"అదేంలేదండి. ఆ అమ్మాయి చదువుకి డిస్టర్బెన్స్ గా ఉంటుందని నేనే యింటిపనుల్లోకి రానివ్వను, ఇహ...తన ఫ్రెండ్స్ తో తప్ప ఎవరితోనూ చనువుగా ఉండదు. అది ఆమె స్వభావం. ఒక రకంగా అలా ఉండటమే మంచిదేమో కదండి."
ఆమెను తన ధోరణివైపు ఎంత త్రిప్పుకుందామన్నా సాధ్యపడక "అవుననుకోండి" అంది రాధాప్రియ. తన ఇంటిలో ఎవరిమీద ఈగవాలనివ్వకుండా ఉండటం ఆమెకు రుచించటంలేదు.
"ఉండండి తీసుకొస్తాను" అంటూ సుజాత లేచింది.
"నేను మీతోబాటు లోపలకొస్తాను. మీ ఇల్లెలా ఉందో చూస్తాను" అంటూ రాధాప్రియ కూడా లేచింది.
ఉన్నవి నాలుగు గదులే అయినా, ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టుగా ఉండటం, ఏ వస్తువెక్కడ ఉండాలో అక్కడ అమర్చినట్లు, అప్పుడే సర్దినట్లు నీట్ గా ఉండటం ఆమెకు ఆశ్చర్యమనిపించింది. కాని ఆ ఆశ్చర్యాన్ని మరుక్షణంలో అహం, అసూయ దిగమ్రింగేశాయి. తాము చేయలేనిపని యింకొకరు చేస్తుంటే మనిషిలో మెచ్చుకోలు ఉండదు." ఆఫ్ ట్రాల్ అనే నిర్లక్ష్యధోరణి నిజాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది.
అలాంటి వాళ్ళ కళ్ళు ఎదురుగా కనిపించే వాటికన్నా కనిపించని వాటిని వెతుక్కుంటూ ఉంటాయి.
సుజాత గ్యాస్ స్టవ్ అంటించి పాలు కాస్తోంది.
"ఇదేమిటి మీకు ఒక సిలెండరే ఉందేమిటి? స్పేర్ సిలెండర్ లేదా?" అనడిగింది రాధాప్రియ.
"లేదండి"
"స్పేర్ సిలెండర్ లేకపోతే ఎలాగండి? ఒకటి ఖాళీ అయిపోయాక, రెండోది వచ్చేవరకూ యిబ్బంది పడరూ?"
"నాలుగయిదు రోజులు యిబ్బంది పడితే ఏమండి. అసలు ప్రతి చిన్నదానికీ యిబ్బంది అనుకుంటే ఎలా? ఆ కాసిని రోజులూ కిరసనాయిల్ స్టవ్ వాడుకుంటాం. మనం మరీ అంత సుఖానికి అలవాటు పడడం మంచిది కాదనుకుంటాను."
"అంతేలెండి"
సుజాత టీ తయారయ్యాక కప్పులో పోసి ఇచ్చింది.
"అదేమిటి? మీరు తాగరా?"
"నాకు మధ్యాహ్నాలు కాఫీగానీ, టీగానీ తాగే అలవాటు లేదండి"
రాధాప్రియ కప్పు నోటి దగ్గర పెట్టుకుని కొంచెం సిప్ చేసింది. "బావుంది, అంది అప్రయత్నంగా.
సుజాత బయటకు వెళదామా అన్నట్లు చూసింది.
ఆ చూపు రాధాప్రియ అర్థం చేసుకుంది. "అన్నట్లు మీ బెడ్ రూమ్ చూపించలేదేం" అంది.
"చూడటానికి ప్రత్యేకంగా ఏముందిలెండి రండి"
ఇద్దరూ బెడ్ రూమ్ లో కెళ్ళారు.
చాలా సాధారణంగా వున్న టేబిల్ కాట్. కాని దానిమీద అతి శుభ్రంగా ఉన్న బెడ్ షీట్.
చిన్న బీరువా, తీర్చిదిద్దినట్లు హ్యాంగర్స్ కున్న బట్టలు, రాధాప్రియ కళ్ళు సూయింగ్ మిషన్ మీద పడ్డాయి.
"మీకు మిషన్ కూడా వచ్చునేమిటి?"
"ఏదో...నా జాకెట్లు, మా మాధురివి నేనే కుడుతూ ఉంటాను."
కొంచం ఆగి రాధాప్రియ గొంతు చిన్నది చేసి అంది. మీరేమీ అనుకోకపోతే ఓ ప్రశ్న అడుగుతాను.
"అడగండి"
"మీకు పెళ్ళయి ఎన్నాళ్ళయింది?"
"నాలుగేళ్ళయింది?"
"ఇన్నాళ్ళూ పిల్లలు లేకుండా...ఊ? సహజంగా అలా జరిగిందా? లేక ఫ్యామిలీ ప్లానింగా"
సుజాత నవ్వి వూరుకుంది, జవాబు చెప్పలేదు.
బయటకు నవ్వుతూ ఉన్నా ఆమె కళ్ళలోని నిశ్చిలత్వం చూసి, ఆ ప్రశ్నకు జవాబు రాబట్టలేనని తెలుసుకుని, యిహ అ ప్రసక్తి ఎత్తకుండా వూరుకుంది.
టీ త్రాగడమయినాక, "వస్తానండి. రేపు తప్పకుండా పేరంటానికి రండి" అంటూ వెళ్ళిపోయింది.
4
రాధాప్రియ ఇంటిలో ఓ మూలగా ఉన్న గదిలో చిన్న నులకమంచమున్నది. దానిమీద ఓ డెబ్బై ఎనభయ్యేళ్ళ వృద్ధురాలు ఎప్పుడూ పడుకుని ఉంటుంది. ఆమె కొన్ని సంవత్సరాలనుంచి వ్యాధిగ్రస్థురాలయి ఉంది. మంచం మీద నుంచి కదల్లేదు. మనిషి బక్కచిక్కి శల్యావశిష్టమై ఉంది.
ఓరోజు మధ్యాహ్నం రెండుగంటలవేళ రాధాప్రియ ఎయిర్ కూలర్ వేసుకుని హాయిగా నిద్రపోతుంది.
అంతకు అరగంట ముందునుంచీ వృద్ధురాలు "రాధా! రాధా" అని పిలుస్తోంది. రాధాప్రియకు మెలకువ రావటం లేదు.
శరీరంలో శక్తి హరించుకుపోతున్నా వృద్ధురాలు పిలవటం ఆగలేదు.
చివరకు మెలకువ వచ్చింది. నిద్రలో వున్నప్పుడు లేపితే ఆమెకు ఎక్కడలేని కోపమూ వస్తుంది.
విసురుగా లేచి దూకుడుగా అత్తగారి దగ్గర కెళ్ళింది. "ఎందుకట్లా అసహ్యంగా అరుస్తారు? మీకు బుద్ధిలేదూ?" అంది కోపంగా.
"అట్లా...విసుక్కోకే రాధా. దాహంతో చచ్చిపోతున్నా, అందుకని మంచినీళ్ళ కోసమని పిలిచాను." అన్నది వృద్ధురాలు బలహీన స్వరంతో.
"మంచినీళ్ళు ప్రక్కనే బల్లమీద పెట్టాగా" ఎందుకింకా గోల చేస్తారు?"
"చెంబులో నీళ్ళు అయిపోయినాయే"
"అయితే? నిద్రలేచేదాకా ఆగాలి"
"నాలిక ఎండిపోతుంటే ఉండలేకపోయానే"
రాధాప్రియ ఆమెవంక అసహ్యంగా చూచి వంటింట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి చెంబులో పోసింది.
"అఘోరించండి" అంది.
వొణికే చేతుల్తో ఆ నీళ్ళు గ్లాసులో వొంపుకుని అవస్థపడుతూ త్రాగింది.
"ఏం చెయ్యనే...ఆ దేవుడ్ని ఎంత ప్రార్థించినా, ఆయనకు నామీద దయ కలగడంలేదు. నాకు చావు రావటం లేదు."
"రాదు. మా అందరి చావూ చూస్తేగాని మీకు రాదు."
"అలా అనకే. మీ అందరూ చల్లగా వుండాలి."
"ఆఁ ఆఁ మీరిలా సంవత్సరాల తరబడి చావకుండా సతాయిస్తోంటే ఇల్లు గుల్ల చేసుకుంటూ మేము చల్లగానే ఉంటాం" అంటూ యివతలికొచ్చేసింది.
ఆ లోపలి గదిలో ఉన్న కొన్ని క్షణాలలోనే, భయంకరమైన ఉక్కవల్ల రాధాప్రియకు వళ్ళంతా చెమట పట్టేసింది. ప్రాణం కడగట్టిపోయినట్లయింది. బెడ్ రూంలో కొచ్చి ఎయిర్ కూలర్ ముందు కూర్చుని ఆ చల్లదనాన్ననుభవిస్తూ హమ్మయ్య అని వూపిరి తీసుకుంటుంది.