"ఏం కానడమేమిటి సామీ? వీడు మీ మీదకి కత్తి విసిరి చంపబోయాడు కదా?"
"ఏదీ? ఎక్కడ?" తన శరీరంవేపు చూసుకున్నాడు.
భుజంమీద కట్లు కనిపించింది. వీపుమీద గాయపునొప్పి తెలుస్తూనే వుంది.
"ఇందాక నువ్వేకదన్నా మంచె దిగొచ్చి గాయంమీద ఆకుపసరు పోసి కట్టు కట్టింది? ఇప్పుడు ఏం ఎరుగనోడి లెక్క అడుగుతున్నావేంటి" అన్నాడు.
స్వామి లీల చాటడానికి ఒక మనిషి కావాలనుకున్నాడేమో?
ఇందాక కదలని కాళ్లు ఇప్పుడు కదులుతున్నాయి. బొక్కబోర్లా పడ్డవాడు కూడా నెమ్మదిగా లేచాడు.
"నేనా? కట్టు కట్టిన్నా. ఇయాల ఏం మొద్దు నిద్రపట్టిందో నాలుగింటికి లేచేవోణ్ని. తెల్లగా తెల్లారిపోయినంక కళ్లు తెరిచిన"వెర్రిముఖం వేసుకున్న రైతు సూర్య భుజానికున్న గుడ్డను తడిమి చూసాడు.
"నువ్వే అన్నా మంచె దిగి లాంతరు పట్టుకువచ్చి ఈ అయ్యకి కట్టు కట్టినావ్."
అది వుత్సవ విగ్రహానికి ధరింపజేసే పట్టు ఉత్తరీయం.
దాని అంచులు జరీతో మెరుస్తున్నాయి.
గుర్తుపట్టాడు రైతు.
రోజూ స్వామి సేవచేసే సూర్య కూడా గుర్తుపట్టాడు.
అది స్వామి ఉత్సవ విగ్రహానికి ధరింపజేసే ఉత్తరీయమని.
కాషాయపు రంగులో వుంది.
సాక్షాత్తూ స్వామి వచ్చి తన గాయానికి కట్టు కట్టాడు.
తన భక్తులపట్ల ఆయనకి ఎంతటి వాత్సల్యమో కదా?
కానీ స్వామి తనకి కనిపించలేదే?
కత్తి విసిరినవాడు పరుగునవచ్చి సూర్య కాళ్లమీద పడ్డాడు.
"ఆ నిముషాలనికేమైందో తెలియదు సామీ!చెట్టుకింద నీ మానాన నువ్వు కూకుంటే నిన్నెందుకు పొడవాలనిపించిందో, నీమీద ఎందుకట్ల కోపం వచ్చిందో? దొంగతనానికి వచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఎల్లాల్సినోడిని నిన్నెందుకు పొడవాలనిపించిందో?నీమీద కత్తి ఇసరంగానే కరెంటు తీగ పట్టుకున్నట్టయింది నాకు. ఇంక ఆ మీదట ఏమయిందో నాకు తెలివి లేదు."
అతడికి అర్దంకానిది సూర్యకి అర్దమయింది.
మంచెమీద తల విరబోసుకు కూర్చున్న చంద్ర విరగబడి నవ్వుతోంది.
పిచ్చిపట్టినదానిలా నవ్వుతోంది.
నవ్వి నవ్వి ఏడుస్తోంది.
ఆమె మీద జాలితప్ప కోపంరాలేదు సూర్యకు.
ఆ రోజుతో తన దీక్ష పూర్తయింది.
స్వామికి ఆకుపూజ చేయించి ఇంటికి బయలుదేరాడు.
యుద్దంలో గెలిచి ఇంటికి వెడుతున్న వీరుడిలా వుందతడి మనసు.
జన్మజన్మలుగా అతడిలో సంకుచితమైన అపూర్వశక్తులకు తెరతొలగినట్లుగా కూడా అయింది.
ఇక్కడ చనిపోయి మరొకచోట పుట్టే మనిషికి పూర్వజన్మ వుండకపోయినా, పూర్వజన్మ సంస్కారం మట్టుకు అతడి వెన్నంటే వస్తుందని చెబుతారు జ్ఞానులు.
భక్తిమార్గంద్వారానో, జ్ఞానమార్గంద్వారానో, మంత్రజపంద్వారానో సంపాదించుకున్న జ్ఞానమార్గం ద్వారానో, మంత్రజపం ద్వారానో సంపాదించుకున్న ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక సంపద కూడా అతడిలో గుప్త నిధిలా నిక్షిప్తమయ్యే వుంటుందంటారు. అవి సందర్బాన్నిబట్టి బయటపడుతుంటాయి.
* * * * *
"ఎన్ని లెటర్స్ రాసినా నీనుండి రిప్లయ్ లేదు. ఏమిటి సంగతి? ఎందుకీ మౌనం?"
ఒకనాడు ఇద్దరు స్నేహితులు రాజేంద్ర, సుమీత్ యుద్దానికి వచ్చినట్లుగా వచ్చారు కారేసుకుని.
"ఇంతకీ మా లెటర్స్ అందాయా లేదా?"
"అందాయి'
'మరి రిప్లై ఎందుకివ్వలేదు? ఏమయింది నీకు? నా డిస్పెన్సరీ ఓపెనింగ్ కు రాలేదుసరికదా కనీసం గ్రీటింగ్స్ కూడా పంపలేదు. ఈ పల్లెటూళ్లో డాక్టర్ గా అంత బిజీ అయ్యావా? లేక మమ్మల్ని మరచిపోయావా"
'ఈ పల్లెకీ. చుట్టుపక్కల ప్రాంతాలకీ నేనొక్కడినే డాక్టర్ కదా! బిజీగా వున్నట్టే!
"హార్ట్ స్పెషలిస్ట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవాలని వుందనేవాడివి. పెద్ద హాస్పిటల్ కట్టాలని, దాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనేవాడివి. అవన్నీ ఏమయినాయి? ఈ పల్లెటూళ్లో సమాధి చేసేశావా?"
"హార్ట్ గురించి ఇప్పుడు చదవడం మొదలు పెట్టాడు. అంటే లబ్ లబ్ మని కొట్టుకునేకాదు, మనసుకు సంబంధించిన హార్ట్ గురించి తెలుసుకుంటున్నాను" అన్నాడు సూర్య.
"ఛత్! వేదాంతం మాట్లాడకు. మనదంతా ప్రాక్టికల్. మాటైనా, మనం నడిచే బాటైనా, మా మామగారికి చెప్పాను మనం ముగ్గురం కలసి పెట్టబోయే హాస్పిటల్ గురించి. ఆయన కొంత డబ్బు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సమీత్ కి ఎక్కడా జాబ్ చేయడం ఇష్టం లేదుట. అతడు కూడా మన హాస్పిటల్ కి కొంత పెట్టుబడి పెట్టి, మన హాస్పిటల్ లోనే పనిచేస్తానంటున్నాడు. మనం ముగ్గురం కూర్చుని, మన హాస్పిటల్ కి సంబంధించిన ప్రాజెక్ట్ తయారుచేద్దాం. బడ్జెట్ ఎంతవుతుందో ముందు తేలాలి. ఆ విషయం మాట్లాడటానికే మేం ఇద్దరం కలిసి వచ్చాం "
"ముందు భోజనాలు కానివ్వండి. తరువాత అలాగే కూర్చుని మాట్లాడదాం."
"ఉదయం స్నానం చేయకుండానే బయలుదేరాం. దారిలో దుమ్ము, ధూళీ.... డర్టీ రోడ్స్ కదా! ఇక్కడికి వచ్చాక చేస్తే ప్రెష్ గా వుంటుందని....."
"దానికేం భాగ్యం అయ్యగారూ! రండి బాత్రూమ్ చూపుతాను...." రాందత్ అన్నాడు.
బ్రీఫ్ కేస్ లోంచి లుంగీ, బనియన్స్, టవల్స్ తీసుకుని రాందత్ వెంట వెళ్లారు.
భోజనాలు అయ్యాక మిత్రులు ముగ్గురూ కూర్చున్నారు.
సిటీలో హాస్పిటల్ కట్టాలన్న నా ఆలోచన మారలేదుగానీ, నాకు కొంత టైం కావాలి. ప్రస్తుతం ఆర్దికంగా పరిస్థితి అంత అనుకూలంగా లేదు. పోతే మా నాన్నగారు ఈ వూరు విడిచి రాలేరు. ఆయన్ని విడిచి నేను రాలేను. ఆయన వున్నంతవరకూ నేను ఇక్కడ్ వుండాలనుకుంటున్నాను."
"స్వంతంగా హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన కలిగించిన వాడివే నువ్వు. నువ్వే వెనక్కి తప్పుకుంటే ఎలా?"
"చెప్పాకదా - నాన్నగారి ఆర్దిక పరిస్థితి బాగుండలేదని. ఆయన్ని ఇబ్బందిపెట్టడం నాకిష్టంలేదు."
"రావుబహద్దూర్ కృష్ణభూపాల్ గారి కొడుకుని... నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? కోరుకోవాలేగానీ కొండమీది కోతినైనా తెప్పించగలిగే నువ్వే ఈ మాటలు మాట్లాడితే, సామాన్యులం.... మేమెంత నీముందు?"
"దానిదేముంది? బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయి."
"ఇక్కడికి వచ్చి వేదాంతం బాగా వంటబట్టించుకున్నావే! చాలా మారావు" నిష్టూరంగా అన్నాడు సమీత్.
"సరేగానీ - మన హాస్పిటల్ బిల్డింగ్ కి సిటీలో మంచి సెంటర్ లో ప్లేస్ చూసిపెట్టి వచ్చాం. నువ్వొకసారి వచ్చిచూసి ఓకేచేస్తే , బేరం సెటిల్ చేసి కొనేద్దాం. ముందు స్థలం కొని పడేస్తే తరువాత హాస్పిటల్ నిదానంగా ఆలోచించుకోవచ్చు" అన్నాడు సమీత్.
"అలాగే! నా డిస్పెన్సరీ కూడా చూడొచ్చు. ఏం? ఎప్పుడొస్తావు చెప్పు?"
"సీరియస్ కేసులేమీ లేకపోతే ఎల్లుండో, అవతలి ఎల్లుండో వస్తాను"
"మీ నాన్నగారిని పరిచయం చేయలేదేం?"
"ఆయన లేరు. ఉత్తరదేశ యాత్రకి వెళ్లారు. "ఆ రోజంతా అక్కడే గడిపారు స్నేహితులు. సాయంత్రం నదికి షికారు వెళ్లారు.
పెద్ద బంగళా, బంగలా దగ్గరలోనే నది, బంగళానుండి నదివరకు మెట్లు, నదిలో తిరిగే పుట్టీలు.
చేపలుపట్టే బెస్తలు, నీటి పక్షులు. ఎంత చూసినా తనివితీరనట్లుగా వున్నసుందర ప్రకృతి.
"నువ్వెందుకు ఈ పల్లెటూరిని విడిచి రాలేకపోతున్నావో ఇప్పుడర్దమయింది. చాలా ప్రశాంతంగా వుందిక్కడ. ఆలోచిస్తే -ప్రశాంతతను మించినది ఏదీలేదు. ఎంత వున్నతి సాధించినా, ఎంత సంపాదించినా ప్రశాంతత లేకపోతే అంతా వ్యర్దమే....." అన్నాడు సుమీత్.
మరురోజు ఉదయం బయలుదేరుతూ తన డిస్పెన్సరీ చూడ్డానికి తప్పక రమ్మని చెప్పాడు రాజేంద్ర.
రెండు రోజుల తరువాత వెళ్లాడు సూర్య.
"నువ్వొచ్చావు - చాలా సంతోషంరా.... " సూర్యని కౌగలించుకుని సంతోషం వ్యక్తం చేశాడు రాజేంద్ర . డిస్పెన్సరీ అంతా తిప్పి చూపాడు. స్టాఫ్ ని పరిచయం చేశాడు.
"ఒక్క పది నిముషాలు వీళ్లని చూసి పంపేస్తాను. తరువాత ఇంటికి వెళదాం. నా శ్రీమతిని పరిచయం చేస్తాను .ఈ రోజు ఆమె చేతివంట తింటావు. చాలా బ్రహ్మాండంగా చేస్తుంది వంట."
త్వరత్వరగా పేషెంట్లని చూసి పంపేస్తున్నాడు రాజేంద్ర.
మార్వాడీ శేఠ్ లా వున్న ఒకాయన్ని ఆయన భార్యా, కొడుకు చెరో ప్రక్క పట్టుకుని వచ్చారు.
పిచ్చి పిచ్చిగా బట్టలు పీక్కుంటున్నాడు. పిచ్చి పిచ్చిగా చూస్తున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా చేతులు తిప్పుతున్నమాడు. చూడగానే తెలుస్తోంది ఉన్మాది అని.
"నిన్నటికీ ఈ రోజుకీ ఏమైనా గుణం కనిపించిందా?" అడిగాడు రాజేంద్ర.
"గుణం కనిపించలేదు డాక్టర్. రాత్రి ఒక్కసారి కూడా నిద్రపోలేదు.