కుర్చుని కుర్చుని చివరికి తాంబులానికైనా నోచుకోక విసిగి లేచింది ఆమె. ఎవరో రవల నక్లెసావిడతో మాట్లాడుతోన్న పార్వతిని సమీపించి "నేను వెళుతున్నాను" అంది. పార్వతి ఏదో పెద్ద త్యాగం చేసేస్తున్నట్లు ఒక్క క్షణం ఇటు తిరిగి "మంచిది" అని, మళ్ళీ వెంటనే అటు తిరిగిపోయింది. అవమానంతో కళ్యాణి కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. భారంగా ఇంటికి చేరుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తోన్న కళ్యాణిని చూసి గాభరా పడ్డాడు శంకరం. దగ్గరగా చేరి లాలనగా శిరస్సూ నిముర్తూ కళ్యాణి! ఎందుకీ దుఃఖం? నీ చిరునవ్వే నా బలంగా బ్రతుకుతున్నాను , కళ్ళు తుడుచుకో ! ఏమిటది?"
ఆమె తెప్పరిల్లి జరిగినదంతా చెప్పింది, ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు శంకరం. "పిచ్చిదానా! జరగవలసినట్లే జరిగింది. దీనికి బాధపడతా వెందుకు? పెద్ద ప్లీడరు గారి భార్య ఆవిడా - అయన క్రింద గుమస్తాగా పనిచేస్తున్న నా భార్యవి నువు. ఆవిడ అహంకారమంతా నీ దగ్గిర కాక మరెవరి దగ్గర చూపిస్తుంది." అనునయంగా అన్నాడు శంకరం.
ఆలోచిస్తూ కూర్చుంది కళ్యాణి. ఆ రాత్రి శంకరం ఆమెని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోబోతే కళ్యాణి ఎడంగా జరిగింది. "అదేం కళ్యాణి! బీదవాడ్నని క్కూడా లోకువగా వుందా?' చిన్న బుచ్చకుంటూ అన్నాడు.
"ఛీ....ఛీ! అదేం కాడు, నేనొక్క విషయం చెప్తాను అర్ధం చేసుకుంటారా?" "నీమాట ఏ విషయంలో కాదన్నాను. అంత కాదనవలసిన మాటలు నువ్వు చెప్పావుగా! ఏమిటీ?" "మనం కనీసం రెండు వేలయినా బ్యాంకులో వెయ్యగలిగే వరకూ మనకు పిల్లలోద్దు."
"రెండువేలా? మనమూ? నీకు పిచ్చా?" "పిచ్చి కాదు. మనిద్దరమే అయితే ఎలాగో ఒకలా పొందిక చెయ్యగలను. మూడేళ్ళు లేక నాలుగేళ్ళు కష్టపడితే కాస్త పోగు చెయ్యలేమా? ఆలోచించండి. అంతమరీ దిరిద్రం కడుక్కుపోతుంటే పిల్లలు లేకపోతే మాత్రమేం క్షమించండి. వాళ్ళను సరిగ్గా పెంచలేక మనకీ, దేశానికి కూడా ఒక భారంగా తయారు చెయ్యటం నాకిష్టం లేదు."
'దేవిగారు చదువుకున్నారు.... ఈ బీదవాడి అదృష్టం పండి నన్ను వరించారు. తమ సెలవు. "నవ్వుతూ అన్నాడు శంకరం.
"హమ్మయ్యా! మీరీ మాత్రం అర్ధం చేసుకొని నాతో సహకరించగలిగితే చాలు - మనం బీదవాళ్ళ మయినా మన పిల్లని వృద్దిలోకి తెగలను. " శంకరం తృప్తిగా నవ్వి కళ్యాణి ని ముద్దు పెట్టుకొని అప్పటికప్పుడు చెప్పులు తొడుక్కుని బయలుదేరాడు. ఫేమలీ ప్లానింగ్ దగ్గరికి.
పార్వతికి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు. తరువాత ఒక కొడుకు. ఏడాది ఏడాదికీ కాన్పు రావడంతో మనిషి బాగా నీరసించి పోయింది. అస్తమానూ నడుం నొప్పి అనో, కాళ్ళు నొప్పిలనో మూలగటం అలవాటయి పోయింది, మూడో బిడ్డకి ఏడాది నిండీ నిండకుండానే మళ్ళీ వాంతులు చేసుకోవటం ప్రారంభించింది పార్వతి.
'అదేమిటి! మొన్నటి వరకూ మూలుగుతూనే వున్నావుగా?" బెంగగా అడిగాడు సత్యనారాయణ. "నిన్న కులాసాగానే ఉన్నావుగా!" సగం నవుతో , సగం నీరసంతో అంది పార్వతి. ఆ వరబడిని మొత్తం అయుడుగురు కూతుళ్ళను ఇద్దరు కొడుకులను కన్నది ఆ ఇల్లాలు. పార్వతి అనారోగ్యం మరింత ఎక్కువయింది.....సత్యనారాయణ ఇంట్లో అడుగు పెట్టేసరికల్లా ఒక మూలనుంచి పెద్ద పిల్లల బాక్సింగులూ , మరో మూల నుంచి చిన్న పిల్లల ఏడుపులూ, మరో పక్క నుంచి పసివాడి మలమూత్రాది సంబంధమైన చిరాకూ, పడక గదిలోంచి భార్య మూలుగూ ఒక్కసారిగా చుట్టుముట్టేవి.
ఇంటికెందు కొచ్చానా అనిపించేది. సత్యనారాయణ సహజంగా కులాసా పురుషుడు , స్వార్ధపరుడు. పగలంతా ఏంతో శ్రమ పడిన అతని శరీరం సహజంగానే విశ్రాంతిని కులాసాలను కోరేది. ఇంట్లో వాతావరణం అందుకు ఏమాత్రం అనుకూలంగా వుండేది కాదు. సమస్యలను ఎదుర్కోలేని బలహీనుల్లాగే అతను ఎస్కే పిజం ను ఆశ్రయించాడు. తన సమస్యలకు మూలమేమిటో అలోచించి వాటిని పరిష్కరించుకునే బదులు తాగుడునూ, వేశ్యలనూ, ఆశ్రయించాడు. ఆసలు సమస్యలనే మరచిపోవడానికి.
ఖర్చులు పెరిగాయి ....వ్యసనాలతో వెనుకటి ప్రాక్టీస్ తగ్గింది. కుటుంబంలో దర్జా మాత్రం తగ్గలేదు. ఇంట్లో పసిపిల్లల దగ్గర నుంచీ ఎవరు ఎక్కడి కెళ్ళినా కారు మీదే వెళ్ళాలి. ఏ కొత్త సినిమా వచ్చినా ఇంటిల్లి పాది కారులో హైక్లాస్ కెళ్ళి తీరాలి......ఎవరింట్లో పేరంటమయినా అప్పటి కప్పుడు పార్వతి కొత్త చీర - ఖరీదైనది - కట్టుకోవాలి. పిల్లలందరికీ మంచి బట్టలూ, మేజోళ్ళు, బూట్స్ వుండాలి. ఒక వంటమనిషి , ఒక మాలీ, పై పనికి మరోమనిషి ఉండక తప్పదు.
మొట్టమొదటి సారిగా ఒక ఎకరం అమ్మాడు సత్యనారాయణ.
నాలుగేళ్ళయింది అయిదువందలైన పోగు చెయ్యలేక పోయారు కళ్యాణీ శంకరం దంపతులు.
"మనకి పిల్లల్ని చూచుకునే యోగం లేదేమో!" అన్నాడు బెంగగా శంకరం.
"ఛ! అలా అధైర్యపడకండి. ఈ ప్లీడరీ గుమస్తా ఉద్యోగం ఎదుగు బొదుగు లేకుండా వుంది. మరో ఉద్యోగం ఏమైనా చుచుకోరాడూ! రెండు వేలు బాంక్ లో ఉన్నాక కాని పిల్లలోద్దు .....అసలు లేకపోయినా సరే!"
అనుకుకొండా కాకినాడలో ఇంతకంటే కాస్త మంచి ఉద్యోగం దొరికింది శంకరానికి. శంకరం కల్యాణి కాకినాడ వెళ్ళిపోయారు. అంతమంది పిల్లలతో, రోగాలతో పిల్లలను అదుపులో పెట్టడం చేతకాలేదు పార్వతికి. ఒక్కళ్ళకైనా చదువు సరిగ్గా అబ్బలేదు. మూడవ నెంబరు పద్నాలుగేళ్ళు వచ్చినా ఆరో క్లాసులోనే ఉన్నాడు.
పెద్ద పిల్ల పెళ్లి కుదిరింది. గొప్ప సంబంధం చూసి ఎనిమిది వేలు కట్నంతో పెళ్లి చేశారు. రెండెకరాలు హరించుకు పోయాయి. ప్రాక్టీస్ ఇంచుమించు పడిపోయింది .....విస్కీ బాటిల్ దగ్గర లేకపోతె రోజు గడవటం లేదు సత్యనారాయణకి.
పెద్దమ్మాయి పురుటి కొచ్చింది. ఇంటిలో రెండు ఉయ్యాలలు వెలిశాయి....ఒకటి కురుతూ బిడ్డకి, మరొకటి తల్లి బిడ్డకి. రెండో కూతురు పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి కూడా దర్జాగానే చేశారు. పెద్ద కొడుకు పచ్చి రౌడిలా తయారయ్యాడు. వేశ్యలు వాళ్ళే రానియ్యలేదు. డబ్బు లేదు గనుక, త్రాగుడును మాత్రం వదిలించుకోలేకపోయాడు .
సత్యనారాయణ ఆ పూటకు ఇంట్లో బియ్యం కేలపోయినా సరే, బార్ కి మాత్రం వెళ్ళటం మానలేకపోతున్నాడు. రెండో అల్లుడు 'అది కావాలి , ఇది కావాలి " అని తాఖీదులు పంపుతూ సతాయిస్తూనే వున్నాడు.
పార్వతీ మళ్ళీ కడుపుతో వుంది. ఈసారి పురుడు సవ్యంగా రాలేదు. శిశువు గర్భంలో చచ్చిపోయింది..... ఆపరేషన్ చేసి తియ్యవలసి వచ్చింది.
"ఇంక నీకు పిల్లలు పుట్టరు "అంది లేడీ డాక్టర్. "హమ్మయ్య!" అనుకుంది పార్వతి . ఇంత అవస్థ పడకుండానే ఇలా "హమ్మయ్య!" అనుకునే అవకాశం ఉందని గుర్తించలేని అమాయకురాలు.
పెద్ద కొడుకు రౌడీ అయితే చిన్నకొడుకు రోగిష్టి. మూడో కూతురికి కూడా నానా అవస్తా పడి గొప్ప సంబంధమే చేశారు -- అక్కడితో ఆస్తంతా పూర్తిగా హరించుకుపోయింది.... మర్యాదలు సరిగా జరగనందుకు మూడో కూతుర్ని అత్తగారు సతాయిస్తున్నారని తెలిసినా కళ్ళనీళ్ళు పెట్టుకోవటం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది పార్వతి.
పండుగలకు పిలవటం లేదనీ, చివరకు పసుపు కుంకుమయినా పెట్టడం లేదనీ కూతుళ్ళే దెప్పి పొదుపుగా ఉత్తరాలు రాస్తున్నా సమాధానం కూడా రాయకుండా ఊరుకుంది. పెద్ద కొడుకు ఇంటికి వచ్చినప్పుడు వస్తాడు, లేనప్పుడు లేదు ....అతడు ఇంటికి రాలేదనే బెంగకంటే వస్తే ఎలాగనే భయమే ఎక్కువ పార్వతికి.
ఎప్పుడో వచ్చి, ఉన్న అరగంటలోనూ యిల్లంతా నరకంలా మార్చి , మిగిలిన వాళ్ళ గురించిన ఆలోచనే లేకుండా ఇంట్లో ఏముంటే అది తినేసి వెళ్ళిపోయే వాడు రవి. అందుకని అతను రాకుండా ఉంటేనే బాగుండుననిపించేది పార్వతి ప్రాణానికి. రోగిష్టి వాడయినా నమ్మకస్తుడయినా చిన్నకొడుకు మాధవ్ మీదే ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతుంది పార్వతి. పదమూడేళ్ళు నిండి నిండకుండానే ఇంటెడు చాకిరీ నెత్తి నీసుకుని నోరుమూసుకు చెయ్యటం అలవాటై పోయింది నాలుగో కూతురు వారిజకి.
ఇంటిపనే కాదు, తండ్రి అర్ధం పర్ధం లేని వాగుడూ, రోగిష్టి తల్లి నిష్కారణమైన సణుగ్గుళ్ళూ కూడా అలవాటై పోయాయి. తమ ఇంటి ప్రక్కనే ఉన్న యశోదమ్మ గారితో పరిచయం చేసుకుంది వారిజ. ఆవిడ దగ్గర నవలలు తీసుకుని తెగ చదివేది. ఆ నవలలే ఆమెకీ అనునిత్యమూ తనను చుట్టుముట్టిన అనేక సమస్యలను తాత్కాలికంగా మరిపించేవి. తన తండ్రి సమస్యల నుండి త్రాగుడులోకి పారిపోయినట్లు ఆ పిల్ల తన చికాక్కుల్లోంచి పుస్తకాల్లోకి పారిపోయేది.
అప్పుడప్పుడు యశోదమ్మ ఇంటికి బంధువులోస్తూ ఉండేవారు. అప్పుడల్లా యశోదమ్మ వారిజను సాయానికి పిలిచేది. వారిజ యశోదమ్మకు ఎంతో సాయం చేసేది ఓపిగ్గా యశోదమ్మకు జాలేసి వారిజ చేతిలో ఒక రూపాయి పెట్టేది. మొట్ట మొదటి రోజున వారిజ అరూపాయి సంబరంగా తల్లి చేతిలో పెట్టింది. ఆ రూపాయి చూసి అదెలా వచ్చిందో విన్న తరువాత బావురుమని ఏడ్చింది పార్వతి. ఏదో ఆవేదన కడుపునా మేలి పెట్టేయగా తన క్షోభ తనకే అర్ధం గాక కూతురి మీద విరుచుకు పడింది.
"పాపిష్టిదానా! చివారకు ముష్టి దానివయ్యావా? అక్కడా ఇక్కడా చాకిరీలు చేసి డబ్బు లడుక్కోంటున్నావా! సిగ్గు లేదూ ఇంత బ్రతుకు బ్రతికి!" "నేనడగలేదు ఆవిడే ఇచ్చారు" బెదురుగా అంది వారిజ.