పరశురామ్ మాటలతో స్పృహలోకి వచ్చాడు చక్రవర్తి.
"అబ్బే....ఏం లేదు....ఈ విషయం ప్రత్యేకించి నాకు ఎందుకు చెబుతున్నారో అర్ధం కావడంలేదు జైలర్ గారూ...." ఏమనాలో తోచక అసందిగ్ధంలో జావాబిచ్చాడతను.
"నీకు రాజేంద్ర తెలుసా?"
"రాజేంద్రా....ఆ....తెలుసు...."
"అతను నన్నుకలిసి నీ గురించి చెప్పాడు"
"ఏమని?"
"నీకు తప్పించుకునే అవకాశం కల్పించమని కోరాడు...."
"చక్రవర్తి కళ్ళల్లో కొట్టొచ్చినట్టు ఆశ్చర్యం ప్రత్యక్షమయింది.
ఎప్పుడో మూడునెలల క్రితం మాట అది....
తనను పరామర్శించడానికి వచ్చిన రాజేంద్రతో చెప్పాడు....తనను ఎలాగయినా జైలు నుంచి తప్పించుమని....ఆ మాట అడిగినందుకు కోపం వచ్చిందేమో ఆ క్షణం నుంచీ అతను అనిపించటం మానేశాడు.
అదే ఆఖరుసారి....తనను కలవడం!
పటిష్టమయిన కాపలావున్న జైలులో నుంచి ప్రాణాలతో తప్పించుకుని బయటపడడం అంత సులభమయిన పని కాదని తనకూ తెలుసు....
అయినా...ఏదో చిన్న ఆశ తనను అలా మాట్లాడించేలా చేసింది.
దాదాపు అతని విషయమే మరచిపోయాడు తను....
తొంభై రోజుల తరువాత....ఆరోజు తను అన్నమాటలు తిరిగి వింటున్నాడు.
తను వింటున్నది కలో....నిజమో తేల్చుకోలేని డైలమాలో నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నాడు చక్రవర్తి.
"ఈ రోజు సాయంత్రం నువ్వు తప్పించుకోవచ్చు"
చక్రవర్తి కళ్ళలో బయట ప్రపంచం కనిపించింది...."
"రాజేంద్రా....థాంక్యూ వెరీమచ్...." అని మనసులోనే స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడతను.
ఎలా తప్పించుకోవాలో వివరిస్తున్నాడు పరశురామ్.
"సరిగ్గా సాయంత్రం ఏడుగంటలకు హోమ్ శాఖ సహాయ మంత్రి చస్తాడు. ప్రోగ్రామ్ ప్రారంభం అయ్యేసరికి ఏడూ ఇరవై అవుతుంది. అప్పటికి ఖైదీలందరూ స్టేజీముందు కూర్చుంటారు. అందరు ఖైదీలతో పాటు ముందు రాకుండా నువ్వు వెనుకబడినట్టు మెల్లగా అడుగులువేయి. ఎవరూ గమనించకుండా ఆ చుట్టుప్రక్కలే కాస్త చీకటి ప్రదేశం చూసుకుని కొద్దిసేపు ముఖం చాటుచేసుకో....
నేను నిన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూనే వుంటాను. నువ్వు సేఫ్టీప్లేస్ లో వున్నావని నాకు అనిపించిన మరుక్షణం ఏదోపని వున్నట్టు లేచివెళ్ళిపోతాను. నీకు అదే సంకేతం....సరిగ్గా ఏడూ ముప్పయ్ అవుతుండగా ఫుడ్స్ సప్లయ్ చేసే వాన్ లోపలకు ఎంటర్ అవుతుంది. ఆ సమయానికి కేవలం రెండే రెండు నిమిషాలపాటు పవర్ సప్లయ్ నిలిచిపోతుంది....
"అంటే, అర్ధమై వుంటుందనుకుంటాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడానికే నేను లేచి వెళ్ళేది. తిరిగి కరెంట్ వచ్చేలోపు నువ్వు గ్రౌండ్స్ దాటి ఫెన్సింగ్ ఎక్కి అవతలవైపుకు దూకి....అక్కడ ఆగి వున్న ఫుడ్స్ సప్లయ్ వ్యాన్ లోకి చేరుకోవాలి....ఇందులో ఏ మాత్రం తేడా జరిగినా తరువాత నువ్వు తప్పించుకునే అవకాశం వుండదు....ఆ వ్యాన్ బయటకు వెళ్ళే వరకూ ఎవరూ నిన్ను ఫాలో చేయకుండా నేను మేనేజ్ చేస్తాను...."
చక్రవర్తి గుండెల్లో ఒక్కసారిగా ఆనందం పొంగి వచ్చింది.
మూడేళ్ళ తరువాత తను మళ్ళీ బయట ప్రపంచాన్ని చూడబోతున్నాడు....
బయట అడుగు పెట్టీ పెట్టడంతో ముందుగా తనుచేయవలసింది....తనను జైలునుంచి బయటకు రప్పించిన రాజేంద్రని కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవడం....
తరువాత....
తన జీవితంతో ఆడుకున్న నయవంచకి ఎక్కడుందో వెదికి పట్టుకోవడం....
శ్రీప్రియ ! ఎస్....ఐ వాంట్ దట్ డెవిల్!
ప్రేమ పేరుతో మోసంచేసి వంచించి, తనను జైలుపాలు చేసిన ఆ పాతకి అంతు చూడడానికే తాను తప్పించుకోవాలనుకున్నాడు తప్ప....జీవితంపై వ్యామోహంతో కాదు!
ఏ నేరం చేయకుండానే హంతకుడనే ముద్రవేసుకుని మూడు సంవత్సరాలుగా కఠిన కారాగారవాస శిక్షను మౌనంగా భరించింది ఆ వంచకి అంతుచూడాలనే!....
తనను అవమానించి తన జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నించిన ఆ వంచకి జీవితంతో....తనే చదరంగం ఆడాలి....!!
"చక్రవర్తీ నేను చెప్పింది అర్ధమయిందా?...."
పరశురామ్ రెట్టించి అడగడంతో ఆలోచనలనుంచి బయటపడ్డాడతను.
మౌనంగా తలవూపి సెల్ లోపలకు నడిచాడు చక్రవర్తి.
హోమ్ శాఖ సహాయమంత్రి ప్రసంగం మొదలయింది.
ఆయనతో పాటు వచ్చిన ఆహ్వానితులందరికీ ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఖైదీలంతా స్టేజీముందు కూర్చుని ఆయన చెప్పేది శ్రద్దగా వింటున్నారు.
కొంతమంది గార్డులు ఖైదీలచుట్టూ రౌండ్లుకొడుతూ కాపలా కాస్తున్నారు.
స్టేజీమీద వున్న జైలర్ పరశురామ్ కళ్ళు చక్రవర్తికోసం వెదుకుతున్నాయి. ప్రసంగం మొదలుకావడానికి ముందే ఖైదీలనుంచి వేరుపడి గుబురుచెట్ల చాటుకు అతను తప్పుకోవడం గమనించాడు.
ఫుడ్స్ సప్లయ్ వ్యాన్ కోసం క్షణాలను లెక్కపెట్టుకున్న పరశురామ్ కు ఆ మంత్రి మహాశయుడు ఏం చెబుతున్నాడో వినిపించుకునే స్థితిలో లేడు.
సమయం అతి భారంగా గడిచిపోతోంది....
మరొక పావుగంట తరువాత వచ్చింది వ్యాన్....