Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 10


    మళ్ళీ కూర్చున్నారు శ్రీధరం, చౌదరి.
    అయిదు నిమిషాలు గడిచాయి. సమయం ఆరుగంటల ముప్పై నిముషాలయ్యింది.
    శృతి బయటకొచ్చింది. వస్తూ కాస్త తూలి, తలుపు కానుకొని నిలబడిపోయింది.
    "ఏమిటమ్మా? ఏవఁయ్యింది?" కంగారుగా అడిగాడు భరద్వాజ.
    "ఏమీ లేదంకుల్. కళ్ళు తిరుగుతున్నాయి."
    "అయితే రెస్ట్ తీసుకోమ్మా. ఈ రోజొద్దులే."
    "సారీ అంకుల్!"
    ఆమె దగ్గరగా వెళ్ళి తలమీద చేయివేసి అన్నాడు భరద్వాజ__ "గాడ్ బ్లెస్ యూ...."
    శ్రీధరం, చౌదరీ కూడా ఆయనతో లేచి నిల్చున్నారు.
    అప్పటికి సరిగ్గా ఆరుగంటల నలభయ్ నిమిషాలయింది. అక్కడ ఆ బంగళాకి ఓ మైలు దూరాన వున్న హోటల్ లో కూర్చుని కాఫీ తాగుతూ వాచీ చూసుకున్నాడు సాగర్.
    ఈ పాటికి భరద్వాజ కారులో కూర్చుని వుంటారు. స్టార్ట్ చేశారా? కారు బయల్దేరిందా? చెయ్యి సన్నగా వణికింది సాగర్ కి. ఈ రోజుతో తన సమస్యలన్నీ తీరిపోతాయి. కోట్ల ఆస్థితో తనూ, శృతీ స్వర్గాల్ని ఏలవచ్చు. కోట్ల ఆస్థి....కోట్ల ఆస్థి....ఉన్నట్టుండి సాగర్ గుండె లయ తప్పింది.
    ఆస్థి....ఆస్థి....అవునూ....అసలు భరద్వాజ విల్లు రాశారా? రాస్తే ఎవరికి రాశారు? ఒకవేళ రాయకపోతే ఆస్థి శృతికి దక్కుతుందా? దక్కుతుందా? శృతి లీగల్ హెయిరేనా? ఇన్ని ఆలోచనతో అతని బుర్ర వేడెక్కింది. ఇవేవీ తెలుసుకోకుండా తను తొందరపడ్డాడు. ఇప్పుడు ఎదురుదెబ్బ కొడితే? మళ్ళీ వాచీ చూసుకున్నాడు సాగర్.
    ఆరూ నలభయ్ అయిదు అయ్యింది. ఇంక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడక్కడ, ఒకవేళ భరద్వాజగారు అనివార్య కారణాల వల్ల ఆగిపోయి వుంటే ఇప్పటికి మించిపోయింది లేదు. ఆయన్నాపాలి. ఎలాగయినా ఆపాలి....హోటల్ బిల్ పేచేసి కౌంటర్ దగ్గరికి పరిగెత్తాడు.
    "ఫోన్ చెయ్యాలండీ!"
    కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఫోన్ జరిపాడు సాగర్ కేసి.
    గబగబా డయల్ చేసాడు. మళ్ళీ యిందాకటి మొగ కంఠమే రెస్పాన్స్ ఇచ్చింది.
    "హల్లో...."
    "హల్లో....శృతి వుందా?"
    "పిలుస్తానుండండి...." అతను ఫోను ప్రక్కన పెట్టినట్టున్నాడు.
    క్షణాలు గడుస్తున్నాయి.... సాగర్ లో టెన్షన్ పెరుగుతోంది.... ఇంక తట్టుకోలేకపోయాడు సాగర్! ఫోన్ పెట్టేసి రెండు రూపాయల నోటొకటి కౌంటర్ పైన పడేసి బయటికి పరిగెత్తాడు. స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా నడిపాడు.
    ఇప్పుడతని ధ్యేయం ఒక్కటే. భరద్వాజని కారెక్కకుండా ఆపాలి....ఆపాలి....ఆపాలి.
    స్కూటర్ వీధి మలుపు తిరిగింది. గేట్ కేసి చూసిన సాగర్ గుండె ఆగినంత పనయ్యింది.
    గేటు బయటకు అప్పుడే వచ్చి వీధి రెండోవైపు తిరిగి వేగంగా దూసుకుపోయింది మారుతీకారు. కారులో యిద్దరున్నట్లు గుర్తించాడు సాగర్.


                                     5


    హాస్పిటల్ ఎప్పటిలాగే హడావుడిగా వుంది. లోకంలోకి వచ్చిన జీవాల్ని చిరునవ్వులతో ఇంటికి తీసుకెళుతున్నవారు కొందరయితే లోకం నుండి నిష్క్రమించిన వారి జ్ఞాపకాల హోరులో హృదయం పగిలేలా రోదిస్తూ హాస్పిటల్ ని వదులుతున్నవారు కొందరు. రెంటికీ మధ్య ఊగిస లాడుతూ ఆతృత, నిర్లిప్తత మధ్య కొందరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 'జీవితం' అనే పదానికి నిదర్శనంగా వుంది హాస్పిటల్.
    ఓ మూలగా నిలబడి వున్నాడు సాగర్. అతని మనసులో కోటి గొంతుకలు ఆర్తనాదం చేస్తున్నాయి. "నువ్వు పాపివి" అని. ఆ హోరుని తొక్కివేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు సాగర్. తను ఏం చేయబోతే ఏం జరిగింది.
    భుజంమీద ఎవరిదో చెయ్యి పడటంతో వెనక్కి తిరిగాడు సాగర్.
    శృతి.
    ఆమె కళ్ళల్లో ఎలాంటి భావమూ లేదు.
    "వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర నాకోసం వెయిట్ చెయ్యి. వస్తా...." అనేసి అక్కడ నుండి వడి_వడిగా నడిచింది.
    భారంగా అడుగులు ముందుకేసాడు సాగర్. ఎదురుగా హృదయ విదారకంగా ఏడుస్తూ చౌదరి సతీమణి దీర్ఘమైన నిట్టూర్పు అప్రయత్నంగా వెలువడింది సాగర్ హృదయపు లోతుల నుండి.
    అక్కడ నుండి నేరుగా స్కూటర్ ని పబ్లిక్ గార్డెన్ కేసి నడిపించాడు. మరో అరగంటలో అతణ్ణి కలుసుకుంది శృతి.
    బ్రాడ్ వే బార్ కమ్ రెస్టారెంట్ కి వెళ్ళారిద్దరూ.
    "ఐ డెస్పరేట్లీ నీడ్ ఎ డ్రింక్ శృతీ" నీరసంగా అన్నాడు సాగర్.
    "హావిట్....?"
    "నువ్వు?"
    "నో! థాంక్స్"
    స్టూవర్టు రాగానే ఓ డబుల్ విస్కీ సోడా ఆర్డర్ చేసాడు తనకి. కూల్ డ్రింక్ ఒకటి చెప్పాడు శృతి కోసం.
    చాలాసేపు మౌనంగా వుండిపోయారిద్దరూ. విస్కీ మొదటి రౌండ్ పూర్తిచేసి మరో డబుల్ తెప్పించుకున్నాక సిగరెట్ అంటించి సాగరే నాంది పలికాడు సంభాషణకి....
    "పాపం చౌదరి...."
    "అవును!"
    "నావల్లే జరిగిందంతా"
    "అలా అని ఎందుకనుకుంటున్నావ్?"
    "మనం ఒకటి అనుకున్నాం. అతని అదృష్టం బాగోలేక అతను దొరికిపోయాడు. అది నీవల్ల ఎందుకవుతుంది?"
    ఏమీ మాట్లాడలేదు సాగర్.
    "భయపడుతున్నావా సాగర్?"
    ఆ గొంతులో ఏవుందోగాని ఆ మాట తాకవలసిన చోటే తాకింది సాగర్ ని.
    "చూడు! జరిగిందేదో జరిగింది. ఇకనుండి ఏ అడుగువేసినా క్షుణ్ణంగా చర్చించి పూర్తిగా పకడ్బందీగా చేద్దాం....ఏం?"
    రెండో రౌండ్ లో సగం గ్లాసు పూర్తయింది సాగర్ కి. అతని మెదడు మళ్ళీ ఎప్పటిలా పుంజుకోసాగింది.
    "శ్రీధరం పరిస్థితి ఎలా వుంది?" మరో సిగరెట్ అంటించుకొని ప్రశ్నించాడు.
    "ఇంకా స్పృహలోకి రాలేదు"

 Previous Page Next Page