"ఏం మురళీ!" మురళీ భుజంమీద చెయ్యివేసి నవ్వాడు రవి. "బెంగపెట్టుకోకు-మీ అమ్మగారితో నేను వచ్చి చెపుతాలే, మధ్యలో కరంట్ పోయి సినిమా ఆలస్యంగా వదిలారని...." అన్నాడు.
"ఏం అక్కర్లేదు-మా అమ్మ ఏమీ అనదు" నువ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు మురళి.
అందరూ సినిమా కెళ్ళి సినిమా వదిలాక కామత్ హోటల్ కి వెళ్ళి డిన్నర్ తీసుకున్నారు. అందరి డిన్నర్ కీ రవి తనే ఖర్చుపెట్టాడు. ఇలా ఖర్చు పెట్టి అందరినీ తన చుట్టూ తిప్పుకోవటం, రవికి చాలా ఇష్టం. రవి ప్రెసిడెంట్ అయ్యాక అతని జేబులో ఎప్పటికంటే ఎక్కువగా వుంటోంది డబ్బు.
భయపడుతూ భయపడుతూ పన్నెండు గంటలకు ఇంటికి వచ్చిన మురళిని చూసి మండిపడింది సత్యవతి.
"పోనీగదా అని సినిమాకి పంపిస్తే ఇదా, నువ్వు చేసినపని? ఇప్పుడా రావటం? ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావ్?"
మురళి బుర్ర చురుగ్గా ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి తల్లి కోపాన్ని తప్పించుకో గలిగితే చాలు.
"నా పెన్ మధ్యాహ్నం కాలేజీలో రవికిచ్చి మరచిపోయాను. అది తెచ్చుకోవటానికి రవి ఇంటికి వెళ్ళాను. పొద్దున్న లెక్కలు చేసుకోవాలి!"
"ఏదీ పెన్?"
"ఇదిగో!" జేబులోంచి పెన్ తీసి చూపించాడు. అదృష్టవశాత్తూ పెన్ జేబులో పెట్టుకునే సినిమాకు బయలుదేరాడు మురళి. మురళి వెళ్ళేటప్పుడు జేబులో పెన్ ఉందో, లేదో గమనించలేదు సత్యవతి.
"అదిసరే! రవి ఇంటికెళ్లి పెన్ తీసుకురావటానికి ఇంతసేపెందుకయింది?"
"రవీవాళ్ళ అమ్మగారు వాళ్లింట్లో భోజనం చెయ్యమన్నారు. బాగుండదని తిన్నాను. రవి మన ఇంట్లో ఎన్నోసార్లు తింటాడు కదా. నేను వాళ్లింట్లో తిన ననటం బాగుంటుందా, చెప్పు?"
ఇక, మాట్లాడలేకపోయింది సత్యవతి. ఆదివారం రాగానే "రవితో కలిసి చదువుకుంటాను." అంటాడు. ఇంట్లోంచి బయలుదేరాలని చూస్తాడు మురళి. "వీల్లేదు. కావాలంటే రవినే ఇక్కడకు రమ్మను" అంటుంది. చచ్చినట్లు రవినే తమ ఇంటికి ఆహ్వానిస్తాడు మురళి. అలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు సత్యవతి రవిని కూడా తమతో భోజనానికి ఆహ్వానించేది.
రవిపట్ల సత్యవతికి ప్రత్యేకమైన అభిమానం ఉండటానికి కారణం ఉంది. ఒకరోజు వంటినిండా దెబ్బలతో ఉన్న మురళిని తన కారులో తీసుకుని వచ్చాడు రవి. మురళికి దెబ్బలనుండి రక్తం కారుతోంది. ఆయాస పడుతున్నాడు. సత్యవతి హడలిపోయింది. "ఏమిటిది? ఏమైంది?" అంది కంగారుగా కన్నీళ్ళ పర్యంతమై.... ఏం జరిగిందో రవి వివరించాడు.
మురళికీ, మరొక విద్యార్ధికీ ఏదో మాటా మాటా వచ్చింది. మురళి ఉద్రేకంగా ఆ విద్యార్ధిని ఏదో తిట్టాడు. ఆ విద్యార్ధి మురళిని చెంపమీద కొట్టాడు. మురళి రెచ్చిపోయి ఆ విద్యార్ధిని చెడా మడా చెంపలు వాయించేశాడు. ఆ విద్యార్ధి అప్పటికి తగ్గిపోయి వెళ్లిపోయాడు. కానీ విద్యార్ధుల్లో ఎవరి గ్రూఫ్ వాళ్ళకి ఉంటుంది. దెబ్బతిన్న విద్యార్ధి తన గ్రూప్ తో మురళి ఒంటరిగా వున్న సమయం చూసి మీదపడి చావబాదాలనుకున్నాడు. సమయానికి రవి చూసి అడ్డుపడ్డాడు. రవి ఒక్కడే అయినా ప్రెసిడెంట్ కావడంవల్ల ఆ గుంపు చెదిరిపోయింది. రవి మురళీని తన కారులో ఇంటికి తీసుకొచ్చాడు.
ఈ సంగతి విన్న సత్యవతికి ఆశ్చర్యంతో మతిపోయింది. ఏం పిల్లలు వీళ్ళు! ఇప్పటినుంచీ ముఠాలా? ప్రాణాలకు తెగించి తన్నుకోవటాలా? ఈ పసిమనస్సులో ఇలాంటి కక్షలూ, కార్పణ్యాలూనా?
రవి అడ్డుపడకపోతే? మురళి ఏ స్థితిలో ఉండేవాడో ఊహించుకునేసరికి భయంతో మోకాళ్ళు వణికాయి సత్యవతికి. తన కొడుకుని ఆడుకున్న రవిని అప్పటినుండీ అభిమానంగా చూసేది సత్యవతి.
మురళి దెబ్బలనుండి కోలుకున్నాక "ఇలా అనవసరపు తగాదాల్లోకి దిగకు. ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది? ఎందుకొచ్చిన దెబ్బలాటలు?" అంది.
మురళి రోషంగా "వాడు నన్ను మాటలంటే ఎందుకూరుకోవాలమ్మా! మా రవితో చెప్పి మా పార్టీవాళ్ళతో రేపు...." అని ఏదో అనబోతుండగానే "మురళీ!" అని అరిచి మురళీ పక్కన కూలబడింది సత్యవతి.
"ఇలాంటి పిచ్చి తగాదాల్లో తలదూర్చావంటే, నిన్నసలు కాలేజీకి పంపను" కోపంగా అంది. సత్యవతి చేతిలో ఉన్న మహాస్త్ర మిదే!
"నువ్వు ఒకరిజోలికి వెళ్ళకపోతే, నీ జోలికి ఎవరు రారు. నీ చదువు సంగతి నువ్వు చూసుకో! రేపు మళ్ళీ మా పార్టీ అంటూ గొడవ చేశావంటే జాగ్రత్త!" అని హెచ్చరించింది. "ఈ అమ్మకేమీ తెలియ" దని మనసులో విసుక్కున్నాడు మురళి. ఎందుకైనా మంచిదని ఆ తరువాత మురళిని వారంరోజులు కాలేజీ మానిపించి, తనూ స్కూల్ కి సెలవుపెట్టి, ఇంట్లోనే చదివిస్తూ కూచుంది సత్యవతి. కాలేజీ మానెయ్యవలసిరావటం, ఫ్రెండ్స్ లేకపోవటం, అమ్మ ఇంట్లో కూచుని చదివించటం-అన్నీ నరకంగానే తోచాయి మురళికి. అక్కడితో తల్లికి భయపడి దెబ్బలాటల జోలికి వెళ్ళేవాడు కాదు.