పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు.
అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ కళ్ళు నులుముకుంటూ నిద్రలేచి ఓసారి ఆవలించి నిర్మాతను చూసి జాలి పడి ఇలా అంది.
"రాజయ్యా! నీ అవస్థ చూస్తుంటే నాకు మహా ఇదిగా వుంది. శ్రమ మర్చిపోయేందుకు నేనో రసవత్తరమైన కధ నీకు చెప్తాను. ఏ రసం అని అడగకు! సినిమా ఫీల్డులో మిగిలినాయ్ రెండే రెండు రసాలు కదా ..... సరసం! విరసం. సరే కధ విను!
"కొంతకాలం క్రితం ఆంధ్రదేశంలో బంగారం అనే బంగారం లాంటి కుర్రాడుండేవాడు. (వాళ్ళకి బోలెడంత బంగారం కూడా ఉందిట) ఆ కుర్రాడికి మూడో ఏట నుంచే తెలుగు సినిమాలు చూడడం అలవాటయింది. నాలుగో ఏట నుంచీ సినిమాల్లోని అశ్లీల డైలాగులు ముద్దుముద్దుగా వల్లె వేస్తుండేవాడు. ఇది చూచి అతని తల్లిదండ్రులు మురిసిపోయారు.
"మా బంగారమే! ఈ లేత వయసులోనే ఇంత చక్కగా వయసుని మించిన మాటలు మాట్లాడుతున్నాడంటే ఇంకొంచెం పెద్దయ్యాక ఎంత గొప్పాడవుతాడంటారు?" అంటూ ఇరుగుపొరుగు వాళ్ళను అడిగారు.
"ఇంకేమౌతాడు బాలనటుడౌతాడు. ఇలాంటి వెధవ్వాగుడు. అతివాగుడు వాగేది మన తెలుగు సినిమా బాలనటులేగా!" అన్నారు వాళ్ళు.
అయిదో ఏడు వచ్చేసరికి బంగారం సినిమాల్లోని శృంగార గీతాలని ఒకసారి వింటే చాలు అనర్గళంగా పాడడం మొదలుపెట్టాడు.
'అమ్మో ! అమ్మో ! మా బంగారం గొప్ప ప్లేబాక్ సింగర్ అవుతాడు కాబోలు" అని ముచ్చటపడి అలాంటి రికార్డులన్నీ కొనితెచ్చి రికార్డ్ ప్లేయర్లో వేసి మరీ వినిపిస్తూండెవారు. ఆరో ఏడు వచ్చేసరికి బంగారం సినీ సాహిత్యం బదులుగా తన సొంత మాటలతో రెండర్ధాలు వచ్చే పాటలు కట్టి పాడసాగాడు.
"అబ్బో అబ్బో విన్నారా! ఇంక తెలుగు సినిమాలకు పాటలు రాసేయగలడు మావాడు" అంటూ అందరికి అబ్బురంగా చెప్పుకున్నారు. ఏడో ఏడు వచ్చేసరికి బంగారం జ్యోతిలక్ష్మి డాన్స్ లూ, జయమాలిని డాన్సులూ చూసినప్పుడల్లా సీట్లోంచి లేచి నిలబడి విజిల్స్ వేయసాగాడు.
"అమ్మో! అమ్మో! మావాడు ఇలాంటి వన్నీ మెచ్చుకుంటూన్నాడంటే తప్పక సెన్సార్ బోర్డు మెంబరవుతాడు" అని మరింత ఆనందపడిపోయాడు.
ఎనిమిదో ఏడు రాగానే చదువు మానేసి కేవలం సెక్స్ డాన్సులు చూడ్డానికి అలవాటు పడిపోయాడు. తెలుగు సినిమాల్లో చాలాకాలం పాటు ఒకే సెక్స్ డాన్సర్ డాన్స్ లు చేయడం నచ్చక కాబరేషోలకు వెళ్ళటం ప్రారంభించాడు.
ఇదిలా వుండగా హటాత్తుగా అతగాడికి పెళ్లీడు వచ్చింది - సినిమాకు సంబంధం లేని సెక్స్ డాన్స్ లాగ! బోలెడు సంబందాలుచ చూశారతని తల్లిదండ్రులు.
'అబ్బే! వీళ్ళెవరూ వద్దే! కొత్తగా సెక్స్ డాన్స్ లు చేసే పిల్ల కావాలి! ఆ పిల్ల డాన్స్ లు నేనింతకు ముందేక్కడా చూసి ఉండకూడదు" అన్నాడతను.
సరేనని దేశంలోని కాబరే ఆర్టిస్టులందరినీ చూపించారు వాళ్ళు.
"అబ్బే వీళ్ళందరి డాన్స్ లు చూసేశాను...." అన్నాడతను.
వాళ్ళ కేటు తోచలేదు. వెంటనే బంగారాన్ని ఒక సైకాలజిస్టుకు చూపించారు. సైకాలజిస్టు అతన్ని లక్ష ప్రశ్నలేసి, పాతిక బొమ్మలు గీయించి, అయిదువేల రూపాయల ఫీజు తీసుకుని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని మెడికల్ షాపు కెళ్ళారు వాళ్ళు.
"ఈ మందు మెడికల్ షాపుల్లో దొరకదు. తెలుగు సినిమా ఫీల్డులో దొరకొచ్చు వెళ్ళండి" అన్నాడు షాపువాడు.
"అ మందు పేరేంటసలు?" ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు.
"కొత్త సెక్స్ డాన్సర్"
వాళ్ళకు సంగతి అర్ధమయింది.
"అవునే! ఈ మధ్య సినిమాల్లో కొత్త పిల్ల డాన్స్ చేస్తోందన్నారు. అ పిల్లయితేనే నాకు పెళ్ళి మీద ఆసక్తి కలిగిస్తింది" అన్నాడు బంగారం.
వెంటనే మద్రాస్ చేరుకొని ఆ క్రొత్త సెక్సు డాన్సర్ ఇంటి కెళ్ళారందరూ. సంగతంతా ఆమెకు చెప్పి అతనిని వివాహం చేసుకోడానికి అంగీకరిస్తే ఆమెకు పదిలక్షల రూపాయలు కట్నంగా ఇస్తామని ఆశ పెట్టారు. ఆనందంగా ఒప్పుకొందాపిల్ల.
"కానీ ఓ షరతు! ప్రతిరోజూ రాత్రి మన పడగ్గదిలో సెక్స్ డాన్స్ చేయాలి నువ్వు! అప్పుడు గాని నాకు సంసార జీవితం మీద ఆసక్తి కలగదు" అన్నాడు బంగారం.
"ఓస్! ఇంతేనా! దానికేం భాగ్యం! మీక్కావాలంటే తెల్లార్లూ డాన్స్ చేస్తూనే ఉంటాను" అందామె.
వెంటనే పెళ్ళయిపోయింది. ఆ రాత్రి పడగ్గదిలో ఆమె డాన్స్ కోసం ఎదుర్చూడసాగాడు బంగారం. ఆ పిల్ల గదిలో కొచ్చి సెక్స్ డాన్స్ చేయాలని ప్రయత్నించింది గానీ ఏమాత్రం కుదరడం లేదు.
"అయ్యో! ఎందుకో డాన్స్ రావడం లేదండీ! స్టెప్స్ పడడటమే లేదు" అందామె దిగులుగా. ఆన్ని సినిమాల్లో బుక్కయిపోయి జనానికి పిచ్చెక్కిపోయే విధంగా సెక్స్ డాన్స్ చేసే పిల్ల ఇప్పుడు ఎందుకు చేయలేకపోతోందో , ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు బంగారానికి.
ఇలాక్కాదని స్టీరియో లో ఎల్లారీశ్వరీ పాడిన ఓ రెండర్ధాల పాట వేసి అప్పుడు డాన్స్ చేయమన్నాడామే. ఊహు! అయినా గాని లాభం లేకపోయింది. వెంటనే ఆమెను మర్నాడు తెల్లవారు జామున నిద్రలేపి సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాడు. సైకాలజిస్ట్ మాములుగానే లక్ష ప్రశ్నలడిగి పాతిక బొమ్మలు గీయించి అయిదు వేల రూపాయలు ఫీజు తీసుకుని ఆమె ఎందుకు డాన్స్ చేయలేక పోతుందో బంగారానికి వివరించాడు. బంగారానికి ఏడుపొచ్చేసింది. ఆ మాటలు వినగానే. ఆ సైకాలజిస్టునే కౌగలించుకుని బావురమని ఏడ్చి అప్పటికప్పుడే విడాకులిచ్చి తన ఊరికి రైలేక్కేశాడు"
ఇంతవరకూ కధ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది.
"రాజయ్యా! కోరి ఆ సెక్సు డాన్సర్ ని చేసుకున్న బంగారం మళ్ళీ ఆమెకు ఎందుకు విడాకులిచ్చాడు/ సినిమాల్లో ఎన్నో సెక్స్ డాన్సులు చేసి, ఇంకా చేస్తూనే ఉన్న ఆ అమ్మాయి పడగ్గదిలో భర్త ఎదురుగా ఎందుకు చేయలేకపోయింది? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది...."
"దీనికింత పెద్ద తన్నుకుచావల్సిన పనేముంది? ఆ పిల్ల బంగారం ఎదుట డాన్స్ చేయలేదని తేలిపోయింది. ఆ పిల్ల డాన్స్ చూడకపోతే బంగారానికి సంసార సుఖాల మీద ఆసక్తి వుండదని సైకాలజిస్ట్ ముందే చెప్పాడు. కనుక అలా డాన్స్ లు చేయలేని పిల్లతో సంసారం ఉపయోగం లేదని బంగారం విడాకులిచ్చేశాడు. ఇకపోతే ఆ పిల్ల ఎందుకు పడగ్గదిలో డాన్స్ లు చేయలేక పోయిందంటే సినిమా షూటింగు ల్లో ఆమె అలవాటు పడిన వాతావరణం అక్కడ లభించక పోవడం వల్ల! ఆమె డాన్స్ చేయాలంటే కెమెరామెన్, డైరెక్టరూ, లైట్స్, లైట్ బాయ్స్, మేకప్ మేన్, అసిస్టెంట్, ప్రొడ్యూసరు, జర్నలిస్టు లూ, ఇతరులూ ఇంతమంది ఆమె చుట్టూ ఉండడం అలవాటు ఆమెకి. 'సైలెన్స్, 'లైట్స్ అన్' అన్న కేకలు ఉండుండి వినబడుతుండాలి. స్టార్ట్, యాక్షన్ అన్న కేకలు, క్లాప్ కొట్టే శబ్దాలూ, 'కట్' అన్న అరుపులూ ఇవన్నీ ఉండాలి. ఓ మూల నుంచి రెండర్ధాల తెలుగుపాట రికార్డ్ వినబడుతుండాలి. అప్పుడు గాని డాన్స్ చేయడం సాధ్యం కాదామెకి. అతని పడగ్గదిలో ఈ హంగులేమీ లేకపోవడం వల్ల ఆ పిల్లకి డాన్స్ చేయడం కుదరలేదు. ఆ హంగులన్నీ పడగ్గదిలోకి రోజూ ఏర్పాటు చేయించడం సాధ్యం కాదు. కనుక ఆ పిల్లనే వదులుకున్నాడు బంగారం-'
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***