Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 8


    "ఫన్నీ ఫెలో! కదూ?"
    "వెరీ ఫన్నీ! ఆ తరువాత ఎక్కడయినా కనబడతాడేమోనని తెగ వెతికాను"
    "స్నేహంలో కనీసం ఒక జత బట్టలయినా వదుల్తే బావుంటుంది"
    "వాడు కనిపించినప్పుడు మన బట్టలన్ని ఒకదానిమీద ఒకటి వేసేసుకుని నిద్రపోవాలట! మన క్లాస్ మేట్ చిరంజీవిగాడు అలాగే చేశాడు!"
    "ఒండర్ ఫుల్ అయిడియా"
    "ఇప్పుడు నీకు అర్జంటుగా బట్టలు కావాలి! అవునా?"
    "అంతేకాదు! కొంచెం కాష్ కూడా కావాలి"
    "డోంట్ వర్రీ బ్రదర్! అన్నీ ఇస్తాను అసలు నీకు వేరే రూమ్ కూడా అవసరంలేదు. నాతోనే వుండు"
    "అంటే నీకింకా మారేజ్ కాలేదా!"
    "పిల్లనిచ్చేందుకు ఎవరికీ ధైర్యం చాలటంలేదు"
    "ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    "అంతా పిరికివెధవలు! మందంటే చాలు భయపడి పారిపోతున్నారు! మందుకొడితే నేను అన్నీ మర్చిపోతానట!"
    "పిచ్చి వెధవలు!"
    "అదే నాకు వళ్ళుమండే విషయం! ఓ.కే. నువ్వు వెంటనే మనింటి కెళ్ళిపో! ఇదిగో తాళంచెవి_ ఇంట్లో నా బట్టలున్నాయ్. వేసేసుకో! ఆఫీస్ బాయ్ తో మధ్యాహ్నం కారియర్ పంపిస్తాను_ భోజనం చేసి పడుకో! సాయంత్రం నేను ఇంటికొచ్చాక అన్నీ మాట్లాడదాం! ఇదిగో ఇంటి అడ్రస్! కనుక్కోవడం వెరీ ఈజీ."
    "ఓ కే"
    భవానీశంకర్ ఆటోలో దీపక్ ఇల్లు చేరుకున్నాడు. ఇల్లంతా చిందర వందరగా వుంది. ఓ గదిలో అన్నీ బ్రాందీ సీసాలు గుట్టగా పడి వున్నాయ్. స్నానం చేసి అల్మారాలో నుంచి ఓ జత ఇస్త్రీ బట్టలు తీసి తొడుక్కున్నాడు. మరికాసేపట్లో కారియర్ తీసుకుని వచ్చేశాడు కుర్రాడు.
    భోజనాలు చేసేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయిపోయింది. అప్పుడిక వెళ్ళి ఉద్యోగంలో జాయినవటం సబబుగా కనిపించలేదు భవానీశంకర్ కి. ఆ మర్నాడు జాయినవాలని నిశ్చయించుకుని మంచంమీద వాలిపోయాడు.
    తిరిగి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయిదయింది. దీపక్ కోసం ఎదుర్చూస్తూ కూర్చున్నాడతను. రాత్రి పదయిపోయినా అతని జాడ కనిపించలేదు. ఓ పక్క ఆకలి మొదలయిపోయింది మళ్ళీ మిగిలిన ముప్పయ్ రూపాయల్లో_ ఆటో ఛార్జీలు పోను మరో నాలుగు రూపాయలు మిగిలింది. ఆ పూటకు భోజనం మిస్ కొట్టేయాలని నిర్ణయించుకుని మళ్ళీ పడుకున్నాడు మంచంమీద పదకొండు గంటలకు తలుపు తట్టిన చప్పుడయింది.
    తలుపు తెరచాడు భవానీశంకర్. దీపక్ తూలుతూ లోపలికొచ్చాడు.
    "హలో! నీకోసం సాయంత్రం నుంచీ ఎదుర్చూస్తున్నాను బ్రదర్! భోజనం కూడా చేయలేదు."
    దీపక్ ఠక్కున ఆగిపోయి భవానీశంకర్ వేపు చూశాడు ఆశ్చర్యంగా.
    "ఎవర్నువ్వు?"
    భవానీశంకర్ విస్తుపోయాడు "నేనేరా! భవానీశంకర్ ని"
    "భవానీశంకర్? వుచ్ భవానీశంకర్?"
    "అదేరా! నీ క్లాస్ మేట్ భవానీశంకర్ ని."
    "వుచ్ క్లాస్?"
    "నేనే గురూ! మనం కాలేజీలో"
    "లెట్ ది కాలేజ్ గో టూ హెల్! నువ్వెవరు?"
    "అదేమిట్రా మనం పొద్దున్న కలుసుకున్నాంగా?"
    "పొద్దున్నా? నో పొద్దున్న నేనెవ్వరినీ కలుసుకోలేదు"
    "కలుసుకోకపోవటమేమిటి నీ తలకాయ్! నువ్వేగా ఇంటికెళ్ళమని తాళంచెవి ఇచ్చిందీ?"
    "నేనెవ్వరికీ తాళాలివ్వలేదు__ గెటౌట్ వన్_టూ_త్రీ_ఫోర్_ఫైవ్_"
    "ఒరేయ్. మనిద్దరం లాస్ట్ బెంచీలో కూర్చునేవాళ్ళం."
    "నేనెప్పుడూ లాస్ట్ బెంచీలో కూర్చోలేదు."
    "ఫిజిక్స్ ప్రాక్టికల్స్ క్లాస్ ఎగ్గొట్టి ఇంగ్లీష్ పిక్చర్ కెళ్ళేవాళ్ళం."
    "అసలు నేను కాలేజ్ కే వెళ్ళలేదు ఎప్పుడూ_ త్వరగా బయటకు పద_వన్_టూ."
    "ఒరేయ్_ స్నేహితుడిని పట్టుకుని ఇలా 'గెటౌట్' అనడం అన్యాయం!"
    "స్నేహితుడివా? అసలు నీ మొఖం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు నేను."
    "అస్సలు చూళ్ళేదా నన్ను?"
    "నో. నెవర్! గెటౌట్ వన్_టూ_త్రీ_ఫోర్."
    "ఇంత రాత్రప్పుడు ఎక్కడికెళ్ళన్రా?"
    "ఎక్కడికయినా పో! అడ్డమైనాడూ 'దీపక్' అంటూ ఇంట్లో జొరబడిపోవటం. కాలేజ్ మేట్. బెంచ్ మేట్_ అంటూ మకాం పెట్టేయడం పెద్ద నాన్సెన్స్ అయిపోయింది. మర్యాదగా బయటకు వెళతావా, లేదా. వన్_టూ_త్రీ_ఫోర్_ఫైవ్_సిక్స్."
    భవానీశంకర్ కేం మాట్లాడాలో తోచటంలేదు.
    "కమాన్! క్విక్! బయటకు పద! నేను నిద్రపోవాలి. వన్_టూ_త్రీ__"
    భవానీశంకర్ అయోమయంగా ఇంట్లోనుంచి బయటికొచ్చాడు.
    దీపక్ వెంటనే తలుపులు భళ్ళున మూసేసుకున్నాడు. మరుక్షణంలో లోపల లైటారిపోవటం "జీవితం ఏమిటి? వెలుతురు, చీకటి" అంటూ అతని పాట అపస్వరాలతో వినిపించటం మొదలయింది. పక్కింటి పెద్ద మనిషి ఆప్యాయంగా భవానీశంకర్ భుజం తట్టాడు.
    "మందుకొట్టేస్తే కొంచెం ట్రబులిస్తాడు. మామూలే_ ఖంగారేం లేదులే! వస్తా!" అంటూ తనింట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.
    భవానీశంకర్ కేం చేయాలో తోచలేదు. ఆరాత్రి ఎక్కడికి వెళ్ళలేడు. జేబులో డబ్బులేదు. బయట అరుగుమీదే పడుకుండిపోయాడు. తిరిగి మెలకువ వచ్చేసరికి బాగా ఎండెక్కిపోయింది. ఛటుక్కున లేచి తలుపు కొట్టాడు ఆశగా.
    పది నిమిషాల తర్వాత తలుపు తెరిచాడు దీపక్.
    భవానీశంకర్ ఏదో మాట్లాడేలోపలే మళ్ళీ మంచంమీద పడి నిద్రలో మునిగిపోయాడు.
    భవానీశంకర్ త్వరత్వరగా మొఖం కడుక్కుని రడీ అయిపోయాడు.
    దీపక్ నిద్రలేస్తే మళ్ళీ ఏం పేచీ పెడతాడోనని భయంగా వుంది. ఇలాంటి మందూభాయ్ దేశాయ్ తో ఈ ఇంట్లోనే ఉండటం అసాధ్యం. అతనికి పిల్లనివ్వటానికి అందరూ ఎందుకు భయపడుతున్నారో అర్థం అయిపోయిందతనికి. పొద్దుగూకేసరికి పెళ్ళాన్ని చూచి "ఎవర్నువ్వు?" అని బయటకు గెంటేస్తాడు.
    తను వెంటనే మరో గది చూచుకోవాలి! లేపోతో రోజూ అరుగుమీదే నిద్రపోవాల్సి వస్తుంది. కానీ ఇంకోగది తీసుకోవాలన్నా, తనకు మొదటినెల జీతం వచ్చేవరకూ తిండికి గడవాలన్నా డబ్బెక్కడిది? ఆ భరద్వాజ్ గాడు...
    హఠాత్తుగా భవానీశంకర్ మెదడులో మెరుపు మెరిసినట్లయింది. అవును! తనూ భరద్వాజ్ పద్ధతిలోనే తనక్కావలసిన కాపిటల్ సంపాదిస్తే సమస్య పరిష్కారమయిపోతుంది.
    దీపక్ వంక చూశాడు భవానీశంకర్. పూర్తిగా మత్తులో వున్నాడతను.
    అతని సూట్ కేస్ తెరచి చూశాడు. డబ్బేమీ కనిపించలేదు. అల్మారా తెరచి చూశాడు. అందులోనూ కనిపించలేదు. హాంగర్ కి తగిలించివున్న దీపక్ పాంట్ జేబులో వెతికాడు. పర్స్ దొరికింది. అందులో వందనోట్లు చాలా ఉన్నయ్.
    పది నోట్లు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు భవానీశంకర్. ఆ పక్కనే టేబుల్ మీదున్న పాడ్ మీద నోట్ రాశాడు త్వరత్వరగా.
    "డియర్ ఫ్రెండ్,
         అర్జంటుగా వెయ్యి రూపాయలు అవసరమయి_ నీ జేబులో డబ్బు తీసుకున్నాను. మళ్ళీ వీలయినంత త్వరలో ఈ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను.
                                                      నీ ప్రియమయిన స్నేహితుడు
                                                                 భవానీశంకర్"   

 Previous Page Next Page