Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 9


    అది గమనించి, ఏదో పనివున్నట్టు లేచి స్టేజీదిగిలోపలకు వెళ్ళాడు పరశురామ్.

    చక్రవర్తి ఊపిరి బిగపట్టాడు.

    హఠాత్తుగా పవర్ కట్....

    ఉన్నట్టుండి గందరగోళం....

    "ఎక్కడవాళ్ళక్కడ కూర్చోండి....ఎవరూ కదలొద్దు....ఎమర్జెన్సీ లైట్లు క్షణంలో వెలుగుతాయి" గార్డులు పెద్దగా హెచ్చరించారు.

    ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న చక్రవర్తి వింటినుంచి వెలువడ్డ బాణంలా దూసుకుంటూపోయి అవలీలగా ఫెన్సింగుదాటి అవతలకు జంప్ చేశాడు.

    రెండేరెండు అంగల్లో ఫుడ్ సప్లయ్ వ్యాన్ క్రిందకు చేరుకున్నాడతను.

    సరిగ్గా అదే సమయంలో లైట్లు వెలిగాయి.

    మరొక నిమిషానికి ఏమీ ఎరగనట్టు వచ్చి స్టేజీమీద కూర్చున్నాడు జైలర్ పరశురామ్.

    ఫుడ్ సాకెట్స్ ను దింపుతున్న వ్యక్తి తిరిగి తన పనిలో తను నిమగ్నమైపోయాడు.

    ప్రసంగం ముగించి కూర్చున్నాడు మంత్రివర్యుడు.

    చక్రవర్తి ఎక్కడా కనిపించకపోవడం....ఒకవేళ అతను పట్టుపడడమంటూ జరిగితే ఆ హడావిడి ఏమయినా వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించినా అలాంటి వాతావరణం ఏదీ లేకపోవడం....అతనికి పెద్ద రిలీఫ్ గా తోచాయి.

    యధావిధిగా కార్యక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి.

    ఫుడ్ పాకెట్సు దింపడం పూర్తికాగానే ఒకసారి స్టోర్సులోపలకు వెళ్ళి ఆ విషయం చెప్పి బయటకువెళ్ళి వ్యాన్ స్టార్టు చేసాడతను.

    ఆ కాస్త సమయంలో వ్యాన్ లోపలకు చేరుకున్న చక్రవర్తి లోపలవున్న లావాటి డ్రమ్ములను చాటుచేసుకుని కూర్చున్నాడు.

    జైలు ఆవరణదాటి బయట ప్రపంచంలోకి వచ్చింది వ్యాన్.

    వ్యాన్ వెళ్ళిపోయిన పదినిమిషాల తరువాత కానీ పరశురామ్ "హమ్మయ్య" తేలిగ్గా శ్వాస పీల్చుకోలేకపోయాడు.

    అంతవరకూ అతని అంతరంగంలో మెదులుతున్న ఆలోచనను అమలుజరిపే ఉద్దేశంతో లేచి నిల్చున్నాడు జైలర్ పరశురామ్.


                        *    *     *    *


    "హలో...."

    "ఎస్....రాజేంద్ర హియర్"

    "రాజేంద్రా....నేను చక్రవర్తిని"

    "నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నాను....ఇపుడు ఎక్కడనుంచి మాట్లాడుతున్నావు?"

    "ముషీరాబాద్ బస్ స్టాప్ దగ్గరవున్న ఎస్ టిడి బూత్ లోనుంచి మాట్లాడుతున్నాను."

    "ఓకే....నువ్వు అక్కడే వుండు నేను వెంటనే వస్తున్నాను."

    "ఫోన్ పెట్టి చుట్టూ పరిసరాలను గమనించడంలో నిమగ్నమయ్యాడు చక్రవర్తి.

    సరిగ్గా పదినిమిషాలు గడిచీ గడవకముందే ఎస్ టిడి బూత్ ముందు ఆగిన ఆటోలోనుంచి రాజేంద్ర క్రిందకు దిగి చుట్టూ చూశాడు.

    అతనిని గమనించడంతో దూరంగా నిలిచివున్న చక్రవర్తి పరుగులాంటి నడకతో ఆటోను చేరుకున్నాడు.

    "కమాన్....చక్రవర్తీ!"

    ఇద్దరూ అదే ఆటోలో బయలుదేరారు.

    "నిన్ను ఎవరూ ఫాలో కావడంలేదు కదా" మెల్లగా లోగొంతుకతో అడిగాడు రాజేంద్ర.

    చక్రవర్తి లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు.

    జైలు నుంచి పారిపోయి వచ్చిన టెన్షన్ లో వుండటం వల్ల రాజేంద్ర అతనిని ఎక్కువగా మాట్లాడించలేదు....

    దాదాపు అర్ధగంట ప్రయాణం తరువాత ఆటోను ఒకచోట ఆపి క్రిందకు దిగాడు రాజేంద్ర.

    ఇద్దరూ కాలినడకన బయలుదేరారు.

    రాజేంద్ర ఒక ప్లాట్ ముందు ఆగాడు.

    అక్కడ జనసంచారం చాలా తక్కువగా వుంది.

    ఎక్కడో ఒకటీ అరా తప్ప వాహనాల రాకపోకలు కూడా పెద్దగా లేవు.

    చక్రవర్తిని ఒక గదిదగ్గరకు తీసుకువెళ్ళి తాళంతీసి లోపల గడియ వేశాడు రాజేంద్ర.

    "ప్రస్తుతం నీ మకాం ఇదే చక్రవర్తీ....ఇక్కడ తెలుగువాళ్ళు వుండేది తక్కువ. కేరళ, మద్రాస్ లాంటి ఇతర రాష్ట్రాల వాళ్ళే ఎక్కువుగా వున్నారు. ఇక్కడ నిన్నెవరూ అనుమానించే అవకాశం ఉండదు...."

    "థాంక్యూ రాజేంద్ర....నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు"

    "ఇందులో శ్రమేం లేదు....ఇప్పటికే చాలాకాలం జైలులో గడిపావు....నేను దుబాయ్ లో ఉంటున్న విషయం పోయినసారి నిన్ను కలిసినప్పుడే చెప్పాను....అప్పుడే నాకు తెలిసింది నువ్వు రాణానుంచి విడిపోయావనీ.... అతని నుంచి నిన్ను ఒక అమ్మాయి వేరు చేసిందనీ....అందుకే నిన్ను ఆ విషయం అడగాలని వస్తే జైలునుంచి తప్పించే మార్గం ఆలోచించమని రిక్వెస్టు చేశావు....అప్పటి నుంచీ నేను ఆ పనిమీదే వున్నాను....నా ప్లాన్ ఇప్పటికి అమలులో పెట్టగలిగాను....

    "ఏది ఏమయినా నీమేలు ఈ జన్మలో మరచిపోలేను"

    "ఊరుకో బ్రదర్....మనమధ్య కృతజ్ఞతలు చెప్పుకోవడం ఏమిటి? కానీ, ఆ అమ్మాయి ఎవరన్నదే, నాకు సరయిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు.

    "ఇంతకూ ఆ అమ్మాయి ఎవరు? అసలు ఏం జరిగింది?"

    "చెబుతాను రాజేంద్ర....సమయం వచ్చినప్పుడు తీరిగ్గా చెబుతాను. ఆ వగలాడి పేరు శ్రీప్రియ..... అంతకుమించి వివరాలు నన్ను అడగవద్దు....వీలైనంత త్వరగా ఆమెను వెదికి పట్టుకుని నా పగ దీర్చుకోవాలి....." ఆవేశంగా అన్నాడు చక్రవర్తి.    
 

 Previous Page Next Page