తలుపులు దగ్గరకు వేసి ఆనందంగా బయటికొచ్చేశాడు భవానీశంకర్.
* * * *
"గుడ్ మాణింగ్ అంకుల్" అన్నాడు భవానీశంకర్ పొద్దున్నే సాంబమూర్తి ఆఫీస్ లోకొచ్చి కుర్చీలో కూర్చుంటూ.
"గుడ్ మాణింగ్" అన్నాడు సాంబమూర్తి "నిన్న నువ్వు జాయినవ్వలేదని చెప్పాడు ఎడిటర్ రంగారావు."
"నిన్న కుదర్లేదంకుల్. బనీను, పైజామాతో రావడం బాగుండదు కదా! అందుకని_"
"బనీను, పైజమా ఏమిటి?"
"డ్రస్ అంకుల్ నా నైట్ డ్రస్! అన్నట్లు ఇవాళ రాగానే మన వీక్లీ మొత్తం తిరగేశానంకుల్! అందులో చాలా అయిటమ్స్ అవుట్ డేటెడ్ అంకుల్! నా చిన్నప్పటినుంచీ ఆ శీర్షికల్ని చూస్తున్నాను. అవన్నీ మార్చేయాలని నా ప్లాన్!"
"ఏమిటవి?" ఆసక్తిగా అడిగాడు సాంబమూర్తి.
"మొదటిది సినిమా ఫీచర్ ఫలానా ప్రొడక్షన్స్ వాళ్ళు ఫలానా చిత్రం తాలూకూ షూటింగ్ జరిపారు. ఫలానా నటీనటులు వీర నటన ప్రదర్శించారు. ఇంకొంచెం ప్రదర్శించే లోపుగానే డైరెక్టర్ "కట్" అంటూ అరచాడు లేదా ఫలానా సినిమా షూటింగ్ సమయంలో ఫలానా తార లేక తారడు కాఫీ తాగుతూ ఛలోక్తి విసిరారు అంటూ పరమ చెత్త జోకు రాయటం. ఫలానా సినిమా ఈ వారం రిలీజయింది. కథ, కథనం, అదనం అన్నీ మోతెక్కిపోయాయని రివ్యూ రాయటం."
"అఫ్ కోర్స్" అన్నాడు సాంబమూర్తి సాలోచనగా.
"అయిటమ్ నెంబర్ టూ. వారఫలాలు. ఇది నిజంగా హారిబుల్ ఫీచర్ అంకుల్. ఎన్ని సంవత్సరాలయినా ఎవరి జాతకమూ ఎటూ తేలదు. అలా కాకుండా బాగా డైనమిక్ గా రాయాలంకుల్. దీనికి శాస్త్రజ్ఞులు అవసరం లేదంకుల్. నేనే లాగించేస్తాను. ఉదాహరణకు ఫలానా వృశ్చికం తాలూకూ ప్రజలు ఈ వారం అటూ ఇటూ తేల్చేసుకుంటారు. పెళ్ళికాని వాళ్ళు ప్రేమించినమ్మాయినికానీ, అబ్బాయినికానీ లేవదీసుకు వెళ్ళిపోతారు. పెళ్ళయినవాళ్ళు భార్యకు విడాకులిచ్చేయడమో, విడాకులివ్వాలనుకుంటున్న వాళ్ళు ఆ ఆలోచన కాన్సిల్ చేసేసుకుని భార్యను తెచ్చేసుకోడమో ఏదొకటి చేసేస్తారు."
సాంబమూర్తికి అతని మాటలు భయం కలిగించడం ప్రారంభించినయ్.
"అయిటమ్ నెంబర్ త్రీ. డాక్టర్ సలహాలు. మోస్ట్ హోప్ లెస్ థింగ్ అంకుల్ ఇది. చాలామంది డాక్టర్లు వారాలకొద్దీ పేషెంట్లను పరీక్షించి, రకరకాల పరీక్షలు చేయించినా కూడా అసలయిన జబ్బేమిటో ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. అలాంటిది అక్కయ్యా! కుడి చెయ్యి, ఎడమకాలు తెల్లారుజామున ఏడింటికి మూడు నిమిషాలపాటు చలనం లేకుండా వుంటున్నాయ్. ఏంచేయాలి అంటే, బి.సి. ఫోర్టీ మింగమనడం."
సాంబమూర్తి నవ్వాడు.
"ఆ ఫీచర్ అసలు కారణం పాఠకుల రోగాలకు మందులివ్వటం కాదోయ్"
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"తెలుసంకుల్! డాక్టర్ సలహాల ద్వారా సెక్స్ సంబంధమున్న ప్రశ్నలు_జవాబులు రాయించి, అందులో బూతు జొప్పించి పాఠకుల నాకట్టుకొనాలని మీ అభిప్రాయం. అవునా? అయ్ నో దట్. కానీ ఈ పద్ధతి అవుట్ డేటెడ్ అంకుల్ డైరెక్టుగా సెక్స్ గురించి ఆర్టికల్స్ రాస్తే మహా క్రేజీగా వుంటుంది. అసలు నన్నడిగితే ఇప్పుడు చేస్తున్న ముసుగులో సెక్స్ విన్యాసాలు ఆపి వాత్సాయన కామసూత్రాలు ఫోటోలతో సహా ప్రచురిస్తే ఎక్కువ పాపులర్ అవొచ్చు."
"అఫ్ కోర్స్" అన్నాడు సాంబమూర్తి ఆలోచిస్తూ.
"అయిటమ్ నెంబర్ ఫోర్."
"సాంబమూర్తి టైమ్ చూచుకున్నాడు.
"ఆల్ రైట్! ఇంకోసారి మాట్లాడదాం. నాకిప్పుడు వేరే పనుంది" అన్నాడు చిరునవ్వుతో.
"ఓ.కే. అంకుల్! రేపు మాణింగ్ కలుస్తాను" అనేసి తన సీట్ దగ్గరకు నడిచాడు భవానీశంకర్.
ఎడిటర్ రంగారావ్ అతనివంక అయిష్టంగా చూశాడు.
"అన్నీ అంకుల్ తో డిస్కస్ చేశాను మైడియర్ రంగారావ్! ఫైనల్ డెసిషన్ రేపో, ఎల్లుండో తీసుకుంటానన్నారు మీన్ వైల్. 63 పేజీలో వెంకులక్ష్మి కవితలు నాకేం నచ్చలేదు. వచ్చే సంచిక నుంచీ తీసేస్తున్నాను."
రంగారావ్ అదిరిపడ్డాడు.
"అది తియ్యటానికి వీల్లేదు" అన్నాడు కంగారుగా.
"ఎందుకని బ్రదర్?"
"దానికి చాలా రెస్పాన్స్ వస్తోంది పాఠకుల నుంచీ."
"పొరబాటు మిస్టర్ రంగారావ్! నేను గత వారం రోజులుగా వచ్చిన ఉత్తరాలన్నీ చెక్ చేశాను. అది ఆపెయ్యమని బూతులు తిడుతున్నారు జనం. ఆ ఉత్తరాలన్నీ ప్రత్యేకంగా ఓ కట్టకట్టి సాంబమూర్తి అంకుల్ కి పంపిస్తున్నానిప్పుడే."
రంగారావ్ మొఖం పాలిపోయింది.
"ప్లీజ్! అలా చేయకు. అది నా పర్సనల్ ఆబ్లిగేషన్" అన్నాడు ధీనంగా.
"ఏమిటది?"
"చెప్పాల్సిందేనా?"
"యస్ మైడియర్ రంగారావ్! సబ్ ఎడిటర్ గా నాకు ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలియాలి బ్రదర్! కమాన్, క్విక్."
"వెంకులక్ష్మి భర్త బ్యాంకులో పెద్ద ఆఫీసరు. ఆమె కవితలు ప్రచురిస్తే మా బామ్మర్దికి పదిహేను లక్షలు లోన్ శాంక్షన్ చేస్తానన్నాడు"
"అయితే ఆ కవితలు కేవలం వ్యాపార కవితలన్నమాట."
"షుమారుగా అంతే."
"ఓ.కే. మైడియర్ రంగారావ్! ఇలా ఎంతకాలం వేయాలి?"
"ఆమెకు రాసేందుకు ఓపిక వున్నంతకాలం."
"వెరీబాడ్ మిస్టర్ రంగారావ్! టైం లిమిట్ లేకుండా యావజ్జీవ రచయితలను పోషించటం నావల్ల కాదు. నేను ఒప్పుకోను. వెంటనే ఒక టైమ్ లిమిట్స్ ఫిక్స్ చేసెయ్యండి."
రంగారావ్ బుర్ర గోక్కున్నాడు.
"ఆల్ రైట్! ఇంకా అయిదేళ్ళు."
"నో, నో, నో. అంత టైమ్ స్పేర్ చెయ్యలేను బ్రదర్! ఇదేం పంచవర్ష ప్రణాళికా? నో. ఇంకా అయిదు సంచికలవరకూ టైమిస్తున్నాను అంతే. ఓ.కే."
"పోనీ ఆరు సంచికలు."
"నో! నథింగ్ మోర్! ప్లీజ్! ఓన్లీ ఫైవ్" ఖచ్చితంగా చెప్పాడు.
రంగారావ్ దిగాలుపడి కూర్చుండిపోయాడు.
భవానీశంకర్ లేచి మాసపత్రిక సెక్షన్ లో కొచ్చాడు. అసిస్టెంట్ ఎడిటర్ మిసెస్ చందన అతనిని చూసి చిరునవ్వు నవ్వింది.
"హలో!"
"హలో చందనాజీ!"
"మీ దగ్గరకే వద్దామనుకుంటున్నాను" అందామె.
"అక్కర్లేదు మేడమ్! కాకితో కబురుచేయండి. చాలు. వచ్చేస్తాను" అన్నాడతను ఆమె కెదురుగా కుర్చీలో కూర్చుంటూ.
"నాకో చిన్న హెల్ప్ కావాలి?"
"అడగండి మేడమ్! ఇక్కడంతా కేవలం బిజినెస్. అంతే. మీకు నా సహాయం కావాలంటే మీరూ నాకో సహాయం చేయాల్సి వుంటుంది."
"ఓ.కే. ఒప్పుకుంటాను" చిరునవ్వుతో అందామె.
"అయితే చెప్పండి మీకేం కావాలో?"
"టి.వి. స్టేషన్ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ మీ వీక్లీలో ప్రచురించాలి" భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"అదేమిటి? మన టి.వి. అంటేనే తెలుగు ప్రజలకు ఎలర్జీ కదా? అలాంటి దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ తయారుచేసే స్టేషన్ డైరెక్టరు ఇంటర్వ్యూ వేయటమా?"