Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 7

   
     "వర్గపోరాటం!"

    "జిందాబాద్" అంటూ అరిచారు జనమంతా.

    "శ్రామికవర్గం!"

    "జిందాబాద్"

    "ధనికవర్గం"

    "ముర్దాబాద్"

    "డబ్బున్నవాళ్ళనీ"

    "నరకాలీ!"

    "డబ్బున్నవాళ్ళనీ"

    "చంపాలీ!"

    "ఇంకిలాబ్"

    "జిందాబాద్"

    "విప్లవం"

    "వర్ధిల్లాలి!"

    హఠాత్తుగా అతను పాట పాడటం ప్రారంభించాడు వుద్రేకం.

    "పదండి ముందుకు - పదండి తోసుకు."

    ఆ గొంతు వింటే చటుక్కున గుర్తుకొచ్చింది రాజశేఖరానికి.

    అతను మరెవరో కాదు.

    ఒకప్పటి క్లాస్ మేట్ కనకారావు.

    ఆ రోజుల్లో కూడా అంతేవాడు.

    కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా విప్లవ గీతాలు పాడుతుండేవాడు.

    పాట హఠాత్తుగా యుద్ధభేరిలాగా మారిపోయింది.

    "చూస్తారేంటి కొట్టండి నరకండి! ఈ డబ్బున్న వాళ్ళను సమాధి చేయండి" అంటూ తన చేతిలోని రాయి తీసుకుని రాజశేఖరం కారు మీదకి విసిరాడు. పెద్ద శబ్ధంతో అద్దాలు పగిలిపోయాయి.

    రాజశేఖరం నిశ్చేష్టుడయ్యాడు.

    అది చూసి జనం రెచ్చిపోయారు.

    అందరూ తలో రాయి తీసుకుని రోడ్ మీద ఆగిపోయిన కార్లన్నిటినీ ధ్వంసం చేసేశారు.

    రాజశేఖరం కొద్దిసేపు వాళ్ళలోనే కలిసిపోయి రోడ్ పక్కన ప్రేక్షకుడిలా నిలబడి చూడాల్సివచ్చింది.

    బస్ లు, కార్లు, స్కూటర్లు అన్నీ ధ్వంసం చేశాక జనం వెళ్ళిపోయారు.
    మామూలుగానే అప్పుడు వచ్చారు పోలీసులు.

    రాజశేఖరం కారు డోర్ తెరిచి సీట్ల మీద పడి వున్న గాజు పెంకులన్నిటినీ దులిపేసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.

    ఇంజన్ కేమీ నష్టం జరగకపోవటం వల్ల కారు తేలిగ్గానే స్టార్ట్ అయింది.

    ఫంక్షన్ కి టైమ్ కి చేరుకోగలిగాడు. అద్దాలు లేకుండా, రాళ్ల దెబ్బలతో చొట్టలుతిన్న కార్లో నుంచి దిగుతుంటే ఫ్రెండ్సంతా ఆశ్చర్యపోయారు.

    జరిగిందంతా చెప్పేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది.

    "ఇక్కడ జనం అంత ఆవేశపరులా?"

    "అవును! అందుకే వీళ్ళను తెలివిగల ప్రతివాడూ వాడుకుంటూనే వుంటాడు."

    ప్రారంభోత్సవం జరిగింది.

    రిపోర్టర్స్ అందరినీ చుట్టుముట్టారు.

    "మీరు అమెరికా నుంచి వచ్చేశారు కదా! ఇక్కడ మీరేమయినా క్రొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేశారా?"
 

 Previous Page Next Page