Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 9


    "మీటింగంటే మాటలా?" అంది. అంటే ఆయనేదో మీటింగులో ఉన్నాడన్న మాట. బహుశా ఫైనాన్స్, సివిల్ ఏంగిల్స్ లో అయి వుంటుంది.
    "మీటింగులో వున్నారా?"
    "ఊఁ...."
    "ఎన్నింటికి బయల్దేరతారు క్లబ్ కి?"
    "గంటపైగా పట్టొచ్చుననుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం"
    "కార్లోనే వెళతారుగా?"
    "ఊఁ...."
    "ఓ.కే. నేను వెంటనే బయల్దేరుతున్నాను"
    "ఏం చేస్తావ్?"
    "తర్వాత చెప్తాను. ఎలాగైనా ఆయన ఆరున్నరదాకా ఇంట్లోనే ఉండేటట్టు చూడు"
    "సరే"
    వెంటనే ఫోన్ పెట్టేసి లేచి నుంచున్నాడు సాగర్.
    సరిగ్గా మరో పది నిమిషాలలో గమ్యం చేరాడు సాగర్. తన స్కూటర్ ని వీధి చివర పార్క్ చేసి నెమ్మదిగా నడిచి తనకు కావలసిన బంగళా దగ్గరకొచ్చాడు.
    రోడ్డుకవతలి వైపుగా నిలబడి ఓసారి చుట్టూ పరిస్థితిని అంచనా వేసుకున్నాడు. అత్యంత అధునాతనంగా ఎంతో చక్కటి ఆలోచనతో కట్టబడిన మూడంతస్థుల బంగళా అది. మంచి పాష్ ఏరియాలో వుందది. దాంతో చుట్టుప్రక్కల అంతగా జనసంచారం లేదు. ఎవరి ఇళ్ళల్లో వారు, ఎవరి సమస్యల వలయంలో వారు మునిగి ఉన్నారు.
    బంగళా ముందున్న చిన్న పోర్టికోలో ఆగి వుంది మారుతి ఎరుపుఇ రంగుది. బయట చుట్టూ వున్న చిన్న ప్రహరీగోడకి మనిషి ఎత్తులో గేటు, గేటుకి రెండుప్రక్కలా రెండు పాలరాతి ఫలకాలు. ఒకదానిమీద నల్లటి అక్షరాలతో "అక్షయ" అనే పేరు; మరో దానిపైన చెక్కబడి వుంది "భరద్వాజ ఎమ్.కాం" అని. గేటు నుండి ఇంటివరకూ ఒక్క మనిషి కూడా లేడు.ఉన్నట్టుండి భయం మొదలయ్యింది సాగర్ లో. తను చేయదలచుకున్న పనికి నిమిషం కన్నా కట్టదు. కాని, ఈ నిమిషంలోగా ఎవరైనా గమనిస్తే.... అరచేతులకి చెమటలు పోశాయి.
    నిల్చున్న చోటునుండి అడుగు ముందుకి కదలడంలేదు. ఎవరైనా తనని చూస్తే ఆ సమయంలో తనక్కడ ఉండటానికి ఏం కారణం చెబుతాడు? ఏం చెబుతాడు? ఏం చెబుతాడు?
    అయినా ఇప్పుడేం తొందరొచ్చింది? ఇంత హడావుడి చేయకపోతేనేం? బాగా ఆలోచించి చక్కగా ప్లాన్ చేసి నీట్ గా చేస్తే పోలా....
    ఇప్పుడింత అర్జంటేమిటి?
    "ఈరోజు బుధవారం. ఆయన క్లబ్ కెళతారు. ఇదో మంచి అవకాశం కావచ్చు" శృతి మాటలు గుర్తుకొచ్చాయతనికి. పైగా ఫోన్ చేసి తనేదో ఈరోజే పొడిచేసానని చెప్పాడు శృతికి. ఇప్పుడు తనేమీ చేయకపోతే శృతికి తనమీద నమ్మకం పటాపంచలవుతుంది. అది తననసలు భరించలేడు. శృతికోసం తనేమైనా చేస్తాడు. పైగా ఒక పని అనుకొన్నాక అది చేసేస్తేగాని తను ప్రశాంతంగా వుండలేడు.
    వాచీ చూసుకున్నాడు. ఆరు కావొస్తోంది సమయం. ఇంక ఆలస్యం చేయడం మంచిదికాదు. ధైర్యం కూడగట్టుకొని అడుగు ముందుకి కదిపాడు సాగర్.
    గేటుదాటి నెమ్మదిగా పోర్టికో సమీపించాడు.
    చుట్టూచూసి తననెవరూ గమనించట్లేదని నిర్ధారించుకున్నాక చటుక్కున కారు క్రిందికి దూరాడు.
    హైడ్రాలిక్ బ్రేక్ వుంది దానికి.
    ఓ అరనిమిషం పరిశీలించాడు దాన్ని.
    చక్రాలకి లోపల బిగించివున్న చిన్న చట్రాలలో బ్రేక్ డ్రమ్ము లమర్చబడి వున్నాయి. ఆ డ్రమ్ముల లోపల 'లైనర్స్' వుంటాయని తెలుసు అతనికి. స్టీరింగ్ వీల్ క్రింద వుండే క్లచ్, ఆక్సిలేటర్, బ్రేక్ పెడల్ కి సరిగ్గా క్రింద చిన్న 'బ్రేక్ ఆయిల్ టాంక్' వుంది. దాన్నుండి నాలుగువైపుల ద్వారా చక్రాలకి ఆయిల్ సర్క్యులేట్ అవుతుంది బ్రేక్ నొక్కినప్పుడల్లా.
    అది లైన్సర్ చేరి చక్రాల్ని నెమ్మది పరచి ఆపుతూ ఉంటుంది.
    జేబులోంచి చిన్న స్పానర్ తీసి చూసుకున్నాడు సాగర్. సరిపోయిందది. నెమ్మదిగా ఆయిల్ పైపులకున్న బోల్ట్ లు లూజ్ చేయసాగాడు, అలా డెబ్బై శాతం లూజ్ కాగానే వడివడిగా బయటికి నడిచాడు. మొహంనిండా నూనె మరకలు అయినట్లున్నాయ్! కర్చీఫ్ తో తుడుచుకున్నాడు వెంటనే. స్కూటర్ స్టార్ట్ చేశాడు.
    సరిగ్గా అదే సమయానికి బంగళా లోపలి పరిస్థితి గంభీరంగా వుంది.
    ఎస్టిమేట్ పూర్తిగా పరిశీలించాక ఎట్టి పరిస్థితిలోనూ సబ్ మిట్ చేసిన ఎస్టిమేట్స్ లోపల కన్సట్రక్షన్ పూర్తి చెయ్యలేరని తేల్చాడు సివిల్ ఇంజనీర్ చౌదరి. దాంతో చాలా తీవ్రంగా ఆలోచించాడు భరద్వాజ. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చేయిజారిపోనివ్వడం ఆయనకి ససేమిరా ఇష్టంలేదు. ఎలాగయినా సరే వాళ్ళచేత ఎస్టిమేట్స్ మార్పించి బాలెన్స్ సోర్సెస్ ఎవిడెన్స్ సంపాదించాలి. ఏది ఏమైనా.. రేపుప్రొద్దున్న మూర్తి సేకరించిన వివరాలు స్టడీ చేశాకగానీ చెప్పలేం.
    "ఓ.కే! ఈ విషయం ఇక ప్రక్కనుంచుదాం. రేపు డీటెయిల్స్ అన్నీ స్టడీ చేశాక డిసైడ్ చేద్దాం. ఈలోగా మళ్ళీ ఒకసారి కంపెనీ స్టేటస్ డిస్కస్ చేస్తే మంచిది." అని శ్రీధరంవైపు చూశాడు భరద్వాజ.
    దాదాపు ఆరు నిమిషాల పాటు తన ఎదురుగా వున్న, ప్రొద్దున్న వచ్చిన వ్యక్తి పంపినవారి కంపెనీ లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలను ఎనలైజ్ చేసి కంపెనీ స్థితిగతులను విశదీకరించాడు శ్రీధరం. సమయం ఆరుగంటల పదిహేను నిమిషాలయ్యింది. లేచాడు భరద్వాజ.
    "ఓ.కే! ఫ్రెండ్స్_లెటస్ డిస్పర్స్ ఫర్ ది డే."
    చౌదరి లేచాడు.
    శృతి వచ్చిందక్కడికి.
    "అయిపోయిందా అంకుల్ డిస్కషన్?"
    "అయ్యిందమ్మా...." ఒళ్ళు విరుచుకున్నాడు భరద్వాజ. "నా సిగార్ కేస్ ఇలా పట్రామ్మా. క్లబ్ కి టైం అవుతోంది."
    "అంకుల్! ఈ రోజు నేను కూడా వస్తాను క్లబ్ కి."
    ఆశ్చర్యంగా చూశాడామెవైపు భరద్వాజ. దాదాపు పది సంవత్సరాలుగా ఎప్పుడూ క్లబ్ పట్ల అంతగా ఇంటరెస్ట్ తీసుకోని శృతి తనకై తానుగా క్లబ్ కి వస్తాననడం అతనికి ఆశ్చర్యం కలిగించింది.
    "వాటె ప్లెజెంట్ సర్ ప్రైజ్! సరే తయారవ్వు మరి...." అన్నాడు తను.
    కాని శృతి కేవలం తనని ఆరున్నర వరకూ ఇంట్లోనే ఆపే ప్రయత్నం చేస్తుందని అతనికి తెలీదు.
    శృతి లోపలికి వెళ్ళిపోయింది.
    "మరి నేను వెళ్ళొస్తాను" శ్రీధరం కూడా లేచాడు.
    "ఆగు! నే వెళుతూ డ్రాప్ చేస్తాలే! కూర్చోవోయ్ చౌదరీ. నేను డ్రాప్ చేస్తానులే."

 Previous Page Next Page