'అంటే ఈ వివాహం వల్ల నాకూ నా కుటుంబానికి ఎడబాట్లయ్యే విధివ్రాత తటస్థిస్తే నాకు జన్మాంతం తీరని వ్యాధే కదా! పోనీ మా అన్నయ్యకి మల్లే నేనూ ఉద్యోగరీత్యా పరదేశంలో ఉంటానుగనుక పర్వాలేదు అనుకుందాం (అలా అని అనుకోవడం నాకు చాలా కష్టంగా తోచినది). అయినా ఆ బాలిక నన్ను ప్రేమించక రాచపట్టిననే గర్వంలో మునిగి ఉండేందుకు ఎక్కువ సావకాశాలుంటాయనుకో! అప్పుడు నా బ్రతుకు శూన్యమవుతుంది. ఆలోచన చేయలేకుండా ఉన్నానురా పరమం.
'ఈ పిచ్చి ఉత్తరాన్ని చూసి నన్ను పిచ్చివాణ్ణి అనుకున్నా సరే! ఈ సందర్భంలో నువ్వు దగ్గర లేకపోవడం, నాలోని చైతన్యం మాయమైనట్లుగా ఉంది. నువ్వూ ఇప్పుడే కొత్తగా చేరుకొన్నావు నీ సంసారాన్ని. ఇంతలోనే మళ్ళీ వానప్రస్థాశ్రమం స్వీకరించరా అని ఎట్లా అన్ను? జాగ్రత్తగా ఆలోచించి జవాబు రాయి. డాకుదొరకి కాకినాడ రాశాను. మా యిద్దరే నా కేడుగడలు.
'ప్రేమనేది నిజమేనని, అది పుస్తకాల్లో మాత్రం ఉండే వట్టి బూటకమనేవారి వాదన అనుభవరహితమనీ మనం ఇదివరకే అనుకున్నాం. అట్లాంటి ప్రేమ నన్నిప్పుడావరించుకుందోయి. ఆ బాలిక నా హృదయాన్ని కాలుడు సత్యవంతుని జీవాన్ని బొమ్మలో లాగుతున్నట్లు లాగివేసిందిరా! అది నిజమైన ప్రేమకావచ్చును. లేక వట్టి వాంఛేనా కావచ్చును. కాని బాలికను నేను కరగ్రహణం చేయనినాడు నాజన్మ ఎడారి అని భావించుకుంటున్నా, ఏమో! ఆమెను చూడ్డానికి వెళ్ళని మునుపు పిల్ల తెల్లగా పాలిపోయి ప్రాణం లేకుండా క్షయరోగం పట్టి పీడించేవ్యక్తిలాగు, ఈదురో అంటూ ఉంటుందనీ, ఏదో కాస్త సంగీతం, కాస్తన్నర ఇంగ్లీషు, అరకాస్త తెలుగు, పరకకాస్త సంస్కృతం బలవంతంగా నేర్చిన చిలకల్లే ఉంటుందనీ, కన్ను, ముక్కు, గడ్డం విభేదం లేకుండా ఉండే మూర్తి అయివుంటుందననీ, మా బావా, నేనూ అనుకున్నాం కాని, ఆమె మానవ బాలిక కాదురా, మన్మథ సృష్టిరా! సరస్వతి సపత్నిరా!
'ఏమి సంగీతం, ఏమి మాధుర్యం! ఆమె మూర్తి దాల్చిన కళాధిదేవతంటే నమ్ము. మేము అక్కడ కరిగిపోయాము. లోకోత్తరుడగు శ్రీరామయ్య గారి అంతరంగిక శిష్యురాలనని ఫిడేలు వాయిద్యంలో చాటుకుందిరా.
'బా బావ, భాషలు తదితర పాండిత్యం సానపైపెట్టి ఒరచిచూచాడు.
'ఆ బాలిక హృదయం చూరగొనాలి అని తన్మయుణ్ణయి, మతి చలించిన నాకు తీవ్రావేశం కలిగింది. ఆ బాలిక ఫిడేలు అందుకున్నాను. చెన్నపట్నంలో నేను నేర్చిన విద్య, వెంకటస్వామి నాయని మాధుర్యంతో, దక్షిణా పథాలు తిరిగి గమనించి హృదయస్థం గావించుకొన్న గోవిందస్వామి పిళ్ళే, చౌడయ్యల చమత్కృతులతో గుప్పేశాను సంగీతం వెన్నెల. ఆ రోజున ఎందుకైనా మంచిదని మహ అద్భుతంగా వేషం వేశాను. ఎలాంటి వస్త్రము అలంకరించానో నువ్వు ఊహించి ఉత్తరంలో రాయి.
'మరి ఆ బాల నన్ను విస్తుబోయి చూసిందని నా అభిప్రాయం. మా బావ అభిప్రాయం అదే!
'జవాబుకు ఎదురుచూస్తూ నువ్వు దగ్గరలేవని పరితపించే నీ నారాయుడు.'
'ఔనా, కాదా?'
ఇంతలో లక్ష్మీపతి భార్య రమణమ్మ పిల్లవాని నెత్తుకొని బండి దిగినది. అన్నయ్య వచ్చాడూ! ఎంతసేపయింది అన్నయ్యా నువ్వు బండి దిగి? మండపల్లిలో వెంకట్రాయుడు మామయ్యగారి యింట్లో మాట్లాడుతూ ఉంటే పొద్దు పోయింది. ఇంతలో బాబు ఏడ్చాడు. నాలుగు వేడి మెతుకులు పెట్టి బయల్దేరాను. అత్తయ్య ఒకటే బలవంతం.'
'బావా, నేనూ వస్తున్నామని అత్తయ్యతో చెప్పడానికి సిగ్గుపడ్డావేమిటి? ఇందాకటినుంచి ఇంకా రాలేదని బావ ఒకటే చూడ్డం గుమ్మం వైపు!'
'నారాయణ గారూ, అలా చూసేరోజులు వచ్చాయి. నేను చూసేవాణ్ణో కాదో నీ హృదయానికి తెలవదురా వెఱ్ఱివాడా!'
'ఇలా ఇవ్వవే బాచిగాణ్ణి! రాడేం? కొత్తవచ్చింది! ఏడుపు మొఖం పెట్టాడు. మీ నాన్న వచ్చాడురా. సూరీడూ! బాచిగాడికి తెచ్చిన గిలకలు, బొమ్మలు ఇలా తేవే. ఇవిగోరా! ఆరీ నీ! లంచం ఇస్తే వచ్చాడు. బావా వీడు ఓవర్ సీయర్ పని చేసేటట్టున్నాడోయి, అసాధ్యుడు. ఆ బూరా ఇయ్యి, నీ దగ్గరకు వస్తాడు. ఆ! వెళ్ళాడూ! వీడు తప్పకుండా, లంచగొండే! అచ్చా. 'బాచిగాడు ఆటలో కెవ్వుమని కేరింతలాడినాడు. తండ్రి చేతుల్లో ఎగురుట ప్రారంభించినాడు. లక్ష్మీపతి తొనలు తిరిగి పండువలె నున్న తన కుమారుని ముద్దిడుకొని సూర్యకాంతం చేతికిచ్చినాడు.
'బాచిగాణ్ణి నాకియ్యవూ సూరీడత్తయ్యా!' అని శ్రీరామమూర్తి తనయ, జానకి, బాలకు నెత్తుకున్నది. చాకలివాడును, పనికత్తెయు వేడినీళ్లు తోడగా సుబ్బారాయుడు గారు, లక్ష్మీపతి, శ్రీరామమూర్తి, నారాయణరావు స్నానములకు బొయినారు. సూర్యకాంతం అన్నగార్లకు, బావగారికి సబ్బుబిళ్ల లందించినది. మంగలివా డొడళ్లు తోమినాడు. రమణమ్మ తెల్లని తువాలు మడత లందీయ, దుడుచుకొని, యామె యందిచ్చిన పట్టు తాపి తాను ధరించి మువ్వురు వంటవసారా నంటియున్న పడమటింటిలో యథాస్థానముల నధివసించిరి. సుబ్బారాయుడు గారు కోడ లందిచ్చిన యంగ వస్త్రము చే దడియార్చికొని, పీట పైనుంచిన మడిపంచెల జతలో నొకదాని గట్టి, సంధ్యావందనము ప్రారంభించినారు.
జపము కొంత యగుటయు, వడ్డన ప్రారంభించవచ్చునని తన మామూలు పద్ధతిని విస్తరివైపు చేయిచూపి తలయూపినారు. జానకమ్మ గారి అక్కగారు వడ్డన ప్రారంభించి పూర్తిచేయునప్పటికి, 'చతుస్సాగరపర్యంతం' అని ప్రారంభించి గోత్ర ప్రవరులు పఠించి, సంధ్యావందనము ముగించిరి. అందరు నొక్కసారిగా నాపోశనములు గ్రహించినారు. భోజనములు కొంత వరకైనవి. పచ్చడి కలుపుకొనుచు సుబ్బారాయుడు గారు తమ యల్లుని దిక్కు మొగమై 'మీరు ఆలస్యంగా వచ్చారు. బస్సు చెడిపోయిందా యేమిటి, దారిలో!' అని సంభాషణ ప్రారంభించెను.
మామగారన్న లక్ష్మీపతికి మిక్కిలి గౌరవము, భయము, భక్తి. అల్లుడన్న పరమ ప్రేమ మామగారికి. 'కాదండి, విశ్వలాపురం జమిందారు గారు తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు గారు రాజమండ్రిలో ఉన్నారు...'
'అవును, ఆయన చాలా మంచివాడు. శాసనసభలో ఎప్పుడూ రైతుల తరఫున మాట్లాడుతూ ఉంటాడు. గాంధీగారి శకం రాక మునుపు, పేరు ప్రతిష్టలతో పూజింపబడే ఆంధ్ర నాయకులలో ఆయన ఒకరు. ఆయన్ని బాగా ఎరుగుదును. జమీందారైనా నియోగులలో చాలా గౌరవంగా జీవిస్తున్న నాయకుడు.'
'ఆయనకు వివాహం కావలసిన బాలిక ఒకర్తె ఉన్నది.'
'ఊఁ!'
జానకమ్మ గారు దొడ్డిలో చల్లగాలికి కూర్చుండియున్నది. యీ మాట విని లోనికి జూచినది.
'మా చిన్న బావకు తమ కుమార్తెనిద్దామని వారికి సంకల్పం కలిగింది. వారూ మేమూ బెజవాడ ప్లాటుఫారంలో తారసిల్లాము. ఆయన నారాయణ బావ సంగతి ఎలా గ్రహించాడో మమ్మల్ని బలవంతం పెట్టి రామమండ్రిలో ఆపుజేశారు.'
'వాళ్ళింట్లోనే!' అని జానకమ్మ గారు అల్లుణ్ణి పృచ్చ జేసినారు.
'అబ్బా! అప్పుడే జమిందారుల పేరు చెప్పేటప్పటికి ఒక్క గంతేసింది. బంగారపు తాళ్ళెట్టి ఈడ్పించుకోవాలి. బంగారపు చీపురుకట్టతో కోట్టించుకోవాలి.'
'ఊరుకుందురూ! మీరెప్పుడూ వేళాకోళం చేస్తూనే ఉంటాను.'