"సరే సార్!"
అతను వెళ్ళిపోగానే సుధీర్ కుమార్ మళ్ళీ కిటికీలోనుంచి దూరంగా వున్న గుడిశెల వైపు ఆనందంగా బైనాక్యులర్స్ తో చూడసాగాడు.
అతని హృదయమంతా బాధతో నిండిపోయింది. నిజంగా ఎంత మంచి జీవితం అది! ఎలాంటి చికాకులూ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి భయాలు, ఆందోళనలూ, ఎలాంటి చీకూ చింతా లేకుండా గడిపే జీవితం ఎంత మంచి వరం? చిన్నప్పటినుంచీ తను గుడిశెల్లో అలాంటి జీవితం గడపాలని ఎంతగా కోరుకునేవాడు? గుడిశెల్లో వాళ్ళలాగా వెన్నెల్లో నులకమంచం మీద పడుకోవాలనీ, చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్టలతో ప్రకృతిలో కలిసిపోవాలనీ, పగలంతా కాయకష్టం చేసుకుని సాయంత్రానికి గుడిశెకు చేరుకుని అంబలి తాగుతూ, పక్కనే ఆకలి ముఖంతో తనని చూసే కుక్క తల నిమురుతూ...
ఈ కోరికలన్నీ చిన్నతనం నుంచీ తనతోపాటు పెరిగి పెద్దవయిపోయాయి.
పెరిగిపోతున్న ఆస్తులూ, తరిగిపోతున్న ఆరోగ్యం, పెరిగిపోతున్న టెన్షన్స్, తరిగిపోతున్న మనశ్శాంతి...కార్లు, విమాన ప్రయాణాలు, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మీటింగ్ లు, తాగుళ్ళూ, డిన్నర్ లూ, ఏ.సి. చల్లదనాలు, లగ్జరీ జీవితాలూ-ఇవన్నీ రాన్రానూ నరకం అయిపోతున్నాయి.
స్వేచ్చగా ఆలోచించడం, స్వేచ్చగా గాలి పీల్చటం స్వేచ్చగా తిరగటం మృగ్యమైపోయాయి. ఒకే ఒక్కసారి తను రోడ్డు మీద ఇసుక కుప్పలో పడి ఆనందంగా దొర్లుతుంటే తన తండ్రి నౌకర్లతో లోపలకు లాక్కొచ్చేలా చేసి చావగొట్టి మళ్ళీ బయట అడుగుపెట్టకుండా కట్టడి చేశాడు.
"డాడీ!"
ఆలోచనల్లోనుంచి ఉలిక్కిపడి తేరుకున్నాడు సుధీర్ కుమార్. ఎదురుగ్గా మృదుల నిలబడి వుంది.
"ఏం బేబీ?"
"మిమ్మల్ని చూసి వారం రోజులయిపోయింది డాడీ!"
"అవునమ్మా! దేశమంతా తిరిగేయాల్సి వచ్చింది. ఇందాకే వచ్చాను మళ్ళీ. ఎలా వున్నావ్ బేబీ?"
"బాగానే వున్నా డాడీ!"
తన మనసులోని మాట చెప్పాలా వద్దా అన్న సంశయం కలిగింది ఆమెకి.
"డోంట్ వర్రీ బేబీ! ఆ డబ్బు వుంది చూశావూ అది ఎక్కువయిన కొద్దీ మనుషుల మధ్య నాన్ ట్రాన్స్ పరెంట్ తెరలు దించేస్తుందమ్మా. అందుకే వీలయినంత త్వరగా దీనిని వదిలించుకుందామని చూస్తున్నాను. అన్నట్లు ఈ మధ్య రిలీజయిన 'గుడిశెలు మారాలి' అనే సినిమా చూశావా నువ్వు?"
"లేదు డాడీ!"
సుధీర్ కుమార్ షాక్ తిన్నట్లు చూశాడామెవైపు.
"ఏమిటమ్మా? గుడిశెలు మారాలి సినిమా చూళ్ళేదా నువ్వు!!!"
"లేదు డాడీ! చూద్దామని రెండో రోజు వెళ్ళేసరికి తీసేశారది."
"అందుకే మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోకూడదమ్మా. ఏ సినిమా అయినా సరే మొదటిరోజే చూసేయాలి. ఇంకెప్పుడూ అలాంటి తెలివితక్కువ పని చెయ్యకు."
"సరే డాడీ"
"ఆ గుడిశెలు మారాలి సినిమాలో హీరో ఎక్కడుంటాడో నీకు తెలుసామ్మా?"
"తెలీదు డాడీ. ఎక్కడుంటాడు?"
"ఓ అందమయిన గుడిశెలో."
"ఓ...అలాగా!"
"ఆ గుడిశెలోనే వుంటూ, స్కాలర్ షిప్ తో చదువుకుంటూ, తీరిక సమయాల్లో కూలి పని చేసుకుంటూ చాలీ చాలని తిండి తింటూ - అబ్బ! తలుచుకుంటేనే ఆనందంతో వళ్ళు పులకరిస్తుందమ్మా."
"డాడీ..." ఏదో చెప్పటానికి ప్రయత్నించిందామె.
"అందులో హీరోయిన్ ఎక్కడుందనుకున్నావ్?"
"ఎక్కడ డాడీ?"
"కాంక్రీట్ బిల్డింగ్ లో"
"ఓహో!"
"కాంక్రీట్ బిల్డింగుల్లో పెరిగేవాళ్ళ హృదయాలు కూడా కాంక్రీట్ లాగానే వుంటాయమ్మా. కానీ చివరకు హీరో ఏం చేశాడో తెలుసామ్మా? కాంక్రీట్ బిల్డింగ్ లో వుండే వారి గుండెలకంటే గుడిశెల్లో పెరిగే వారి గుండెలే కష్టాలకు ద్రవిస్తాయని, మంచికి స్పందిస్తాయనీ ఋజువుచేస్తాడు."
మృదులకు నిరాశ కలిగింది.
తండ్రి మూడ్ లో వున్నాడంటే గుడిశెలకు సంబంధించిన విషయాలు తప్పితే ఇంకోటేమీ మాట్లాడడు.
"డాడీ!"
"ఎస్ బేబీ!"
"మా ఫ్రెండ్ ఒకతనిని ఇవాళ మనింటికి ఇన్వైట్ చేశాను డాడీ"
"అలాగా! అతను గుడిశెల్లో వుంటాడామ్మా?"
"లేదు డాడీ!"
సుధీర్ కుమార్ నిరుత్సాహపడిపోయాడు.
"అలాగా వెరీ బాడ్! ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ మనుషుల్ని రాక్షసులుగా మార్చేస్తాయమ్మా. అందుకే ప్రపంచమంతా ఇన్ని అలజడులూ, ఇంత వయొలెన్స్."
"మధ్యాహ్నం మీరు కూడా ఇంటికొస్తే అందరం కలిసి భోజనం చేయవచ్చు డాడీ."
"ఓ! తప్పకుండా వస్తానమ్మా. ఎన్నింటికి రావాలో మా సెక్రటరీకి చెప్పి వెళ్ళు."
మృదుల ముఖంలో ఆనందం కనిపించింది.