Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 9

    మాకు మళ్ళీ గొంతు నొక్కుకు పోయింది.
    అందరం ఆ ప్రశ్న విననట్లు నటించాం.

ఓట్లు అమ్ముకోవడానికి బీదతనం కారణమనీ, చదువుకోవడం చదువుకోకపోవడం కారణం కాదనీ అర్థమయింది మాకు అప్పుడే!
    "సరే! గదంతా మంచిగానే వుందిసార్! మరిప్పుడు ఈ సదువుకి పైసల్సంగతేంది?
    అందరూ అతని వంక అభినందిస్తూ చూశాం!
    శాయిరామ్ అతనికి ధైర్యం చెపుతున్నట్లు భుజం తట్టాడు.

"పిచ్చివాడా! మేం కసాయి వాళ్ళం కాదు. మీలాంటి బీదల దగ్గర పైసలు తీసుకొని చదువు చెప్తామనుకుంటున్నారా! మేం సమాజం కోసం ఈ పని చేపట్టాం! మన రాష్ట్రంలో నూటికి నూరుపాళ్ళు అక్షరాస్యత సాధించాలనేది మా ధ్యేయం." అన్నాడు ఉత్సాహంగా.
    అతను మావంక పిచ్చోళ్ళను చూసినట్లు చూసాడు.
    "నేననెడిది అదిగాద్సార్! మీరు మాకు పైసలిచ్చెడి సంగతి! మీ దగ్గర సదువు గిట్ట నేర్చినందుకు మాకేమిస్తవ్?"
    అతని ప్రశ్న మాకు మతిపోగొట్టింది.
    "మీకు చదువు చెప్పినందుకు మేము మీకు పైసలివ్వాలా?" షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు జనార్ధన్.
    "అవ్ సార్! ఇయాళ్రేపు ఏపనయినాగానీ పైసల్లేకుండా ఎవళ్ళు జేస్తార్సార్."
    రంగారెడ్డి రంగంలోకి దిగాడు.
    "ఇదిగో నీ పేరేంటి బాబూ?"
    "నర్సింహ సార్"
    "చూడు నర్సింహా! చదువు రోజంతా నేర్చుకోరు కదా మీరు. మీ పనులు మీరు రోజంతా చేసుకుని సాయంత్రం రెండు గంటలు చదువు నేర్చుకుంటారన్నమాట! దీనికి పైసలడగటం తప్పుకదూ?"
    "ఇగో సార్! ఈ నకరాలన్నీ మనదగ్గర నడవయ్! మాకు ఊరికే మీరెందుకు సదువు జెప్తారు సార్! మీరేం పాగల్ గాళ్ళా? గవర్నమెంట్ దగ్గరో, లేకుంటే ఇంకెవళ్ళ దగ్గరో మంచిగ పైసలు కమాయిస్తారు. మాకెరుక లేదా సార్! మా గుడిసెలోళ్ళ పేరు జెప్పుకొని ఎంతమంది ఎన్ని పైసలు కమయించలేద్సార్! అన్నీ మా కెరుకే సార్! సంతకం జేయడానికి రాదుగాని దునియా తెల్సుసార్ మాకు! టైమ్ వేస్టెందుకు గ్గానీ- మేం వందమందున్నాం. అందరం మంచిగ మీరెట్ల జెప్తే అట్లా సదువు నేర్చుకుంటం! మాకు ఎన్ని పైసలిస్తారో జెప్పండ్రి!"
    అప్పటికే అక్కడ మరో వందమంది పోగయిపోయారు.
    నేను రంగారెడ్డి వైపు చూసాను.
    "మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు! అందుకని ఎంతోకొంత డబ్బిచ్చేసి వాళ్ళను అక్షరాస్యులిగా చేయటమే మంచిది" అన్నాను.
    "అవును! మన కాలనీలో చదువు చెప్పాలని ఉత్సాహపడుతున్న వాళ్ళంతా పాపం నిరుత్సాహ పడిపోతారు" అన్నాడు శాయిరామ్.
    "అదీగాక మన రాష్ట్రాన్ని నూరుశాతం అక్షరాస్యత గల రాష్ట్రంగా మార్చే అవకాశం పోగొట్టుకుంటాం" అన్నాన్నేను.
    "సరే పైసలెన్ని ఇవ్వాలి?" అడిగాడు రంగారెడ్డి.
    నర్సింహ తల గోక్కున్నాడు.
    "ఒక్కొక్కనికి దినానికి ఇరవై రూపాయలివ్వండి- పిల్లగాండ్లకు పదిరూపాయలిస్తే చాలు."
    అందరం ఉలిక్కిపడ్డాం-
    "రోజుకి ఒక్కొక్కళ్ళకు ఇరవై రూపాయలా?"
    "అవ్ సార్! సాయంత్రం కూలిపనికెళ్ళొచ్చినాంక మూడు గంటలు పనిజేయాలె! మళ్ళా అదిగూడా కాళ్లతో, చేతులతో చేసిడి పని కాదు దమాక్ తోటి పని జేయాల! మెదడు తోటి రెండు గంటలు పనిజేయించాలంటే తక్కువ పనాసార్ అది? మేం పనిజేయాలె- మా మెదడు తోటి గూడా మేమే పని జేయించాలే! అక్కడికీ ఇద్దరి కూలీ అవుతున్నది గద్సార్!"
    నేను రంగారెడ్డిని పక్కకు పిలిచాను.
    "రెడ్డీ! వెంటనే వాడడిగింది ఒప్పేసుకో! లేపోతే వాడికీ వాడి మెదడుకీ ఇద్దరికీ చెరో ఇరవై ఇమ్మని అడుగుతాడు" అన్నాడు రహస్యంగా. రంగారెడ్డి ఒప్పుకున్నాడు.
    "సరే భయ్! రేపు సాయంత్రం నుంచీ రోజూ మేమంతా ఇక్కడికి వచ్చి మీకు చదువు చెప్తాం! మీరంతా పదిమంది చొప్పున పది బాచీలు- ఇక్కడ రడీగా ఉండాలి. ఆరింటికల్లా- సరేనా?"
    నర్సింహ మొఖంలో ఆనందం కనిపించింది.
    "అలాగే సార్! పైసల్దీసుకున్నాక ఇక పని జేయకుండ ఎట్లుంటాం సార్! గసంటి దోకాబాజ్ మనతాన లేద్సార్! ఇప్పుడు ఒక్కరోజు జీతం అందరికీ అడ్వాన్స్ ఇయ్యండ్రి!"
    మేము గతుక్కు మన్నాము.
    "అడ్వాన్సా? అడ్వాన్సెందుకు?"
    "లేకుంటే ఎట్లా సార్? మీరు రేపు కాకపోతే ఎంత నుక్సార్ సార్?"
    "అదేమిటి మేం రాకపోయినా మీకు నష్టమేముంది?"
    "మీ మాట ఇని- మేం వేరే వాండ్లెవరైనా సదువు జెప్పనికొస్తే మా బేరం పోగొట్టుకుంటాం గద్సార్? న్యాయం ఆలోచించాలే!"
    మాలో చాలా మందికి చెమటలు పట్టినయ్! కర్చీఫ్ తీసి మొఖాలు తుడుచుకున్నాం.
    "ఇచ్చేసేద్దామా?" అడిగాడు రంగారెడ్డి పార్వతీదేవి వైపు చూస్తూ.
    "ఇచ్చేద్దాం" అంది పార్వతీదేవి.
    "తప్పేదేముంది?"
    "దీనికి సోంచాయిస్తారేం సార్? ఈ అక్షరజ్యోతి దిక్కుకెళ్ళి మాలాంటోళ్ళకు మంచి డిమాండున్నది సార్ ఇయాళ్రేపు! ఇయాళ అడ్వాన్స్ ఇయ్యకపోతే రేపు వేరే వాండ్ల దగ్గరజేరిపోతాం!" దబాయింపుగా అన్నాడు నర్సింహ.
    మేము కిక్కురుమనకుండా అందరం తలో ఇరవై తీసి వాళ్ళకిచ్చాం.
    "మిగతా అందరికీ రేపిస్తాం- ఇక్కడున్న పదిమందికీ మాత్రం ఇవాళ ఇస్తున్నాం" చెప్పాడు రంగారెడ్డి.
    నర్సింహ ఒప్పుకున్నాడు.
    అందరం ఆనందంగా కాలనీకి చేరుకున్నాం.
    చదువు చెప్పాలంటే ఒక్కొక్కరూ రోజుకి ఇరవై రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందనేసరికి చదువు చెప్తాననే వాలంటీర్ల సంఖ్య పూర్తిగా పడిపోయింది.
    కేవలం మా కమిటీ సభ్యులం మాత్రమే మిగిలాం! తెల్లారేసరికి వాళ్ళల్లో కూడా కొంతమంది మాయమైపోయి- చివరకు నేనూ రంగారెడ్డి మాత్రమే ఆ పదిమందినీ అక్షరాస్యులుగా చేయడానికి నిర్ణయించుకున్నాం!
    మర్నాడు మేము వెళ్ళేసరికి నర్సింహ తాలూకు గ్రూప్ వాళ్ళందరూ సిద్ధంగా కూర్చుని వున్నారు. అందరికీ పలకలూ, బలపాలూ ఇచ్చి అ ఆ ఇ ఈ లు రాయించటం ప్రారంభించాం!   
    పది నిముషాలు దిద్దగానే నర్సింహ గుడిశెలో కెళ్ళి గుడంబా సీసా తీసుకొచ్చాడు.
    అందరూ తలో గ్లాసులో పోసుకొంటూంటే మాకు భయం వేసింది.
    "అదేమిటి? చదువు అయ్యేవరకూ తాగకూడదు" అన్నాడు రంగారెడ్డి.
    "ఇగో సార్! ఈ నకరాలు మన దగ్గర నడవయ్! తాగొద్దంటానికి నువ్వెవళ్ సార్? నా పైసల్తో నేన్తాగుత! ఇష్టముంటే సదువు చెప్పు- లేకుంటే పో-"

 Previous Page Next Page