శ్రీరంజనిని చూడగానే విష్ చేసిందామె.
"గుడీవినింగ్ మేడమ్!"
"గుడీవినింగ్!"
"స్టఫ్ కావాలా మేడమ్?"
శ్రీరంజని బాగ్ లో నుంచి ఓ నోట్ల కట్ట తీసి ఆమె ముందుంచింది.
"పిల్స్."
"ఓకే మేడమ్!"
ఆ యువతి డబ్బు తీసుకుని సొరుగులో వేసి ఓ రంగురంగుల కాగితం మీద కోడ్ లాంగ్వేజ్ లో ఏదో రాసి ఆమెకిచ్చింది. శ్రీరంజని ఆ కాగితం తీసుకుని హాలుకి ఆనుకుని వున్న మరో గదిలోకి నడిచింది. చాలా పెద్దగా, విశాలంగా వుందా గది.
డిమ్ లైట్స్ తో, మెత్తని తివాచీలతో, సువాసనలతో నిండి వుందది.
అక్కడక్కడ వేసివున్న సోఫాల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు. కొంతమంది సోఫాలో వెనక్కు జారగిలబడి కళ్ళు మూసుకుని వున్నారు. ఇంకొంతమంది ఆ క్లబ్ తాలూకూ యువతలను వళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది తివాచీ మీద ఒరిగిపోయి తెరలు తెరలుగా నవ్వుతున్నారు.
అయితే ఆ డిమ్ లైట్లో ఎవరి మొఖాలూ స్పష్టంగా కనిపించటం లేదు. చాలా నెమ్మదిగా స్టీరియోలో ఇంగ్లీష్ సాంగ్స్ వినబడుతున్నాయ్.
శ్రీరంజనికీ దృశ్యాలన్నీ పాతవే అవటంచేత తిన్నగా కౌంటర్ దగ్గరకు నడిచింది.
కౌంటర్ వెనకవున్న యువతి చిరునవ్వుతో విష్ చేసింది.
శ్రీరంజని తన బాగ్ లోని కాగితం తీసి ఆమె ముందుంచింది.
ఆ యువతి కాగితం తీసుకుని వెనుకనున్న అందమయిన ప్లాస్టిక్ డబ్బా తీసి శ్రీరంజనికిచ్చింది.
"ఫ్రెష్ స్టఫ్ మేడమ్! ఫిలిప్పైన్స్ నుంచి వచ్చింది."
"ఓ! ఫెంటాస్టిక్!"
"రూమ్ ఏమయినా కావాలా మేడమ్?"
"యస్!"
ఆ యువతి వెనుక ఉన్న ఓ తాళం చెవి ఆమెకిచ్చింది.
"రూమ్ నెంబర్ 202 ఈజ్ యువర్స్" అంది చిరునవ్వుతో.
"థాంక్యూ!"
శ్రీరంజని లిఫ్ట్ లోకెళ్ళి నిలబడింది. సెకండ్ ఫ్లోర్ మరింత నిశ్శబ్దంగా ఉంది.
202 ముందు నిలబడి తాళంచెవితో తలుపు తెరిచిందామె. లోపల లగ్జరియస్ ఫర్నిచర్ తో కనులపండుగగా అలంకరించి వుంది. డబుల్ కాట్ మంచం మీద కూర్చుని ప్లాస్టిక్ డబ్బాలోని ఓ పిల్ తీసుకుని నోట్లో వేసుకుందామె. కొద్ది సెకన్ లలోనే అది ప్రభావం చూపటం ప్రారంభించింది.
మంచం మీద వాలిపోతూ రెండో పిల్ వేసుకుందామె. బెడ్ కి పక్కనేవున్న ఫోన్ అందుకుని ఓ బటన్ నొక్కింది.
"సిద్ధార్థ హియర్"
"హాయ్! శ్రీరంజని!" అందామె మత్తుగా.
"ఓ నువ్వా! ఏ రూమ్?"
"202"
"ఓకే వస్తున్నాను"
ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
అతను లేచి బయటికొచ్చి రిసెప్షనిస్టు వేపు చూశాడు.
"ఎవరయినా ఫోన్ చేస్తే 202కి కనెక్టు చెయ్!"
"యస్సర్"
అతను గదిలోకొచ్చేసరికి ఆమె మూడో పిల్ వేసుకుంటోంది.
"ఏమిటి రెండు రోజుల్నుంచీ దర్శనం లేదు?" గది తలుపు మూసి లాక్ చేస్తూ అన్నాడతను.
"బిజీ. నిరంజన్ డాటర్ వచ్చింది ఇవాళ. నిరంజన్ తో షాపింగ్ కెళ్ళాల్సి వచ్చింది."
"ఆ అమ్మాయిని మన క్లబ్ మెంబర్ చేస్తానన్నావుగా?" ఆమె పక్కనే మంచంమీద ఒంగి నగ్నంగా కనిపిస్తున్న ఆమె పొత్తి కడుపు మీద చేయివేసి నిమురుతూ అడిగాడు.
"అదంతా ఈజీ కాదు. నిరంజన్ కి తెలిస్తే చాలా ప్రమాదం. స్లోగా టాకిల్ చేస్తాను. అదీగాక ఆ పిల్ల చాలా పొగరుబోతు. తెలివిగలది. చాలా టైమ్ పడుతుందేమో."
"ఆమె వున్నది సిమ్లా కాలేజీలో కదా! అది బాగా ధనవంతుల పిల్లలు చదివే కాలేజ్ కాబట్టి తప్పకుండా డ్రగ్స్ అలవాటయి వుండాలి"
"అదేంలేదు. అలాంటివి జరక్కుండా చాలా స్ట్రిక్టుగా చూస్తుంటుందక్కడ ప్రిన్సిపాల్. డూ యూ నో? కాలేజ్ హాస్టల్ వేపు కేవలం వార్డెన్, ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ తప్ప ఇంకెవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. పేరెంట్స్ కూడా నెలకోసారి మాత్రమే అనుమతింపబడతారు. మెస్ స్టాఫ్ కూడా నెలకోసారే బయటకెళ్ళడం. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది."
"ఓకే. ఇప్పుడా పంజరం నుంచి బయటపడింది కదా"
"అవును"
అతను టేబుల్ మీదున్న ప్లాస్టిక్ డబ్బా చూశాడు.
"ఏమిటంత తక్కువ స్టాక్ కొన్నావ్?" నవ్వుతూ అడిగాడు.
నిరంజన్ కి ఎందుకో అనుమానం కలిగింది. జాయింట్ ఎకౌంటులో డ్రా చేయాలంటే ఇద్దరి సంతకాలూ ఉండాలన్న నిబంధన పెట్టించాడు. దాంతో నాక్కావలసినంత మొత్తం తీసుకోడానికి వీల్లేకుండా వుంది"
"కష్టాలు మొదలయ్యాయన్న మాట"
"అయితే నువ్వున్నావుగా!"
అతను ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.
"అఫ్ కోర్స్, అయామ్ ఆల్వేస్ దేర్"
"థాంక్యూ" అతని తలను చాతీకి హత్తుకుందామె.
* * * *
తెల్లవారుజామున నాలుగవుతోంది. చిరంజీవి అప్పటికే లేచి యూనిఫారం ఇస్త్రీ చేసుకొనసాగాడు. తనకున్న ఒకే ఒక్క యూనిఫారం అది. అందుకే రోజూ ఉతికి ఇస్త్రీ చేసుకుంటాడు. పిల్లలు నిద్రకళ్ళతోనే కూర్చుని పాఠ్య పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుకుంటున్నారు.
"గుప్తుల కాలమునే స్వర్ణయుగమని అందురు. ఆనాటి రాజధాని నగరంలో రాజ వీధులలో వజ్రాలు, కెంపులు, వైఢూర్యాలు వీధులలో కుప్పలుగా పోసి అమ్మెడివారు."
చిరంజీవి సన్నగా విజిల్ వేయసాగాడు. బాగా ఆనందంగా ఉన్నప్పుడు విజిల్ వేస్తుంటాడతను. ఆ విషయం పిల్లలందరికీ తెలుసు. అందుకే మొఖాలు చూసుకున్నారు.