Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 10


                                        5


    బయట్నుంచి ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.
    "ఎవరూ?" అంటూ విజయ్ కుమార్ వెళ్ళి తలుపు తీశాడు.
    బిచ్చగాడు.
    విజయ్ కుమార్ కి కోపమొచ్చింది.
    "ఏయ్ ఎందుకు బెల్లు నొక్కావు?" అన్నాడు.
    "ఎందుకేమిటి? అడుక్కోటానికి" అన్నాడు బిచ్చగాడు.
    "దానికి యిదేనా పద్ధతి? కాలింగ్ బెల్ కొట్టి వస్తావా?"
    "మరి కాలింగ్ బెల్ పెట్టింది దేనికి? నొక్కి పిలవటానికి కాదా!"
    "అది విజిటర్స్ కు"
    "నేను విజిటర్ నే. విజిటర్స్ లో అనేక రకాలుంటారు. అందులో యిదీ ఒక రకం. అయినా యిప్పుడు వ్యాపారాల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, సినిమాల్లో ట్రెండ్ మారిపోయినట్లే అడుక్కోవడంలో కూడా ట్రెండ్ మారిపోయింది. నీ డ్యూటీని నువ్వు గౌరవిస్తున్నట్లే నా డ్యూటీని నేను గౌరవిస్తున్నాను. నిన్ను నేనెలా గౌరవిస్తున్నానో నువ్వూ నన్ను గౌరవించాలి.
    "నిన్ను నేను గౌరవించాలా?"
    "అంతేమరి. త్వరగా ఏమయినా ఇయ్యి. నిన్న వండిన అన్నం, పాడైపోయిన కూరలు అవేం పనికిరావు" మనకన్నీ ఫ్రెష్ గా వుండాలి. లేకపోతే సయించవు. అలా కుదరకపోతే క్యాష్ ఇయ్యి.
    "ఏమిటయ్యా. అడుక్కోటానికొచ్చి డిమాండ్ చేస్తున్నావ్_ఏదో హక్కున్నవాడిలా"
    "కరెక్ట్. హక్కు వుంది."
    "ఏమిటి? డిమాండ్ చెయ్యటానికి హక్కుందా?"
    "ఈ దేశంలో ప్రతివారికీ బోలెడు హక్కులున్నాయి. మర్డర్లు చెయ్యటానికి, ఆస్తులు విధ్వంసం చెయ్యటానికి గూండాకి హక్కుంది. ఎవరూ ఏం మాట్లాడటానికి వీల్లేదు. ఆఫీసుల్లో పనిచెయ్యకుండా జీతం తీసుకోడానికి, సెలవు పెట్టకుండా మానెయ్యటానికి ఉద్యోగస్థుడికి హక్కుంది. ఎవరూ ఏం మాట్లాడటానికి వీల్లేదు. నేరం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోకుండా మామూలు ప్రజల్ని చిదకబాదటానికి పోలీసులకి హక్కుంది. అంతేకాదు. వాళ్ళిష్టమొచ్చినట్లు మంచివాళ్ళని నేరస్థులుగా, కంప్లెయింటివ్వటానికొచ్చిన వాళ్ళను దోషులుగా చిత్రీకరించటానికి హక్కుంది. కాలేజ్ స్టూడెంట్లను అమ్మాయిల్నేడిపించటానికి, రౌడీలను ఇష్టమొచ్చిన ఆడాళ్ళని యథేచ్చగా రేప్ చెయ్యటానికి హక్కుంది. మొగాళ్ళకి సాధ్యమయితే ఫ్యామిలీ లేడీస్ తో అక్రమ సంబంధం పెట్టుకోటానికి హక్కుంది. గవర్నమెంటు ఆఫీసుల్లో ఫ్యూన్ దగ్గర్నుంచి ఆఫీసరుదాకా లంచాలు తింటానికి హక్కుంది. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళ నెదిరించటానికి, పెళ్ళాలకు మొగుళ్ళ నెదిరించటానికి హక్కుంది. కార్పెంటర్లకూ, ఎలక్ట్రీషియన్లకూ కావలసిందానికంటే ఎక్కువ డబ్బులు తీసుకుని కూడా మోసం చెయ్యటానికి హక్కుంది. రాజకీయ నాయకులకు దేశం కోసం కాకుండా ఓట్ల కోసం గొర్రెల మందల్లా ప్రజల్ని బొమ్మల్ని చేసి ఆడించటానికి హక్కుంది. ఎన్నికలముందు ఓటరు మహాశయులారా, అన్నలారా, అక్కలారా, మీ విలువైన ఓటు అని దణ్ణాలెట్టేసిన నాయకులకు ఎన్నికలయిపోయాక ఆ ప్రజల్ని పశువులుగా చూడటానికి హక్కుంది. తమకిష్టంలేని నాయకుల్ని తుపాకులు పెట్టి కాల్చేసి, బాంబులు పెట్టి చంపేసి అరాచకం సృష్టించటానికి కొంతమందికి హక్కుంది. వినాయకుడికి ఏం జరిగినా దాంతో ఏమీ సంబంధం లేని ప్రజల్ని లూటీలు చేసి, దహనకాండలు చేసి, బంద్ లు చేసి నానా హింసలు పెట్టే హక్కు ఆయా పార్టీల కార్యకర్తలకుంది. ఇతరుల సొంత విషయాల్లో జోక్యం చేసుకొని, పుకార్లు పుట్టించి, బ్లాక్ మెయిల్ లెటర్సు రాసి వాళ్ళ జీవితాల్లో సంక్షోభం సృష్టించే హక్కు చాలామంది ప్రబుద్ధులకుంది. ఆ ప్రక్కింట్లో జరిగే సంగతులు, ఆ మాటకొస్తే జరగని సంగతులు ఆరాలు తీసి ముందుగా తెలుసుకునే హక్కు ఇరుగుపొరుగు వారికుంది. అయిన వాళ్ళమని చెప్పుకుని వచ్చి రోజుల తరబడి తినెయ్యటం, అవసరమొచ్చి సహాయమడిగితే చెయ్యకపోగా హేళనగా అవమానం చెయ్యటం, ఈ హక్కు సమాజంలో చాలామందికుంది. అలాగే ఈ ప్రపంచం మీద అలిగి, పనిచెయ్యటమంటే అసహ్యమేసి అడుక్కొనే హక్కు నాకూ వుంది."
    విజయ్ కుమార్ అతనివంక ఆశ్చర్యంగా చూసాడు.
    "ఎవరు మీరు?" అనడిగాడు.
    "అడుక్కొనేవాడ్ని మీరని మర్యాదివ్వకండి" అన్నాడతను.
    "మిమ్మల్ని చూస్తే చాలా చదువుకున్నట్లుగా వున్నారు."
    "నా పర్సనల్ విషయాలొద్దులెండి. త్వరగా యివ్వండి. ఇంకా చాలా ఇళ్ళకు వెళ్ళాలి. ఎండెక్కాక అడుక్కోవటం నాకు విసుగు. నా బాడీని హైరానా పెట్టటమిష్టంలేదు."
    విజయ్ కుమార్ జేబులోంచి ఓ రూపాయి తీసి యిచ్చాడు. "యింకో రూపాయివ్వండి."
    దేనికన్నట్లు చూశాడు.
    "ఇంతసేపు నన్ను వాగించినందుకు"
    జేబులోంచి మరో రూపాయి తీసి యిచ్చాడు.


                             *    *    *    *


    "అక్కా వచ్చేశా"
    బయట్నుంచి ఓ గొంతు సప్తస్వరాల మేళవింపులా వినిపించింది.
    సుశీలమ్మగారు ఇవతలికొచ్చింది. తమ్ముడ్ని చూడగానే ఆమె ముఖం వికసించింది.
    "ఏమిటి రామేశమే...? ఏమిటి సిస్టరిన్ లా రాలేదా?"
    వచ్చింది. అదిగో రిక్షాలో సామానులు లోపల పెట్టిస్తోంది.
    "అదేమిట్రా. మొగవాడివి నువ్వు వుండి సిస్టరిన్ లాతో బరువు మోయిస్తున్నావు. ఉండు మావాడ్ని పిలుస్తాను. వినోద్ వొరేయ్ వినోద్ అని కేకేసింది."

 Previous Page Next Page