Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 8


    "షిప్ట్ ఇళ్ళంటే ఏమిటో తెలీదా మీకు?" అది చాలామందికి తెలుసునన్నట్లు ఆమెని ప్రశ్నించాడు అతను.
    "తెలీదు."
    "అంటే మరేం లేదు. ఆ ఇంట్లో పగలంతా ఒకళ్ళు. రాత్రంతా ఒకళ్ళు ఉంటారన్నమాట! ఉదాహరణకి మీకు పగలు ఆఫీసనుకోండి! ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం ఆరుగంటలకొస్తారు... ఆ రెండో వ్యక్తి సాయంత్రం ఆరుగంటల కెళ్ళి రాత్రి డ్యూటీచేసి ఉదయం తొమ్మిదిగంటల కొస్తారన్నమాట. చాలామందికి ఆ పద్ధతి ఇళ్ళు ఇప్పించానీ మధ్య" చెప్పాడతను.
    సావిత్రికి నవ్వుతోపాటు ఆశ్చర్యం కూడా కలిగింది.
    ఇళ్ళ పరిస్థితి మరీ ఇంత ఘోరమా?__ తనెప్పుడూ అనుకోలేదు ఇలా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని.
    "సరే...మీరు రేపు సాయంత్రం రండి. తొంభయి తొమ్మిదిపాళ్ళు మీకు ఇల్లు చూపించే ఏర్పాటు చేస్తాను" ఖచ్చితంగా అన్నాడతను.
    సావిత్రికి నమ్మకం కలగలేదు...అయినా చేయగలిగిందేమీ లేదు...నిరాశతో బయటకు నడిచిందామె. నాలుగడుగులు వేసేసరికి శ్రీరామ్ ఆమెకెదురువచ్చాడు.
    "హలో ఏమన్నాడు రామలింగం?"
    "మామూలే! ఏమీ దొరకలేదట..."
    "మరి మీ ఎమర్జన్సీ పాతిక రూపాయలూ వాపసు తీసుకోవాల్సింది."
    "ఇంకెక్కడిస్తాడు? పోనీండి! అవి పోతే పోయినయ్. కనీసం రేపయినా ఇల్లు చూస్తే బావుండు."
    "వాడిమీద నాకు నమ్మకం పోయిందిలెండి" నవ్వుతూ అన్నాడతను.
    "నేనూ అదే అన్నాను. షిప్ట్ సిస్టమ్ ఇళ్ళు కావాలా అనడుగుతున్నాడు."
    "షిప్ట్ సిస్టమ్ ఇళ్ళా..." ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్.
    "అవును అలాంటివి కూడా ఉన్నాయంట. రాత్రి డ్యూటీలు చేసేవాళ్ళు పగలు అదే ఇంట్లో ఉంటారు. పగలు డ్యూటీలు చేసేవాళ్ళు రాత్రిళ్ళు ఉంటారుట. నాకు నవ్వొచ్చింది ఆ పద్ధతి వింటుంటే."
    శ్రీరామ్ కూడా నవ్వేశాడు.
    "నా ఉద్దేశం ఆ పద్ధతి వీడే కనిపెట్టి ఉంటాడు. మీలాంటి ఎమర్జన్సీ వాళ్ళకోసం."
    సావిత్రి కూడా నవ్వేసింది.
    "సరే నేను వెళ్ళివస్తాను వాడి దగ్గరకు" ఆమెతో చెప్పి రామలింగం ఇంటివేపు నడిచాడు శ్రీరామ్.
    సావిత్రి బస్ స్టాప్ కొచ్చి నిలబడింది.
    పది నిముషాలు గడిచినా బస్ రాలేదు.
    "ఇంకా బస్ రాలేదా అప్పటినుంచి?" ప్రక్కనే వచ్చి నిలబడుతూ అడిగాడు శ్రీరామ్.
    "ఊహు! మీరు మాట్లాడి వచ్చేశారా?" అడిగిందామె.
    "ఆఁ! బుధవారంలోగా ఇల్లు చూడకపోతే నా పాతిక రూపాయలూ నాకివ్వాల్సి ఉంటుందని వార్నింగిచ్చాను." నవ్వుతూ అన్నాడతను.
    "చూస్తాడంటారా?" అడిగింది సావిత్రి.
    "నమ్మకం లేదుగానీ, నమ్మినట్లు నటించక తప్పదు కదా!"
    సావిత్రి నవ్వేసింది.
    "అన్నట్లు ఇక్కడికొస్తూంటే నాకో ఆలోచన తట్టింది. మీరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఎందుకుండకూడదు?" అడిగాడతను.
    "ఆ ప్రయత్నం ఎప్పుడో చేశాను. ప్రస్తుతానికి అక్కడేమీ ఖాళీలు లేవట."
    "ఓహో!" మళ్ళీ ఆలోచనలో పడుతూ అన్నాడతను.
    రెండు బస్ లు ఒకేసారి వచ్చి ఆగినాయక్కడ.
    "ఓ.కే_సీయూ ఎగైన్." అనేసి పరుగుతో వెళ్ళి ఓ బస్ ఎక్కేశాడతను.
    సావిత్రి తను కూడా బస్ ఎక్కేసింది.
    ఆ మర్నాడు ఆదివారం...
    అంచేత ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే గడిపిందామె.
    సోమవారం సాయంత్రం యధాప్రకారం మళ్ళీ రామలింగం ఇల్లు చేరుకుందామె.
    "వచ్చేశారా! కూర్చోండి__ఆ లొకాలిటీ అంతా గాలించేశారు మా కుర్రాళ్ళు. ఒక్క ఇల్లు కూడా మనక్కావలసిన రేంజ్ లో దొరకలేదట. అందుకని కొంచెం దూరంగా ఎక్కడయినా ప్రయత్నం చేయమంటారా, వద్దా! చెప్పండి!" ఆమెను చూస్తూనే మొదలెట్టాడు రామలింగం.
    "ఎక్కడో చోట...ముందు ఉండటానికో ఇల్లు దొరికితే చాలు." కోపంగా అందామె.
    "అలా కోప్పడకండి! సరే_మీరు రేపు రండి! ఈలోగా మా కుర్రాళ్ళు ఓసారి వేరేచోట్ల తిరిగేసి వస్తారు."
    సావిత్రి బయటకు నడిచింది. గడప దాటగానే ఎదురొచ్చాడు శ్రీరామ్.
    "ఏమయినా శుభవార్త చెప్పాడా రామలింగం?" అడిగాడతను.
    "ఊహు! మామూలు వార్తలే! అంది నవ్వుతూ.
    "అయితే నా పనీ గోవిందా అన్నమాటే!" అతను కూడా నిరాశ పడిపోయాడు.
    సావిత్రి అక్కడినుంచి త్వరత్వరగా వెళ్ళిపోయింది బస్ స్టాఫ్ వేపు. ఆ రాత్రంతా ఆమె ఏవేవో ఆలోచనలతోనే గడిపివేసింది. ఈ పద్ధతిలో తనకు ఇప్పట్లో ఇల్లు దొరకడం సంభవం! అంతవరకూ చేయగలిగిందేమిటి? శెలవు పెట్టి ఇంటికెళ్ళిపోవాలా?

 Previous Page Next Page