Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 8


    "అయితే మరెందుకు పెట్టేశావ్? అదేగా మనక్కావలసింది?" ఆశ్చర్యంతో అడిగాము మేము.
    సాధారణంగా మొదట ఏ నెంబర్ కొట్టినా రాంగ్ నెంబర్ వెళ్తుంది కదా- ఆ అలవాటు చొప్పున ఇంకే నెంబర్ కయినా వెళ్తుందేమో అనుకున్నాను. కానీ మనం అక్షరజ్యోతికి రింగ్ చేస్తే అక్షరజ్యోతే ఫోనులో కొచ్చేసరికి షాక్ తగిలినట్లయి కంగారుగా ఫోన్ పెట్టేశాను.
    అందరూ అతనిని అర్థం చేసుకున్నారు.
    "నిజమే! అలా సడెన్ గా మనం రింగ్ చేసిన నెంబరే పలుకుతే చాలా షాకింగ్ గా వుంటుంది. కొంచెం వీక్ గా ఉన్న హార్ట్ పేషెంట్స్ అయితే ఎగిరి పోతారసలు"
    ఈసారి నేను అక్షరజ్యోతికి రింగ్ చేశాను.
    "హల్లో అక్షరజ్యోతి హియర్" అన్నాడు ఫోన్ కవతలివేపు నుంచీ.
    "హల్లో సర్. మేము నిర్భయ్ నగర్ కాలనీ వాళ్ళం మాట్లాడుతున్నాం"
    "ఏం కావాలి మీకు?"

"అదేనండీ! మేమంతా చదువురాని వాళ్ళందరికీ చదువు చెప్పి మన ప్రభుత్వానికి సహాయం చేయాలనుకుంటున్నాం. మీ స్కీమ్ వివరాలేమిటో చెపితే?"
    "ఆ స్కీమ్ లో ముందు కండిషనేమిటంటే ముందు అసలు మీకు కొద్దో గొప్పో చదువొచ్చి ఉండాలండీ! మరి మీ వాళ్ళకి. ఆ అర్హత ఉందా?"
    "ఓ మా కాలనీ అంతా కూడా ఎడ్యుకేటెడేలెండి. లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఎట్లా చేస్తాం?"
    "ఓ! అలాగా! అయితే సరే! నెక్ట్స్ మీరు చేయాల్సిందేమిటంటే మీ కాలనీకి చుట్టు పక్కలున్న పదిమంది నిరక్షరాస్యులను వెతికి పట్టుకోవాలి. వాళ్ళ వయసు పదిహేనూ ముఫ్పై మధ్య ఉండాలి. సాయంత్రం సమయాల్లో మీరీ క్లాసులు కండక్ట్ చేయాల్సుంటుందన్నమాట. ముందు వాళ్ళకు చదువెలా చెప్పాలీ అనే విషయం గురించి మేము మీకు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తాం! మీక్కావలసిన మెటీరియల్ కూడా ఇస్తాం. మీ ఇంటి నెంబర్లు, పేర్లు, చిరునామాలు చెపితే మీరు ఎప్పుడు ట్రైనింగ్ కి రావలసిందీ మేమే పోస్ట్ కార్డ్ ద్వారా ఇంటిమేషన్ పంపుతాం!"
    "ఐసీ! అయితే మేమే స్వయంగా మీ ఆఫీసుకొచ్చి కనుక్కుంటాంలెండి"
    అందరికీ ఆ వివరాలు చెప్పాను.
    నిరక్షరాస్యులకు చదువు చెప్పాలంటే ముందు మేము నాలుగు రోజులు ట్రయినింగ్ తీసుకోవాలి అనేసరికి మా లిస్ట్ లో సగం మంది జారిపోయారు.
    "చూడుగురూ! నువ్వేమయినా చెప్పు. నన్ను ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫీస్ కెళ్ళమని మాత్రం చెప్పకు. నా మీదేమయినా పగ ఉంటే నన్ను నరుకు. చెప్పు తీసుకుని కొట్టు అంతేకాని గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళమని మాత్రం చెప్పకు" అన్నాడు జనార్థన్.
    "ఆ మాట నిజమే! లక్ష ప్రయివేట్ కంపెనీలకెళ్ళి పనులు చేసుకురమ్మంటే చేసుకొస్తాం గాని ఒక్క గవర్నమెంట్ డీలింగ్ కూడా మా వల్లకాదు మా కొద్దసలు" అన్నారు మిగతావాళ్ళు కూడా!
    "మా పెదనాన్నగారు గవర్నమెంట్ ఆఫీస్ లో పాపం ఏదో చిన్న పనిపడి దానికోసం తిరిగి తిరిగి కదా చివరకు ఆ ఆఫీస్ వరండాలో చనిపోయాడు" అంది పార్వతీదేవి.
    "ష్! మరీ అలా మాట్లాడకండి! మనలో కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ వున్నారు" అన్నాడు రంగారెడ్డి.
    ఆ విషయం అప్పుడు గుర్తుకొచ్చి టక్కున ఆ టాపిక్ మాట్లాడటం మానేశాం అందరం.
    "అయినా ఇంకొకడికి చదువు చెప్పడానికి గవర్నమెంటెందుకు మధ్యలో! మనమే మనచుట్టు పక్కల ఉన్న కొంతమంది చదువురాని వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను అక్షరాస్యులను చేసేద్దాం" అంది పార్వతీ దేవి.
    "అవును అదే మంచిది"
    అందరం అప్పటికప్పుడే నిరక్షరాస్యులను వెతకటానికి టార్చ్ లైట్లు తీసుకుని బయల్దేరాం.
    మా కాలనీకి దగ్గరిలోనే ఉన్న సంజయ్ నగర్ గుడిశెల సంఘంలో చాలామంది నిరక్షరాస్యులుంటారని మాకు తెలుసు.
    మమ్మల్ని చూడగానే గుడిశెల వాళ్ళందరూ పరుగుతో వచ్చి చుట్టుముట్టేశారు. అందరి ముఖాల్లోనూ ఆనందం.
    "సార్! మాకియ్యండ్రిసార్! గరీబోండ్లున్నాము జమానా కెళ్ళి ఓట్లు మీకే వేస్తున్నాము"
    మాకు ఆశ్చర్యంతో నోటమాటరాలేదు.
    "ఏమిటీ మీ కిమ్మంటున్నారు" అడిగాడు రంగారెడ్డి.
    "అదేసార్! ఐదువేలు పుక్కట్ లోన్ ఇస్తనికి వచ్చిన్రు గద్సార్ మీరు- బాంకోళ్ళకు అప్పు గురించి రాసిచ్చి సంవత్సరమైపాయె సార్-"
    మాకు అప్పుడు అర్థమైంది.
    సాధారణంగా ప్రతి ఎలక్షన్ ముందూ గవర్నమెంట్ అలాంటి ఓటు బాంక్ అందరికీ తలో ఐదువేలు అప్పు ఉచితంగా ఇస్తూండటం పరిపాటి.
    ముఖ్యంగా జనార్ధన్ పూజారి చేసిన పని ఇది.
    రంగారెడ్డి నవ్వాడు బిగ్గరగా!
    "అమ్మా! మీ అందరికీ ఫ్రీగా బాంక్ ల ద్వారా అప్పులిప్పించిన జనార్ధన్ పూజారి వల్ల బంగారం మొత్తం అమ్ముకునే స్థితికొచ్చిందమ్మా మనదేశం- ఇంకా పుక్కట్ లోన్లు ఆపరా మీరు?"
    మేము లోన్ ళు ఇచ్చేవాళ్ళం కాదని తెలీగానే క్షణాల్లో మమ్మల్ని వదిలి ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
    మేము గత్యంతరం లేక మరికొన్ని గుడిశెల దగ్గరకు వెళ్ళి అందరినీ బయటకు పిలిచాము.
    అది సాయంత్రం టైమవటంతో చాలామంది గుడిసెల ముందే కూర్చుని గుడంబా తాగుతున్నారు.
    "ఏం గావాలి మీకు?" ఒకతను తాగటం ఆపి మావేపు చూశాడు.
    "ఈ ఏరియాలో చదువురాని వారందరికీ కనీసం రాయటం, చదవటం నేర్పిస్తాం" అన్నాడు రంగారెడ్డి.
    "దేన్ని గురించి జేస్తున్రిదంతా?" అడిగాడింకొకతను.
    "మా దగ్గర చదువు నేర్చుకుంటే మీ అందరూ ఇకనుంచి వేలి ముద్ర వేయకుండా మీ సంతకాలు మీరే చేయవచ్చు" అంది పార్వతీదేవి.
    వాళ్ళు ముఖాలు చూసుకున్నారు.
    "ఏదైతే ఏమయింది? అంగూఠా బదులు దస్తఖత్ జేస్తే మీకేమైనా ఫాయిదా ఉంటదా?" వాళ్ళ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కాలేదు.
    "అదేం వుండదుగానీ- అలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట! అలా అందరూ సంతకాలు చేయటం నేర్చుకుంటే మన రాష్ట్రంలో అందరూ చదువుకున్న వారికింద లెక్కన్నమాట."
    "రాష్ట్రంలో అందరూ సదువుకున్నోళ్ళుంటే ఫాయిదా ఏమైనా వుంటుందా సార్ మనకి?"
    ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.
    "అంటే ఇంతకాలం అది మంచిగ పని జేయలేదా సార్?"
    "పన్జేస్తే ఇప్పుడు విదేశాలకు బంగారం ఎందుకమ్ముకుంటాం? ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో చదువు లేకపోవటం వల్లే మన గతి ఇట్ల తయారయింది" అన్నాడు రంగారెడ్డి.
    "అంతేకాదు భాయ్! సదువు లేనందువల్లే లీడర్లు మన ఓట్లు గిట్ట పైసలిచ్చి కొని గెలుస్తున్రన్నట్లు!" అన్నాడు యాదగిరి.
    "మళ్ళా ఎమ్మే చదివి లెక్చరర్ ఉద్యోగం జేస్తున్న భీమ్ రెడ్డి సాబ్ కూడా పైసల్దీసుకుని ఓటేసిండు గద్సార్ మొన్నా?" ఎవరో అడిగారు.

 Previous Page Next Page