Previous Page Next Page 
జయ - విజయ పేజి 9


    "అవును! కొంతకాలం వరకూ"
    అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కాడు.
    "వీలయినప్పుడు ఒకసారి రావడానికి ప్రయత్నిస్తాననుకో! కానీ పరిస్థితులెలా ఉంటాయో తెలీదుగా!"
    తలూపింది జయ!
    "వెళ్ళిపోయేముందు ఒక్క కోరిక!" అన్నాడతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
    "ఏమిటది?"
    "మనిద్దరం ఒక రోజంతా కలసి ఆనందముగా గడపాలి."
    "అమ్మో!"
    "ఏం?"
    "మావాళ్ళు ఒప్పుకోవద్దూ? వాళ్ళకేమని చెప్పను?"
    "ఏదొకటి చెప్పు! ప్లీజ్! మళ్ళీ మనకిలాంటి అవకాశం లభిస్తుందో లేదో..."
    "కానీ...ఒక రోజంతా ఎందుకు? మధ్యాహ్నం కాసేపు చాలదూ?"
    "ఊహు! ఆరోజుని మనం మన జీవితమంతా గుర్తుంచుకొనేంత అద్భుతంగా అనుభవించాలి."
    జయ మాట్లాడలేదు.
    తను తల్లితో ఏమని చెప్పి బయటపడగలదా అని ఆలోచించసాగింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకయితే పర్వాలేదు కానీ రాత్రి కూడా అతనితో గడపాలంటే ఎలా సాధ్యం?"
    ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదామెకి.
    "సారీ కిషోర్! ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మాత్రం వీలుంటుంది."
    "ఓకే! దట్సాల్ రైట్! ఎల్లుండి వస్తావా?"
    "ఊ!"
    "ఎక్కడ కలుసుకుంటావ్?"
    "నీ యిష్టం!"
    "స్టేషన్ దగ్గర. తొమ్మిదింటికి."
    "సరే!"
    "వెళదామా ఇక?"
    ఆమె తలూపింది.
    ఇద్దరూ బయటికొచ్చేశారు.
    ఆటోలో ఆమెను ఇంటికి కొద్ది దూరంలో వదిలి అతను వెళ్ళిపోయాడు.
    ఆ రెండోరోజు ఉదయమే లేచి ఎనిమిది గంటలకల్లా రడీ అయిపోయింది జయ.
    "ఏమిటింత పెందలాడే రడీ అయిపోయావ్?" ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.
    "మా ఫ్రెండ్ ఇంటికెళ్ళాలమ్మా! కొంచెం పని వుంది!"
    "ఎవరది?"
    "అదే...సరిత అని చెప్పలేదూ?"
    "కాలేజీలో ఎలాగూ కలుసుకుంటారుగా?"
    "సరిత కాలేజీకి రావటం లేదమ్మా! జ్వరం వచ్చిందట..."
    "ఓహో..." ఆమె సమాధానంతో సంతృప్తి పడిందామె. వయసులో ఉందనీ, ఆమె అందం ఎంతోమందిని ఆకర్షిస్తోందనీ, అంచేత ఆమెను కనిపెట్టి వుండడం, తప్పుదారి పట్టకుండా కాపాడడం తన బాధ్యత అనీ గ్రహించిందామె.
    జయ త్వరగా బయల్దేరి స్టేషన్ కు చేరుకుంది.
    అప్పటికే కిషోర్ ఆమెకోసం ఎదురుచూస్తూ కనిపించాడు.
    ఇద్దరూ టాక్సీలో మళ్ళీ అదే ఇంటికి చేరుకున్నారు.
    మధ్యాహ్నం వరకూ బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లనిపించింది జయకు. ఇద్దరికీ స్వర్గంలో విహరిస్తున్నట్లుంది.
    "కిషోర్!" అతని మెడ చుట్టూ చేతులు వేసి అరమోడ్పు కన్నులతో మత్తుగా పిలిచిందామె.
    "ఊ!"
    "మనం విడిపోవడం నీకు బాధ కలిగించడం లేదూ?"
    "బాధెందుకు ఉండదూ?" చిరునవ్వుతో అన్నాడతను.
    "మనమింకా కలుసుకోవడం సాధ్యంకాదా?"
    "భలేదానివే! కలుసుకోకుండా ఎలా ఉంటాం! ఏదొక రోజు నీకోసం మళ్ళీ వస్తాను."
    "ప్రామిస్?"
    "ప్రామిస్."
    "పోనీ ఉత్తరాలు రాస్తుంటావా?"
    "ఓ! రోజుకో ఉత్తరం రాస్తాను. సరే నువ్వూ అలాగే రాస్తూండాలి నాకు."
    "రోజూ నీ దగ్గర నుంచి ఒక ఉత్తరం రాకపోతే నేన్నీకు రాయను."
    "తప్పకుండా రాస్తానన్నాను కదా?"

 Previous Page Next Page