Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 9


    "నాలుగు రూపాయలు! సినిమాకి!" టక్కున సమాధానం చెప్పేశాడు మురళి.
    "సినిమాకా? ఇవాళా? వర్కింగ్ డేస్ లో సినిమాలకు వెళ్ళద్దని చెప్పలేదూ?"
    "ప్లీజ్! ప్లీజ్! నా ఫ్రెండ్సంతా ప్రోగ్రాం వేసుకున్నారు. నేనూ వస్తానన్నాను. నాకు వాళ్ళు టికెట్ బుక్ చేసేసి ఉంటారు. నేను వెళ్ళకపోతే ఆ టికెట్ వేస్ట్. నేనా డబ్బులివ్వలేకపోతే, నాకు ఇన్సల్ట్, అందుకేగా ఆటలు మానేసి చదువుకున్నాను."
    సత్యవతి వెంటనే ఒప్పుకోలేక పోయింది. చదువుకొనే పిల్లలు ఇలా చీటికీ మాటికి సినిమాలకు వెళ్ళటం అలవాటయితే ఏం బాగుపడతారు? అలా అని మరీ స్ట్రిక్ట్ గా ఉంటే ఇలా తిన్నగా అడగటానికి బదులు అడ్డదారులు పడతారేమో! వాళ్ళ సరదాలు కొంతవరకు పోనిస్తేనే మంచిదేమో!
    మ్యూజిక్ క్లాస్ నించి వచ్చింది మురళి చెల్లెలు లత. ఈ ఆడపిల్లలు నయం. కొంత అల్లరి చేసినా మరీ అడ్డూ అదుపూ లేకుండా తిరగరు. సంగీతం, నృత్యం ఇలాంటివి నేర్చుకోవాలని సరదా పడతారు.
    "అమ్మా! అన్నయ్య గేమ్స్ కెళ్ళకుండా చదువుకోవటంలేదు. నువ్వు రాపోయే ముందువరకూ ఆడుతూనే ఉన్నాడు. సరిగ్గా నువ్వు వచ్చే సమయానికి పుస్తకం ముందు కూచున్నాడు. నేను మ్యూజిక్ క్లాస్ కెళ్ళేవరకూ ఆడుతూనే ఉన్నాడు." అని చెప్పేసింది లత.
    "నా సంగతి నీకెందుకు? నీ చదువు సంగతి నువ్వు చూసుకో" అని కంయ్ మన్నాడు మురళి.
    "నేను నీతో మాట్లాడటం లేదు. అమ్మతో చెపుతున్నాను. నువ్వు నా జోలికి రానక్కర్లేదు" అతి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది లత.
    ఆ అన్నాచెల్లిళ్ళిద్దరూ దెబ్బలాటకి దిగితే ఇక అప్పట్లో తెమిలేదికాదు. అంచేత సత్యవతి గాంభీర్యం తెచ్చిపెట్టుకుని "మురళీ! అబద్ధాలెందు కాడతావ్! చదువుకోకుండా చదువుకున్నానని చెప్తే మోసపోయేది నేను కాదు-నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు." అంది. మురళి ముఖం పాలిపోయింది. లత ముఖం వికసించింది.
    "అయినా ప్రతి చిన్నదానికీ ఇలా భయపడి అబద్ధాలెందుకు? "నాకు సినిమాకు వెళ్ళాలని ఉంది-వెళ్తాను" అని చెప్పలేవూ? ఇదిగో నాలుగు రూపాయలు తీసుకో!" అంది సత్యవతి.
    ఈసారి మురళి ముఖం వికసించింది. లతని చూసి వెక్కిరించాడు. మూతి తిప్పి వెళ్ళిపోయింది లత.
    "ఇప్పుడు ఇస్తున్నానని ఎప్పుడూ సినిమాలకు బయలుదేరతావేమో, జాగ్రత్త! ఏదో, ఒకసారి కదా, అని పంపిస్తున్నాను. ఇలా చీటికీ మాటికీ వర్కింగ్ డేస్ లో సినిమాలకు బయలుదేరావంటే...."
    తల్లి ఏం చెప్తోందో వినబడటంలేదు మురళికి. నాలుగు రూపాయలూ చేతిలో పడ్డాక హుషారుగా సినిమాకి తయారవటంలో మునిగిపోయాడు. బట్టలు ఇస్త్రీ పెట్టుకున్నాడు- బూట్స్ పాలిష్ చేసుకున్నాడు. తయారై తనను తను నాలుగు వైపులనుండీ అద్దంలో చూసుకొంటూంటే లత ఊరుకోలేక "బాగున్నావులే!" అంది.
    "నా జోలి కొచ్చావంటే చూడు! చుప్పనాతి శూర్పణఖ-నువ్వు అమ్మతో వెళ్ళి పది రూపాయల గాజులు వేసుకొస్తే నేనిలాగే ఏడ్చానా?"
    వంటింట్లో సాయంత్రం వంట చేస్తోన్న సత్యవతి "హుష్! ఏమిటా దెబ్బలాట? నోరు మూసుకోండి!" అని కసురుకోగానే ఇద్దరూ నోరు మూసుకున్నారు. మురళి ఫ్రెండ్స్ వచ్చారు. మురళి తల్లి దగ్గిరకొచ్చి.
    "అమ్మా! వెళ్తున్నాను" అన్నాడు.
    "సరే, వెళ్ళు-కానీ, ఇప్పుడే చెప్తున్నాను-మళ్ళీ మళ్ళీ ఇలా బయలుదేరావంటే..."
    మురళి గాబరాపడిపోతూ "ప్లీజ్! గట్టిగా చెప్పకు అమ్మా! నా ఫ్రెండ్స్ వింటాను- నా పరువు పోతుంది" అన్నాడు.
    'ఏం పిల్లలు! తల్లి మందలిస్తే....తల్లి మాట వింటే, అది ఫ్రెండ్స్ కి తెలిస్తే పరువు పోతుందిట!' అని మనసులో అనుకున్నా పైకేమీ అనలేదు సత్యవతి. మురళి బయటికి రాగానే రవి "ఏం నాయనా! మీ అమ్మగారి అనుమతి సంపాదించావా?" అన్నాడు హేళనగా.
    మురళి బింకంగా "మా అమ్మ ఏమీ అనదు. నేను చెప్పకుండా వచ్చేస్తే నాకోసం బెంగ పెట్టుకుంటుంది. అందుకని చెప్పాను" అన్నాడు.
    "పిక్చర్ అయిపోయాక మీకందరికీ కామత్ హోటల్లో నేను డిన్నర్ ఇస్తాను-" గర్వంగా అన్నాడు రవి.
    మిత్రులందరూ "యెక్స్ లెంట్!" అని అరిచారు. మురళికి మాత్రం గుండె దడదడలాడింది. సినిమా అయిపోయాక ఇంకా ఆలస్యంగా వెళ్తే అమ్మ తిడ్తుంది. ఇంట్లో అన్నం తినకపోతే మరీ తిడ్తుంది.

 Previous Page Next Page