Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 10


    "అది నిన్నటి ప్రోగ్రామ్! మేమ్ సాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రతి గంటకూ మారిపోతూ వుంటాయ్. అసలు ఇవాళ ప్రోగ్రామ్ ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళటం కానీ, అది కాన్సిలయి నాగార్జునసాగర్ అయింది. తీరా బయల్దేరేసరికి ఇంకేమవుతుందో తెలీదు."
    "మేమ్ సాబ్ చాలా షార్ట్ టెంపర్ డ్ అని విన్నాను. నిజమేనా?" రహస్యంగా అడిగాడు చిరంజీవి.
    "భలేవాడివేలే! అందుకే కదా మేము భయపడి ఛస్తుంది. నీకీ విషయం తెలుసా? మేమ్ సాబ్ కాలేజ్ హాలిడేస్ కి హైద్రాబాద్ వచ్చినప్పుడల్లా ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు నౌఖర్లు ఉద్యోగాలు గానీ, వంటవాళ్ళ ఉద్యోగాలు కానీ పోతుంటాయ్. అంత కోపం ఆమెకు. సెలవు పూర్తయి ఆమె మళ్ళీ వెళ్ళేవరకూ ఆ ఇంట్లో నౌఖర్లు, చాకర్లు అందరూ వళ్ళు దగ్గరుంచుకుని ప్రాణాలు గుప్పెట్లో ఉంచుకుని బ్రతుకుతుంటారు."
    శ్రీరామ్ హడావుడిగా బయటికొచ్చాడు.
    చిరంజీవి అతనికి సెల్యూట్ కొట్టాడు.
    "నీ పేరేంటి?" చిరంజీవిని అడిగాడతను.
    "నా పేరు చిరంజీవి సార్!"
    "కారు జాగ్రత్తగా చెక్ చేసుకున్నావ్ కదా?"
    "చేసుకున్నాను సార్!"
    "ఏం ట్రబుల్ ఉండదు కదా?"
    "ఉండదు సార్!"
    "అయితే నీ కారు తీసుకొచ్చి ఈ టయోటాలకు ముందుపెట్టు. అమ్మాయిగారు నీ కారులో ఎక్కుతారు."
    "అలాగే సార్!" క్షణాల్లో తన కారు తీసుకొచ్చి వాటిముందు పార్క్ చేశాడతను.
    సరిగ్గా ఏడుగంటలకల్లా కిలకిల రావాలతో, అలంకరణలతోనూ మెరసిపోతున్న దేవకన్యల్లాంటి యువతులు పొడుగ్గా, విశాలంగా, ఎత్తుగా వున్న మెట్లు దిగసాగారు. వారి వెనుక సర్వెంట్ మెయిడ్స్.
    చిరంజీవి గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు.
    ఆహా ఎంత అందగత్తెలు!
    వాళ్ళల్లో నిరంజన్ గారి అమ్మాయి ఎవరో?
    అందరి ముఖాలవంకా పరీక్షగా చూశాడతను.
    నావీ బ్లూ రంగు చుడీదార్ ధరించిన యువతి అతని దృష్టినాకర్షించింది. ఆమె ముఖంలోనే ఆ దర్జా, ఆ పొగరుబోతుతనం కనబడుతున్నాయి.
    "పొగరుపోతుతనం ఉంటేనేం? భలే అందంగా వుంది. ఆడదంటే అలా ఉండాలి. సినిమా స్టార్స్ ఏం పనికొస్తారు ఆ అమ్మాయి ముందు? అనుకున్నాడతను.
    ఆమె నవ్వుతూ మాట్లాడుతూంటే మరింత అందంగా, మరింత మనోహరంగా కనబడుతోందతనికి. జానపద సిన్మాల్లో దేవకన్యలా ఉంది.
    అంత అందమయిన అమ్మాయికి ఆ మాత్రం పొగరుండటంలో తప్పు లేదు. ఆ మాత్రం కోపం ఉండడంలో ఏ మాత్రం తప్పులేదు.
    ఆ విషయంలో తను ఆ అమ్మాయికే ఓటేస్తాడు.
    జిందాబాద్ జిందాబాద్-ఆ అందాలరాసి జిందాబాద్!
    జిందాబాద్ జిందాబాద్- ఆ సొగసులబోణి జిందాబాద్.
    నా పవిత్రమయిన ఓటు-ఆ అందగత్తెకే!
    చెంప ఛెళ్ళుమన్న చప్పుడు.
    దాంతోపాటు మొఖం పగిలినంత నొప్పి.
    కొద్దిక్షణాలు ఏం జరిగిందో అర్థంకాలేదతనికి.
    కళ్ళు బైర్లు కమ్మినయ్, మెదడు పనిచేయటం మానేసింది.
    ఏం జరిగింది? ఏం జరిగి ఉంటుంది?
    ఆ అందాల రాణి తన కారు దగ్గరకు రావటం వరకూ గుర్తుంది. ఆ తరువాతేం జరిగిందో తెలీటం లేదు.
    ఆ! అవును గుర్తుకొచ్చింది.
    తన చెంప ఛెళ్ళుమంది.
    ఎలా?
    ఎవరు కొట్టారు?
    ఎందుక్కొట్టారు?
    కొట్టారా అసలు?
    "ఇడియట్! దిక్కులు చూస్తూ నిలబడ్డానికా వచ్చింది? డోర్ మేము తెరచుకోవాలా? మేమే డోర్ తెరుచుకుని, మేమే కార్లో కూర్చుని, మేమే డోరు వేసుకుని, మేమే అన్నీ చేసుకుంటే నువ్వెందుకురా ఇంక? బోడి డ్రైవింగ్ చేయటమొక్కటేనా నీ పని? ఆపాటి డ్రైవింగ్ మేము చేసుకోలేమా?"
    ప్రవాహంలా కురిపిస్తోంది మాటలు.
    తననే-తనవంకే పొగరుగా, కసిగా చూస్తోంది.
    చిరంజీవి కంగారుపడిపోయాడు.
    అవును! ఆమె అందాన్ని తనివితీరా చూస్తూ తను ఘోరమయిన తప్పు చేసేశాడు. డోర్ తెరచి పట్టుకోవలసిన విషయం పూర్తిగా మర్చిపోయాడు.
    ఆమెకు కోపం కలుగజేశాడు.
    అయినా కోపం వచ్చినంతమాత్రాన తన చెంప ఛెళ్ళుమనిపిస్తుందా? పైగా 'రా' అంటుందా తనను?
    ఇంతవరకూ ఎవరూ తనను 'రా' అనలేదు తన తల్లి తప్ప.
    తన తండ్రి కూడా ఏమోయ్ అంటూండేవాడు.
    "ఇంకా చూస్తావేమిట్రా ఇడియట్! డోర్ తెరు"
    ఈసారి ఆమె కాలితో మోకాలి మీద తన్నింది.
    ఆ బూటు మడమ మోకాలి మీద ఇనుప ముద్దలా తగిలింది.
    మోకాలిచిప్ప ముక్కలయిపోయిందేమోనన్నంత నొప్పి.
    ఇది మామూలు కాజువల్ తన్ను కాదు.
    ప్రొఫెషనల్ తన్ను.
    అంటే తన్నటంలో బాగా ప్రాక్టీస్ వున్నవాళ్ళు యిచ్చిన కిక్. ఛటుక్కున వంగి డోర్ తెరిచి పట్టుకున్నాడు.
    అప్రయత్నంగా చిరంజీవి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.  
    జీవితంలో ఇది మొదటిసారి. ఇంత దారుణంగా అవమానింపబడటం. తిట్లు, తన్నులు.
    ఏం జీవితం ఇది?
    తను చిన్నప్పుడు రోజూ స్కూలుకెళ్ళేటప్పుడు తన తల్లి ఎంత మురిసిపోతుండేది. తన తల దువ్వుతూ, తనకు స్కూల్ యూనిఫారం వేస్తూ, టై కడుతూ, పుస్తకాల బ్యాగ్ భుజానికి తగిలిస్తూ, బూట్లు వేస్తూ అంటుండేది ప్రేమగా, ఆశగా.

 Previous Page Next Page