Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 10


    "ఆ ఇంటర్వ్యూ వేస్తే మా కజిన్ ఒకమ్మాయికి టి.వి.లో ఉద్యోగం ఇస్తానన్నాడు."
    "ఐసీ! ఇది ఓ 'జీవి' ఉద్యోగానికి సబంధించిన వ్యవహారం అన్నమాట."
    "అవును."
    "ఇంటర్వ్యూ ప్రచురించకపోతే మీ కజిన్ కి ఉద్యోగం రాదు."
    "కరెక్టు"
    "ప్రచురిస్తే ఉద్యోగం వస్తుంది."
    "యస్!"
    "ఆల్ రైట్! సరే ఒక వారం రిస్క్ తీసుకుందాం. దాని ప్రభావం వల్ల అయిదారు వారాలు సర్క్యులేషన్ దెబ్బతింటుందనుకోండి. అయినా సరే."
    "థాంక్యూ భవానీశంకర్ గారూ! ఇప్పుడు మీకోసం నేనేం చేయాలో చెప్పండి"
    భవానీశంకర్ జేబులో నుంచి కాగితం తీసాడు. దాని మడత విప్పి అమ్మాయి బొమ్మను చందన ముందుంచాడు.
    "నాకు అర్జంటుగా ఈ అమ్మాయి వివరాలు కావాలి. ఇది ఏ మాగజైన్ లో పబ్లిషయిందో తెలీదు."
    ఆమె కాగితం అందుకొని రెండువేపులా పరికించి చూసింది.
    "కాని అసలెందుకా వివరాలు?" ఆశ్చర్యంగా అడిగింది.
    "ఆ అమ్మాయిని ప్రేమించాను"
    ఆమె విరగబడి నవ్వసాగింది.
    "ఎందుకలా నవ్వుతారు?"
    "కాగితాల మీద బొమ్మలను చూసి ప్రేమించానంటే నవ్వొస్తోంది."
    "ఇది ఆర్టిస్టు గీసిన బొమ్మకాదు_ ఫోటో_"
    "అయితే అయుండవచ్చు."
    "ఫోటోలో వ్యక్తుల్ని ప్రేమించడం మనకు కొత్తేమీ కాదు గదా! పురాణ కాలం నుంచి ఉంది."
    ఆమె ఇంక నవ్వుతూనే వుంది. "ఆల్ రైట్! మన మాసపత్రికలన్నీ తీసిచూస్తాను. ఏ సంగతి మీకు సాయంత్రం తెలియచెప్తాను"
    "థాంక్యూ మేడమ్! మీ వివరాలమీద ఓ జీవి ప్రేమ ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి!"
    "ఓ.కే_"
    భవానీశంకర్ వచ్చేశాడక్కడినుంచి!
    సాయంత్రం వరకూ ఆతృతగా ఆమె ఫోన్ కోసం ఎదురుచూస్తూ గడిపాడతను. చివరకు సాయంత్రం మళ్ళీ తనే ఆమెదగ్గరికెళ్ళాడు.
    చందన తన టేబుల్ చుట్టూ పాత మాసపత్రికల బౌండ్స్ పేర్చుకుని కూర్చుంది.
    "అయామ్ సారీ! మీ ప్రియురాలి ఫోటో మన మంత్లీలో పబ్లిష్ అవలేదు. గత నాలుగేళ్ళుగా వచ్చిన సంచికలన్నీ వెతికాను"
    భవానీశంకర్ నిరుత్సాహపడ్డాడు.
    "అయితే ఇంకేమిటి దారి?"
    "ఇది తప్పకుండా ఏదొక తెలుగు మాసపత్రికలో ప్రచురించబడిందే! ఎందుకంటే ఈ సైజులో వచ్చేవి మాసపత్రికలే! కనుక అన్ని మాసపత్రిక ఆఫీసులకూ వెళ్ళి వెతకాల్సిందే!"
    "అయితే ఆ పని చేయండి! మన మాసపత్రికల పేర్లూ, అడ్రస్ లూ అన్ని రాసిస్తే వేట ప్రారంభిస్తాను"
    "ఇప్పుడే ఇస్తాను" అంటూ ఓ పెద్ద పుస్తాం తెరచి అందులోని అడ్రస్ లన్నీ ఓ కాగితంమీద రాసిచ్చింది.
    "థాంక్యూ! మీకు చాలా శ్రమ ఇచ్చాను"
    "ఏంపర్వాలేదు. కానీ మీకో విషయం చెప్పమంటారా?"
    "చెప్పండి!"
    "ఈ అమ్మాయి కోసం అంత శ్రమపడటం అనవసరం అని నా అభిప్రాయం. ఇంతకంటే అందమయిన అమ్మాయిలు మీరు కావాలనుకుంటే దొరుకుతారు"
    భవానీశంకర్ నవ్వాడు.
    "కాని మీకు పెళ్ళయిపోయిందికదా"
    చందన సిగ్గుపడిపోయింది.
    యూ ఆర్ టూ స్మార్ట్" అంది చిరుకోపంతో.
    భవానీశంకర్ అక్కడనుంచి బయటకొచ్చేశాడు. పార్కు చేరుకొని ఎవరూ లేనిచోట కూర్చుని చందన ఇచ్చిన అడ్రస్ ల లిస్ట్ ఓసారి చూశాడు మళ్ళీ. రెండు మాసపత్రికలు మద్రాస్ నుంచి వస్తున్నాయ్. మూడు విజయవాడ నుంచి, ఆరు హైద్రాబాద్ నుంచీ, ఒకటి మచిలీపట్నం నుంచీ.
    వీటన్నిటిని ఎప్పటికి వెతకగలడు? ఆ అమ్మాయి ఫోటో అతన్ని చూసి నవ్వుతున్నట్లనిపించింది_ హేళనగా.
    భవానీశంకర్ కి ఎక్కడలేని పట్టుదలా వచ్చింది.
    "ఏమయినా సరే! ఈ అమ్మాయిని కనుక్కోవలసిందే"
    నిజానికి ఈమెను కనుక్కోవటం చాలా తేలిక! ఇంత అందమైన అమ్మాయి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు కనుక!
    మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా "విజేత" మాసపత్రిక ఆఫీస్ కి చేరుకున్నాడతను. చాలా చిన్న ఆఫీసది. ఇద్దరు యువకులు కూర్చుని ఏదో రాసుకుంటున్నారు.
    "హలో బ్రదర్స్!" చిరునవ్వుతో పలకరించాడతను.
    వాళ్ళు ఆశ్చర్యంగా చూశారతనివేపు.
    "నా పేరు భవానీశంకర్! నేను చంద్రిక వారపత్రికలో ఎడిటర్ని"
    "రండిసార్ కూర్చోండి" అన్నాడొకతను వినయంగా.
    "అర్జంటుగా మీ ఎడిటర్ని కలుసుకోవాలి బ్రదర్! ఉన్నారా?"
    "ఓ! లోపలికెళ్ళండి"
    భవానీశంకర్ లోపలకు నడిచాడు. ఓ లావుపాటి వ్యక్తి కూర్చుని ఉన్నాడక్కడ. తనను తను పరిచయం చేసుకున్నాడతను.
    "అదేమిటి? ఆంధ్రదీపిక ఎడిటరు రంగారావ్ కదా?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    నిన్నటివరకూ మైడియర్ సర్! నిన్నటివరకూ! ఇవాల్టినుంచీ భవానీశంకర్.
    "ఎందుకింత సడెన్ గం మార్చేశారు?"
    "టాలెంట్ బ్రదర్! మన టాలెంట్ చూసి సాంబమూర్తికేం చేయాలో అర్థంకాలేదు. అసలు తనే రిజైన్ చేసి ఛీఫ్ ఎడిటరు నాకివ్వాలని ఆశ పడ్డాడుగానీ నేను ఒప్పుకోలేదు. లివ్ అండ్ లెట్ లివ్ అనేది మన పాలసీ! అంచేత ఇంక నెక్ట్స్ బెస్ట్ పోస్టు వీక్లీది కనుక రంగారావ్ ని నా అసిస్టెంట్ గా వేసి నాకా పోస్ట్ ఇచ్చారు."
    "ఐసీ"
    "ఇంతకూ నేను వచ్చిన పనేమిటంటే_ఇదిగో_ఈ అమ్మాయి ఫోటో ఉన్న ఈ పేజీ మీ "విజేత" మాసపత్రికలోదే అని నా అనుమానం! ఈ అమ్మాయి అడ్రసూ, వివరాలూ అర్జంటుగా కావాలి గురూగారూ."
    అతను ఆశ్చర్యపోయాడు.
    "ఎందుకూ?"
    "ఎందుకంటే__ఎందుకంటే...ఈ అమ్మాయి మా ఫ్రెండొకతనికి బాగా ఫ్రెండట. ఇద్దరు ప్రేమించుకున్నారట చాలా కాలం క్రితం. అందుకని."
    "ఓ.కే. అర్థమయింది" నవ్వుతూ అన్నాడతను.
    "కొంచెం మీరీ సహాయం చేశారంటే..."
    "ఓ.యస్. నో ప్రాబ్లెమ్...మా వాళ్ళతో అన్ని సంచికలూ వెతికిస్తాను."
    "థాంక్యూ! నేను సాయంత్రం వస్తాను."
    "అన్నట్లు మీరుకూడా ఓ చిన్న సహాయం చేస్తే..."
    భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
    "ఎవరిదయినా ఇంటర్వ్యూ మా వీక్లీలో వేయాలా?"
    "అబ్బే...అలాంటివన్నీ మా పత్రికలోనే వేసుకుంటాం! అది కాదు! నా నవల ఒకటి మీ వీక్లీలో సీరియల్ గా వేస్తే."
    "నవలా?" ఖంగారుగా అన్నాడు భవానీశంకర్.
    "అవును! ఊరికే కాదులెండి. మీరుకూడా ఓ నవల మా మాసపత్రికలో సీరియస్ గా రాయవచ్చు"
    "ఐసీ."
    "ఎలావుంది అయిడియా?"

 Previous Page Next Page