Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 8


    "ఏమండీ అద్దం ఉన్న ఆ డ్రెస్సింగ్ టేబిల్ తీసుకుందామండీ" బ్రతిమాలుతున్న ధోరణిలో అందామె.
    "కాని సీతా ప్రతినెలా మనం యాభై రూపాయల చొప్పున ఎలా కట్టగలం చెప్పు?" ఇబ్బందిగా అన్నాడు మాధవరావు. నిజానికి తనకి అలాంటి అలంకార వస్తువులు కొనడం అయిష్టం! కానీ సీత మనసు నొప్పించడం అంత కంటే అయిష్టం.
    "మీ కెందుకండీ ఎలాగోలా నేను మిగులుస్తాగా!"
    "నీ యిష్టం! నీకంత ధైర్యం ఉంటె నాకేం అభ్యంతరం లేదు....."
    వెంటనే యాభై రూపాయలు షాపు వాడికి కట్టేసి ఇంటి అడ్రస్ ఓ కాగితం మీద రాసి షాపు యజమాని కిచ్చిందామే.
    "రేపు ఉదయం మనషి కిచ్చి పంపిస్తాను" అన్నాడతను.
    ఆ రాత్రంతా ఆమె ఆ డ్రస్సింగ్ టేబిల్ గురించే ఆలోచించింది. అదెక్కడ ఉంచాలీ, దాని సొరుగుల్లో ఏమేం నింపాల్సింది.
    "మనలాంటి దురదృష్టవంతులకు అలాంటి వస్తువులు అనవసరం సీతా! అవి ఏ అందమయిన బంగళాల్లోనో  ఉండాలి గాని మనం ఉన్నలాంటి దిక్కుమాలిన కొంపల్లో కాదు. ఇలాంటి చోట అది కూడా వెలవెలా పోతుంటుంది. అదీగాక మనకు అలాంటివి కొనుక్కునేంత తాహతు కూడా లేదు. ఈ యాభై రూపాయలయినా మామయ్యకు పంపగలిగి ఉంటె నేనెంతో సంతోషించే వాడిని........"
    తన మనసులోని మాటలన్నీ బయట పెట్టాడు మాధవరావు.
    సీత మనసు చివుక్కుమంది. తన కోరికల నన్నింటినీ నాశనం చేసుకొని మరొకరికి- అదీ తనకు సంబంధం లేని వాళ్ళ కోసం పాటుపడలా? అలాంటప్పుడు మరి తనని వివాహం ఎందుకు చేసుకున్నట్లో. ఓ వంట మనిషిలా ఉంచడానికా? అంటే ఇది వివాహం పేరుతొ వంట మనిషిని కొనుక్కోవడమన్నమాట.
    "సరే పోనీలెండి! రేప్రోద్దున వెళ్లి డ్రస్సింగ్ టేబిల్ వద్దని చెప్పేసి వద్దాం"! నిష్టూరంగా అందామె.
    "కేవలం ఈ డ్రస్సింగ్ టేబిల్ గురించే నేను మాట్లాడడం లేదు సీతా! మనమున్న సంగతి గురించి చెబుతున్నాను అంతే! నీ మనసు కష్టపెట్టాలని , నీ ఇష్టాలు గౌరవించ కూడదనీ నాకు లేదు. నువ్వు కోరిందల్లా పొందేట్లు చేయడం నాకు మాత్రం అనందం కాదూ? భార్య సుఖపడాలని, అన్ని విధాల సంతృప్తి పరచాలనీ ఏ భర్త కోరుకోడు. కాని ఈ "లేమి" మూలంగా అలాంటి వన్నీ కప్పడిపోతాయ్. లేని పోనీ అపోహలకు , అపార్ధాలకు వెలికి వస్తాయ్. మనిద్దరం ఒకరి నొకరు పూర్తిగా అర్ధం చేసుకొనే వాళ్ళమయితే మన మధ్య ఉన్న అనురాగాన్ని, అనుబంధాన్ని ఈ "లేమి" ఏమీ చెయ్యలేదు."
    సీత అతని మాటలు ముగ్ధురాలాయి వింటోంది. అతని మాటల్లో ఏంతో నిజం కనిపించిందామెకి. నిజమే భార్యని సుఖ పెట్టాలని ఏ భర్త అనుకోడు? తామున్న పరిస్థితుల మూలాన మాధవరావు బాధ పడుతున్నాడు. అంతేగాని తను డ్రస్సింగ్ టేబిల్ కొన్నందుకు కాదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఈ "లేమి" అనేది జీవితాంతం ఉండేదే. తనే వీలు చూసుకొని తన క్కావలసిన వన్నీ అమర్చుకోవాలి. అన్నీ భర్తతో చెప్పి అతని మనసు నొప్పించడం అవివేకం. హటాత్తుగా ఆమెని తన కౌగిట్లోకి లాక్కున్నాడు మాధవరావు.
    "సీతా! నా మీద కోపంగా ఉందా?" ఆమె కళ్ళల్లో కళ్ళుంచి అడిగాడతను.
    "కోపమెందుకూ> మీరేమన్నారని ఇప్పుడు?' తేలిగ్గా నేవ్వేస్తూ అందామె. మిగిలిన రాత్రి మధురంగా గడిచిపోయింది వారికి.

                                4

    "రేపు రెడ్డీని, అతని భార్యనూ మనింటికి డిన్నర్ కి పిలిచాను......" అన్నాడు మాధవరావు ఆరోజు ఆఫీస్ నుంచి ఇంటి కొస్తూనే.
    "వస్తానన్నారా?" సంతోషపడుతూ అందామె. తమ డ్రస్సింగ్ టేబిల్ రెడ్డి భార్యకు చూపించాలని ఆమెకు ఏంతో కోరికగా ఉంది.
    "ఓ! అదివారమేగా! తప్పక వస్తామన్నారు....."
    ఈ క్షణం నుంచే హడావుడి పడిపోయింది సీత. ఇల్లంతా నీట్ గా సర్దటం, డోర్ కర్టెన్లు ఉతికి ఆరేయడం- అన్నీ -
    ఆమె శ్రమ చూస్తుంటే మాధవరావుకి నవ్వొచ్చింది . తామున్న స్థితి కంటే ఓ మెట్టు పైన ఉన్నట్లు కనబడాలని మనుషులు ఎందుకు ప్రవర్తిస్తారో అతని కెప్పుడూ అర్ధం కాని విషయమే!
    క్రింది తరగతి వాడు మధ్యతరగతి వాడిలాగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. మధ్యతరగతి వాడు మరింత ఉచ్చస్థితిలో ఉన్నట్లు నటిస్తాడు. ఆపై తరగతి వాడు లక్షాధికారి లాగానూ, లక్షాధికారి కోటీశ్వరుడు లాగానూ....
    మర్నాడు మధ్యాహ్నం పన్నెండింటికల్లా స్కూటర్ మీద రెడ్డి - అతని భార్యా సుభాషిణి వచ్చేశారు.
    ఇల్లు చిన్నదయినా బాగానే ఉందిరా!" అన్నాడు రెడ్డి నీట్ గా ఉన్న ఆ గదిని చూస్తూ.
    "ఇదంతా మా ఆవిడ ప్రతాపంలే! రోజుకి పన్నెండు గంటలు ఇల్లు సర్ధడంలోనే సరిపొతుందామెకు" నవ్వుతూ అన్నాడు మాధవరావు.
    "ఈ డ్రస్సింగ్ టేబిల్ బావుంది. ఎంతక్కొన్నారు?" సుభాషిణి సీత నడగనే అడిగింది. గర్వంతో ఉప్పొంగిపోయింది సీత. ఈ క్షణం కోసమే, అదికొన్న దగ్గర్నుంచీ ఎదురు చూస్తోందామే.
    "మూడొందల తొంభయ్" ప్రకటించాడు.
    "చాలా బావుంది. ఎక్కడ కొన్నారు?"
    "నాంపల్లి దగ్గర అదేదో షాపులో.....
    వచ్చిన దగ్గర నుంచీ సీత దృష్టి నాకర్శించిన విషయం సుభాషిణి కట్టుకున్న చీర. చాలా అద్భుతంగా ఉందా చీర. నల్లని రంగు మీద పచ్చని చారలు, తెల్లని పూలూ, సన్నగా పాము కుబుసంలా ఉంది. ఆ చీర గురించి వివరాలు తెలుసు కోవాలని , తనూ వీలయితే అలాంటి చీరని స్వంతం చేసుకోవాలనీ ఉవ్విళ్ళూరుతుందామె. భోజనాలయాక ఆ అవకాశం రానే వచ్చింది. ఇద్దరి టాపిక్ చీరల మీదకు మళ్ళింది.

 Previous Page Next Page