Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 10


    సీతకు కోపం చల్లారలేదు.
    "అసలు ఆ విషయమే కాదు లెండి! నేనేది అడిగినా మీరు హేళన చేస్తూనే ఉంటారు. మనిషికి ఆశ ఉండటంలో తప్పేముంది? ఏ వస్తువు కోసమయినా ఆశ పడితేనే దాన్ని పొందడం సాధ్యమవుతుంది. అన్నిటికీ, "ఇది మనవల్ల కాదు" అని నిరుత్సాహపడితే అది అలాగే అయిపోతుంది. ఆశలనేవీ లేకపోతే ఇంక జీవితం మీద ఆసక్తి ఏముంటుంది?" నిష్టూరంగా అందామె.
    "ఐయామ్ సారీ సీతా! నీ మనసు నొప్పిస్తున్నాను కదూ?" దగ్గరగా నడిచి ఆమె చుబుకం పట్టుకొని తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడతను.
    సీత అతని వంక చూసేసరికి సీత కోపమంతా మంచులా విడిపోయింది. అతని గుండెల మీదకు వాలిపోయి మెడ కింద గాడంగా చుంబించింది.
    ఆదివారం ఉదయమే ఇద్దరూ రెడీ అయి రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
    "మీ కోసమే ఎదురు చూస్తున్నాను. రండి" లోపలకు ఆహ్వానించింది సుభాషిణి.
    "రెడ్డి లేడా?" ఇల్లంతా చూస్తూ అడిగాడు మాధవరావు.
    "ఊహు! కాదు తీసుకురావడానికి కెళ్ళారు; ఇంకో అరగంటలో వచ్చేస్తారు " అందామె.
    సీత సుభాషిణితో పాటు వంటింట్లోకి నడిచింది.
    అక్కడ మరో స్త్రీ వంట చేస్తోంది.
    "మనక్కావలసినవన్నీ నేను చేయడం కష్టమని వంట మనిషిని పిలిపించాను" నవ్వుతూ అంది సుభాషిణి.
    సీత ఆశ్చర్యపోయింది.
    నలుగురికి వంట చేయడానికి ఓ వంట మనిషా! ఎంత సుఖకరమైన జీవితం అమెది?
    సరిగ్గా అరగంటయేసరికి బయట కారు హారన్ మోగింది. భర్తతో పాటు తనూ హాల్లోకి నడిచింది సీత.
    రెడ్డి కారు దిగి లోపలికొచ్చాడు.
    ఆ కారు వంకే కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది సీత. ఎంత అందంగా ఉంది కారు. ఆ కారు మీద ఒక్కసారి ప్రయాణం చేస్తే జీవితం ధన్యమయిపోతుందనెంత అద్భుతంగా ఉంది. అలాంటి కార్లో ప్రయాణం చేయడం ఎంత మందికి సాధ్యం. కేవలం తన భర్త స్నేహితుడివల్ల తనకా అదృష్టం కలుగబోతోంది. ఈ మాత్రానికి కూడా నోచుకోని వాళ్ళెంత మంది లేరు?
    "ఈ కారు వాడు అమ్ముతానంటున్నాడు. నేను పాతికవేల కడిగాను. వాడు నలబై కి తక్కువ అమ్మనంటున్నాడు. చూద్దాం? కొన్నాళ్ళు పొతే వాడె దిగి వస్తాడని ఆగాను. బావుండలేదూ కారూ?" మాధవరావుతో అంటున్నాడు రెడ్డి. సీత గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. సుభాషిణి వాళ్ళు ఆ కారు కొనుక్కోబోతున్నారా? ఆమె మీద హటాత్తుగా ఈర్ష్య కలిగిందామెకి. ఎంత అదృష్టం! స్కూటర్ గురించి ఆలోచించడానికి కూడా తను అర్హురాలు కాదు. సుభాషిణి స్కూటరు వదిలి కారు కొంటోంది. మరికాసేపటి తర్వాత కారులో అందరూ బయల్దేరారు. ఫ్రంట్ సీటులో రెడ్డి సుభాషిణి కూర్చున్నారు. వెనుక సీట్లో తామిద్దరూ . కారు విశాలమయిన రోడ్ల మీద నుంచి దూసుకుపోతోంటే ఆనందంతో పొంగిపోతోంది సీత. దబుక్కున ఏదైనా లాటరీ తగిలితే ఎంత బావుంటుంది? ముందు ఇలాంటి కారే కోనేస్తుంది తను! మిగతా విషయాలు తరువాత! గండిపేట చేరుకొంది కారు.
    అక్కడి ప్రకృతి దృశ్యాలు పరవశత్వం కలుగ జేస్తున్నాయి. ఎంత అందంగా, ప్రశాంతంగా ఉందిక్కడ. ఇలాంటి దృశ్యాలు సినిమాలో చూడటమే గాని ప్రత్యేక్షంగా చూడటం ఇదే మొదటిసారి.
    రెడ్డి టేప్ రికార్డర్ తీసి మంచి పాటలు వినిపించసాగాడు. అందులో సుభాషిణి పాడిన పాట కూడా ఉంది.
    సీతకు మళ్ళీ ఈర్ష్యగా కలిగిందామే మీద.
    భర్త అంటే రెడ్డిలా ఉండాలి. ఎంత ప్రేమ అతనికి భార్య మీద . ఆమె మీద ఈగ వాలనివ్వడు. ఆమెను కాలు కింద పెట్టనీదు. ఓ స్త్రీ కోరుకునే అన్ని వస్తువులూ ఆమె కోసం అమర్చాడతను.
    మాధవరావు వంక చూసిందామె. రెడ్డి పక్కనే కూర్చుని దూరంగా ఎటో చూస్తున్నాడతను. అతనికీ తన భర్తకీ ఎంత తేడా? ఖరీదైన బట్టలతో మెరిసిపోతున్నాడు రెడ్డి. వెలవెల పోతున్న కాటన్ బుష్ షర్టూ నలిగిన పాంటుతో తన భర్త రెడ్డి దగ్గర నౌకర్లా ఉన్నాడు. రెడ్డి టేప్ రికార్డర్ పెట్టి ఆనందిస్తోంటే తన భర్త ప్రకృతి దృశ్యాలు కూడా చూడకుండా ఏదో ఆలోచిస్తున్నాడు. అసలా మనిషిలో ఏ కోరికా లేదు. ఏ ఆశలూ లేవు. ఉన్నదానిలోనే సంతృప్తి , లేనిదాని గురించి అసలు ఆలోచనే లేదు.
    మధ్యాహ్నం అందరూ భోజనాలు ముగించారు.
    సుభాషిణే వడ్డించింది అందరికీ! ఎన్ని రకాల వంటకాలు! అవి కూడా సినిమాలలో చూడటమే! డబ్బున్న జీవితాలకూ లేని జీవితాలకూ ఎంత తేడా! ప్రతి విషయంలోనూ, కొట్టెచ్చెటంతా తేడా కనబడుతోంది.
    సాయంత్రం వరకూ పేకాట ఆడి కాసేపు ఈతకొట్టి తిరిగి ఇంటికి బయల్దేరారు వాళ్ళు.\
    సీత కసలు ఉత్సాహమే లేదు. ఆ పిక్నిక్ ఆమెకు మానసిక ఉల్లాసం కలిగించలేదు. సరికదా మరింత కృంగదీసిందామేని. మరిన్ని సుఖాలకు తను దూరంగా ఉందొ అప్పుడే తెలిసిందామెకి.
    రోజులు గడిచిన కొద్ది ఆమెకు మనశ్శాంతి కరువయిపోసాగింది. జీతం ఎటూ చాలటం లేదు. వాయిదాల పద్దతిలో తీసుకొన్న డ్రస్సింగ్ టేబిలూ, రేడియో, సోఫా సెట్టు- వీటికి డబ్బు కట్టే సరికి ప్రాణం మీద కోస్తోంది. దాంతో మాధవరావు అప్పులు చేయక తప్పటం లేదు. జీవితంలో ఏనాడూ అప్పు చేయ్యలేదతను. ఇప్పుడు సీత తెలివితక్కువ పనుల వల్ల తను అప్పుకి బయల్దేరడం అతనికి బాధ కలిగించింది.
    సీతతో మనస్పూర్తిగా మాట్లాడలేకపోతున్నాడతను. సీత కూడా ఈ విషయం గ్రహించుకొంది. అయినా అతనిని పట్టించుకొదల్చుకోలేదామే. తనేమీ కాని పనులు చేయడం లేదు. అవన్నీ కొనడం తన స్వార్ధానికి కాదు. తమ ఇంటిని తనక్కావలసిన పద్దతిలో తీర్చి దిద్దుతోంది. అంతే! అందుకు కొంతవరకూ తమ తహతుకి మించిన ఖర్చు అయితే అవ్వవచ్చు. అలాటి పరిస్థితుల్లో - ఈ సమస్యలేలా పరిష్కరించుకోవాలా అని ఇద్దరూ కూడబలుక్కొని ఆలోచించుకోవాలి గాని అయన తన మీద అలిగితే ఏం లాభం? అలా అలిగినంత మాత్రాన తమ సమస్యలు పరిష్కారమవుతాయా?

 Previous Page Next Page