Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 9


    'ఇది వేళాకోళం అంటుందేమిటి? గాది రాజుగారి సంబంధం వచ్చినప్పుడు కట్నాల సంగతి మనం కాదు కాబోలు, నిష్కర్షగా చెప్పి వాళ్ళను 'వచ్చిందేదారి' అని అనిపించింది.'
    'అవును. మొదట నగల మాట వారు నిష్కర్షగా అడిగితే నేను లాంఛనాల మాటడిగాను. మీరు బెల్లంకొట్టినట్లు మాట్లాడక ఊరుకుంటే, ఇంత నిష్కర్షగా అడిగేవాళ్ళ సంబంధం ఇష్టంలేక ఆయెత్తు యెత్తాను. అది తప్పటే అక్కయ్యా?'
    'తప్పనా ఏమి? జమిందారుకు వియ్యపరాల నౌతాననే సంతోషం చేత, కతికితే అతకదని విచారంలో మునిగి ఉన్నావనుకున్నాను' అని సుబ్బారాయుడు గారు నవ్వగా జానకమ్మ గారు, శ్రీరామమూర్తి, లక్ష్మీనరసమ్మ గారు నవ్వుకున్నారు.
    శ్రీరామమూర్తి: ఇంతకూ ఎక్కడోయి మకాం, రాజమండ్రిలో?
    లక్ష్మీపతి: శ్రీనివాసరావు గారింట్లో.
    శ్రీరా" ప్లీడరు శ్రీనివాసరావుగారేనా? జమీందారుగారూ, ఆయన జీవికాజీవులే.
    సుబ్బారాయుడుగారు: అమ్మయ్యా!
    జానకమ్మగారు: మళ్ళీ మొదలెట్టారూ?
    సుబ్బా: తర్వాత ఏం జరిగింది?
    జన: మీకిప్పుడాదుర్దా వచ్చిందేమి?
    శ్రీరా: ఉండవే అమ్మా! లక్ష్మీపతిని చెప్పనియ్యి.
    లక్ష్మీ: నారాయణా, నేనూ వెళ్ళి పిల్లను చూశాం. అమ్మాయి చాలా అందంగా ఉంది. మంచి తెలివైన పిల్ల. బాగా చదువు చెప్పిస్తున్నారు. సంగీతంలో నిధి.
    జన: చిన్నబాబు ఈ మధ్య మరీ బాగా నేర్చుకొన్నాడన్నారూ!
    లక్ష్మీ: అతనూ ఫిడేలు వాయించాడు.
    లక్ష్మీపతి బావమరిదివంక జూచినాడు. ఇంతవరకూ హృదయములో నానందరాగములు వినుచున్న నారాయణరావు, చిరు బొమముడిలో బావగారివంక జవాబు పరపినాడు.
    లక్ష్మీ: వారంతా మంచిరోజు చూచి మామగారితో మాట్లాడ్డానికి వస్తారనుకుంటాను. జమిందారుగారు బావంటే వెఱ్ఱిపడిపోతున్నారు.
    జమిందారు గారి యాడంగులు తెరవెనుక నుండి నారాయణరావును చూచిరనియు, దాను బాలిక నింగ్లీషు భాషలో తెలుగులో, నితర విషయములలో బరీక్ష జేసితిననియు, లక్ష్మీపతి చెప్పగా నందఱు వినిరి. ఎవరి యాలోచనలు వారి నలముకొన్నవి.
    సావిట్లో సుబ్బారాయుడు గారు పెద్ద కుమారునితో సంబంధము విషయమై రాత్రి రెండు జాములవరకు ముచ్చటించి, తమకా సంబంధము కాకుండుటయే మంచిదని నిశ్చయించినారు. లక్ష్మీపతి దక్షిణపు గదులలో తన గది జేరినాడు. నారాయణరావు తల్లికడ జేరి జమిందారు గారిని గురించి ముచ్చటించి, తండ్రిగారితోపాటు తనకై యారుబయట వేసిన మంచముపై పవళించి నిదురపోయినాడు.
    నాల్గురోజులయిన వెనుక పరమేశ్వరమూర్తి వ్రాసిన లేఖయు, కాకినాడ నుండి రాజారావు వ్రాసిన లేఖయు వచ్చినవి.
    'నేను కవిత్వం వ్రాయలేను. అయినా కవిత్వం అంటే నాకు పరమ ప్రీతియన్న సంగతి తెలుసును గదా. నువ్వు వ్రాసిన ఉత్తరం నాకు గల్గించిన సంతోషం. నేను పద్యాలు వ్రాసేవాణ్ణే అయితే నూరు పద్యాల్లో గుప్పి వేసేవాణ్ణి. లెక్కలవాణ్ణి కాబట్టి రెండుముక్కల్లో నా అభిప్రాయం తెలుపుతాను.
    ఒకటి _ జమిందారు గారి కుటుంబానికీ మీ కుటుంబానికీ పొత్తు కలవదని మనం ఊహించడం న్యాయం.
    రెండు _ జమిందారీ కుటుంబంలో నిష్కళంకమైనట్టినీ, నిర్మలమైనట్టినీ, ప్రేమపూరితమైన హృదయాలు ఉండడం అరుదు.
    మూడు _ పెళ్ళికుమార్తెకు కూడా నువ్వంటే ప్రేమ కుదరడం కొంచెం కష్టం.
    నాల్గు _ అంత గొప్ప కుటుంబాలలో, నాగరికతలో మునిగివున్న వాళ్ళలో ఆరోగ్యము చాలా హీనముగా ఉంటుంది. నీకున్న బల సంపదకి బలహీనురాలై జన్మపొడుగునా ఏవో రోగాలతో మూల్గే బాలిక భార్య కావడం ప్రశస్తం కాదు.
    అయినా ఈ యాపత్తులకు పూర్వపక్షాలు ఉన్నాయి. అవికూడా చాలా ముఖ్యమైనవే.
    ఒకటి _ జమిందారుగారు నీ విషయమై విపరీతమైన ప్రేమతో ఉన్నారు. తక్కినవాళ్ళెట్లా ఉన్నా, ఆయన ఒక్కడు చాలు రెండు కుటుంబాలూ సరిగ్గా ఉండడానికి. మీ కుటుంబము ఎప్పుడూ తప్పు చెయ్యదు.
    రెండు _ నువ్వు చక్కని వ్యక్తిత్వము కలవాడివి. అందమైన వాడివి. జ్ఞానము కలిగిన మహారాజు కుమార్తెనైనా వలలో వేసికొనే వ్యక్తిత్వము ఉందని నా అభిప్రాయం.
    మూడు _ నీ ఉత్తరాన్ని బట్టి చూస్తే, బాలిక చాలా ఆరోగ్యవంతురాలని స్పష్టముగా ఉంది. జమిందారుగారు ఆరోగ్యవంతులు.
    'కాబట్టి నాకు జమిందారు గారి సంబంధములో ఏమి లోటు కనబడదు. నేను ఉత్తరములో ముఖ్యమైన మూడు విషయాలకన్న, అలంకారములతో అసలే రాయలేను. నా మాటలు కటువుగా ఉంటాయేమో! నేను రెండు రోజులలో బయలుదేరి వస్తాను. ఈలోగా జమిందారు గారి కుటుంబము విషయమై దర్యాప్తు చేసివస్తాను.'
                                                                                   ఇట్లు,
                                                                         నీ ప్రియమైన రాజారావు
    'ఒకనాడు ఐరోపా ప్రపంచాన్నితన పాదాక్రాంతము నొనర్చిన మహోత్కృష్టుడైన 'క్రిక్టాన్' ఉన్నాడు. నేడు నారాయణుడున్నాడు.
    'నీకు పాదములకాడ తన సర్వస్వముతో తన్ను ధారపోసుకొనుటకు ఏ బాలయున్నూ తగదని నా మనవి.
    'నిన్ను ద్వాహమై ఆ బాలిక తన బ్రతుకు సువాసనాలహరిలో లీనమొనర్చుకోవాలి.
    'చిన్నతనాన్నుంచి నేను కలల్లో తేలియాడేవాణ్ణి. సౌందర్యోపాసనామయమైన నా బ్రతుకు అందానికే దూరమైంది. నా పరుషత్వ సంపద, ఉత్కృష్ట సౌందర్య స్వరూపమైన యోషారత్నము పదముమ్రోల సమర్పింప తలచుకొన్న నా తపస్సు నిర్జల భూమిలో నూయి త్రవ్వినట్లయినది. సర్వకళా స్వరూపమైనటువంటి నా హృదయం చివికిపోయింది.
    'కుంచె కొసల్ విచిత్రలత గూర్చి మనోహరవర్ణభంగి మూర్తించి, పరీమళావృత శరీరరుచుల్ పొదివించి కంఠమున్! పంచమరాగ గీతికల పల్కితి, తేనెలు వాకలూర, మధ్వ్యంచిత దివ్యసుందర సుధామయ భావములల్లు వెట్టుచున్.'
    'ఆ భావం భావమాత్రమే అయింది. అలాంటి సందర్భములో నీ అదృష్టం గమనించుకో. నీ హృదయాశయమైన బాలికామణికై ఎదురుచూడవచ్చును. నువ్వే ధైర్యంగల మగవాడివైతే మహాత్మాగాంధీగారు ఉపదేశమిచ్చినట్లు విధవా వివాహం చేసుకొని ఉందువు. విగత భర్తృకలైన బాలలు విద్యా సంపన్నులు, సుందరీమణులు పెక్కుమంది ఉన్నారు. నీకు ధైర్యము లేదు. సరేనయ్యా! ఎలా వచ్చిందో సంబంధరూపంగా వరంలా ఒక బాలిక, విద్యా స్వరూప, కళాకోవిద, అద్భుత సౌందర్యమూర్తి! నువువ్ అదృష్టవంతుడవు. 'ఆలోచించక సంబంధం ఒప్పించు. నేనే దగ్గర ఉంటే! చాలా బాగుండేది.
    'షెల్లీ ఏ కోర్కెకై సంఘ బహిష్కారం పొందాడో, కీట్సు ఏ అందరాని ఫలముకై ఆశించి ఆశించి లోకాంతరాలు చేరాడో, డాంటీ ఏ ఉత్కృష్ట భావంతో ఆనందమయమైన కవిత్వం సృష్టించాడో, రొజెటీ ఏ దివ్యపథములో వసించి భగ్నమైన ఆ బ్రతుకులో తన గీతికాగుళుచ్చము బాలి ఇచ్చినాడో, ఆ మహా ప్రణయము నీకు వరమైతే హామ్లెటులా 'అవునా కాదా?' అన్న సంశయంలో పడబోకు.
    'సరే. నేను రెక్కలు కట్టుకుని మా రాణీ గారితో వస్తున్నా. వదలి ఉండడం కష్టం గనుక బాబయ్యగారి అనుమతిమీద వచ్చి, పెళ్ళితంతులన్నీ నడిపిస్తాం. సూరీడు, కన్నతల్లి, పిల్లకాయలు, నువ్వు వచ్చావని మురిసిమురిసి విరిసిపోతారు.
                                                                      నేను నీయొక్కే! పరం'

 Previous Page Next Page