Previous Page Next Page 
జయ - విజయ పేజి 10


    "నేను ఉత్తరాలు రాస్తే మీవాళ్ళేమీ అనుకోరు కదా?"
    "మా డాడీ పట్టించుకోరు. కానీ మా మమ్మీ ఒప్పుకోదు."
    "ఎందుకని?"
    "నాకు మామయ్య కూతురితో పెళ్ళి చేయాలని మా అమ్మ కోరిక."
    "ఆ పెళ్ళి నీకిష్టం లేదా?"
    "ఇంతకుముందు ఇష్టం ఉండేది. కానీ నీతో ఫ్రెండ్ షిప్ అయ్యాక ఆమెమీద ఇష్టం తగ్గిపోయింది."
    "మీ మామయ్య వాళ్ళెక్కడుంటారు?"
    "ఢిల్లీలో_"
    "ఓ...అయితే ఇప్పుడు నేను దగ్గరుండను కాబట్టి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరయిపోవచ్చు.
    "కదూ?" నవ్వుతూ అడిగింది.
    "ఏమో! చెప్పలేను." ఆ జవాబుని ఊహించలేకపోయిందామె.
    అనుమానంగా అతని వైపు చూసింది.
    "కిషోర్! నాతో ఫ్రాంక్ గా ఓ విషయం చెప్తావా?"
    "ఏమిటది?"
    "డూ యూ రియల్లీ లవ్ మీ?"
    "అదేమిటి అలా అడుగుతున్నావ్? నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా?"
    "నాకు నమ్మకం లేక కాదు! కానీ ఎంత సిన్సియర్ ప్రేమో తెలుసుకుందామని అడుగుతున్నాను."
    "ఎంత సిన్సియరంటే_ అయ్ వాంట్ టు మారీ యూ జయా! ఎన్ని రోజులయినా సరే మా మమ్మీని, డాడీని ఒప్పించి నిన్ను పెళ్ళిచేసుకుంటాను."
    "షూర్? ఆశ్చర్యంగా అడిగింది జయ.
    "భలేదానివే! ఆ అభిప్రాయం లేకపోతే నిన్ను నా సొంతం ఎలా చేసుకున్నాననుకున్నావ్?"
    "దానికీ దీనికీ సంబంధం ఏముంది?"
    అతను ఆశ్చర్యపోయాడు.
    "అదేమిటి? సంబంధం లేదా?"
    "అయ్ డోంట్ థింక్ సో..."
    కిషోర్ నిశ్చేష్టుడయ్యాడు.
    "అంటే_ప్రేమ వేరూ! శారీరక సంబంధం వేరా?"
    "రెండూ కలసి ఉంటే బాగానే వుంటుంది కానీ, ఒకోసారి అది సాధ్యం కానప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు?"
    "అంటే ఇప్పుడు మనం పెళ్ళి చేసుకోకపోయినా నువ్వేమీ బాధ పడవా?"
    "బాధ పడతానేమో! కానీ జీవితాంతం అదే బాధతో మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూండను."
    కిషోర్ కి ఆమె మాటలు అశాంతి కలిగించాయ్.
    తను గాఢంగా ప్రేమించిన యువతీ అలా మాట్లాడడం నచ్చలేదతనికి.
    "అంటే నీ ఉద్దేశ్యంలో ప్రేమకు విలువ లేదా?"
    "ప్రేమ అనేది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అదే శాశ్వతం కాదు. ఒక్క మనిషినే ప్రేమించి ఆ వ్యక్తి కోసమే జీవించాలనుకోవడం మూర్ఖత్వమని నా అభిప్రాయం. ఎందుకంటే జీవితం వీటన్నిటికంటే విస్తృతమైనది. జీవితంలో ప్రేమ, పెళ్ళి, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ చిన్న భాగాలు!"
    కిషోర్ కేం మాట్లాడాలో తోచలేదు.
    తను అంతగా ప్రేమించిన యువతి ఇలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చటం అతనికి అసంతృప్తిగా ఉంది.
    ఇద్దరూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు.
    అలాంటి యువతిని తను ప్రేమించటం తప్పేమో అన్న ఆలోచన కలుగుతుందతనికి.
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగింది జయ.
    "నీ మాటల గురించే ఆలోచిస్తున్నాను."
    "నీకు నచ్చలేదా?"
    "నచ్చకపోవటం కాదు. వింతగా అనిపిస్తున్నాయ్."
    "అలా మాట్లాడానని నామీద చీప్ అభిప్రాయం ఏర్పడిందా?"
    "నో! అలాంటిదేమీ లేదు."
    "ఇంక వెళ్దామా మరి?"
    ఇద్దరూ లేచి నడవసాగారు.
    బస్ స్టాప్ దగ్గర కొచ్చాక ఆగిపోయారు.
    "నేనింక వెళ్తాను" అన్నాడతను.

 Previous Page Next Page