Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 10


    మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా తానే వెళ్ళి ఆటో తీసుకొచ్చి తన సామానంతా అందులోకి చేర్చింది.
    "వెళుతున్నాను__మీరు నాకెంతో సహాయం చేశారు! మీ అందరికీ ఋణపడివున్నాను" అనేసి బయటికి నడిచిందామె.
    ఇంటికి చేరుకునేసరికి అప్పటికే శ్రీరామ్ తన గదిలోకి దిగాడు...పైజమాతో నైలాన్ నవ్వారుతో ఉన్న మంచం మీద పడుకుని పేపర్ చదువుతున్నాడు.
    సావిత్రి ఆటో దిగటం చూడగానే ఆమె వారిస్తున్నా వినకుండా తనే ఆమె సామాను తీసుకొచ్చి ఆమె గదిలో ఉంచాడు.
    "ఇవాల్టినుంచీ వంట మొదలుపెడుతున్నారా?" అడిగాడు తను.
    "లేదండీ! వంటసామాను కొనుక్కోవాలి కదా!"
    "ఓ క్రొత్త సంసారం అన్నమాట!__పడుకోవడానికి మంచం కూడా లేదనుకుంటానే__"
    "లేదు. అదీ కొనుక్కోవాలి!"
    "ఓ.కే. మీకేమయినా కావాలంటే నాకు చెప్పండి తెచ్చిపడేస్తాను"
    "థాంక్యూ."
    అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు.
    అప్పటికప్పుడే రడీ అయి ఆఫీస్ కి బయలుదేరింది సావిత్రి.
    శాంత ఆశ్చర్యపోయింది__ఆమె ఒక్కతే ఓ ఇంట్లో వుంటుందంటే_
    "నాకు హాస్టల్లో ఏమంత నచ్చటంలేదే?" అందామె అసంతృప్తిగా.
    "బాగుంది__హాస్టల్లో సీటు దొరక్క నాలాంటివాళ్ళు ఏడుస్తోంటే__"
    "గత్యంతరంలేక ఉండటమే_"
    "ఎందుకని?"
    "అన్నీ చికాకుగానే ఉంటాయ్! భోజనం, ప్రైవసీ ఎప్పుడూ అందులో ఉండే అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ రావటం_వెళ్ళటం__"
    "అయినాగానీ ఉద్యోగం చేసుకునే ఒంటరి ఆడపిల్లలకది బెస్ట్ ప్లేస్ అనుకుంటాను..."
    "అందులో చేరేవరకూ అలా అనిపిస్తుంది."
    "మధ్యాహ్నం తండ్రిదగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది.
    అందులోని విషయాలు చదువుతూనే నిర్ఘాంతపోయిందామె...తన రెండో చెల్లెలు ఎవరో ఒకతన్ని ప్రేమించిందట...ఇద్దరూ రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుని చాలారోజులు అయిందట. ఆ విషయం ఇప్పుడే తండ్రికి తెలిసిందట.
    సావిత్రి చాలాసేపటివరకూ ఆలోచిస్తూనే ఉండిపోయింది.
    తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళకోసం వాళ్ళ ముగ్గురు చదువు పూర్తవడం కోసం తను ఆలస్యంగా పెళ్ళిచేసుకోవాలనుకుంది.
    ఎందుకంటే తండ్రి రిటైరయ్యేరోజున పాతికవేలు అప్పులు మిగిలాయ్.
    అంత విచ్చలవిడి ఖర్చు__
    ఎప్పుడూ సినిమాలూ, హోటళ్ళూ, టూర్ లూ, పుణ్యక్షేత్రాలు తిరగడమే_అదీ కుంటుంబం మొత్తం_
    వేలకు వేలు ఖర్చయిపోయేవి.
    మొదట్లో తను పట్టించుకోలేదు. రానురాను అన్ని విషయాలూ తెలుస్తున్నకొద్దీ అభ్యంతరం చెప్పసాగింది... తనతోపాటు చెల్లాయిలూ, తమ్ముడు కూడా యెదురుతిరిగారు...
    అది చాలా కోపం కలిగించిందాయనకు. అయినా ఆయన ఖర్చులు మానలేదు.
    అందుకే రిటైర్ మెంట్ సమయంలో వచ్చిన మొత్తమంతా అప్పులకు తీర్చినా ఇంకా అప్పు మిగిలింది.
    సాయంత్రం కోఠీ హోటల్లో తన కార్నర్ సీట్లో కూర్చున్నా ఆలోచనలు ఆమెను వదల్లేదు.
    మొదటి షాక్ పెద్ద చెల్లి విషయంలో తగిలింది.
    తనకు సరైన సంబంధాలు దొరక్కపోవడం వలన తన చెల్లెలికి పెళ్ళిచేయడానికి నిశ్చయించుకున్నట్లు తండ్రి వ్రాశాడు.
    తనకు తండ్రిమీద మొదటిసారిగా అయిష్టం కలిగింది.
    తనకు పెళ్ళిచేయడానికి సరైన ప్రయత్నం చేయకుండానే అలా రాయటం కేవలం ఆయన లోటుని కప్పిపుచ్చుకోవడానికే!
    తనకు పెళ్ళి చేస్తే తల్లినీ తండ్రినీ పోషించేవారెవరున్నారు?
    అందుకని కావాలనే తనకు సంబంధాలు చూడకుండా చూసినట్లు నటిస్తూ, అబద్ధాలు చెపుతూ, కుదురుతాయనుకున్న సంబంధాలు చెడగొడుతూ...ఏదో అడ్డంకి చెపుతున్నాడు.
    ఇవన్నీ తనకు తెలీదని ఆయన అభిప్రాయం.
    కానీ తను అన్నీ గమనిస్తూనే ఉంటుంది.
    "కాఫీ చల్లారిపోయింది..." బేరర్ మాటలతో ఆలోచనల్లోనుంచి తేరుకుంది సావిత్రి.
    బిల్ కట్టేసి రోడ్డుమీదకొచ్చింది.
    జన ప్రవాహం...
    అందులో తనలాంటి ఒంటరి వాళ్ళెవరయినా వుంటారా? అందరూ వుండి కూడా ఒంటరితనం... ఎంత దారుణం.
    ఆటో పక్కనుంచి వెళ్ళింది నెమ్మదిగా.
    లోపల్నుంచి ఓ స్త్రీ బిగ్గరగా ఏడుస్తోంది. పక్కనున్నామె ఆమెను సముదాయిస్తోంది.

 Previous Page Next Page