Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 9


    ఆటో కోసం చూశాడు.

 

    ట్రాఫిక్ బంద్ చేయడం వల్ల ఎక్కడా ఒక్క ఆటో కూడా కన్పించడంలేదు.

 

    రోడ్ క్రాస్ చేసి పెట్రోల్ బంక్ వరకూ వెళ్ళాడు. అక్కడో ఖాళీ ఆటో కన్పించింది.

 

    "చల్తే భాయ్."

 

    "ఎక్కడికి సర్?" అడిగాడు ఆటోవాడు.


    
    "మీటింగ్ లో ఫోటోలు తీసి వస్తాను... వెంటనే ఫిల్మ్ ని కలర్ లాబ్ కివ్వాలి.. ప్రోసెసింగ్ కి. ఒక గంట యిక్కడ నువ్వు వెయిట్ చేయాలి. ఏదో టైమ్ లో నేను బయటికొస్తాను. నేను రాగానే ఆటో స్టార్ట్ చేయాలి."

 

    "వెయిటింగ్ ఛార్జ్ ఏక్ సౌ రుపియ్యా" మరొక్కప్పుడైతే ఆ ఆటోవాడ్ని చాచి కొట్టేవాడే.

 

    "అలాగే! ఎక్కడుంటావ్" అడిగాడు ఆదిత్య.

 

    "ప్రెస్ క్లబ్ పాన్ దబ్బా దగ్గరుంటా."

 

    జేబులోంచి యిరవై రూపాయల నోటుతీసి అతని చేతిలోపెట్టి, అతని వైపొకసారి చూసి నిజాం కాలేజీలోకొచ్చాడు ఆదిత్య.

 

    ఎనిమిది పదిహేను నిమిషాలైంది.

 

    ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ వింగ్ లోకొచ్చిన ఆదిత్య కళ్ళు అహోబలపతి కోసం వెతుకుతున్నాయి.


    
    అతిధులకు ఆహ్వానం అయిపోయింది.

 

    చీఫ్ మినిస్టర్ ని ఒకాయన ఆకాశమంత ఎత్తున పొగిడేసి, నలుగురుతోపాటు మోసుకొచ్చిన ఓ దండేసి వెళ్ళిపోయాడు. అలా ముందుకెళ్తున్న దండలన్నిట్నీ అంతకు ముందే పోలీసులు మెటల్ డిటెక్టర్లతో చెక్ చేశారు.

 

    దండల కార్యక్రమం... దండాల కార్యక్రమం జోరుగా సాగుతోంది.

 

    "పార్టీ వైస్ ప్రెసిడెంట్, నగర ఎక్స్ ఎమ్మెల్యే, శ్రీ అహోబలపతిగారు చీఫ్ మినిస్టర్ని పుష్పమాలాంకృతుల్ని చేస్తారు."

 

    మైక్ లోంచి ఆ ఎనౌన్స్ మెంట్ విన్పించగానే వులిక్కిపడ్డాడు ఆదిత్య.

 

    అతని కళ్ళు అహోబలపతిని వెతుకుతున్నాయి.

 

    అంతవరకూ చూడలేదు ఆదిత్య.

 

    వి.ఐ.పీ. గ్యాలరీలో ఆ చివరి పక్కనున్న ఎమ్మెల్యేతో హుషారుగా మాట్లాడిన అహోబలపతి లేచి నిలబడ్డాడు.

 

    ఆ పక్కనున్న ఎమ్మెల్యే వైపు చూశాడు ఆదిత్య. అతను గుర్రం పెద్దబ్బాయి.

 

    ఆదిత్య వెంటనే షూ లేస్ ని సరిచేసుకోవాటానికన్నట్లు ముందుకి వంగాడు. చేతిని మూడో సర్వే కడ్డీ వైపు చాపాడు... క్రమంగా మృత్యువు నిద్రలేస్తోంది.

 

    కార్యకర్తలు నిలువెత్తు దండను మోసుకొని రాగా, నవ్వుతూ ముందుకు నడిచాడు అహోబలపతి. పిస్టల్ ఆదిత్య ఫాంట్ జేబులోకొచ్చింది.

 

    ఘడియలు క్షణాలవుతున్నాయి... మృత్యువు వళ్ళువిరుచుకుంటోంది.

 

    ఠీవిగా స్టేజ్ మెట్లెక్కుతున్నాడు అహోబలపతి.

 

    ఫోటోగ్రాఫర్ల కెమేరాలు క్లిక్ మంటున్నాయి.

 

    ఒకటి... రెండు... మూడు... నాలుగు... అయిదు... ఆరు... ఏడు...

 

    ఆదిత్య చూపులు డేగ చూపుల్లా వున్నాయి.

 

    స్టేజీకీ, జనరేటర్ కి మధ్యగా నున్న చీకటి ప్రదేశం వైపు అడుగేశాడు. ఆదిత్య నెమ్మదిగా కెమేరా సరిచేసుకుంటూ.

 

    అతని కుడి చెయ్యి కుడి ఫ్యాంట్ జేబులోకెళ్ళింది.

 

    ఏ ఒక్కరూ అతన్ని గమనించడం లేదు అన్న విషయాన్ని నిర్ధారించుకుని.

 

    జేబులోని పిస్టల్ ని బయటకు తీస్తున్నాడు ఆదిత్య.

 

    ఎనిమిది... తొమ్మిది... పది... పదకొండు... పన్నెండు...

 

    ఆ సమయంలో....

 

    ఎందుకో ఆదిత్యకు....

 

    ప్రపంచంలో అతి తక్కువ దూరంలో, పరిధిలో జరిగిన గ్రేట్ మర్డర్స్ జ్ఞాపకానికొచ్చాయి.

 

    మహాత్మాగాంధీ, జాన్.ఎఫ్.కెనడీ, బలోఫ్ పామే, రాజీవ్ గాంధీ, ప్రేమదాస.

 

    కార్యకర్తల చేతిలోని దండను తనందుకుని చీఫ్ మినిస్టర్ మెడలో వేసి, ఆయన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు అహోబలపతి.

 

    అంతే! ఆదిత్య మరి ఆలస్యం చేయలేదు. పిస్టల్ ని పైకితీసి... గురిచూసి...

 

    షూట్ చేయడం ప్రారంభించాడు.

 

    ఒకటి... రెండు... మూడు... నాలుగు... కేవలం శబ్దమే... బుల్లెట్స్ రాలేదు.

 

    అహోబలపతి చీఫ్ మినిస్టర్ కాళ్ళమీద పడిపోయాడు... నమస్కారం చేయటానికి. దాన్ని వూహించలేదు ఆదిత్య. అతని చేతిలోని పిస్టల్ లోంచే వెలువడిన బుల్లెట్స్ నేరుగా చీఫ్ మినిస్టర్ గుండెల్లో దూసుకుపోయాయి. ఐదో రౌండ్ లో, ఆరో రౌండ్ లో వున్న బుల్లెట్స్ లక్ష్యాన్ని ఛేదించాయి. ఏం జరిగిందో తెలీక సముద్రం పొంగిపోయినట్లు, నిజాం గ్రౌండ్స్ పొంగిపోయింది.

 

    అల్లకల్లోలం...

 

    ఆదిత్య మరేమాత్రం ఆలస్యం చేయలేదు. తన భుజానికి వేళాడుతున్న సంచి జిప్ ని ఓపెన్ చేసి, అందులో వున్న రెండు పాముల్ని నేలమీద వదిలేసి "స్నేక్స్... స్నేక్స్" అంటూ పెద్దగా అరిచి ముఖం దాచుకున్నాడు.

 

    ఆపైన అక్కడాగకుండా మెట్లు, వరండా, లాన్, కాలేజీ మెయిన్ గేట్ వరకు బులెట్ లా పరిగెత్తాడు ఆదిత్య.

 

    నిజాం కాలేజీలోంచి బయటికొచ్చిన ఆదిత్య రోడ్డు క్రాస్ చేసి, ప్రెస్ క్లబ్ ఎదుటకొచ్చాడు.

 

    అక్కడ ఆటో లేదు.

 

    అంతకు అయిదు నిమిషాల క్రితమే పోలీసులు అక్కడ నుంచి ఆటోని బస్టాపు దగ్గరకు తరిమేశారు.

 

    దూరం నుంచే గుర్తుపట్టిన ఆటో డ్రైవర్ ఆదిత్యను చూడగానే-

 

    "సాబ్... సాబ్" అని అరుస్తున్నాడు.

 

    ఆ అరుపును విన్న ఆదిత్య బస్టాపు వైపుకు దూసుకుపోసాగాడు.

 

    ఆదిత్యకు, ఆటోకు మధ్య దూరం లాంటిది. సంధించిన అస్త్రంలా వున్నాడు ఆదిత్య.

 

    అతని ఉచ్చ్వాస నిశ్వాసల శబ్దం ప్రళయ భీకరంగా అతనికి విన్పిస్తోంది. రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. కాలి చెప్పు తెగి, కాలికి అడ్డంగా పడింది. పట్టించుకోలేదు. ఆటో ఎక్కబోతున్న సమయంలో ఠపేలుమని నుదురు ఆటో ఇనుపచువ్వకి తగిలి, రక్తం బొట బొట కారసాగింది.

 

    "డ్రైవర్ క్విక్... క్విక్... పోనీ..." సీట్లో కూర్చుంటూ అరిచాడు ఆదిత్య.

 

    అప్పటికే రెడీగా వున్న ఆటో శరవేగంతో ముందుకు దూసుకుపోయింది.

 Previous Page Next Page