Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 9


    మర్నాడు ఆఫీసులో ఏదో కాగితం రాస్తూండగా 'నమస్తే' అన్న గొంతు వినిపించి ఠక్కున అటువేపు చూసిందామె. శ్రీరామ్ చాలా నీట్ గా, అందంగా డ్రస్ చేసుకొని కూర్చుని వున్నాడు ఎదురుగా ఉన్న కుర్చీలో.
    "మీరా!" ఆశ్చర్యంగా అడిగింది.
    "ఇవాళ ఉదయం నుంచీ శెలవుపెట్టి నేనే తిరుగుతున్నాను ఇల్లు కోసం. ఒకచోట మాత్రం ఓ ఇల్లు దొరికింది! ఆ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను..."
    "చెప్పండి."
    "రెండు గదులు, కిచెన్, బాత్ రూమ్ వున్నాయి. ఇల్లు సెపరేట్ గా వుంది. అద్దె అయిదు వందలంటున్నారు... అయిదు వందలు ఎలాగూ ఒక్కరు పెట్టుకోవటం కష్టం... అందుకని మీరో గది, కిచెన్ తీసుకోండి. నేనో గది తీసుకుంటాను. యిద్దరం కలసి చెరోసగం కట్టేయవచ్చు... ఏమంటారు?"
    సావిత్రి ఆలోచనలో పడింది.
    అతనెవరో తనకు తెలీదు. ముక్కు మొఖం తెలీని వ్యక్తి పక్కన ఉండటం__సపరేట్ గా వున్నా సరే...
    "తలుపులు మూసివేస్తే రెండూ సపరేట్ పోర్షన్స్ అయిపోతాయ్. ఏం ప్రాబ్లమ్ ఉండదు..." ఆమెను కన్విన్స్ చేయటానికి ప్రయత్నించసాగాడతను.
    "సరే_సాయంత్రం ఆ ఇల్లు చూసి చెప్తాను."
    "ఓ.కే. చూడండి...చూడకుండా ఎలా? ఇల్లు మీకు తప్పకుండా నచ్చుతుందనే నా అభిప్రాయం."
    "ఇంటి అడ్రస్ ఏమిటి?" అడిగింది సావిత్రి.
    అతను టేబుల్ మీదున్న కాగితం తీసుకుని దానిమీద చకచకా ప్లాన్ గీశాడు.
    "పాటిగడ్డ దగ్గర! చాలా ఈజీ కనుక్కోవటం... పారడైజ్ దగ్గర్నుంచి తిన్నగా వచ్చేయటమే.
    "సరే_సాయంత్రం ఆఫీసయ్యాక వస్తాను..."
    "ఓ.కే...నేను మీకోసం ఇంటిదగ్గరే ఎదురుచూస్తుంటాను."
    "సరే_"
    అతను వెళ్ళిపోయాడు.
    సాయంత్రం వరకూ ఆ యింటి గురించే ఆలోచిస్తూ గడిపిందామె. ఏదొక యిల్లు...ముందు తను షిఫ్టయిపోవటం ముఖ్యం__ఇల్లు అతనికెంత అవసరమో, తనకూ అంతే అవసరం! ఎవరిదారిన వారు సపరేట్ పోర్షన్స్ లో వున్నప్పుడు యింకా భయమేముంది? అతనెవరయితే తనకేం ఎలాంటివాడయితే తనకేం?
    కానీ అతనిని చూస్తూంటే 'హరిఓం' టైప్ లాగా కనిపించటం లేదు.
    మర్యాదస్తుడిలాగే ఉన్నాడు.
    సాయంత్రం ఆఫీసవగానే అతనిచ్చిన అడ్రస్ ప్రకారం ఆ యింటికి చేరుకుందామె.
    అతను తనకోసం ఆ సందు మొదట్లోనే ఎదురుచూస్తూ నుంచుని వున్నాడు.
    ఇల్లు చూస్తూనే సంతృప్తి కలిగిందామెకి.
    "కొత్తగా చాలాబాగుంది యిల్లు. ఒకే కాంపౌండ్ లో రెండు మూడు ఇళ్ళున్నాయ్. అన్నిట్లో కుటుంబాలుంటున్నాయ్. అంచేత తనేమీ సందేహించనవసరం లేదు__ అదీగాక అతని ఎంట్రన్స్ ఓ వేపు నుంచీ, తన గదికి ఎంట్రన్స్ మరోవేపు నుంచీ_ అంచేత సమస్య ఏమీ ఉండవు...
    "ఎలా వుందంటారు?" అడిగాడతను.
    "బాగానే ఉంది."
    "అంటే ఆ గదీ కిచెన్ తీసుకుంటారా?"
    సావిత్రి తలూపింది.
    "థాంక్ గాడ్! రక్షించారు. మీరు అవునంటారో కాదంటారోనని గుండెలుగ పెట్టుకుని కూర్చున్నాను మధ్యాహ్నం నుంచీ."
    సావిత్రి నవ్వింది.
    "ఇల్లు మీకెంత అవసరమో నాకూ అంతే అవసరం"
    "అయితే ఎప్పుడు దిగుతారు మీరు?"
    "రేపే. మరి మీరో?"
    "నేనూ రేపే__రేపే లాస్టు డేట్ అని చెప్పాను కదా__"
    "ఓకే. అయితే రేపే మీరు రెండు నెలల అడ్వాన్స్ కట్టాలి"
    "సరే..."
    "వస్తానండీ! ఇంకొక్కసారి థాంక్స్ మీకు!"
    సావిత్రి మందహాసం చేసింది.
    అతను ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు.
    ఇంటికి చేరుతూనే తన బట్టలన్నీ సూట్ కేస్ లో సర్దెయ్యసాగిందామె. తన పుస్తకాలన్నీ కూడా సర్దుతుంటే భాగ్యం గమనించింది.
    మరుక్షణం ఇంటిల్లిపాదీ గుమికూడారు.
    "ఏమిటి సామానులు సర్దుకుంటున్నావ్." అడిగింది భాగ్యం.
    "రేపు వేరే ఇంట్లోకి వెళుతున్నాను__"
    "అంటే ఒక్కదానివే ఉంటావా?"
    "అవును."
    "మరి మీవాళ్ళనడిగావా?"
    "ఎవర్నీ అడగాల్సిన అవసరం లేదు__"
    "రేపొద్దున్న వాళ్ళు మమ్మల్ని అడిగితే?" అన్నాడు మామయ్య.
    "వాళ్ళేం అడగరు__నేనే ఉత్తరం రాస్తాను...
    అంతే ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు.

 Previous Page Next Page