Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 9


    "థాంక్యూ డాడీ! నేను వెళ్తానిక" ఆమె పరుగుతో వెళ్ళిపోయింది.
    సుధీర్ కుమార్ బైనాక్యులర్స్ తీసుకుని మళ్ళీ దూరంగా వున్న గుడిశెల వేపు ఆనందంగా చూడసాగాడు.


                                           *    *    *    *


    కె.యస్.ప్రకాష్ దృష్టి అతి ప్రకాశంగా తనముందే నడుస్తున్న సుష్మాసహానీ మీద కేంద్రీకృతమయి వుంది. సుష్మ తప్పితే ప్రపంచంలో ఇంకేమీ వున్నట్లు అతనికి అనిపించటం లేదు. అందుకే కార్లు, బస్సులు, స్కూటర్ వాలాలు, మోటర్ సైకిలు వాలాలు హారన్లు మోగించి విసుగుపుట్టి అతని వెనుకే నెమ్మదిగా నడిపిస్తున్నారు హైద్రాబాద్ లోని అలవాటు ప్రకారం.
    అతను ఆ ట్రాఫిక్ అంతటికీ లీడర్ అయినట్లు ముందు నెమ్మదిగా నడుస్తున్నాడు. అతనికి లీడర్ లాగా సుష్మ నడుస్తుంది.
    "ఆటోలు రోడ్డు మధ్య పార్క్ చేసి కబుర్లు చెప్పుకుంటున్న ఆటో డ్రైవర్లు ఇద్దరు కె.యస్.ప్రకాష్ ని చూసి "అప్నా శహర్ మే లోగోంకో ట్రాఫిక్ సెన్స్ నై యారోం" అనుకుంటున్నారు.
    ఇలా సర్కస్ లా సాగిపోతున్న ట్రాఫిక్ కె.యస్.ప్రకాష్ వెనుకే నత్త తాలూకు ఎవర గ్రీన్ నడకతో ఎంతసేపు ప్రయాణించేదోగానీ హఠాత్తుగా సుష్మాసహాని ఆ రోడ్డు పక్కనే వున్న "కేఫ్ కామెరూన్" అనే హోటల్లోకి తిరిగేసరికి కె.యస్.ప్రకాష్ కూడా అదే హోటల్లోకి నడవక తప్పలేదు.
    ఫ్యామిలీ రూమ్ లో సుష్మాసహానీ కెదురుగ్గా తనూ కూర్చున్నాడు.
    ఆమె అతనివేపు చిరాగ్గా చూసింది.
    ఫ్యామిలీ రూమ్ లోకి సింగిల్ గా ఒక మగాడు రావటం, కావాలని తన టేబుల్ నే షేర్ చేసుకోవటం ఆమెకు నచ్చలేదు.
    "హలో మిస్! మీరు మిస్ సుష్మా కదండీ! నేను మీ ఫ్యాన్ ని" అన్నాడతను చిరునవ్వుతో.
    ఆమె వెంటనే కూల్ అయిపోయింది. "ఓ!" అంది లోపలి ఆనందం బయటకు కనిపించకుండా.
    "మీరు అద్భుతంగా నటించిన 'ఆగని మనసులు' సీరియల్ చూశాను. మీరు అద్భుతంగా కంటే కూడా బాగా నటించారు."
    "ఓ! థాంక్యూ! ఆగని మనసులు కాదు, ఆగని మమతలు."
    "ఆగని మమతలా? మరి నేను ఆగని మనసులని రాసుకున్నానే. నో ప్రాబ్లెమ్! ఇంటికి వెళ్ళగానే మార్చేసుకుంటాను."
    ఆమె చాలా అందంగా నవ్వింది. "డైరీలో రాసుకున్నారా?"
    "అవును మొత్తం పేజీ అంతా నింపేశాను"
    "ఎందుకు?"
    "మీ ఫ్యాన్ నయిపోవటం వల్ల"
    "ఓ!" అందామె కొంచెం సిగ్గుపడుతూ.
    అంతకుముందు చిరాకు కలిగించిన అతని ప్రజెన్స్ ఇప్పుడు కొంత ఆహ్లాదకరంగా వుందామెకి.
    బేరర్ వచ్చాడు సుడిగాలిలాగా "క్యా చాహియే?"
    కె.యస్.ప్రకాష్ ఆ అవకాశాన్ని వదలదల్చుకోలేదు.
    "హోటల్లో ఏమేం వున్నాయో అన్నీ రెండు ప్లేట్స్ తీసుకురా."
    "దయచేసి నా కోసం ఏమీ చెప్పకండి" అందామె గాభరాగా.
    బట్లర్ చిరాగ్గా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    అతను ఆశ్చర్యపోయాడు "అదేమిటి?"
    "టూమచ్! మీలాంటి అందాల దేవత ఐస్ క్రీమ్ లు తినాలి గానీ, బటర్ మిల్క్ లేమిటి? కన్యాశుల్కం పిరీడ్ లో వున్నట్లు?"
    "ఐస్ క్రీమ్ లు తింటే లావయిపోతాను. దాంతో ఎవరూ హీరోయిన్ వేషం ఇవ్వరు."
    "ఏడ్చారు. ఇవ్వకపోతే నేనే సినిమా తీసి మిమ్మల్ని హీరోయిన్ గా చేసేస్తాను."
    ఆమె ఆశ్చర్యపోయింది. నవ్వు కూడా వచ్చింది.
    "మీరు సినిమా తీస్తారా?" అంది నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూ.
    "అవును! తీస్తాను. చేతిలో డబ్బు లేక వూరుకోవటమేగానీ అసలు ఎప్పుడో తీసేయాల్సింది."
    ఇంక కిలకిల నవ్వేసింది.
    బట్లర్ మళ్ళీ వచ్చాడు విసుగ్గా "ఏం కావాలో తేల్చుకున్నారా?" అడిగాడతను.
    "రెండు బటర్ మిల్క్" అన్నాడు కె.యస్.ప్రకాష్.
    "అదేమిటి? మీరెందుకు బటర్ మిల్క్ తీసుకోవడం?"
    "అసలు నేనేప్పట్నించో మజ్జిగ తాగాలని అనుకుంటున్నాను. మన వంటికి మజ్జిగ చాలా మంచిదని మా పాలతను చెప్పాడు. అదీ గాక ఇవాళ్టి నుంచీ నా అభిమాన పానీయం బటర్ మిల్క్."
    ఆమె మళ్ళీ నవ్వేసింది.
    బేరర్ ఇద్దరికీ బటర్ మిల్క్ తెచ్చిచ్చాడు.
    "మీరు టి.వీ. ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తారనుకుంటాను?"
    "మీ ప్రోగ్రాం ఒక్కటే చూస్తాను"
    "ఓ..."
    "మీ హాబీ లేమిటో తెలుసుకోవచ్చాండీ?" ఆరాధనతో అడిగాడు.
    "నాకు బేస్ బాల్ గేమ్ వాచ్ చేయటమంటే యిష్టం. అమెరికన్స్ ఎంత అద్భుతంగా ఆడతారో అది."
    "అఫ్ కోర్స్! నిజంగా బేస్ బాల్ చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది. నాకూ ఆ గేమ్ అంటే ప్రాణం."
    "రియల్లీ?"
    "నిజమండీ! మీ మీద ఒట్టు."
    "అఫ్ కోర్స్! క్రికెట్ కూడా బాగానే వుంటుంది"
    "నాకు క్రికెట్ అన్నా కూడా యిష్టమే."
    "నాకూ అంతే నండీ!"
    "ఎంతయినా క్రికెట్ ఎప్పటికీ బేస్ బాల్ కాలేదు."

 Previous Page Next Page