పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
"నిర్మాతా! నీ అవస్థ చూస్తె నాకు జాలి వేస్తోంది. ఇలా ఎటూ తేలకుండా ఏ నిర్ణయమూ తీసుకోకుండా నానా అవస్థలూ పడ్డ ఓ నటీమణి కధ చెప్తాను విను!"
ఆ మాటలకు నిర్మాత చిరాగ్గా మొఖం పెట్టాడు.
"అలా మొఖం మాడ్చుకుంటావెం? నీలాంటి చిరాకు గాళ్ళుండబట్టే ఇండస్ట్రీలో మంచి కధలు రావడం లేదు. ఈ కధ సినిమా తీయాలని కాదు చెప్పేది. నీకు ఆ ఫిలిం బాక్స్ బరువు బాధ కలిగించకుండా ఉంటుందన్న జాలితో చెప్పటమే! మొఖంలో వెధవ ఎక్స్ ప్రెషన్ లు ఇవ్వకుండా విను.
అనగనగా ఓ హీరోయిను. ఆ పిల్ల మాములుగానే ఝూమ్మని మలయాళీ పిక్చర్స్ల్ లో కెళ్ళి బాగా నటించేసి ఓ ప్రెసిడెంట్ అవార్డు తెచ్చుకుని మళ్ళీ తెలుగు ఫీల్డు కొచ్చేసి రాజ్యం ఏలసాగింది. ఆ హీరోయిన్ పట్టిందల్లా బంగారం, నటించినదల్లా శతదినోత్సవం అవసాగినాయ్. దాంతో ఆమె ఇంటి ముందు కార్ల క్యూ వెంకటేశ్వర స్వామి దగ్గర క్యూలా పెరిగిపోయింది.
మరి కొద్ది రోజుల తర్వాత ఆమెను తమ పిక్చర్స్ లో బుక్ చేసుకోవాలన్న నిర్మాతల క్యూతో పాటు మరో పక్క ఇంకో క్యూ కూడా ప్రారంభమయింది.
హీరోయిన్ ఆ క్యూ చూసి ఆశ్చర్యపోయింది.
"మీరెవరు?" అనడిగింది క్యూ దగ్గర కెళ్ళి.
"మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళం! 'ఊ' అంటే చాలు మా కాళ్ళు కడుక్కుని వర దానం చేసుకోడానికి సిద్దంగా ఉన్నాం" అన్నారు వాళ్ళు.
హీరోయిన్ వాళ్ళ మమ్మీ దగ్గరకు పరిగెత్తింది. ఇలా ఏ గోడవోచ్చినా వాళ్ళమ్మ దగ్గరకు పరుగెత్తడం ఆ హీరోయిన్ కి అలవాటు అని ఓ జర్నలిస్ట్ రాశాడు. అప్పట్నుంచీ నిజంగానే అన్నీ మమ్మీ నడిగే చేస్తోందామె. ఒకటి రెండు విషయాలు తప్ప! వాళ్ళమ్మ అ విషయం విని బోలేడానందపడింది.
"కరెంటు ఉండగానే లైటు స్వేచ్ వేసుకోవాలి తల్లీ!" అంది సినిమా పద్దతిలో.
"అంటే ఏమిటి?" అంది హీరోయిన్ అర్ధం కాక.
"అయ్యో నా పిచ్చి తల్లీ! ఇంతమంచి డైలాగ్ అర్ధం కాలేదా? వంట్లో సొంపులూ, కంట్లో ఇంపులూ ఉండగానే పెళ్ళి చేసేసుకోవడం తారలకు ఎంతో ఆరోగ్యం. అనక అన్నీ ఇగిరిపోయాక వెతుకుతే వళ్ళు కాలాక బర్నాల్ కోసం బజారెల్లినట్లుంది. ఏ అయిదో పెళ్ళివాడో , ఆరో పెళ్ళి వాడో దొరుకుతాడు. వాడికున్న అరడజను మంది పిల్లల్ని కూడా నువ్వే పోషించాలి .... అంచేత ఇంటర్ వ్యూ ప్రారంభించు. మనం ఎంత తరిగినా తరగనంత ఆస్తి ఉన్నాడిని చూసి కట్టుకో" అంది.
వెంటనే ఇంటర్యూ ప్రారంభమయింది. క్యూలో ఉన్నాళ్ళందరినీ హీరోయినూ, ఆమె తల్లీ కలిసి వడబోస్తే చివరకు ముగ్గురు మిగిలారు. ఆ ముగ్గురికీ మళ్ళీ ఇంటర్యూ ఏర్పాటుచేశారు. మొదటివాడు పిలువగానే లోపలి కొచ్చి కూర్చున్నాడు.
"నన్ను చేసుకోడానికి నీకేం అర్హతలున్నాయ్?" అనడిగింది హీరోయిన్ అతనిని.
"అర్హతలా! పిచ్చిదానా! రెండు కోట్ల రూపాయల ఆస్థి వుంది. ఇంకో అయిదు కోట్ల రూపాయల బ్లాక్ మనీ వుంది. ఆరు కార్లున్నాయ్. రెండు షిప్పులున్నాయ్. మద్రాస్ లో ఓకే వీధి వీధంతా నాదే! అన్ని ఇళ్లున్నాయ్. ఇంకేం కావాలి?" అన్నాడతను ఇంటర్వల్ లేకుండా నవ్వి.
"అబ్బో - అబ్బో - ఎంత డబ్బో - వీడినే చేసుకోవే" అంది హీరోయిన్ తల్లి.
'ఆలోచిద్దాం , నెక్ట్స్ " అంది హీరోయిన్.
వెంటనే ఇంకొకతను వచ్చాడు.
"నీ సంగతేమిటి?" అడిగింది హీరోయిన్.
"నేను బాగా డబ్బున్న హిందీ చిత్ర నిర్మాతను. పాతిక సిల్వర్ జూబిలీ సినిమాలు తీశాను. ఇప్పుడు ఓ డజను గోల్డెన్ జూబిలీ సిన్మాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇవికాక మరో డెబ్బయి ప్లాటినం జూబిలీ సిన్మాలు ప్లాన్ చేశాను. వాటన్నిటిలో నువ్వే హీరోయిన్ వవుతావ్. ఇదిగాక ఇంక వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయ్. తెగ డబ్బుంది. నువ్వంటే గుండె ల్నిండా ప్రేమ ఉంది" అన్నాడతను.
'అబ్బో అబ్బో - వీడే బాగున్నాడే - వీడినే చేసుకో" అంది హీరోయిన్ తల్లి.
"పార్కలాం! నెక్ట్స్ ..." అంది హీరోయిన్.
మూడో వ్యక్తి లోపలికొచ్చాడు.
"నా దగ్గర డబ్బేమీ లేదు. బోలెడు మగసిరి వుంది. నువ్వంటే లవ్వుంది" అన్నాడు.
"ఛీ ఛీ? వేడిని బయటకు గెంటండి" అంది హీరోయిన్ తల్లి.
"పార్కలాం!" అంది హీరోయిన్. అని ఆ తరువాత రోజుల తరబడి అలోచించి అలోచించి నానా ఆందోళనాపడి , తల్లి మాట కాదనలేకా , ఆవుననలేకా చివరకు ఓ నిర్ణయానికొచ్చింది. ఇంతవరకూ కధ చెప్పి సెన్సార్ ఇలా అంది.
"రాజా! ఆ ముగ్గురిలో ఆ హీరోయిన్ ఎవరిని చేసుకుంటుంది? ఏ కారణం చేత చేసుకుంటుంది? ఆమె తల్లి చెప్పిన మాటలే వింటుందా? లేక తనంతట తానుగా నిర్ణయం తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు తెలిసి సమాధానం చెప్పలేకపోయావో...."
'అపోశ్!" అరిచాడు నిర్మాత. "ప్రతి కధ వెనుకా అలా తల వెయ్యి ముక్కలో చెక్కలో అవుతుందని బెదిరించావంటే నేనీ బాక్స్ ఇక్కడే పడేసి వెళ్ళిపోతాను " కోపంగా అన్నాడతను.
సెన్సార్ భయపడింది. "సరే అననే! చెప్పు" అంది రాజీకోస్తూ.
"ఆ హీరోయిన్ ముగ్గురిలో చివరివాడినే చేసుకుంటుంది. తన పెళ్ళి విషయంలో మాత్రం వాళ్ళమ్మ మాట వినదు. ఎందుకంటే సంసార సుఖం ఇచ్చేది మొగుడు కానీ తల్లి కాదు గదా. ఇకపోతే డబ్బున్నవాడినీ , నిర్మాతనూ వదిలి ఆఖరి వాడిని చేసుకోడానికి కారణం అతను తనకు బోలెడు 'మగసిరి' ఉందని చెప్పడమే!"
"అదేమిటి/ మగసిరి వుందంటే చాలు చేసుకోడమేనా?"
"మద్రాసు నగరంలో అందునా సినీ ఫీల్డులో సాధారణంగా లభించనిది మగసిరి ఒక్కటే అని మనందరం సినిమా పాటల ద్వారా తెలుసుకుంటూన్నాం. ఏ పాటలో చూసినా 'మగసిరి గల రాజా" అనో లేక "మగసిరి కావాలిరా" అనో ఓ ముక్క పాటల రచయిత తప్పక రాస్తాడు. అతను రాయకపోతే నిర్మాతా, డైరెక్టరు కావాలని రాయిస్తారు. లేకపోతె వాళ్ళే రాసేస్తారు. కనుక దీన్ని బట్టి తెలుసు సినీఫీల్డు లో ఎవరికీ మగసిరి లేదని, అది కలవాడినే చేసుకోవాలనీ హీరోయిన్ అనుకోవడం లో తప్పులేదు. బహుశా అది మీ సెన్సార్ వాళ్ళకు కూడా కరువే కాబోలు. అందుకని అలాంటి పాటలే క్లీన్ గా అనుమతిస్తారు...."
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా ఎగిరి సెన్సార్ ఆఫీస్ వేపు వెళ్ళిపోయింది.
***