"మీ చీర చాలా బావుంది. ఎంతకు కొన్నారు?" అడిగింది సీత.
"నూట అరవై . అమెరికన్ జార్జేట్ అది" అంది సుభాషిణి.
సీత నిరాశ పడిపోయింది. ఆ ధర వింటూనే. అంత ధరా? అంత ఖరీదు పెట్టి చీర కొనుక్కోవడం తనకెలా సాధ్యమవుతుంది? ఎనిమిది నెలల వరకూ డ్రస్సింగ్ టేబిల్ కి వాయిదాలు కట్టటం తోనే సరిపోతున్నది. ఏదేమయినా భర్త నడగాలి. అలాంటి చీర కొనిపెట్టమని. ఆ మాత్రం భార్యకు చీర కొనివ్వలేక పొతే ఎలా?
"నువ్వు అదృష్టవంతుడివోయ్ మాధవరావ్! అన్ని విధాల అనుకూలవతి అయిన భార్య దొరికింది" అన్నాడు రెడ్డి నవ్వుతూ.
"మరీ, ఎదురుగా పొగడకురా! మీ చెల్లాయికి గర్వం ఎక్కిపోతుంది" తనూ నవ్వుతూ అన్నాడు మాధవరావు.
"సీత అలా మారిపోయే మనిషి కాదులెండి" కల్పించుకొంటూ అంది సుభాషిణి.
"వచ్చే ఆదివారం మీరిద్దరూ మా యింటి కొచ్చేయండ్రా మాంచి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను" అడిగాడు రెడ్డి.
"మొన్నగా వచ్చింది" నసిగాడు మాధవరావు.
"మొన్న కేవలం డిన్నర్ కెగా వచ్చింది. ఈసారి మా ఫ్రెండ్ కారు తీసుకొస్తున్నాను. అందరం ఎటైనా పిక్ నిక్ వెళ్దాం. పెళ్ళయి నెల దాటిపోయింది. ఇంతవరకూ మా చెల్లయిని ఎక్కడకూ తీసుకెళ్ళ లేదు నువ్వు. మా చెల్లాయ్ కాబట్టి పోనీ లెమ్మని ఊరుకుంది. అదే మరొకరయితే జుట్టు పట్టుకొని హనీమూన్ లాక్కేల్లె వాళ్ళు" కోపం నటిస్తూ అన్నాడు రెడ్డి.
"అరేయ్ నువ్వన్నీ లేనిపోనివి రేపెట్టిపోకు! నువ్వెళ్ళగానే అవన్నీ చేస్తారా , లేదా అంటూ నన్ను దులిపెస్తుంది" బ్రతిమాలుతున్నట్లు అన్నాడు మాధవరావు.
'అలాగే అబద్దాలు చెప్పండి" చిరుకోపంతో మాధవరావు వంక చూస్తూ అంది సీత. అనేసింది కాని ఆమె మనసులో నిజంగానే రెడ్డి మాటలు పనిచేయటం ప్రారంభించాయి.
తను అనేక కధల్లోనూ, నవలల్లోనూ "హనీమూన్" గురించి చదివింది. సినిమాల్లో చూసింది కానీ నిజ జీవితంలో ఎక్కడా కనిపించటం లేదు. ఎంత సరదాగా ఉంటుందనీ ఆ హనీమూన్. సుందరమైన దృశ్యాల మధ్య విహరించడం ఖరీదయిన హోటల్లో మకాం, అసలు జీవితానికి నిర్వచనం హనీమూనేమో! మరి అంతటి ముఖ్యమైన అంశం కేవలం నవలలకూ , కధలకూ సినిమాలకే పరిమితమై పొయిందెందుకనో! తన స్నేహితురాలు జయలక్ష్మికి వివాహమయింది వెంటనే భర్తతో కాపరానికి వెళ్ళిపోయింది కూడా! దాన్నడిగితే దానికి "హనీమూన్" లేదట. బోలెడు డబ్బవుతుంది వద్దు" అన్నాట్ట వాళ్ళాయన. ఇందిర కూడా అంతే! తను చెప్పేవరకూ దానికి హనీమూన్ అంటే ఏమిటో తెలిస్సావలేదు. వాళ్ళే కాదు తను బంధువుల్లో చాలా మందికి వివాహాలకు వెళ్ళింది తను. ఎక్కడా "హనీమూన్" ప్రసక్తే లేదు.
"మీరు హనీమూన్ కి డార్జిలింగ్ వెళ్ళారు కదూ!" అడిగాడు మాధవరావు.
'అవును! చాలా బావుంటుందిలే అక్కడ! ఉదయాన్నే లేవగానే మంచుతో నిండి కనిపించే "కాంచన గంగ" శిఖరం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? గంటల తరబడి చూస్తూ కూర్చోవచ్చు. నాకయితే ఆ ప్రదేశం వదిలి రాబుద్ది కాలేదనుకో?"
"అక్కడే ఉండి పోవాల్సింది" నవ్వుతూ అంది సుభాషిణి.
"నన్నొక చోట ఉండనిస్తే కదా నువ్వు" ఆమె వంక చూస్తూ అన్నాడు రెడ్డి . అందరూ నవ్వేశారు.
మరికాసేపు కూర్చుని రెడ్డి, సుభాషిణి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన స్కూటరు వంకే, అది కనబడనంతవరకూ చూస్తూ నిలబడి పోయింది సీత.
తమకి స్కూటరు వుంటే ఎంత బావుంటుంది? ప్రతి రోజూ సాయంత్రం స్కూటరు మీద ఇద్దరూ సరదాగా టాంక్ బండ్ కీ, సినిమాలకీ హాయిగా తిరుగొచ్చు కదా! తను వెనుక సీటు మీద కూర్చుని మాధవరావు నడుము పట్టుకొంటే అదో థ్రిల్! ఇవన్నీ తీరేదెప్పుడు? అనుభవంలో కొచ్చేదెప్పుడు? ఇలాంటివన్నీ ఈ వయసులో అనుభవించలేకపోతే వయసు మళ్ళాక సరదాలేముంటాయనీ?
"ఏమిటి అక్కడే నిలబడిపోయావ్" వెనకగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి నొక్కుతూ అడిగాడు మాధవరావు.
సీత ఆలోచనలు వదిలి ఈ లోకంలో కొచ్చింది. లోపలకు నడిచి మంచం మీదకు ఒరిగిపోయింది.
"సీతాదేవిగారు ఏదో ఆలోచిస్తున్నారు" నవ్వుతూ అన్నాడు మాధవరావు.
'స్కూటరు ఎంత ఖరీదుంటుందండీ?" అమాయకంగా అడిగిందామె. మాధవరావుకి నవ్వాగలేదు.
"ఎందుకట?" అన్నాడు పరిహాసంగా.
తను చెప్పే ప్రతి విషయం అదో నవ్వులాటలా తీసి పారేయడం ఆమెకు కోపం కలిగిస్తోంది.
"మీరేమీ చెప్పద్దులెండి! బుద్ది తక్కువయి అడిగాను ' చిన్నబుచ్చుకొంటూ అందామె.
"అరెరే! ఈ మాత్రానికే అంత కోపమా?" ఆమెను దగ్గరకు లాక్కోబోయాడతను. సీత అతనిని సున్నితంగా తోసివేసి వెనక్కు జరిగింది.
"సరిలేవోయ్! చెప్తున్నాను! ఆ కోపం ఫోజు తీసెయ్. స్కూటరు ఖరీదు సుమారు ఆరువేలవుతుంది. మనం అంత డబ్బు ఈ జన్మలో కూడబెట్టలేము. పోనీ ఆ స్కూటరు కూడా కుట్టు మిషన్లలాగా వాయిదాల పద్దతిలో ఇస్తారా అంటే ఆ సౌకర్యమూ లేదు. అంచేత మనం స్కూటరు ఈ జన్మలో కొనలేము. ఈ పరిస్థితిలో స్కూటరెంత అని నువ్వడుగుతుంటే నవ్వొచ్చింది. అది కూడా నా తప్పేనా ?" సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను.