Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 9

 

    "ఇస్తే మాత్రం తీసుకోవడమేనా? పో అవతలకు పో!" రూపాయి కొంగున కట్టుకుంటూ కసిరింది పార్వతి. వారిజ తలవంచి ఇవతలకు నడిచింది. ఒక నెల రోజులు గడిచాయి. ఇంట్లో బియ్యం ఒక్క గింజ కూడా లేదు.
    "వారిజా నీ దగ్గర డబ్బు లేవి లేవూ?" నీరసంగా అడిగింది పార్వతి.
    "నా దగ్గరా! నాదగ్గరిలా  వుంటాయమ్మ!"
    "యశోదమ్మగారియ్య లేదూ!"
    "నువు తీసుకోవద్దాన్నవుగా!"
    "అంటే! బోడి పౌరుషం ? ఏం చూసుకుని . మీ అయ్యా సంపాదన చూశా! మీ అమ్మ ఐశ్వర్యం చూశా! తినటానికి తిండి లేక కడుపులు మాడుతున్నా పౌరుషానికి తక్కువ లేదు. వంట ఎలా వండాలి! ఈ పూట ఏం పెట్టను మీకందరికీ? మాధవను ఎలా ఊరుకో బెట్టను!" కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. వారిజ లేచి తన పాత పరికిణి మడతల్లో దాచిన రూపాయి తీసి తల్లి కిచ్చింది. ఒక్కమాట మాట్లాడకుండా అందుకుంది పార్వతి కళ్ళనీళ్ళు మాత్రం ఆగకుండా స్రవించాయి.
    అయిదో కూతురు లత అప్పుడే "ఆకలి" అంటూ పేచీ ప్రారంభించింది. విసుగుతో దాన్నోక్క మాట అంటించి అవతలకు నడిచింది పార్వతి. ఇల్లెగిరి పోయేలా రాగాలు పెడుతున్న లతను బుజ్జగించదానికి ప్రయత్నించ సాగింది వారిజ. ఆ పిల్ల మరింత పెంకిగా వారిజని చేతుల్తో, కాళ్ళతో కొట్టింది. ఆ దెబ్బలన్నీ సహించి ఎక్కడో మారుమూల ఉన్న కాసిని అటుకులు లత ముందు పోసి లతను ఊరుకోబెట్టే సరికి బ్రహ్మలు దిగి వచ్చారు వారిజకి.
    తరువాత అప్పుడప్పుడు పార్వతికి వారిజ ఒకటీ, అర్ధ చాలా సార్లిచ్చింది. ఎలా వచ్చిందని పార్వతి అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదూ. ఈ మధ్య వారిజ అతికష్టం మీద డబ్బు కూడా బెట్టుకుంటుంది ఒక టెర్లిన్ చీర కొనుక్కోవాలనీ, ఒక్కటంటే ఒక్కటి. పాతిక రూపాయలు పెడితే కాస్త నాసిరకంది వస్తుందట. ఎలాగైనా ఒక్క చీర కొనుక్కోవాలి. పదిహేను రూపాయలు పోగు చెయ్యగలిగింది.,,, మిగిలిన పదీ ఎలా వస్తాయి? వారిజ కోర్కె విన్న యశోదమ్మ జాలి పడింది. వారిజ సంతోషానికి అవధులు లేవు జనం వచ్చాక మొదటిసారి అంతటి ఆనందాన్ని అనుభవించింది.
    ఆ రోజు మాములుగా తమ్ముడ్ని హాస్పిటల్ కు తీసికెళ్ళింది. పరీక్ష చేసి మందు రాసిచ్చాడు డాక్టరు. ఆ మందు చీటీ పట్టుకుని మందులిచ్చే కౌంటర్ దగ్గర కెళ్ళింది" ఈ మందు అయిపోయిందమ్మా! స్టాక్ లేదు." అంటూనే తన బాధ్యత తీరిపోయినట్లు మరొకళ్ళని పిలిచాడు కౌంటర్ లో వ్యక్తీ . ఊసురుమంటూ చీటీతో సహా ఇంటికొచ్చింది వారిజ. సంగతి విన్న పార్వతి కుంగిపోయింది. "ఎలాగే! వాడి జ్వరం అసలే తీవ్రంగా ఉంది. మందు కూడా లేకపోతె ఎలా?"
    వారిజ సమాధానం చెప్పలేదు . ఏం చెప్పగలదు?
    వారిజ టెర్లిన్ చీర కోసం పదిహేను రూపాయలు కష్టం మీద దాచుకున్న సంగతి తెలుసు పార్వతికి. "పోనీ , ఈ మందు బజారులో కొనుక్కొస్తే .....' అనలేక అనలేక అంది పార్వతి.
    ఉలిక్కిపడింది వారిజ. దీనంగా తల్లి వంక చూసింది. పార్వతి కడుపులో తిప్పినట్లయింది. "వద్దులే! ఊరికే అన్నాను. వాడి రోగం , నా రోగం ఒకనాటితో పోయేవి కావు. నువు చీర కొనుక్కో అంటూనే కడుపు తీరా ఏడవటానికి అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఒక గంట గడిచిన తరువాత తల్లి దగ్గరకు వచ్చింది వారిజ. మాధవ నీరసంగా మూలుగుతున్నాడు .
    "సాయంత్రం వెళ్ళి మందు కొనుక్కొస్తానమ్మా!" మాధవ్ ను చంక నేసుకుంటూ అంది వారిజ.
    పార్వతి ఏ సమాధానమూ చెప్పలేదు. శూన్యంగా చూసింది. సాయంత్రం బజారు కెళ్ళాడానికి తయారయి పెట్టె తెరచిన వారిజ గుండె గుభిల్లుమంది.
    తన పాత బట్టలు చిందర వందరగా ఉన్నాయి. వాటిలో దాచిన డబ్బు లేదు.
    గాభరాగా చూస్తోన్న ఆమెను త్రాగిన మత్తులో నవుతూ సమీపించాడు సత్యనారాయణ.
    నీ డబ్బేనా? నేను తీశానే! అప్పుగా తీసుకున్ననే! ఇచ్చేస్తాను."
    "నాన్నా!' వెక్కి వెక్కి ఏడ్చింది వారిజ.
    "ఛీ! ఎడుస్తావెందుకుకే! ఇవననా? ఇస్తానే! మీ అమ్మని కార్లలో తిప్పాను. మీకందరికీ పట్టు పరికిణీలు కొన్నాను. మీ అక్కలకు వేలువేలు పోసి పెళ్ళి చేశాను. ఒక్క పది హీను రూపాయలు బాకీ తీర్చనా? నమ్మకం లేదూ నాలో?"
    బావురుమని ఏడ్చాడు సత్యనారాయణ.
    కళ్ళప్పజెప్పి నిల్చుంది వారిజ- విసురుగా వచ్చింది పార్వతి.
    "ఒక్క చీర తీసుకుందామని అది అడుగున దాచుకున్న డబ్బు ఊడ్చుకున్నావు నమ్మకం లేకేం? నిన్ను నమ్మబట్టే ఈ గతి కొచ్చాం. కనీసం నా నగలు నీకియ్యకుండా దాచుకున్నా ఈనాడు నా పిల్లలకి ఇంత తిండయినా దొరికేది. నువేప్పుడో ఇస్తావు ఆ డబ్బు ....కాని మాధవ్ కి మందేలా!"
    "మాధవ్ మందు!....నేను తెస్తాను మందు - ఏదీ వారిజ! ఆ చీటీతే!"
    ఆమె చేతిలోంచి మందు చీటీ లాక్కుని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యనారాయణ.
    సత్యనారాయణ తిరిగి వస్తాడని ఏ కోశానా నమ్మకం లేకపోయినా పార్వతి, వారిజా రాత్రి పదింటి వరకు అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పన్నెండు గంటలకి శాశ్వతంగా కళ్ళు మూశాడు మాధవ.
    తలపగల కొట్టుకుని ఏడ్చింది పార్వతి.
    బెదిరిపోతున్న లతను బుజ్జగిస్తూ కుళ్ళి కుల్లో ఏడ్చింది వారిజ. ఆ మర్నాడు బాగా పోద్దేక్కేక వచ్చాడు సత్యనారాయణ తను రాగానే పార్వతి తన మీద విరుచుకు పడుతుందని భయపడుతూ వచ్చిన సంత్యనారాయణకి పార్వతి ఏమి అనకపోవడం ఆశ్చర్యం కలిగించింది ......తేలిగ్గా నిట్టుర్పు విడిచి పార్వతి దగ్గరగా వచ్చాడు.
    "మాధవ్ కు మందు తెచ్చాను పార్వతి! భద్రంగా తెస్తోంటే దార్లో సైకిల్ తగిలి పగిలిపోయింది."
    "మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ తెచ్చాను" మధ్యలో విసుగ్గా అడ్డు తగిలింది. "ఈసారి నా పాలిటి శని దేవత అడ్డు తగిలి ఒలికిపోయింది.'
    'అరె ! నీకెలా తెలుసు?" ఆశ్చర్యపోయాడు సత్యనారాయణ.
    "కాని దిగులు పడకు పార్వతి , మందు రేపు తెస్తాను . అమ్న్డు మందు .....దుకాణాలన్నీ తిరిగి....."
    "మందు గురించిన దిగులింక అక్కర్లేదు. మాధవ రాత్రి చచ్చిపోయాడు .' సత్యనారాయణ ముఖం పాలిపోయింది కొన్ని క్షణాలే. అంతలో విరగబడి నవ్వాడు.

 Previous Page Next Page