Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 10

 

    "చచ్చాడా? బ్రతికిపోయాడు. హమ్మయ్యా యింక మందక్కర్లేదు . గుండెలు బ్రద్దలయ్యేలా మూలిగాడు. వాడి బాధలన్నీ తీరిపోయినాయ్. మరి, యింక నా బాధలేప్పటికి తీరుతాయో!" అక్కడ్నించి పారిపాయింది పార్వతి.
    

                                                    -----------

    "పార్వతి , మన వారిజకి సంబంధం  నిశ్చయం చేశాను" సంబరంతో అన్నాడు సత్యనారాయణ..... నమ్మలేనట్లు చూసింది పార్వతి. "నిజం పార్వతి! నిజం. మనకేం ఖర్చు లేదు. ఖర్చులన్నీ వాళ్ళవే...."
    "ఎవరు పెళ్ళికొడుకు?"
    "శర్మ అని చాలా బుద్ధిమంతుడులే! జిల్లా కోర్టులో హెడ్డు గుమాస్తాగా పని చేస్తున్నాడు."
    "నిజంగానా? అతనికి కుంటో గుడ్డో లేదు కదా?"
    "భలే దానివే ! నిక్షేపంగా వుంటాడు."
    "ఖర్చులన్నీ వాళ్ళవే అన్నారా?"
    "ఆ! ఇంకా నాకే ఒక వెయ్యి ఇస్తానన్నాడు......" చటుక్కున అనేసి నాలుక కరాచుకున్నాడు. గతుక్కుమంది పార్వతి.
    "ఎన్నేళ్ళు పెళ్లి కొడుక్కి?" అంది.
    "వాడు యాభై అంటాడు కాని నాకు తెలుసు యాభై రెండున్నా ఉంటాయి. అ మాత్రం కనిపెట్టలేనా? " తన తెలివికి తనే మురిసిపోయాడు సత్యనారాయణ.
    క్షణకాలం స్థాణువులా నించున్న పార్వతి గొంతు పెగాల్చుకుని....
    "యాభై యేళ్ళు పైబడ్డా పెళ్ళి కావలసి వచ్చిందా?" అంది . తను తీసుకొచ్చిన సంబంధాన్ని తను సమర్ధించుకోవడం న్యాయమనిపించింది సత్యనారాయణకి.
    "వాడి కోసమా! ఆ మొదటి భార్య ఊరికే పోకుండా , నలుగుర్ని పిల్లల్ని కని మరీ పోయింది.... ఆ పిల్లలందరినీ వాడేలా చూసుకో గలుగుతాడు? ఏం చెయ్యాలి పెళ్ళి చేసుకోక?"
    కళ్ళప్పగించి నిలబడింది పార్వతి.
    "ఏం బాగులేదనా?" పార్వతిని చూసి నీరసంగా అన్నాడు.
    "చాలా బాగుంది. వారిజకి చెప్పండి. పొంగి పోతుంది."
    'ఆహా.....నువ్వే చెప్పు."
    "ఏం? ఇంత బాగున్న విషయాన్ని కూతురికి చెప్పడానికి భయమేం?"
    "అది కాదు పార్వతి! యింత కన్నా ఈ స్థితిలో ఎక్కడ్నుంచి తెగలను? నువు చెప్పనా?"
    "ఏం చెప్పను ? ఎలా చెప్పను? ఈడుకు మించిన శక్తితో కుటుంబాన్నంతా నిర్వహిస్తున్న దానివి ."నీ గొంతు కోయ్యామంటావా అమ్మా!" అని అడగనా?"
    వెక్కి వెక్కి ఏడ్చింది పార్వతి. తల వంచుకుని వెళ్ళిపోయాడు. కాని ఈ సంగతి ఎవరూ చెప్పకుండా వారిజకి తెలిసిపోయింది. ఆ మాటలన్నీ వినడం వల్ల, తరువాత నెమ్మదిగా తల్లి దగ్గర కూర్చుంది.
    "అమ్మా! ఎలాగైనా నాన్నకు నచ్చ చెప్పు. ఈ పెళ్ళి వద్దని....." అంది, ఎలాగూ తల్లి తనవైపే కదా అన్న ఆశతో. శారీరక మానసిక బాధలతో చితికిపోయి వుంది పార్వతి.
    "ఏం ? ఎందు కొద్దూ? నీ దౌర్భాగ్యానికి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ తెస్తామనుకుంటున్నావ్?" కసిరింది గట్టిగా. బావురుమంది వారిజ. పార్వతి కళ్ళు చెరువులయ్యాయి. వారిజను దగ్గరకు లాక్కుని గుండెల్లో అడుముకుంది.
    "ఏడవకమ్మా! యింత కన్నా కష్టాలేముంటాయి? పోనీ, అక్కడయితే కడుపు నిండా తిండి కట్టుకునేందుకు బట్టా అయినా దొరుకుతుందేమో! ఇప్పట్లో నీ పెళ్లి చెయ్యగలమా? కనీసం పెళ్ళి ఖర్చులయినా భరించగలమా? ఇది తప్పేలా లేదు."
    వారిజ ఇంకేం ,మాట్లాడలేదు. దుఖాన్ని మింగెయ్యగలగడం వారికీ బాగా అలవాటయిపోయింది.....చిన్నప్పటి నుండి వారిజ తన కిష్టం లేని వెన్నో సహిస్తూ వచ్చింది.
    అమ్మ తనను నిష్కారణంగా తిడితే నోరెత్తలేదు.....ఒక్క టెర్లిన్ చీర కనుక్కోవాలని తను దాచుకున్న డబ్బు తండ్రి లాక్కుంటే కన్నీళ్లు కర్చలేదు. యశోదమ్మ గారు తనకు కొని పెట్టిన రిబ్బన్లు లత పెట్టుకుంటే చిరునవు నవింది. ఉప్పూ, గొడ్డూ కారం అన్నంలో వేసుకు తిని కాస్తా కూస్తా కూరా పచ్చడి మిగిలిన వాళ్ళకి పంచింది. నీళ్ళ మజ్జిగకయినా ఆశ పడకుండా పెరుగు బిళ్ళ లత చేతిలో వేసింది.
    అన్నీ సహించగలిగింది. కాని తనని ముసలి వాడికి కిచ్చి కట్ట బెడ్తా నంటే మాత్రం భరించ లేకపోయింది. మిగిలిన ఏ విషయంలోను ఎలాంటి ఆశలూ లేకపోయినా వైవాహిక జీవితం మీద చాలా ఆశలు పెంచుకుంది వారిజ.....యశోదమ్మ గారి దగ్గర తెచ్చుకున్న నవలలు చదివి తన జీవితం కూడా అలా ఉంటుందని కలలు కనేది.
    తనకు తన జీవితం మీద విసుగు పుట్టి ఏ రైలు క్రింద పడటానికి వెళ్తుంది. సరిగ్గా రైలు వచ్చే సమయానికి ఎవరో అందమైన , డబ్బున్న యువకుడు తనను రక్షిస్తాడు. తరువాత అతడు తనను గాడంగా ప్రేమిస్తాడు.....ఆ తరువాత పెళ్ళి.
    తను పరధ్యానంగా నడుస్తూ వుంటుంది. ఎవరిదో కారు కింద పడిపోతోంది......ఆ కారులో అందమయిన యువకుడు ఉంటాడు. పడిపోయిన నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తాడు. .....స్వయంగా దగ్గరుండి సపర్యలు చేస్తాడు. అది ప్రేమగా పరిణామిస్తుంది.
    ఇలా సాగిపోయేవి వారిజ ఆలోచనలు.....బ్రతుకు బరువు నుండి ఎప్పటికప్పుడు ఇలాటి బంగారు కలల్లోకి జారిపోయే వారిజ తన బంగారు కలలు ఇంత దారుణంగా విద్వంసం మయిపోవటం సహించలేకపోయింది. అయితే ఈ కలలు వాస్తవిక జీవితంలో ఎలా ఆకారం పొందుతాయనేది కూడా ఆమె ఊహ కందని విషయమే. ప్రయత్న పూర్వకంగా కలల్ని నిజం చేసుకునే సాహసం మాత్రం వారిజలో లేదు.

                                                      ............

    వారిజ ఎప్పుడూ కారు హరన్ వినగానే ప్రక్కకు తప్పుకునేది .ఏనాడూ రైలు క్రింద పడటానికి ప్రయత్నించలేదు సరికదా, పట్టాల దగ్గిరకు కూడా వెళ్ళలేదు. తన జాగ్రత్త మీదే తనకి కోపమొచ్చింది వారిజ కిప్పుడు. కాని ఇప్పుడెలా! ఒక వేళ రైలు క్రింద పడటానికి వెళుతుందే అనుకో, ఆ సమయానికి అందమైన యువకుడు రావద్దూ? లేక నిష్కారణంగా చచ్చిపోతే! చావటం ఇష్టం లేదు వారిజకు. సరిగ్గా ఇలాంటి సమయంలో వచ్చింది వారిజ స్నేహితురాలు మాధవి.
    మాధవి నిసిమాలలో పాటలు పాడుతుంది. వారిజ సంగతంతా విని "నీ పాత బాగుంటుందిగా? పోనీ నువు సినిమాలలో ప్లే బాక్ పాడుతావా? నేను సహాయం చేస్తాను" అంది. వారిజ ఆలోచనలో పడింది.
    ఇంట్లో ఎవరూ ఇందుకు ఒప్పుకోరని తెలుసు. కానీ తల్లి ఏమంది!" అతడిని చేసుకుంటే నీకు తిండి బట్ట అయినా దొరుకుతుంది ' అని.
    తిండి బట్టా ఇవలేక ఎవడికో కట్టబెట్టడానికి తల పడ్డారు కన్నావాళ్ళే! తన తిండి బట్ట తనే సంపాదించుకుంటేనేం? ఆ రోజంతా అదోలా వున్న కూతుర్ని చూసి "అలావున్నావెం?" అంది పార్వతి.
    "ఏం లేదు " అంది వారిజ.
    మళ్ళీ ఆ విషయం పట్టించుకో లేదు పార్వతి.
    ఆ మధ్యాహ్నం తన పక్కలో కూర్చుని తన గుండెలు రాస్తున్న వారిజను చూసి కళ్ళలో నీళ్ళు నింపుకుంది పార్వతి." ఇంటిపని చాలకే తల్లీ , ఈ సేవ? పో! పోయి కాసేపు పడుకో! ఈ రోగాలు తగ్గేవి కావు" అంది.
    కాని వారిజ లేవలేదు . తల్లి గుండెలు రాస్తూ అలాగే కూర్చుంది.
    "అమ్మా! అన్నయ్య ఒక్కసారి వస్తే బాగుండును" అంది అకస్మాత్తుగా వారిజ.
    "ఎందుకే తల్లీ వాడు! వాడే సవ్యమయిన వాడయితే మనకిన్ని ఇబ్బందులుండేనా?" వారిజ ఇంకా మాట్లాడలేదు."
    తనకు రిబ్బనూ, బొమ్మలూ కొని పెట్టిన అక్కయ్యను చూసి పొంగిపోయింది లత. "రోజూ ఇలా కొనిపెట్ట కూడడా అక్కా?" అంది బుంగమూతితో. వారిజ చప్పున అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం "ఏంట్రా!" అని అనుకున్నా తన బొమ్మల్లో పడిపోయింది లత.
    మూడు గంటలు దాటాక ఎక్కడ్నుంచో వచ్చాడు సత్యనారాయణ.
    తండ్రి దగ్గరగా వచ్చింది వారిజ. "టీ తాగుతావా నాన్నా?" అంది.
    "బాగుందమ్మా! చాలా బాగుంది. నువ్వు బంగారు తల్లివమ్మా నిజం చెపుతున్నాను వారిజా, నువు చాలా గోప్పదానివయి పోతావు." వారిజ నవింది.....పది నిముషాలలో లోపలి కెళ్ళి మళ్ళీ తండ్రి దగ్గరగా వచ్చింది.
    "నాన్నా"
    "ఏం వారిజా?"
    "ఇదిగో!' రెండు రూపాయలు కాగితాన్ని తండ్రి చేతిలో పెట్టింది.
    "ఇంతే ఉంది నాన్నా!"
    "ఎందుకు? ఎందుకిది?"
    "ఇలా కాక నిన్నింకేలా సంతోష పెట్టగలను నాన్నా" పిచ్చి వాడిలా చూశాడు సత్యనారాయణ.
    " కొత్త మాట వింటున్నానమ్మా! ఇన్నాళ్ళ నా జీవితంలో నేను అందర్నీ సంతోష పెట్టడానికి ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఇన్నాళ్ళకు నువు......నా కూతురివి , నన్ను సంతోష పెట్టాలను కుంటుంటే ....నాకు ....నాకు....."

 Previous Page Next Page