తే కనీసం కన్న తల్లికి కూడా తెలియనీయలేదు నా చావు గురించి. అనాథ ప్రేతాన్ని అయ్యాను."
"ఇప్పుడేం చేయాలో చెప్పు?"
"మట్టిలో వున్న నా అస్తిపంజరాన్ని బయటకి తీసి, దానికి అగ్ని సంస్కారం కలిగించు. శాస్త్రోక్తంగా పిండప్రదానం చేసి, నా ఆకలి తీర్చు."
"అప్పుడయినా నీ ఆత్మ శాంతిస్తుందా?"
"నా ఆత్మ పూర్తిగా శాంతించాలంటే. నన్ను నువ్వు వివాహమాడాలి."
"నేను బ్రతికుండగా అది అసంభవం కదా?'
"అందుకే నువ్వు చావాలి. నీ అంతట నువ్వు చావాలి. అంటే ఆత్మ హత్య చేసుకోవాలి."
"ప్రాణాలమీద పెద్దగా తీపి వున్నవాడిని కాను. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికైతే మాత్రం నేను చావను. అదేం మహత్కార్యమని?"
"మహత్కార్యం కాదేమోగానీ నువ్వు చేసిన పాపిష్టి పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లేదా?" నీవల్ల నాశనమయిన ఒక జీవితాన్ని సరిదిద్దాలని లేదా?
"ఇంకా నీకొక జీవితముందా?"
సూర్య స్వరంలో వినిపించిన ఎగతాళికి భగ్గుమన్నట్లుగా అయింది చంద్ర.
"ఎన్నో కలలు! కన్నెకలలు. చెంచుపిల్లగా చంద్రగా నేను కన్న కలలు. ఆడుతూ పాడుతూ తిరిగే చెంచుపిల్లను .అమాయకంగా నిన్నేప్రేమించాను. నీకోసం తహతహలాడాను. నీ కౌగిటి కోసం పరితపించాను. నీ ధ్యాసేమో మంత్ర తంత్రాలమీద. నీ కాంక్ష అంతా మానవాతీత శక్తుల్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలనీ, గొప్ప తాంత్రికుడిగా పేరు పొందాలని. నేను విసిరే వలలో పడ్డట్టే పడి తప్పించుకుపోయేవాడివి. నీలో పొంగులెత్తే ప్రేమను నిర్దాక్షిణ్యంగా అణచివేసుకునేవాడివి. నేను నీ లక్ష్య సాధనకు ఆటంకమని తలిచావు. కొండగుహలో నువ్వు నిక్షిప్తం చేస్తున్న ధనరాశికి బలి ఇవ్వడానికి నీకో కన్నెపిల్ల కావలసి వచ్చింది. ఆ కన్నెపిల్లకు వుండవలసిన లక్షణాలన్నీ నాలో నీకు కన్పించాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, నన్ను కొండగుహకు తీసుకుపోయావు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, స్నానంచేసి రమ్మన్నావు. పెళ్లి వేడుక కదా సంబరం చేసుకోవద్దా అంటూ ఏదో త్రాగించావు. మైకంలో ముంచావు. తల తెగ నరికావు. స్త్రీ హత్యాపాతకం నిన్ను వెంటాడుతుంటే, పశ్చాత్తాపంతో కుమిలిపోయావు.
ఎవరైతే నీ లక్ష్యసాధనకు అడ్డుకున్నావో, ఆమె లేని ప్రపంచం నీకు శూన్యమనిపించింది. విరక్తితో హిమాలయాల్లోకి వెళ్లిపోయావు. ఆత్మానందుల శిష్యుడివై తపస్సులో మునిగిపోయావు. మరుజన్మలో మణిచంద్ర భూపాల్ గా పుట్టావు. తిమ్మడిగా ఏ స్త్రీ వాంఛనైతే నిర్దాక్షిణ్యంగా అణచి వేశావో, అదే స్త్రీ వాంఛ పొంగులెత్తి నిన్ను స్త్రీ లాలసుడిగా మార్చి వేసింది. నువ్వు తిమ్మడిగా వున్నప్పుడు, నీ కౌగిటికోసం తపించాను. నీ కౌగిటిలో మరణించినా చాలు అనుకున్నాను. చంద్రరేఖగా పుట్టిన నాకు చిత్రంగా నీ కౌగిలి లభించినా, అది నాకు ఇనుప పంజరమైంది. నా మానాన్ని, ప్రాణాన్ని హరించింది.