Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 8


    వాష్ బేసిన్ లో మొహం కడుక్కుని తలెత్తి అద్దంలోకి చూశాడు సాగర్. అద్దంలోని వ్యక్తి కళ్ళల్లో ఎర్రటి చారికలు.... పెదాలపైన విషపు నవ్వు.... నుదుటిపైన పుట్టుమచ్చ చిన్నగా అదురుతోంది. ఆశ్చర్యంగా అద్దంలోకి చూస్తున్నాడు సాగర్. అద్దంలోని వ్యక్తి క్రమంగా రెండు చేతులూ పైకెత్తాడు. అతని చేతిలో నల్లగా నిగనిగలాడుతోంది పిస్టల్. ఆ పిస్టల్ బారెల్ పైన నిల్చుని గంభీరంగా గది ప్రతిధ్వనించేలా అంటోంది ఊహలోంచి ఉబికిన శృతి....
    "మనమే ఆయన్ని చంపేద్దాం.... మనమే ఆయన్ని చంపేద్దాం."


                                     4


    అవతలివేపు ఫోన్ రింగ్ అవుతోంది. అయిదు సార్లు.... ఆరు.... ఏడూ.... ఎనిమిది.... తొమ్మిదవసారి రింగ్ అవుతూండగా తీశారెవరో ఫోన్,
    "హలో" ఎవరిదో మగగొంతు.
    టక్కున ఫోన్ పెట్టేసాడు సాగర్. అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తుంది. దాదాపు గంట క్రితమే అతనో నిర్ణయానికి వచ్చి వున్నాడు శృతి కోసం శృతిని పొందడం కోసం తను ఏమైనా చెయ్యాలనే నిర్ణయం అది. ఈ నిర్ణయానికి అతను రావడానికి అతనికి చాలా సమయం పట్టింది. ఎంతో ఘర్షణని ఎదుర్కొన్నాడు. పైగా ఇది మామూలు విషయం కాదు. ఏకంగా ఒక మనిషినే చంపేయడమంటే....శృతి పట్ల ఉన్న కృతజ్ఞతాభావం, ప్రేమలకి తోడు ఎక్కడో అతని హృదయం మారుమూలల్లో తను ఈ పనిచేస్తే తన కైవసం అయ్యే కోట్ల ఆస్తికూడా అతడ్ని ఉత్సాహపరచిందనే చెప్పాలి. కారణం గత జీవితంలో అనుభవించిన కష్టాలు కావచ్చు.... మరోటి కావచ్చు. అతను మాత్రం ఒక దృఢనిశ్చయానికి వచ్చి వున్నాడు.
    తను నిర్ణయం తీసుకోగానే ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు సాగర్. వెంటనే తను రంగంలోకి దూకాలి....కాని ఎలా? తనేమైనా వృత్తిరీత్యా హంతకుడా? పైగా రక్తం చూస్తేనే భయపడేలా పెరిగిన తను....
    అతనికి పదే పదే శృతి చెప్పిన విషయం జ్ఞాపకం వస్తోంది.
    "ఈ రోజు బుధవారం. సాయంత్రం ఆయన క్లబ్ కెళతారు."
    అవును....ఇదో అవకాశం కావచ్చు. కారు ఆయన స్వయంగా నడుపుతారు. ఏ బ్రేకో ఐకేస్తే....అవునూ.... బ్రేకుల్లేక దేనికయినా గుద్ది ఏ కాలో చెయ్యో విరిగి బయటపడితే!!! పోతే పోయింది. మరో ప్రయత్నం గురించి అప్పుడాలోచించవచ్చు. కాని ఈ ప్రయత్నం చెయ్యడంలో తప్పేమీ లేదుగా! నిర్ణయం తీసుకున్నాక అతని మెదడుకి ఉత్సాహం వచ్చింది. ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యాలి. ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇంతా చేసి దొరికిపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది.
    కుర్చీ వెనక్కివాలి బెల్ నొక్కాడు సాగర్.
    స్వింగ్ డోర్ తెరచుకుని ఆఫీస్ బాయ్ వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు.
    "వెళ్ళి అర్జెంటుగా ఓ టీ తే" వెళ్ళిపోయాడు ఆఫీసు బోయ్.
    ఇంటర్ కమ్ మ్రోగింది. తీశాడు సాగర్.
    "సర్....మీరు ప్రొద్దున్న ఇచ్చిన లెటర్స్ అన్నీ రెడీ అయ్యాయి. సైన్ చేస్తారా?" సెక్రటరీ అడిగింది.
    "ఈరోజే డిస్పాచ్ కావలసినవి ఏవైనా ఉన్నాయా?"
    "ఒకటుంది. షమ్సేర్ సింగ్ ఎండ్ సన్స్ కి రాసిన క్లారిఫికేషన్ లెటర్."
    "అది నేనే సైన్ చెయ్యాల్సిన అవసరం లేదులే. థామస్ చేతగాని, స్వామినాథన్ చేతగాని ఫర్ సిగ్నేచర్ తీసుకుని పంపెయ్యండి."
    "ఓ.కే. సర్....మిగిలినవి"
    "మిగిలినవి పంపండి. టైం చూసుకుని సైన్ చేస్తాను."
    "ఎనీమోర్ లెటర్స్ సర్?"
    "లేవు."
    లెటర్స్ అన్నీ చక్కగా ఫైల్లో అమర్చి తెచ్చి టేబుల్ పైన ఉంచింది సాగర్ సెక్రటరీ సునంద.
    "సర్. ఫైవ్ కావస్తుంది. నేను....వెళ్ళొచ్చా?"
    అప్పుడు గుర్తొచ్చింది సాగర్ కి సునంద ఫోర్ థర్టీకే వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుందని.
    "సరే...."
    ఆమె అటు వెళ్ళగానే టీ వచ్చింది. దాన్నలాగే వుంచి మళ్ళీ ఫోన్ డయల్ చేశాడు సాగర్. ఈసారి వెంటనే తీశారెవరో ఫోన్.
    "హలో...." మళ్ళీ అదే మగగొంతు. వెంటనే డిస్కనెక్ట్ చేద్దామన్న కోరికను అతి బలవంతంగా ఆపుకొని.
    "హలో....శృతిగారు ఉన్నారా?" అన్నాడు సాగర్.
    "లేరండీ....ఎవరండీ మాట్లాడుతున్నారు?" సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు సాగర్.
    ఇప్పుడు సమయం అయిదు దాటుతుంది. ఆయన సరిగ్గా ఎప్పుడు క్లబ్ కి వెళతారో తెలీదు తనకి. అసలు దానికంటూ ఓ టైం ఉందో లేదో కూడా తెలియదు. బుధ, ఆది వారాలలో మాత్రం తప్పకుండా వెళతారని తెలుసు. మళ్ళీ ఫోన్ పైన చేయివేసి అలాగే కాసేపుండిపోయాడు. తరువాత ఎడంచేత్తో టీ కప్పు అందుకుని నెమ్మదిగా సిప్ చేయసాగాడు. కుడి చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తి చెవికి ఆన్చుకుని, భుజాన్ని కాస్త పైకెత్తి అది పడిపోకుండా ఎడ్జెస్ట్ చేసుకున్నాడు. తరువాత కుడి చేత్తోనే డయల్ చేశాడు అవతలి వైపు ఫోన్ నాలుగు సార్లు మ్రోగాక ఎత్తారు. మళ్ళీ ఇందాకటి కంఠాన్నే ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు సాగర్. కాని అవతలి కంఠం శృతిది.
    "హలో...."
    సాగర్ గుండె వేగంగా కొట్టుకుంటోంది.
    "హలో....శృతీ?"
    "అవును....చెప్పు?" శృతి తన గొంతు గుర్తించిందని గ్రహించాడు.
    "ఐ హావ్ డిసైడెడ్."
    "మైగాడ్!"
    అర్థం కాలేదు సాగర్ కి. "ప్రక్కనున్నారా?"
    "ఉన్నారు."
    "ఏం చేస్తున్నారు?"
    "నాకు ఫైనాన్స్ గురించిన కంట్రోల్, సివిల్ ఇంజనీరింగూ అసలు తెలియవు. అదీగాక మీటింగంటే మాటలా?"
    ఆమె ఏం చెపుతోందో వెంటనే అర్థం కాలేదు సాగర్ కి. రెండు క్షణాలు.... మూడు.... నాలుగు.... అర్థమయ్యేటట్లు చెప్పవచ్చుగా.... అదే అందామని నోరు తెరచి టక్కున ఆగిపోయాడు. అదన్నమాట సంగతి. తన పక్కనే ఉన్నట్టున్నారెవరో. దాంతో కోడెడ్ పద్ధతిలో చెప్పింది. సాగర్ బుర్ర చురుగ్గా పనిచేసింది. ఏమిటి? ఏమిటది? నిమిషం తరువాత అర్థమయ్యింది.

 Previous Page Next Page