Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 10

    "అవునవును"
    "అలాగే బేస్ బాల్ ఎప్పటికీ క్రికెట్ అవలేదు."
    "ఛస్తే అవలేదండీ!"
    "క్రికెట్ ఈజ్ క్రికెట్ అండ్ బేస్ బాల్ ఈజ్ బేస్ బాల్!"
    "అవునండీ. క్రికెట్ క్రికెట్టే! బేస్ బాల్ బేస్ బాలేనండీ!"
    "బేస్ బాల్ దరిదాపులకు కూడా రాలేదు క్రికెట్"
    "రావటమా? అసలు చుట్టుపక్కలక్కూడా తొంగిచూడలేదండీ!"
    ఆ తరువాత ఇంకేం మాట్లాడాలో తెలీలేదామెకి.
    అప్పుడు అకస్మాత్తుగా టైమ్ చూసుకుంది. "మైగాడ్! డబ్బింగ్ కెళ్ళాలి. టైమ్ చూసుకొనేలేదు" అంటూ తన బ్యాగ్ లో నుంచి వంద నోటు తీసి బిల్ వున్న ప్లేట్ లో పెట్టబోయింది.
    "నోనోనో! బిల్ నేనివ్వాలి." అంటూ ఆమెకు అడ్డంపడి ప్లేట్ లాగేసుకున్నాడతను.
    "ఆల్ రైట్...! అయితే నేను వెళ్తానిక! థాంక్స్ ఫర్ యువర్ కంపెనీ" అంటూ చకచకా బయటకు నడిచిందామె.
    ఆమె వెనుకే తనూ నడవబోతుంటే బేరర్ బిల్ ప్లేటు అతని ముందుంచాడు.
    అప్పుడు గుర్తొచ్చింది తన జేబులో రెండ్రూపాయలకంటే ఎక్కువగా క్యాష్ లేదని. బిల్ వైపు చూశాడతను. ఎనిమిది రూపాయల తొంభై పైసలు.
    కె.యస్.ప్రకాష్ కి ఒక్కసారిగా తన జీవితం మీద విరక్తి కలిగింది. తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి కోసం తొమ్మిది రూపాయల బిల్ కట్టలేని బ్రతుకూ ఓ బ్రతుకేనా? కాదు! ముమ్మాటికీ కాదు. ఇదే ఇంకెవరయినా అయితే ఈ బ్రతుకు భరించలేక భారతదేశం (అబద్ధాల పుట్ట) టి.వీ.న్యూస్ చూసి ఇట్టే ప్రాణం వదిలేసేవారు.
    బేరర్ కె.యస్.ప్రకాష్ వైపు చిరునవ్వుతో చూశాడు.
    "హు..." అన్నాడు నిట్టూరుస్తూ.
    "అంటే?" అడిగాడు బేరర్ మరింత అనుమానంగా.
    "రంగుల రాట్నం లాంటి ఈ జీవితం సంకుల సమరమనే కీర్తి శిఖరములను అధిరోహించుట మానవమాత్రులమయిన దేవోదాత్తులు మహోన్నత ధీరోదాత్త బహుకృతశల్యాశల్య అసద్భావనాసజనిత్కర్ష ప్రయోజనా ప్రభంజన విచలితవిమోచనా..." ఇంతవరకూ మాట్లాడాక అతనికి తను చెప్పదల్చుకున్నమాట దారి తప్పినట్లనిపించింది.
    "వర్డ్స్ కరెక్టేగాని ఏది దేని తర్వాతో మర్చిపోవటం వల్ల కన్ ఫ్యూజింగ్ గా వుంది. కొంచెం అటూ ఇటుగా అంటే ఆఖరి పదం మధ్యలోనూ, మధ్యలో పదం మొదట్లోనూ అంటే కేవలం ఉదాహరణకు..." అన్నాడతను బేరర్ తో.
    బేరర్ కి అతని మాటలు కొంతవరకూ మతిస్థిమితం తప్పేట్లు చేసినయ్.
    "ఇంతకూ మీరు చెప్పదల్చుకున్నదేమిటి సార్?" అడిగాడు షాక్ నుంచి కోలుకుంటూ.
    కె.యస్.ప్రకాష్ కేం చెప్పాలో తెలీలేదు.
    అసలు మాటల వల్ల ప్రయోజనం లేదని కూడా అతనికి అర్థమైపోయింది.
    ఆ ఆలోచన రాగానే అమాంతం బేరర్ ముఖం మీద ఓ బాక్సింగ్ దెబ్బ కొట్టి అతను ప్రక్క టేబుల్ మీద టిఫిన్ చేస్తున్న భార్యభర్తలిద్దరితోపాటు కుర్చీల సందులో పడిపోయాడన్న విషయం నిర్ధారించుకొని వేగంగా అక్కడ్నించి బయటకు నడిచి జనప్రవాహంలో కలిసిపోయాడతను.


                                           *    *    *    *


    సుధీర్ కుమార్ కారు దిగి ఇంట్లో కొస్తుంటే మృదుల పరుగుతో అతనికెదురొచ్చేసింది.
    "అబ్బ! మీరొస్తారో, మర్చిపోతారోనని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను డాడీ" అందామె ఉత్సాహంగా.
    "నా కోసమా? ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్ కుమార్.
    "ఎందుకేమిటి డాడీ...? మా ఫ్రెండ్ ఒకతనిని లంచ్ కి ఇన్ వైట్ చేశానని చెప్పాను కదా! అతనిని మీకు పరిచయం చేయాలి."
    "ఎందుకు?"
    "అయ్యో! ఏమిటి డాడీ మీరు మరీనూ రండి" అంటూ హాల్లోకి రాగానే సోఫాలో కూర్చున్న విజయ్ ని పరిచయం చేసింది.
    "ఇతనే విజయ్ మా డాడీ..."
    "నమస్తే" అన్నాడు విజయ్ వినయంగా లేచి నిలబడి.
    "నమస్తే...నమస్తే...నీ పేరేంటోయ్?"
    "విజయ్ సార్..."
    సుధీర్ కుమార్ మృదుల వైపు అనుమానంగా చూశాడు "మరి నరేష్ అంటావేమిటమ్మా? అతని పేరు విజయ్ అట"
    "నేను విజయ్ అనే చెప్పాను డాడీ" కోపం నటిస్తూ అందామె.
    "నేను చెప్పేది అదే! అతని పేరు విజయ్ కాదుట"
    "ఇంక విజయ్ కి కల్పించుకోక తప్పలేదు "నా పేరు విజయేనండీ."
    సుధీర్ కుమార్ మరింత ఆశ్చర్యపోయాడు.
    "అలాగా! అయితే మరిందాక విమల్ అని చెప్పావెందుకు?"
    "నేనలా చెప్పలేదండీ."
    "మరేం చెప్పావ్?"
    "విజయ్ అనే చెప్పాను"
    "అదే నేననేది నీ పేరు సురేష్ అని, విజయ్ అని ఎందుకు చెప్పినట్లు? వెరీ బాడ్! ఇంతకూ నువ్వేం చేస్తున్నావోయ్?"
    "ఏమీ చేయటం లేదండీ! చదువు ఆపేశాను."
    "బహుశా బీదతనం వలన ఆపేసి వుంటావ్! కదూ?" ఆశగా అడిగాడు సుధీర్ కుమార్.
    విజయ్ నవ్వాడు. "కాద్సార్! నాకే చదవాలనిపించలేదు."
    "ఓ అలాగా!" నిరుత్సాహపడిపోయాడతను. "పోనీ నువ్వుండటం ఎక్కడోయ్? కేదారనగర్ గుడిశెలోనా?"

 Previous Page Next Page