అయిదు నిమిషాలన్నా గడిచి ఉండదు. బయట్నుంచెవరో "రాధాప్రియగారూ!" అంటూ పిలిచారు.
రాధాప్రియ ఉషారుగా లేచింది. తనకి చాలా ఇష్టమైన గొంతు అది. గబగబా వెళ్ళి తలుపు తీసింది.
విమలాదేవి.
సుజాత వాళ్ళ యింటికి ఇటువైపు పోర్షన్ తమది అవుతే, అటువైపు పోర్షన్ విమలాదేవిది. విమలాదేవి సుబ్బారావు భార్య ఇద్దరికి ఎడతెగని స్నేహం. అవకాశమున్నప్పుడల్లా ఇద్దరూ కలుసుకుని పసందయిన కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా మాట్లాడకపోతే వాళ్ళకి తోచదు, జీవితంలో ఏదో లోపించినట్లుగా ఉంటుంది.
"నిద్రపోతున్నారా?" అనడిగింది విమలాదేవి లోపలకు వస్తూ.
"నిద్రా నాబొందా? ఈ ముసలిదాని పిలుపులతో నిద్రకూడానూ"
"అవును. మీ అత్తగారెంతకీ చావదేమిటి?"
"అదే నాకూ అర్థం కావటంలేదు. ఏ జబ్బూ లేకుండా తిని తిరుగుతున్నవాళ్ళు కళ్ళముందు టపటప రాలిపోతున్నారు. సంవత్సరాల తరబడి తీసుకుంటూ ఈ ముండ చలనం లేకుండా ఉంది."
ఇద్దరూ ఎయిర్ కూలర్ ముందు మంచంమీద ప్రక్కప్రక్కన కూర్చున్నారు.
"మొన్న మీ యింట్లో పేరంటం బాగా జరిగిందండి" అంది విమలాదేవి.
"డబ్బు కూడా బాగా ఖర్చయింది. అయినా సంప్రదాయం కదా తప్పదు" అంది రాధాప్రియ కొంచెం విచారంగా.
"ప్రజంటేషన్లూ అవి బాగానే వచ్చినట్లున్నాయి."
"ఏదో వచ్చాయి. అనుకున్నంతగా రాలేదు."
"అవునూ. ఈవిడుందే...సుజాత మహాతల్లి...ఈవిడ గారేమిచ్చిందేమిటి?"
"ఏమిచ్చింది నా బొంద. చేతులూపుకుంటూ వచ్చి స్టయిల్ గా అయిదు నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది."
"నిజమా?" అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది విమలాదేవి. ఆవిడ చూపుల్లో ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న భావం ప్రతిబింబిస్తోంది."
"ఛీ ఛీ" అంది. తర్వాత, బహుశా ఆవిడగారు రావటమే గొప్ప ప్రజంటేషననుకుందేమో" అంది.
"ఆ ఫోజూ అది చూస్తే అలాగే కనబడుతుంది"
"దానికి తాను చాలా అందగత్తెనన్న అహంకారమనుకుంటానండి."
"ఏమిటండి దాని అందం? నాకన్నా అందంగా వుంటుందా?"
"విమలాదేవి కొంచెం ఖంగుతిని "మీకన్నా అందగత్తె కాదనుకోండి" అంది.
"మరేమిటి?" అని రాధాప్రియ ఆవేశమొచ్చినట్లు అందం గురించి చిన్న ఉపన్యాసమిచ్చింది. "అసలు అందమంటే ఏమిటి? ఊరికినే తెల్లటి ఛాయ, కనుముక్కు తీరు పర్సనాలిటీ, శరీరపు వొంపుసొంపులు, నాజూకులు ఇవేనా, అఫ్ కోర్స్. వీటికి కొంత ప్రాధాన్యత ఉంటే ఉండవచ్చు. కాదనను. కాని అలా...కళ్ళు పైకెత్తి, కొంచెం మొహం ప్రక్కకి త్రిప్పి చూడటం, కనబర్చే మేనిరిజమ్స్, నడుస్తూ వున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఆ హొయలు ఇవన్నీ లేకుండా వొట్టి బొమ్మలా...అది అందమెలా అవుతుందండి?"
"చాలా చక్కగా చెప్పారు. అబ్బే దానిలో ఈ లక్షణాలేమీ లేవండి."
"నాకు దానిలో నచ్చని గుణమేమిటంటే అత్తగారి మీద, మావగారి మీద ఓ...ఆపేక్ష కురిపిస్తూ వుండటం వెధవ యాక్షన్"
"అది ఆరా తీశానండి. ఆ మావగారు తనకున్నదంతా వాళ్ళకిచ్చేశాడట. డబ్బు ఇచ్చాడని కొన్నాళ్ళు అలా షో"
"ఉహు. అదన్నమాట పైగా ప్రపంచంలోని దీనికొకతికే భర్త వున్నట్లు, భర్తను ప్రేమించటం దానికొకదానికే తెలిసినట్లు వెధవ ఫోజు"
"అబ్బబ్బ. ప్రపంచంలో వాళ్ళదొకళ్ళదే ఆదర్శ కుటుంబమైనట్లు వదినా మరదలు, వదినా ఆడపడుచులు...ఓ హోహోహో! ఏం ఆపేక్షలు, ఏం ఆత్మీయతలు...చూస్తోంటే వొళ్ళు కంపరంగా వుంది. వెధవ నటనా, అతిశయోక్తులు."
"ప్రక్కింటి వాళ్ళతో ఓ మాటా లేదు, మంచీ లేదు."
"ఇలాంటి వాళ్ళతో ఓ ప్రమాదం కూడా వుందండోయ్"
"ఏమిటండి"
"మన మొగుళ్ళ దృష్టి దానిమీద పడిందంటే..."
"మీ అందం ముందు దాని అందమెంతా? బ్రహ్మాండమైన మీలాంటి భార్యనింట్లో పెట్టుకుని దానివంక చూస్తాడని నేననుకోను"
"నా ఉద్దేశం అదికాదు. అది మొగుడితో వేరే నంగనాచి వేషాలూ, యింట్లో వాళ్ళతో కలుపుగోలుతనంగా వుండడం...యివన్నీ చూసి దాంతో కంపేర్ చెయ్యటం...యివన్నీ మొదలవుతాయని"
"అవునండోయ్. యిది మనకు పెద్ద దెబ్బే"
కొంచెం ఆగి విమలాదేవి అంది. మీరయితే మొగుడ్ని కంట్రోల్ లో పెట్టుకుంటారా. మా ఆయన నా కంట్రోల్ లో వుండే మనిషి కూడా కాదు. ఇదంతా చూస్తోంటే నాకు భయంగా వుందండి."
"మీరేం భయపడకండి. నేవున్నాగా, నా మీద భరోసా వుంచండి."
ఇద్దరూ కసితీరా కొంచెంసేపు మాట్లాడుకున్నాక అప్పుడే యింటికొచ్చిన సుబ్బారావు "విమలా విమలా" అని గట్టిగా పిలవటం వినిపించింది.
"అమ్మో. మా వారొచ్చేశారు" అని విమలాదేవి లేచి హడావుడిగా బయటికెళ్ళిపోయింది.
రాధాప్రియ లేచి నిలబడింది.
అప్పుడామె ఆకారం విశ్వరూపం దాల్చినట్లు వున్నతంగా, ఉగ్రంగా కనబడుతోంది.
మనిషి ఎత్తుగా ఎదిగిపోయినట్లు...
వక్షస్థలం ఉవ్వెత్తుగా పొంగింది.
కళ్ళు ఎర్రని జీరలు దాలుస్తున్నాయి.
శరీరం వొణుకుతోంది.
"సుజాత! ఒసేవ్ సుజాతా! నాతో పెట్టుకుంటావా? నువ్వు మంచిదానివా? నువ్వు గొప్పదానివా? నువ్వు అందగత్తెవా? నువ్వు ఉత్తమ ఇల్లాలివా? నీ సంస్కారం, నీ బోడి అన్యోన్యలతో నిండి వున్న నీ సంసారం చూసి నేను...ఈ రాధాప్రియను అసూయపడాలా? నా యింటికి పేరంటానికి వట్టి చేతుల్తో వస్తావా? ఆఫ్ ట్రాల్ నువ్వు నన్ను డామినేట్ చేస్తావా? భర్తతో నీ అనురాగం, అందరి కళ్ళూ నీమీద పడేటట్లు చేసుకుంటూన్న నీ స్టయిల్ ఓ...నా వొళ్ళు దహించుకుపోతోంది. నా మనసు మండిపోతోంది. నీలాంటి వాళ్ళున్న ఈ ప్రపంచాన్ని భరించలేక పోతున్నాను. నువ్వంటే నాకు పరమ ఎలర్జీ. నిన్ను టార్గెట్ చెయ్యపోతున్నానే. ఊ...నిన్ను..."
మంచం మీద కూలబడి పోయింది.