కలెక్టరుగారు తహసీల్దారు గారు, రాజమహేంద్రనగరములోని పెద్ద వకీళ్లు, చెన్న పట్టణము నుండి జమిందారుగారి మేనల్లుడు ఆనందరావు గారు, పదిమందినీ కిటకిటలాడుచు నౌకర్లతో, చాకర్లతో, ఒక్కసారిగా సుబ్బారాయుడుగారి ఇంటికి వచ్చినారు. సుబ్బారాయుడు గారు, చుట్టములకని వేరే కట్టియుంచిన మేడ హాలులో పడక కుర్చీలమీద, పేము కుర్చీలమీద, దిండ్ల కుర్చీల మీద నందఱు నధివసించినారు. కొత్తపేట డిప్యూటీ తహసీల్దారుగారప్పుడు 'సుబ్బారాయుడు గారూ! కలెక్టరు గారు, తహసీల్దారుగారు వీరమరూ తమతో ముఖ్యమైన పని ఉండి వచ్చారు. తమరది కాదనక నిర్వర్తించడం మా కందరికీ చాలా సంతోషప్రదమైన సంగతండి.'
సుబ్బా: చిత్తం. తమరు సెలవిస్తే నేను కాదనేవాణ్ణి ఎప్పుడూ కాదండి.
డి.కలె: తొందరపడి మాట ఈయకండి. మాట ఇస్తే మేము వదలం.
సుబ్బా: చిత్తం.
తహ: సెలవియ్యండి ఆనందరావు గారూ! వారు జమిందారు గారి మేనల్లుడు గారు. చెన్నపట్నంలో పెద్ద న్యాయవాదులు.
సుబ్బా: చిత్తం, నేనెరుగుదునండి.
ఆనం: శ్రీరామమూర్తి గారు మాకు పూర్వ స్నేహితులు. మాకేప్పుడు అప్పీళ్ళు పంపిస్తూనే ఉంటారు. వారు పట్నం వస్తే నన్ను చూడకుండా వెళ్లరు.
శ్రీరా: ఆనందరావుగారు నేను 'లా' కాలేజీలో ఒక్కసారే చదువుకున్నాం. ఇన్నాళ్ళకు వారు మా యింటికి విచ్చేసి, మా ఆతిథ్యం అంగీకరించే భాగ్యం మాకు కలిగింది.
డి.త.: అలా అనకండి. ముందర మా ఇంట్లోకి ఏర్పాటులన్నీ అయినాయి. వారు మీ యింటికి రావడానికి చాలా అభ్యంతరాలున్నాయండి శ్రీరామమూర్తిగారూ!
ఇంతలో ఊరిలోని పెద్దలు నలుగురు నాహూతులయి వచ్చి, యథోచితాసనముల నధివసించిరి.
ఆనం: మా మామయ్య గారు, వారి ద్వితీయ పుత్రికను తమ ద్వితీయ పుత్రునకిచ్చి వివాహం చేయ సంకల్పించుకుని మమ్ములనందరిని తమ్ము ప్రార్థించుటకై పంపినారు. తమరు ఆమోదించవలెనని మేమంతా కోరుతున్నాము. వారి కోర్కెను పాలించవలసిందని మనవి.
సుబ్బా: చిత్తం. ఎంతమాట! వారు జమిందారులు. మేము సామాన్య గృహస్థులం. ఆగర్భ శ్రీమంతుల పిల్లను నా కుర్రవానికి ఇస్తామని మీరయితే అనుగ్రహించినా నేను చూస్తూ చూస్తూ ఎలా సాహసించను!
ఆన: తమరలా సెలవీయకండి. భాగ్యభోగ్యాలకేమి? వారికున్నది వారికుంది. మీకున్నది మీకుంది.
డి.త.: పేర్కొకటి లోపం గాని మీరు మాత్రం తక్కువ వారా? మీ ఐశ్వర్యం ఏ జమిందారీకి తీసిపోతుంది?
సుబ్బా: తమరదొకటి పెట్టకండి. మా ఐశ్వర్యమెంత? మేమెంత? ఏదో అన్న వస్త్రాదులకు లోపం లేకుండా గుట్టుగా కాలక్షేపం చేయడం తప్ప నేనంతటివాణ్ణి కాను. అందులో జమిందారీ సంబంధాలకు తూగే తాహత్తు ఎంతటి సంసారికయినా ఉండదు. అందుకనే పెద్దలు 'సమయో రేవశోభతే' అన్నారు.
డి.కలె: మీరు సమానులు కారంటే మేమంతా తెలివిమాలిన వాళ్ళమవుతామే కాని ఇతరమేమి లేదు. ఈ వినయ సంపద మిమ్మల్ని సమానులనే కాదు, అధికులను చేస్తూ ఉంది. ఆ మాటంటే మళ్ళా మీ మొదటి ఆక్షేపణే సిద్ధిస్తుంది కాబోలు! భేరీ జోట్టడమే గాని మేము మాకు మాటలు చెప్పలేము. వారు జమిందారులనే సందేహం మీకు సుతరామూ అక్కరలేదు. వారి యోగ్యతా, ప్రజారాధన తత్పరతా మీరైనా ఎరగంది కాదు. అనవలసి అంటారేకాని, జమిందారు గారు ఎలాగైనా మీవంటి సంపన్న గృహస్థులతో వియ్యమందాలని కుతూహలపడుతున్నారు. మేమంతా అందుకు ప్రేరకులం, అనుమోదకులం. మీరు మాట తీసివేయరని ఆశపడి వచ్చాం.
అంతలో నా యూరి కరణము వెంకటరాజుగా రందుకొని, 'సుబ్బారాయుడు బావగారు! మీరు సందేహించకండి. మీ ఉభయులకు సర్వవిధాలా తగి ఉంటుంది సంబంధం. బంధుకోటి కందరికీ వాంఛనీయమైనది కూడాను. జమిందారుగారనగా రత్నాకరుడివంటివారు. ఆ శ్రీమహాలక్ష్మీ మీ అబ్బాయిని వెదుక్కుంటూ వస్తే కాలొడ్డి అతిలౌక్యం చేయకండి బావగారు. కలెక్టరు గారు, తాసిల్దారుగారు కూడా యింతగా చెబుతూంటే మీరు వెనకాడకండి' అన్నారు. సుబ్బారాయుడుగారికీ యనురోధ పరంపరలో ఏమి చేయడానికి తోచక, 'నేను వారిమాట తీసివేయాలని కాదు. అల్పుడనని జంకుతున్నాను' అనుచు పుత్రునివంక నొకచూపు సారించిరి.
ఇంతలో మరల తహసీల్దారు గారు దొరక బుచ్చుకొని 'మీరు అల్పులో, అధికులో ఆ విషయం మాకు వదలిపెట్టండి. విశ్వలాపురం జమిందారు గారు పేరుకే గాని ఆచార వ్యవహారాల్లో జమిందారులు కారు. కాబట్టి వారితో యెత్తు లెత్తలేమనే సంశయం మీకక్కరలేదు. అయినా మీరు పుచ్చుకోనేవారే గాని, ఇచ్చేవారు కానప్పుడు మీకాభయమక్కరలేదు' అన్నారు.
సుబ్బా: చిత్తం, పుచ్చుకోడానికి కూడా అర్హత ఉండాలి. వారు ఏనుగులను, గుర్రాల్ని, దాసదాసీ జనాన్ని ఇస్తే వాటిని భరించడానికి కూడా శక్తి ఉండదు మావంటి వాళ్లకు.
వెంక: ఈ పేదరుపుల కేమిగానండి, బావగారు తల యెగరవేయండి. నేను అక్కగారికి చెప్పి వస్తాను. రావోయి, అల్లుడూ!
అంటూ శ్రీరామమూర్తితో ఆయన జానకమ్మగారికడకేగెను. ఇచట సుబ్బారాయుడుగారేమియు పాలుపోవక, 'తమవంటి వారందరూ యీ స్వల్పకార్యం మీద నాయింటికి దయచేయడం, నేను తమ ఆజ్ఞకు అంజాయించడం నాకెంతో కష్టంగా వుంది. జమిందారు గారు మా కుర్రవానికి తమ అమ్మాయినిస్తామనడం ఒక యెత్తూ, దిగ్దంతుల వంటి తమందరూ, ఆనాడు సప్తర్షులు హిమవంతుడి దగ్గరకు వెళ్లినట్టుగా రాయబారం రావడం ఒక యెత్తున్నూ. ఇంతకూ విధిసృజన వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉండడం వల్లనే మీవంటివారు పూనుకోవడం కలిగింది' అంటూ ఉపచారవాక్యాలు చెప్పుచుండగా వెంకట్రాజు గారు తిరిగివచ్చి, వియ్యపురాలితో పెండ్లికొడుకుతోగూడ మాటలాడి వచ్చితిననియు, వారందఱకు నంగీకార మేననియు చెప్పి 'ఏమంటున్నారు, మా బావగారు? ఇక నెలాగూ యిది తప్పేది గాదండోయి, మెడలు విరిచి అంటగట్టడమేగాని' అనుచు మేలమాడిరి.
సుబ్బా: తథాస్తు. కానివ్వండి. ఉభయత్రా పెద్దలు, మీ అందరి మాటకు నేనుమాత్రం ఎదురుచెపుతానా!
అన్నంతలో అందఱును 'శుభం, శుభం' అనుచు మందహాసము లోనర్చిరి. వెంటనే సీతారామాంజనేయ సోమయాజిగారొక యాశీర్వచన పనస నారంభింప, సభలోనున్న తక్కిన బ్రాహ్మణోత్తము లందుకొనిరి.
పిమ్మట వెంకట్రాజుగారు, డిప్యూటీ కలెక్టరు గారితో, 'చిత్తం, యిక నేమున్నది తరవాయి? మంచిరోజు చూచి మనవాళ్ళు రాజమండ్రికి ముహూర్త్ నిశ్చయంకొరకు వెళ్లిరమ్మని సెలవాండి' అనెను.
శ్రీనివాసరావుగారంతట 'మరేమిటంటే, మళ్ళా ఎప్పుడో చూడడమెందుకు? ఉండవలసిన సిద్ధాంతులందరు ఇక్కడనే ఉన్నారుగా విచారించండి 'శుభస్య శ్రీఘ్ర'మన్నారు. మొన్న నారాయనర్రావు గారు రాజమండ్రి వచ్చినప్పుడు, నేను పుట్టిన తారీఖు అడిగితే, పెట్టెలోంచి, మరేమిటంటే, జాతక చక్రం తీసి ఇచ్చారు. జాతకం చాలా బాగుందన్నాడు మా సిద్ధాంతి గారు. అమ్మాయి జాతకానికి కూడా చాలా బాగా సరిపోయిందన్నాడు. రెండు జాతకాల్ని బట్టి ముహూర్తం రహితం చేయించడం ఉత్తమం. ఏమండీ సిద్ధాంతి గారూ!