Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 6

    డ్రయివర్ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. అప్పుడప్పుడూ తనే డ్రైవ్ చేయటం సరదా.

    రోడ్డుని సగం ఆక్రమించుకుంటూ ఓ పెద్ద గుంపు కనిపించింది రాజశేఖరానికి.

    గుంపు మధ్యలో నిలబడి ఎవరో ఉపన్యాసం యిస్తున్నారు.

    ఇలా అర్జెంట్ రోడ్డు సైడ్ మీటింగ్స్ భారతదేశంలో అతి తరచుగా జరగటం అతను ఈ కొద్దినెలల్లో గమనించాడు.

    ప్రపంచంలోకెల్లా పనిలేని జనం భారతదేశంలోనే కనిపించారతనికి.

    వీధి ఇంద్రజాలం చేసేవాడి దగ్గర్నుంచీ దొమ్మరిసాని రోడ్ వాకింగ్ వరకూ ఎవడు కొంచెం గట్టిగా మాట్లాడినా క్షణాల్లో వందలమంది గుమికూడిపోతారు.

    అంతేకాదు ఆ ప్రదర్శన రెండుగంటలపాటు జరిగినా కదలకుండా నిలబడిపోతారు.

    ఇక రాజకీయ సభల సంగతి సరేసరి.

    వీధిలో నిలబడి ఎవడయినా గట్టిగా గవర్నమెంటుని తిడితే చాలు! రాజకీయ ఉపన్యాసం అని వాడిచుట్టూ జనం మూగిపోతారు.

    తను మద్రాస్ వెళ్ళినప్పుడు ఇలాగే ఓ తమాషా జరిగింది.

    రోడ్డుకడ్డంగా ఓ మీటింగ్ జరుగుతోంది.

    ఎవడో మధ్యలో నిలబడి ఆవేశంగా వుపన్యాసం యిస్తున్నాడు.

    తను కారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయేసరికి చేసేదిలేక ఆ మీటింగ్ ఏమిటో చూద్దామని కారుదిగి వెళ్ళాడు.

    వాడెవడోగానీ కామా ఫుల్ స్టాప్ లేకుండా బ్రహ్మాండంగా దంచేస్తున్నాడు. అతని మాటల్లో మాటకూ మాటకూ ఎక్కడా పొంతనలేకపోయినా జనం ప్రతి మాటకూ చప్పట్లు కొడుతూనే వున్నారు.

    జాగ్రత్తగా వింటే వాడు మాట్లాడే మాటల్లో ఎక్కడా అంత ఆనంద పడిపోతూ తప్పట్లు కొట్టాల్సిన అవసరమేమీ కనిపించలేదు.

    క్షణక్షణానికీ జనం పెరిగిపోతున్నారు.

    మరి కొద్దిసేపటి తర్వాత ఓ పోలీస్ వ్యాను, దాని వెనుకే అంబులెన్స్ వచ్చాయి.

    పోలీసులు అందరూ కలిసి ఆ ఉపన్యాసం చెప్తున్నవాడి చుట్టూ చేరి అమాంతం వాడిని ఎత్తుకుని అంబులెన్స్ లోకి చేర్చారు.

    జనానికి కోపం వచ్చింది.

    ఆ అంబులెన్స్ కి అడ్డు నిలబడ్డారు.

    "ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్వేఛ్చ లేదా? ఉపన్యాసం యివ్వకూడదా?" అంటూ అరిచారు.

    "వీడు పిచ్చాడయ్యా! పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. పొద్దున్నుంచీ వెతుకుతుంటే ఇప్పటికి దొరికాడు"

    అంటూ తీసుకెళ్ళిపోయారు.

    అప్పుడు తెలిసింది జనానికి. అంతసేపూ తాము వింటూ తప్పట్లు కొడుతోంది ఓ పిచ్చాడి మాటలకని.
    ఇప్పుడీ మీటింగ్ కూడా ఆ బాపతుకాదు గదా!

    మధ్యలో నిలబడి ఓ వ్యక్తి ఆవేశంగా మాట్లాడుతున్నాడు.

    "ఇది ప్రజాస్వామ్యం కాదు. పెట్టుబడిదారులు శ్రామిక వర్గాన్ని దోచుకోవడానికి కనిపెట్టిన కొత్తపేరు. డబ్బున్న వాళ్ళంతా కలసి బీదాళ్ళను బానిసల్లా చేసుకుని బ్రతకటానికి పన్నిన పన్నాగం. డెమొక్రసీ ముసుగులో కార్మికుడిని మభ్యపెట్టి, మోసగించి మారణహోమం చేస్తున్నారు కాపిటలిస్ట్ లు. ఈ దుర్మార్గాన్ని మనం ఎదుర్కోవాలి! పెద్ద ఎత్తున విప్లవం లేవదీసి ధనవంతుల్ని వెంటాడి చీల్చి చెండాడాలి. వాళ్ళ కార్లు ధ్వంసం చేయాలి. వాళ్ళ భవనాలకు నిప్పుపెట్టాలి. వాళ్ళకోసమే పని చేస్తున్న బ్యాంకులను నేల మట్టం చేయాలి. మన వర్గ శత్రువులందరినీ తుదముట్టించాలి" ఆవేశం ఎక్కువయి పోతోందతన్లో.
 

 Previous Page Next Page