Previous Page Next Page 
జయ - విజయ పేజి 8


    "భలే చెప్పావక్కా! లేకపోతే మరీ అలుసయిపోయింది ఆడపిల్లలంటే అందరికీనూ!"
    "ఏయ్ నువ్విక్కడ నుంచి పో జయా!" చిరుకోపంతో అంది పార్వతి.
    "బావుందేవ్! మధ్య నన్నంటావేమిటి? నేనేమన్నానని ఇప్పుడూ." అనేసి అక్కడనుంచి వెళ్ళిపోయింది జయ.
    విజయ ముఖం కడుక్కుని, చీర మార్చుకుంటూండగానే బయట టాక్సీ ఆగిన చప్పుడయింది.
    మామయ్య బయటికెళ్ళి వారిని ఆహ్వానించడం, వాళ్ళు లోపలికొచ్చి కుర్చీలలో కూర్చోవడం ఆమెకు తెలుస్తూనే వుంది. తన రూపం ఓసారి అద్దంలో చూసుకుని వారున్న చోటుకు నడిచింది విజయ.
    "మా అమ్మాయి..." సోఫాలో కూర్చున్న స్త్రీలకు విజయను చూపుతూ అంది పార్వతి.
    వారికి నమస్కరించి అక్కడే రాజారావు పక్కన కుర్చీలో కూర్చుంది విజయ.
    అందరి కళ్ళూ తనమీదే కేంద్రీకరింపబడడం గమనించింది విజయ. కొద్ది క్షణాల తర్వాత తను నెమ్మదిగా పెళ్ళికొడుకు వైపు చూసింది.  
    నల్లగా ఉన్నాడతను. మొఖంలో కళే లేదు.
    "నీ పేరేమిటమ్మా?" పెళ్ళికొడుకు తల్లి కాబోలు అడిగింది.
    "విజయ!"
    "ఏం చదువుకున్నావ్?"
    "ఇంటర్మీడియట్!"
    లోలోపల కోపం పెరిగిపోతుందెందుకో! బహుశా ఇలాంటి పరిస్థితి చాలాసార్లు ఎదుర్కోవడం వల్ల అయ్యుండొచ్చు. ఇంకా అక్కడ కూర్చోవడం నచ్చాలేదామెకి.
    లేచి నెమ్మదిగా లోపలకు వచ్చేసింది.
    వారు కాఫీ ఫలహారాలు ముగించి వెళ్ళిపోయారు.
    "నాలుగు రోజుల్లో ఉత్తరం రాస్తారట." అన్నాడు మామయ్య వాళ్ళు వెళ్ళిపోగానే.
    "ఎందుకూ? నచ్చలేదని ఇక్కడ చెప్పడానికి భయపడ్డారా?" అడిగింది విజయ.
    "బావుంది. వాళ్ళు ఆలోచించుకోవద్దూ?" అంది పార్వతి సమర్ధిస్తూ.
    "ఏమిటమ్మా ఆలోచించుకునేది? అదేంకాదు. మరికొన్ని సంబంధాలు చూసి యెక్కడ ఎక్కువ లాభం ఉంటుందనుకుంటే అక్కడకు పోడానికి! అప్పుడు మనందరకూ ఉత్తరాలు వస్తాయన్నమాట. నచ్చలేదు, పిల్లకి కాలు వంకర లేక మూతి వంకర అని..."
    విజయ మాటలకు విరగబడి నవ్వసాగింది జయ.
    "కరెక్టుగా చెప్పావక్కా! నిజంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నంత గౌరవం ఈ ఎరేంజ్ డ్ మారేజెస్ లో లేదు. పెద్దాళ్ళు చేసే పెళ్ళంటేనే ఆడదానికి బానిసత్వం ప్రారంభమవుతుంది."
    పార్వతి జయ వంక కోపంగా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
    "ఆరోజే మళ్ళీ చంద్రకాంత్ కి ఉత్తరం రాసింది. తనకు అంతవరకూ జరిగిన పెళ్ళిచూపుల గురించీ, తనను అవి యెంత అవమానిస్తున్నాయో, అందుకు తనెంత బాధపడుతోందీ-మనసులో పేరుకుపోయిన అశాంతినంతా ఆ ఉత్తరంలో నింపి తేలిగ్గా గాలి పీల్చుకుందామె.
    హృదయం మీద నుంచీ ఏదో పెద్ద బరువు తొలగిపోయినట్లనిపించింది ఆ ఉత్తరం పోస్ట్ చేశాక.
    కాలేజీ నుంచి బయటికొస్తూంటే కిషోర్ కనిపించాడు జయకు. అతను తప్పక తనకోసం వస్తాడని ఎదురుచూస్తూనే ఉందామె.
    "ఆటోలో వెళ్దామా?" అడిగాడతను ఆమె దగరకొచ్చి.
    "ఎక్కడికి?" ఆశ్చర్యంగా అడిగింది జయ.
    "మనం కొంచెంసేపు మాట్లాడుకోవాలి!"
    ఇంకేమీ మాట్లాడలేదు జయ.
    ఇద్దరూ ఆటోలో రెస్టారెంట్ చేరుకుని లోపల కూర్చున్నారు.
    "మా డాడీకి డెహ్రాడూన్ ట్రాన్స్ ఫరయింది."
    జయ ఆశ్చర్యపోయింది.
    "అంటే అందరూ వెళ్ళిపోతున్నారా?"
    "తప్పదు కదా!"
    ఆమె ఏమీ మాట్లాడలేదు.
    "ఏమీ మాట్లాడవేం?" నవ్వుతూ అడిగాడతను.
    జయ కూడా నవ్వింది.
    "మాట్లాడటానికేమీ కనిపించటం లేదు."
    "అంటే?"
    "మనం కలుసుకుని కొద్దిరోజులయినా కాలేదు. అప్పుడే విడిపోవడమా?" దీనంగా అందామె.
    "అదే జయా! నాకూ బాధగా ఉంది!"
    ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు.
    "ఎప్పుడు వెళుతున్నారు?" అడిగింది జయ.
    "వచ్చేవారం!"
    "అయితే ఆ తర్వాత మనం ఇంక కలుసుకోవడం కుదరదన్నమాట! అంతేనా?" అడిగిందామె.

 Previous Page Next Page