Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 9


    చిరంజీవికి అంతకు ముందురోజు సాయంత్రం జరిగిన సంఘటనే ఇంకా కళ్ళముందు కనబడుతోంది. తనను రహీమ్ భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసుకి తీసుకెళ్ళాక స్వామి లోపలకు పిలిచాడు.
    "ఇదిగో! పొద్దున్న నువ్వు చిలక పలుకులు పలికావ్ గదా! తాగుడు తగ్గించేశా, డ్యూటీలో గిట్ట తాగను అని. అందుకే పిలిపించినా! నువ్వు ఈ క్షణం నుంచే డ్యూటీలో వున్నట్లు. అంతే తిరిగి నేను చెప్పేవరకూ నీ గొంతులోకి ఒక్క చుక్క కూడా పడకూడదు"
    "ప్రామిస్ చేయమంటారా సార్?"
    "నాక్కావలసింది ప్రామిస్ లు కాదు. మాట నిలబెట్టుకోవాల!"
    "నిలబెట్టుకుంటాన్సార్"
    "అయితే ఇంటికి పో. ఇవాళ్టి నుంచి నీకు తనఖా యిస్తా! నువ్వు రాత్రంతా డ్యూటీలోనే ఉండాలె గానీ డ్యూటీ ఉదయం అయిదుగంటలకెళ్ళా స్టార్టవుతాది. బరాబర్ అయిదు గంటలకు నువ్వీడకొచ్చి మారుతీ వన్ థౌజండ్ తీసుకెళ్ళాలి సమజయిందా?"
    "కొత్త కారా సార్?"
    "బ్రాండ్ న్యూ! నువ్వే మొదటి ట్రిప్ కొడుతున్నావన్నట్లు"
    చిరంజీవికి ఆనందం పొంగి పొరలింది.
    "థాంక్యూ సర్"
    "కానీ గిరాకీ ఎవవో తెలుసా? కరోర్ పతి! ఆయన బిడ్డ చాలా కోపంగలామె. ఏమాత్రం డ్రైవింగ్ చేసినాగానీ, జెర్క్స్ గిట్ట ఇచ్చినా గానీ ఆమె చాలా వైల్డుగా బిహేవ్ చేస్తది సమజయిందా?"
    "అయింది సార్"
    "ఇంతకీ ముఖ్యమయిన విషయం ఏమంటే వాళ్ళు బంగారు పిచ్చుకలు. మన కంపెనీకి వాళ్ళవల్ల జబర్దస్త్ లాభం ఉంటది. ఈ సంగతి ఎరుకనా? గిప్పుడీ కొత్త మారుతీ కారు కిలోమీటర్ కి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తున్నా!"
    "బ్రహ్మాండమయిన గిరాకి సార్"
    "గందుకే ఏ పరిస్థితుల్లోనూ ఆళ్ళను బేజారు గాకుండా జూడాల. ఈ నాగార్జునసాగర్ ట్రిప్ సక్సెస్ అయితే ఈ వారం దినాలు మనసుకి ఆళ్ళతోనే వుంటుంది సమజయిందా?"
    "తెల్సింది సార్. ఈ ట్రిప్ సక్సెస్ చేసే బాధ్యత నాది."
    "గుడ్! నాక్కావలసిందదేమళ్ళా!"
    చిరంజీవి త్వరత్వరగా ఇస్త్రీ చేయటం ముగించి యూనిఫారం, బూట్ పాలిష్ కొట్టిన బూట్లు వేసుకున్నాడు.
    "ఏయ్ రాజూ, రజని నేను తిరిగి అర్థరాత్రికి ఇంటికి చేరుకుంటాను. మీరందరూ స్కూలుకి వెళ్ళి చక్కగా చదువుకుని సాయంత్రానికి ఇల్లు చేరుకోండి. భోజనం చేసి చదువుకుంటూ కూర్చోండి. ఎవరింటికి వెళ్ళవద్దు. అల్లరి చేయకూడదు తెలిసిందా?"
    "తెలిసింది మావయ్యా"
    "ఒకవేళ ఏమయినా పిచ్చివేశాలేస్తున్నట్లు రిపోర్ట్ వచ్చిందంటే బెల్టుతో అందరి వీపులూ చీరేస్తాను. అర్థమయిందా?"
    అందరూ తలలు ఊపారు.
    చిరంజీవి సైకిల్ మీద ట్రావెల్ ఆఫీస్ కి బయల్దేరాడు.
    అప్పటికే సుజుకి థౌజండ్ రడీగా ఉంది. అద్దంలాగా మెరిసిపోతుంది. స్వామి ఆఫీసు కూర్చుని ఉన్నాడు.
    చిరంజీవిని చూడగానే అతని మొఖంలో ఆనందం కనిపించింది.
    "వెరీగుడ్. వచ్చేశావన్నమాట! ఏదీ ఓ సారిలా రా! రాత్రి మందు కొట్టావేమో చెక్ చేస్తాను" అంటూ బ్రెత్ ఎనలైజర్ తీసుకొచ్చి చిరంజీవి ముందుంచాడు.
    "ఏది 'హ' అను."
    "హ!"
    "ఇంకోసారను!"
    "హ హహ హ హ!"
    "చాల్చాలు. మందు కొట్టలేదంటే ఆశ్చర్యంగా వున్నది. ఓకే. ఇంక బయల్దేరు. కానీ కారులోనే నిరంజన్ బిడ్డ వస్తున్నది. జాగ్రత్త! చాలా ఒబీడియంట్ గా వుండాలె! చాలా మర్యాద తోటి మాట్లాడాలె! ఏమంటున్నా?"
    "నా విషయం తెలిసికూడా ఎందుకు సార్ అలా అంటారు?"
    "ఏనాడయినా ఒక్క కంప్లైయింట్ వచ్చిందా నామీద?"
    "లేదులే గాని ఈ క్లయింట్ మనకు గోల్స్ మైన్ కాబట్టి మళ్ళీ మళ్ళీ జెప్తున్నభయ్!"
    "గోల్డ్ మైనని ప్లాటినమ్ మైన్ చేస్తాను సార్! నామీద నమ్మకముంచండి."
    "ఓకే! టైమవుతున్నది. ఇకపో!"
    "అలాగే సర్!"
    చిరంజీవితోపాటు స్వామి కూడా బయటికొచ్చాడు.
    చిరంజీవి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.
    అంతకు ముందురోజు సాయంత్రం తను ఆ కారుమీద ట్రయల్ డ్రైవ్ చేశాడు. చాలా అద్భుతంగా, చాలా స్మూత్ గా కదులుతోందది.
    "విష్ యూ గుడ్ జర్నీ!" అన్నాడు స్వామి.
    "థాంక్ యూ సర్!"
    కారు ముందుకు దూసుకుపోయింది.  
    ఖాళీగా వున్న నగర రోడ్లమీద గంటకు తొంభయ్ కిలోమీటర్ల వేగంగా నడవగలుగుతున్నాడతను.
    కారు మోటర్ శబ్దం కూడా వినిపించటం లేదు.
    అంత మెత్తగా పరుగెడుతోందది.
    ఇంత అద్భుతమయిన కారు డ్రైవ్ చేసే అవకాశం కలగటం నిజంగా తన అదృష్టం.
    కొద్దిసేపట్లో కారు వచ్చి బంజారాహిల్స్ లో నిరంజన్ భవనం పోర్టికోలో ఆగింది. అప్పటికే అక్కడ నిరంజన్ తాలూకు టయోటా కార్లు రెండూ సిద్ధంగా వున్నాయ్.
    ఆ డ్రయివర్లిద్దరూ తనను చూడగానే విష్ చేశారు.
    "ఏమన్నా...ఏమిటి సంగతి? మళ్ళీ ఇదే కొలువులో కొచ్చినావన్నమాట."
    చిరంజీవి నవ్వాడు.
    "దునియా గోల్ హై" అన్నాడు.
    "నువ్వెప్పుడు చేరావ్ ఇక్కడ?"
    అతనిని ప్రశ్నించాడు చిరంజీవి.
    "వారం రోజులయింది. ఢిల్లీ నుంచి మేమ్ సాబ్ వస్తున్నారని అపాయింట్ చేసుకున్నారు."
    "ఇవాళ మన ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు చిరంజీవి.
    "మూడు కార్లు నాగార్జునసాగర్ వెళ్తాయ్. అక్కడ నైట్ హాల్ట్. మళ్ళీ ఉదయం బయల్దేరి వచ్చేసేయాలి. ప్రస్తుతానికి ఇదే అఫీషియల్ ప్రోగ్రాం."
    "అదేమిటి రాత్రికే తిరిగి వచ్చేస్తారని మా బాస్ చెప్పాడు."

 Previous Page Next Page