పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
"రాజా! మీ నిర్మాతల బాధలు చూస్తుంటే నాకు భలే జాలిగా ఉంటుంది. పాపం, సినిమా ఫీల్డ్ గురించి అస్సలు ఆ ఆలు కూడా తెలీకుండానే మాద్రాస్ బండెక్కి ఏ డైరెక్టర్ చేతిలోనో డబ్బంతా రిలీజ్ చేసేసి చివరకు సినిమా రిలిజవకుండానే మళ్ళీ వాళ్ళూరికి బండేక్కేస్తుంటారు చాలామంది. ఇలాంటి నిర్మాతలను చెడుగుడు ఆడేసి కేవలం తమ స్వార్ధమే దృష్టిలో పెట్టుకుని డబ్బు కాజేసే ఓ డైరక్టరు కధ చెప్తాను - విను! ఎప్పటికయినా ఈ కధ నీకూ ఉపయోగపడవచ్చు.
అనగనగా ఓ వూళ్ళో ఓ పైసేశ్వరరావ్ . అతనికి తెలుగు చదవడం , రాయడం వచ్చు. మాట్లాడడం కూడా వచ్చు. అతనిది పరమవక్రబుద్ధి. ఎంతసేపూ ఎదుటివాడిని ముంచేసి తనుతేలాలనే చక్కని అభిప్రాయాలు గలవాడు. ఇన్ని సుగుణాలు కలవారు సినిమా ఫీల్డులో అయితేనే ఎంతో రాణించగలరని వాళ్ళ ఊరి వారందరూ అతనికి నచ్చజెప్పి చందా లేసుకుని రైలు టిక్కెట్ కొని మద్రాస్ బండెక్కించారు. మద్రాస్ వచ్చిన మరుసటి రోజు నుంచే తను అతి త్వరగా ఎలా పైకి రాగాలనా అని ఆలోచించాడు పైసేశ్వరావ్. ఇక్కడి మాటలక్కడా, అక్కడి మాటలిక్కడా, ఉన్నవి లేనట్టూ, లేనివి ఉన్నట్టూ కల్పించి చెప్పే వాళ్ళు అతి త్వరగా పైకి రాగలరని తెలుసుకున్నాడు. వెంటనే అ పనులు పూర్తి కానిచ్చి తనూ దర్శకుడయ్యాడు. మొట్టమొదటి సినిమాకు కధ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తనే తీసుకున్నాడు. ఆ సినిమా వంద రోజులాడింది. కాని ఓ రచయిత ఆ కధ తనదని కోర్టు కెక్కాడు. మాములుగానే రచయితకు న్యాయం కలగలేదు. అయినా గాని ఆ రచయిత మొండి ఘటం అవడం చేత ఆ డైరెక్టర్ వచ్చి కాపీ మార్క్ అనీ అంచేత అందరూ మెలకువగా ఉండవలసిందనీ దేశమంతా దండోరా వేశాడు.
దాంతో పైసేశ్వరావ్ కి పెద్ద చిక్కిచ్చి పడింది. ఇప్పుడు కధలు కాపీ కొట్టడం అంత శ్రేయస్కరంగా కనిపించలేదు. అలా అని డబ్బిచ్చి కొనడమూ తన కిష్టం లేదు. ఇలా బాధపడుతుండగా ఓరోజు అతను ఓ చిన్నపిల్లల పత్రికలో ఏకసంధాగ్రాహి, ద్విసంధాగ్రాహిల కధ చదవడం తటస్థించింది. ఆ కధ చదవగానే ఆనందంతో పొంగిపోయాడతను. తనకూ ఎవరయినా ఏకసంధాగ్రాహి దొరికితే రచయితలను పూల్స్ ని చేసి కధలు సంపాదించడం కష్టమేమీ కాదు. వెంటనే ఏకసంధాగ్రాహి కోసం సెర్చి లైట్లు వేసి వెతికాడు. చివరకు ఓ దిక్కుమాలిన ప్రొడక్షన్ లో రెండు పూట్ల భోజనం వేతనంగా పన్జేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కనిపించాడతనికి.
"నువ్వు నా దగ్గర పన్జేస్తే నెలకు వెయ్యి రూపాయలిస్తాను - వస్తావా?" అనడిగాడు పైసేశ్వరావ్.
వెయ్యి రూపాయలనగానే ఆ ఏకసంధాగ్రాహి స్పృహ తప్పాడు. వెంటనే తన కార్లో వేసుకుని ఇంటికి తీసుకుపోయాడు పైసేశ్వరావ్.
"నేనేం చేయాలి?" అనడిగాడు ఏకసంధాగ్రాహి కళ్ళు తెరుస్తూనే.
"మరేం లేదు. నా దగ్గరకు అనేక మంది రచయిత కధలు చెప్పడానికొస్తారు. వాళ్ళు చెప్పే కధలు నువ్వు లోపల్నుంచి వింటూ అప్పటికప్పుడు రాసేస్తుండాలి. రచయిత కధ చెప్పడం పూర్తవ్వగానే నేను "ఒ.కే. ఈ కధా! ఈ కధ నేనే రాశాను. ఈ కధతో సినిమా కూడా ప్రారంభమయింది కావాలంటే నా దగ్గరస్క్రిప్టు ఉంది చూడండి!" అంటూ నిన్ను పిలుస్తాను. నువ్వు ఆ కధ కాగితాలన్నీ ఓ ఫైల్లో పెట్టుకొని వచ్చి ఆ కధంతా చదివి వినిపిస్తావ్. ఆ రచయిత దాంతో కంచి కెళ్ళి పోతాడు. అతని కధ మనింటిదవుతుంది - ఎలా వుంది మన ప్లాను?' అనడిగాడతను. ఏకసంధాగ్రాహి అనందం పట్టలేక మళ్ళీ స్పృహ తప్పాడు.
ఆ మర్నాడే అన్ని పత్రికల్లోనూ "ఫలానా దర్శకునికి కొత్త వెరైటీ కధలు కావలెను. మంచి కధ ఇచ్చిన వారికి ఎక్కువ పారితోషకం" అని ప్రకటనలిచ్చాడు. దాంతో అతనింటి ముందు రచయితలు లైన్ కట్టారు.
రచయిత కధ చెబుతోంటే తెరవెనుక కూర్చున్న ఏకసంధాగ్రాహి స్పీడుగా రాసి కధ ముగిసేసరికి ఫైల్ చేసేస్తుండేవాడు. అప్పుడు పైసేశ్వరావ్ రచయితతో "ఈ కధ నేనే తయారు చేశానండీ ఆర్నెల్ల క్రితం. సినిమా షూటింగు కూడా ప్రారంభమయింది. కావాలంటే స్క్రిప్టు కూడా ఉంది చూడండి." అంటూ ఏకసంధాగ్రాహిని పిలిచి కధ చూపేవాడు.
రచయితలందరూ మోసపోయి ఇంటి కెళ్ళిపోయేవారు. వాళ్ళ కధలన్నీ తనవే అని చెప్పుకుని ఆ కధ అమ్మినందుకు ఏ పాతికవేలో కాజేసేవాడు పైసేశ్వరావ్. పైసేశ్వరావ్ కొద్ది రోజుల్లోనే గొప్ప రైటర్ డైరెక్టర్ అయిపోయాడు. లక్షలు లక్షలు సంపాదించేవాడు.
ఓరోజు ఓ సరికొత్త రచయిత వచ్చాడు పైసేశ్వరరావ్ ఇంటికి. మాములుగానే కధ చెప్పమన్నాడు పైసేశ్వరరావ్. రచయిత కధ చెప్పాడు.
"ఓశ్ ఈ కధా" అని నవ్వాడు డైరెక్టరు. "ఇది నేను ఆర్నెల్ల క్రితమే రాశాను. ఓ ప్రొడ్యూసర్ కి అమ్మాను కూడా! ఈ కధ షూటింగు కూడా ఎల్లుండి నుంచి స్టార్ట్ అవబోతోంది. కావాలంటే చూడండి కధ ఫైలు చూపిస్తాను." అంటూ ఏకసంధాగ్రాహి రాసిన ఫైల్ తీసుకొచ్చి కధ చదివి వినిపించాడు.
"అబ్బ! మీ బుర్ర అమోఘం సార్! మీరు పోయాక మీ బుర్రని పరీక్షలు చేయించాలి! ఇన్ని కధలేలా పుడుతున్నాయో అందులో" అన్చెప్పి రచయిత వెళ్ళిపోయాడు. వెంటనే ఆ కధతో సినిమా ప్రారంభించాడు పైసేశ్వరరావ్. తీరా రిలీజ్ చేయబోయే సమయంలో అదే కధతో మరోచిత్రం అంతకుముందు కొద్ది రోజుల క్రితమే రిలీజయి బ్రహ్మాండంగా ఆడుతోందని తెలిసింది. పైసేశ్వరావ్ ఖంగారు పడిపోయాడు. అదే కధతో మరో సినిమా ఎలా తీశారో అతని కర్ధం కాలేదు. చేసేది లేక అలాగే తన సినిమా కూడా రిలీజ్ చేశాడు. చేసిన రెండ్రోజుల్లో డబ్బాలు తిరిగి వచ్చేసినయ్. ప్రజలూ, సినిమా ఫీల్డు వాళ్ళూ అతని తెలివి గురించి తెగ నవ్వుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ రచయితలను మోసం చేయలేదతను" ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది.
"రాజా! ఆ రచయిత పైసేశ్వరావ్ సంగతి ఎలా కనిపెట్టాడు. అతనికి ఎలా గుణపాఠం చెప్పాడు? ఈ సంగతి ఆ డైరెక్టర్ ఎలా తెలుసుకోలేక పోయాడు? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ వీపు చట్నీ అవుతుంది!" అంది సెన్సార్.
"అదేమిటి తల వెయ్యి ముక్కలవుతుంది అనాలి కదా నువ్వు" అమాయకంగా అడిగాడు నిర్మాత.
"ఆ సెంటెన్స్ లో వయోలెన్స్...... అనగా హింస మరీ ఎక్కువగా ఉందని సెన్సార్ చేసేశాన్లే! త్వరగా సమాధానం చెప్పు."
"ఆ రచయిత మరెవరో కాదు. అంతకు ముందోసారి మోసపోయినవాడే. అతను ఏకసంధాగ్రాహి కధ చదవడం వల్ల జరుగుతున్న మోసం తెలుసుకున్నాడు. తెలుసుకుని తన దగ్గరున్న ఓ మంచి కధని మరో డైరెక్టరుకు అమ్మి ఆ సినిమా సగం అయిపోయాక అప్పుడు వచ్చి అదే కధ మళ్ళీ పైసేశ్వర్రావ్ కి చెప్పాడు. పైసేశ్వరావ్ ఆ సినిమా తీసేలోపల మొదటి చిత్రం రిలీజయిపోయింది. అంచేత పైసేశ్వరావ్ సినిమా ప్లాప్ అయింది" అన్నాడు నిర్మాత.
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.