జయరాం కాక కుమార్ కింకా ఇద్దరుముగ్గురు స్నేహితులున్నారు. వాళ్ళు కూడా నెమ్మదిగా ఆ వంకా ఈ వంకా పెట్టి కుమార్ కి దూరమయ్యారు. కుమార్ అర్ధం చేసుకున్నాడు. ఇది చిన్నతనం నుంచీ అతను అనేక రకాలుగా ఎదుర్కొంటున్నాడు. అంచేత ఇప్పుడు కూడా ఈ తాకిడికి తట్టుకోగలిగాడు.
లీజర్ టైంలో విద్యార్ధులు కొందరు రీడింగ్ రూంలో కూచుని చదువు కుంటున్నారు. అక్కడికి కాలేజి ప్యూన్ వచ్చి "కుమార్ బాబూ! మిమ్మల్ని మీ నాన్నగారు రమ్మంటున్నారు!" అన్నాడు.
కుమార్ లేచి వెళ్ళాడు. మిగిలిన విద్యార్ధులు నిర్ఘాంతపోయారు. క్షణాలలో ఆ వార్త తమ 'నాయకు'లకు అందించారు. ఆ నాయకులు తలక్రిందులయిపోయారు. వెంటనే తమ వేగులను విషయ సేకరణకు పంపారు. కుమార్ స్టాఫ్ రూంలోంచి బయటికొచ్చేసరికి వార్తలు మోసుకుని వేగులు కూడా వచ్చేశారు. వగర్చుకుంటూ చెప్పేశారు.
"కుమార్ గాడు, చంద్రశేఖరంసార్ కొడుకు."
"అవును-వెళ్ళి 'నాన్నగారూ! నన్ను పిలిచారా?' అన్నాడు"
" 'ఇవాళ వుమన్స్ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందిట! ఆలస్యం కావచ్చునని చెప్పింది మంజు-వెళ్ళి దాన్ని వెంటబెట్టుకుని తీసుకురా!' అన్నాడు చంద్రశేఖర్ సార్!"
" 'అలాగే నాన్నగారూ!' అని వచ్చేశాడు మన కుమార్."
"అవును__ 'నా.....న్న....గా....రూ!' అన్నాడు కచ్చితంగా అన్నాడు."
"కుమార్! చంద్రశేఖరం సార్ కొడుకు?"
"బట్, ముష్టిముసలమ్మ కొడుకు?"
"ఈజిట్ లవ్ మారేజ్! ఐమీన్, చంద్రశేఖరం సార్ మారేజ్?"
"చంద్రశేఖరంగారు చిన్నతనంలో గుడిసెల్లో వున్న ఒక సుందరాంగిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఆ సంతానమే కుమార్!"
"ఛత్! నోర్ముయ్! చంద్రశేఖరంసార్ భార్య సుమతిని నాకు తెలుసు. కల్తీలేని బ్రాహ్మణమ్మ__మొన్న ఆవిడింట్లో శ్రావణ మంగళవారం పేరంటానికి మన 'హిలెన్ ఆఫ్ ట్రాయ్' వెళ్ళింది...."
"అలా అయితే చంద్రశేఖరం సార్ కి గుడిసెల్లో సుందరాంగితో ఏదో అక్రమ సంబంధం ఉండాలి! ఆ అక్రమ సంతానమే కుమార్!"
"ఇది కాస్త బాగానే ఉంది. చెప్పుకోవటానికి కూడా సరదాగానే ఉంటుంది. కానీ, ఒక చిన్న సందేహం. ఈ అక్రమ సంతానాన్ని సుమతిగారు ఎందుకు ఆదరిస్తారూ! అని...."
"పాపం, స్త్రీ-అబల__పతివ్రత....భారతనారి, ఏం చేస్తుంది? పురుషుల దుర్మార్గాన్ని అలా భరిస్తుంది...."
"శభాష్! ఈ కథ బ్రహ్మాండంగానే ఉంది. కానీ, మన చంద్రశేఖరం సార్ అలాంటి దుర్మార్గపు పురుషుడుగా కనిపించరే! పై పెచ్చు వచ్చిననాటినుంచీ శ్రీరంగనీతులతో మన ప్రాణాలు తీస్తున్నారు గద? దుర్మార్గుడు! కాపీలు కొట్టద్దంటాడు. ఆయనదేం పోయింది. మన కష్టాలు ఆయనకేం తెలుస్తాయి? స్టేజీపైన కుర్చీలలో కూచునే అయ్యవార్లకేం తెలుస్తాయి, క్రింద బెంచీలలో కూచునే అభాగ్య విద్యార్ధుల కన్నీటిగాధలు!!"
"ఏడిశావ్! నోర్ముయ్! ఔట్ ఆఫ్ పాయింట్ పోతున్నావు. ఇంతకూ చంద్రశేఖరంసార్ కి కుమార్ ఎలా కొడుకు? అట్లు కొడుకయినను, ఆ ముష్టి ముసలమ్మకు ఎట్లా మనవడు?"
ఈ విధమయిన వాదోప వాదాలు చెలరేగుతుండగానే కుమార్ వచ్చాడు. ఒక 'నాయకుడు' కుతూహలం అణచుకోలేక "కుమార్! నువ్వు చంద్రశేఖరంసార్ గారి అబ్బాయివా?" అని అడిగేశాడు. కుమార్ అల్లరిగా నవ్వి "సుట్టలు కొంటానికి చారణా ఇస్తే సెఫ్తా!" అన్నాడు.
5
సత్యవతి స్కూల్ నుంచి వచ్చేసరికి మురళి బుద్ధిగా చదువు కొంటున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఆ టైమ్ లో మురళి ఇంట్లో ఉండడు. గేమ్స్ కి వెళ్ళిపోతాడు. తల్లి ఇంటికి రాకముందే ఇంట్లోంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు సాధారణంగా.
"ఏం నాయనా? ఇవాళ ఏం ప్రళయం రాబోతోంది? నీ అంతట నువ్వు పుస్తకాలముందు కూచున్నావు?" అంది నవ్వుతూ.
మురళి ఉడుక్కుని "ఏమిటమ్మా! నేను చదువుకోనా? నువ్వు ఎప్పుడూ ఇలాగే అంటావు" అన్నాడు.
సత్యవతి నవ్వుకుని "ఇది గేమ్స్ టైం, పోయి ఆడుకో!" అనాలనిపించి. ఏదైనా టెస్ట్ ఉందేమో, అందుకే అంత శ్రద్ధగా చదువు కొంటున్నాడేమో అనుకుని ఊరుకుంది. అయితే మురళి శ్రద్ధకి కారణం ఒక్క గంటకూడా గడవకుండానే తేలిపోయింది. పుస్తకం మూసేసి అలమారులో పెట్టేసి "మమ్మీ!" అంటూ తల్లి దగ్గరకు చేరాడు. ఆ పిలుపుబట్టే సంగతి సగం అర్ధం చేసుకున్న సుమతి "ఎంత కావాలి? దేనికి కావాలి?" అంది.