"తొందరపడకు బ్రదర్....నువ్వు బయట తిరగడానికి ఇది సమయం కాదు. తెల్లవారేసరికి నువ్వు జైలు నుంచి తప్పించుకున్న విషయం బయటపడుతుంది. ఒకవైపు పోలీసులు, మరొకవైపు రాణా మనుష్యులు నిన్ను వేటాడడం ప్రారంభిస్తారు. తన గ్యాంగ్ లో నుంచి చీలిపోయిన ఏ వ్యక్తినీ ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టనివ్వడు ఆ రాణా.....పైగా నువ్వు చిన్నతనం నుంచీ అతని చెప్పుచేతుల్లో పెరిగి అతనికి కుడిభుజంగా వున్నావు. ఒక అమ్మాయి కారణంగా నువ్వు అతని నుంచి విడిపోవడాన్ని అంత తేలిగ్గా తీసుకుంటాడని నేను అనుకోను....నిన్ను బయట తిరగనివ్వకుండా అతని మనుషులు అడుగడుక్కి అడ్డు తగులుతుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను అంతం చేయాలనే ప్రయత్నిస్తారు" చెప్పడం ఆపాడు రాజేంద్ర.
జరగబోయే పరిణామాల గురించి చెప్పడంతో చక్రవర్తి ఆవేశం కొంతవరకు చల్లారింది....అతనిలో అప్పుడే వివేకం తొంగి చూస్తోంది.
సరే అన్నట్టు నెమ్మదిగా తల వూపాడు చక్రవర్తి.
"ఇక నేను వెళతాను....ప్రస్తుతానికి ఈ డబ్బు నీ దగ్గర వుంచు, ఈ గదిలో అన్ని వసతులూ వున్నాయి....కాబట్టి బయటకు వెళ్లే అవసరం నీకు వుండదు....ముఖ్యంగా రెండు రోజులపాటు నువ్వు కిటికీ కూడా తెరవవద్దు. నీకు ఎప్పటికప్పుడు నేను అన్ని వివరాలు సేకరించి చెబుతుంటాను. కొన్ని రోజులు గడిచాక ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం" అంటూ పాకెట్ జేబులో నుంచి కొంతమొత్తాన్ని తీసి అతని చేతిలో వుంచుతూ చెప్పాడు రాజేంద్ర.
చక్రవర్తి అతనివైపు కృతజ్ఞతగా చూశాడు.
"రాజేంద్ర....ఈ సమయంలో నువ్వే గనక నన్ను ఆదుకునివుండకపోతే...."
మనమధ్య అలాంటి మాటలు ఎందుకు బ్రదర్....ఒకప్పుడు నేనూ నీ మార్గంలో ప్రయాణించినవాడినేగా....అప్పుడు నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎలా మరువగలను చెప్పు....నీ పుణ్యమా అనే నేను ఈ రోజు సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాను. ఆ నేర జీవితం నుంచి స్వచ్చమయిన జీవితం గడపడానికి నాకు ఇంతకాలం పట్టింది. నీకు సహాయపడటం నా ధర్మంగా భావిస్తాను....
"ఎవరో మనలని కనిపారేస్తే ఆ రాణాలాంటి వాళ్ళకు దొరుకుతుంటాం. మనపెద్దలు బ్రిటీష్ ప్రజలను వెళ్ళగొట్టగలిగారు. కానీ రాణాలాంటి కసాయివాళ్ళను ఏమీ చేయలేకపోయారు. దేశంలో అలాంటివాళ్ళకు స్థానం వున్నంత వరకు మనం ఇంతే....వస్తాను చక్రవర్తీ....నిర్భయంగా విశ్రాంతి తీసుకో...."
రాజేంద్ర వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలాడు చక్రవర్తి.
ఆకలిగా లేకపోవడంతో వంట పదార్ధాల జోలికి వెళ్ళలేదు.
ఫ్యాన్ స్విచ్ వేసి బెడ్ మీద పడుకున్నాడు.
శ్రీప్రియ ఎంత గొప్పగా తనను మోసం చేసిందో అతని కళ్ళ ముందు మెదిలింది.
గత జ్ఞాపకాలు ఒక్కటొకటిగా అతనికి గుర్తొస్తున్నాయి....
* * *
ఆ రోజు....
గంట క్రితం చక్రవర్తిని తన గదిలో పర్సనల్ గా పిలిచాడు రాణా.
చిలకలగూడా ప్రాంతంలో శంకర్ దాదా అనే రౌడీ ఆ ఏరియాలో తనకు ఎదురు నిలిచే వాళ్ళు ఎవరూ లేరంటూ సవాళ్ళు విసరడమే కాకుండా షాపుల వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
ఇవ్వని వాళ్ళను కాళ్ళో, చేతులో విరగదీయడంతో, అక్కడి వాళ్ళందరూ కలిసి అతనిని అడ్డు తొలగించుకోవడానికి తలా కొంచెం డబ్బు చందాలు వేసుకుని, రాణాని ఆశ్రయించారు.
రాణా ఆ విషయం మాట్లాడడానికే చక్రవర్తిని పిలిపించాడు.
"మరొక గంటలో శంకర్ లాల్ దాదా అనే వ్యక్తి బ్రతికి వుండడానికి వీల్లేదు."
అదీ రాణా ఆజ్ఞ!
చక్రవర్తితో పాటు మరో ఐదుగురు అనుచరులు జీప్ లో కూర్చున్నారు.
జీప్ బయలుదేరింది....
సరిగ్గా ఇదే సమయంలో....
ఒక ఖరీదైన నగల షాపులో....
దాదాపు పది, పదిహేను మంది కస్టమర్స్ మధ్య సేల్స్ మాన్ హడావుడి పడిపోతున్నాడు.
ఆ కస్టమర్స్ మధ్యన రోజ్ కలర్ మిడ్డీతో వున్న ఒక అందమైన అమ్మాయి శంఖం లాంటి తన మెడకు సరిపడే అందమైన నెక్లెస్ ను సెలక్ట్ చేసుకోవడంలో నిమగ్నమై వున్నది.
"ఎక్స్ క్యూజ్ మీ మిస్....మీ పేరేమిటో తెలుసుకోవచ్చా?"
ఆ పిలుపుకు తల తిప్పి చూసిందామె.
ఖరీదైన దుస్తుల్లో వున్నాడతను. ప్రక్కనే ఆమె భార్య కూడా వున్నది.
"శ్రీప్రియ...."
"పేరులాగానే మీరు అందంగా వున్నారు. మీకు అభ్యంతరం లేకుంటే నాదొక చిన్న రిక్వెస్ట్" అతడి కళ్ళల్లో, ఏదో నిగూఢం తొంగి చూస్తోంది.
"ఏమిటో చెప్పండి."
"ఏమీ లేదు శ్రీప్రియా....నగల నైపుణ్యం గురించి నాకు మా ఆవిడకు చాలా తక్కువగా తెలుసు.... మా అమ్మాయి దుబాయ్ లో వుంటోంది. దాని బర్త్ డే పంక్షన్ కు నెక్లెస్ కొనడం కోసం వచ్చాం. కాస్త మాకు సహకరించి నెక్లెస్ సెలక్ట్ చేసి పెట్టడానికి మీకు ఏం అభ్యంతరం లేదనుకుంటాను...." అని చెప్పి ఆమె ముఖంలోకి గుచ్చి చూశాడతను.
అంత లావు పెద్ద మనిషి తనను అడుగుతున్న తీరునిబట్టి కానీ, అతని గొంతులో తొంగి చూసిన మార్దవం వలన కానీ కాదనలేకపోయింది శ్రీప్రియ.
తన సెలక్షన్ కు తాత్కాలికంగా కామాపెట్టి అతనికోసం నగలను పరిశీలించడంలో మునిగిపోయిందామె!