Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 10

    అందరూ తలో గ్లాసు తాగేశారు.
    "ఆ ఇప్పుడు జెప్పు సార్! 'అ ఆ ఇ ఈ' సూడకుండా రాయాలి. గంతనే గదా?" అడిగాడు నర్సింహ.
    "అవును-"
    అతను రాసి తీసుకొచ్చి చూపించాడు.
    ఆ అక్షరాలేమిటో నాకర్థం కాలేదు. ఎందుకంటే అవి తెలుగులిపిలో లేవు-
    "ఇట్లా కాదు" అంటూ రంగారెడ్డి మళ్ళీ రాసిచ్చాడు అందరికీ-
    సరిగ్గా పదినిమిషాల్లో ఓ మనిషి ఇంకో బాటిల్ తీసుకొచ్చి నర్సింహకిచ్చి పైసలు తీసుకు వెళ్ళిపోయాడు.
    మళ్ళీ అందరూ తలో గ్లాసూ తాగారు.
    ఈ సారి పలకల మీద అ ఆ ఇ ఈ లంటూ ఏవో పిచ్చి బొమ్మలు గీసుకొచ్చి చూపించారు. మరో పది నిమిషాల్లో మళ్ళీ అదే వ్యక్తి గుడంబా బాటిల్ తీసుకొచ్చి నర్సింహ కిచ్చాడు.
    "ఏయ్- ఏమిటిది? ఓ పక్కన మేం వీళ్ళకు చదువు చెప్తూంటే నువ్వు బాటిల్ తెచ్చిస్తే ఎలా? వీళ్ళింక ఏం చదువుకుంటారు?" అడిగాడు రంగారెడ్డి.
    అతను మావేపు కోపంగా చూశాడు.
    "ఏయ్ పోన్లేగదాని ఇడుస్తున్న! లేకుంటే మిమ్మల్ని అప్పుడే తన్ని ఇంటికి పంపుతుండె! మీదిక్కు కెళ్ళి ఆళ్ళు గుడంబ బంద్ జేస్తే నష్టం ఎవరికి? మాకా, మీకా? నీయవ్వ- మా సేఠ్ గవర్నమెంట్ కి సంవత్సరానికి ఎంత కట్టాలో ఎరుకనా? నాలుగు నక్షలు బే! నీ తాతిస్తాడా అంత సొమ్ము- అక్షరజ్యోతంట అక్షరజ్యోతి- సాలె- రేపటికెళ్ళి ఈడ కనిపించొద్దు మళ్ళా- కాళ్ళు చేతులు ఇరుస్తా- సాలెగాండ్లు - తిని తిన్నగ ఉండనికి కాదు బాడుకవ్ లకి-" అనేసి వెళ్ళిపోయాడతను.
    మా మొఖాలు అవమానంతో ఎర్రబడి పోయినయ్.
    అప్పటికే వాళ్ళు మూడో బాటిల్ ఖాళీచేసేశారు. పక్కనే టీవీలో వస్తున్న సినిమా చూడ్డాని కెళ్ళారు కొందరు.
    చేతిలో పలకలు విసిరిపారేసి కిందపడిపోయాడొకడు. రెండోవాడు మూడోవాడి చొక్కా పట్టుకుని లింగయ్య అనేవాడు పెళ్ళిలో తనకు చేసిన మోసం గురించి ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధంగా ఉన్నాడు.
    అక్కడున్న ఆడాళ్లిద్దరూ కూడా నిషా ఎక్కువైపోయి ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. చేసేది లేక ఆ పూటకు చదువాపేసి మర్నాడు మళ్ళీ వెళ్ళాం. అందరూ వీసీఆర్ లో కాసెట్ వేసుకుని సినిమా చూస్తున్నారు. మళ్ళీ మూడో బాటిల్ వచ్చేసరికి తిరిగి వచ్చేశాం.
    ఇలాగే తొమ్మిది రోజులూ గడిచిపోయింది.
    "ఇలాక్కాదు గానీ ముందు వీళ్ళకు సంతకం నేర్చుదాం" అన్నాడు రంగారెడ్డి. "వీళ్ళ పేర్లు వీళ్ళు చదువుకుని సంతకం చేస్తే చాలు ఇంకేమీ నేర్పటం మన వల్లకాదు-"
    ఇద్దరం కలసి మూడో బాటిల్ వచ్చే లోపలే వాళ్ళ సంతకాలు చేయటం నేర్పించి, వాళ్ళ పేరు మేము రాస్తే చదవటం నేర్పించాము కానీ మూడో బాటిల్ తాగేస్తే అదంతా మర్చిపోయి మళ్ళీ పిచ్చి బొమ్మలు. గీతలూ గీసి డాన్స్ చేస్తారని మాకు తెలుసు- ఏమయితేనేం? మాకు బ్రహ్మానందం కలిగింది- మా టార్గెట్ పూర్తయినందుకు-
    వెంటనే వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దిగి మర్నాడు కలెక్టరాఫీసుకి చేరుకున్నాం. మేము చేసిన ఘనకార్యం చెప్పగానే మా మాటలు వారికి అర్థం కాకపోవటంతో ఆశ్చర్యంగా కాగితం మీద రాసిచ్చాం! ఆ వివరాలన్నీ రిజిస్టర్ లో రాసుకున్నారు వాళ్ళు. మాకు త్వరలో సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని చెప్పారు రాత ద్వారా!
    మేము తిరిగి వస్తుంటే టాంక్ బండ్ మీద కొన్ని లక్షల ఖర్చుతో ముందు గాస్ తోనూ తరువాత కరెంటుతోనూ వెలుగుతున్న అక్షరజ్యోతి కనిపించింది.
    కొన్ని లక్షల రూపాయలతో నగరమంతతా రాయించిన హోర్డింగ్స్ కనిపించినయ్.
    కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు టీవీ రేడియోల్లో కనబడుతూ వినబడుతున్నయ్.
    కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో అక్షరజ్యోతి పేరు మీద జరుగుతున్న సభలూ, సమావేశాలూ, కాన్ఫరెన్స్ లూ- దారిపొడుగూతూ కనబడుతూనే ఉన్నాయ్.
    "అక్షరజ్యోతి ముసుగులో ఎంత డబ్బు ఎవరెవరు కొల్లగొడుతున్నారో చూడు!" అన్నాడు రంగారెడ్డి.
    "ఈ లెక్కలో మన రాష్ట్రం నూటికినూరు శాతం అక్షరాస్యత సాధించే- రోజు ఎంతో దూరంలో లేదు-" అన్నాన్నేను.
    ఇద్దరం కాలనీ చేరుకున్నాం.
    మేము విజయవంతంగా మా స్కీమ్ అమలు జరిపినందుకు కాలనీలో మా కోసం అభినందన సభ ఏర్పాటు చేశారు.
    నేనూ రంగారెడ్డి వేదిక మీదకు రాగానే దండలు వేశారు మెడలో, అంతా తప్పట్లు కొట్టారు.
    మేము మైక్ ముందుకెళ్ళి మాట్లాడే సమయం వచ్చింది. ముందు రంగారెడ్డి వెళ్ళి మాట్లాడసాగాడు.
    అతని మాటలు నాకర్థం అవసాగినయ్ గానీ మిగతా వారెవ్వరికీ అర్థంకావటంలేదు.
    "తెలుగులో మాట్లాడు" అంటూ కేకలు వేయసాగారు.
    అది మరీ ఆశ్చర్యం కలిగించింది నాకు. ఎందుకంటే అతను తెలుగులోనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాట్లాడ్డానికి ప్రయత్నించాడు రంగారెడ్డి. ఈసారి అతనికి మాటకూడా సరిగ్గా రావటం లేదు. దాంతో అతనిని పక్కన కూర్చోబెట్టి నన్ను మాట్లాడమన్నారు. నేను అక్షరజ్యోతి గురించి ఎంత శ్రమపడ్డామో వివరించటం ప్రారంభించాను గానీ మళ్ళీ కేకలు వినిపించినయ్.
    "తెలుగులో మాట్లాడు" నాకు అప్పుడర్థమయింది.
    చదువు మీద కంటే తాగుడు మీదా, సినిమాల మీదా ఆసక్తి ఉన్న వారికి చదువు నేర్పించేటప్పుడు మనకున్న చదువుకూడా పోయే అవకాశముందని-
    అప్పటికప్పుడు నా భార్యా రంగారెడ్డి భార్యా భోరున ఏడుస్తూ వచ్చారు.
    మా ఇద్దరికీ పిచ్చి ఎక్కిందేమోనని వారి అభిప్రాయం. మరి కాసేపట్లో డాక్టర్ కూడా వచ్చాడు. మేమేమీ మాట్లాదల్చుకోలేదు.
    కొద్ది రోజులు మళ్ళీ మా కాలనీలో గడుపుతే మేము మళ్ళీ మామూలు మనుషులయి పోతామని మాకు తెలుసు.
                                                     *  *  *  *  *

 Previous Page Next Page