Previous Page Next Page 
ఆత్మబలి పేజి 9


    "ఈ ప్రళయానికంతకూ మూలమేవిఁటి? అన్నట్లు ఆ నుదుటి మీద దెబ్బేవిఁటి?" దెబ్బ పరిశీలించడానికి రావు దగ్గరగా వచ్చాడు. కేశవ చటుక్కున వెనక్కు తగ్గాడు. "అదొక ప్రేమ కానుక. అలా ఉండనియ్యి."
    రావు పకపక నవ్వాడు. "ఓహో! అయితే ఈ ప్రళయానికంతకూ ప్రణయం కారణమన్నమాట! ఏదీ, కథ వినిపించు."
    "వినిపించేందుకేమీ లేదు. మొదలూ తుదీకూడా ఇదే!" నుదుటిమీద గాయాన్ని చూపిస్తూ అన్నాడు.
    "అసలెవరు? ఏవిఁటి?"
    "పేరు ఉమ. రిటైర్డు తహశీల్దారుట వాళ్ళ తండ్రి! ఒకరోజు చింతలపూడి రోడ్డుమీద పుస్తకాలు పుచ్చుకుని నడుస్తూ కనిపించింది. చింతలపూడినుంచి వచ్చి ఏలూరులో చదువుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాని వాళ్ళందరూ హాస్టల్లోనయినా ఉంటారు, బస్ లోనయినా వస్తారు. ఇలా నడిచి వెళ్ళటం వింతగా అనిపించి పరిశీలనగా చూశాను. సాధారణమైన అలంకరణ వల్ల మొదట సామాన్యంగా అనిపించినా, ఆమె కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ ముఖంలో ఏదో ప్రశాంత దృఢత్వం కనిపించింది. ఆమెను చూసినవారికి అభిమానమూ, గౌరవమూ ఒకేసారి కలుగుతాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజూ, కావాలనే అదే సమయంలో వచ్చేవాడిని. ఆమె కలిసేది. మా చూపులు కలుసుకునేవి. క్రమంగా ఇదొక అలవాటయిపోయింది నాకు. ఆమె చూపులలోనూ ప్రసన్నత కనిపించింది నాకు. ఆమె తీరు నన్నమితంగా ఆకర్షించింది. ఆమె అంగీకరిస్తే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. సాహసించి ఒకరోజున పలకరించాను. ఎంతో ఆదరంగా మాట్లాడింది. వాళ్ళ కుటుంబ విషయాలన్నీ కూడా చెప్పింది. మరునాడు సాహసించి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాను. ఎందుకో గాభరాపడింది. ఏ సమాధానమూ చెప్పక తలవంచుకొని వెళ్ళిపోయింది. ఆమె నాతో రోడ్డుమీద మాట్లాడటానికి సంకోచపడుతుందనుకొని, వివరంగా అన్నీ వ్రాసి ఉత్తరం చేతికియ్యబోతే చింపి నా ముఖంమీద కొట్టి నన్ను తోసేసింది. మైలురాయి మీద పడ్డాను. అదే ఈ దెబ్బ! పొరపడ్డాను. ఆమెకు నేనంటే ఇష్టంలేదులా ఉంది."
    రావు సావకాశంగా విన్నాడు.
    "నువ్వు తొందరపడ్తున్నావేమో! నువ్వు కొంత పరిచయం పెంచుకొని, నిన్నామె పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశమియ్యకుండానే నాటకంలో లాగా 'నిన్ను ప్రేమిస్తున్నాను' అనేసరికి రౌడీవనుకొని గాభరాపడిపోయిందేమో?"
    కేశవ కూడా ఆలోచనలో పడ్డాడు. "కావచ్చు. కాని నామీద ఏ కొంచెం అభిమానమున్నా, నన్నలా రాతిమీదకు తోసెయ్యగలదా? నా నుదురు తనవల్ల చిట్లి రక్తం చిమ్ముతూంటే, 'అయ్యో!' అనైనా అనుకోకుండా వెళ్ళిపోగలదా? కొంతదూరం వెళ్ళాకైనా ఎలా ఉన్నానో అని వెనక్కు తిరిగి చూడలేదు."
    రావు మాట్లాడలేకపోయాడు. నిజమే! ప్రేమించిన యువతి మనసులో పంతాలు, సంకోచాలూ ఎన్నైనా ఉండచ్చు కాని ప్రియుడి రక్తాన్ని కళ్ళజూడగలిగే కాఠిన్యం మాత్రం అసంభవం.
    కేశవ వంక చూశాడు. అందమైన ముఖం, మంచి విగ్రహం. చదువూ, ఐశ్వర్యమూ కూడా ఉన్న ఇలాంటి యువకుని కాలదాన్నుకున్న ఆ నిర్భాగ్యురాలెవరో?
    తానెరుగని ఆ వ్యక్తిమీద జాలీ, కోపమూ రెండూ కలిగాయి రావుకు.
    "ఇది మరిచిపో! దీనినే మననం చేసుకుంటూ కూర్చోక! ఏముందని?" ధైర్యం చెపుతున్నట్లుగా అన్నాడు రావు.
    "మరిచిపోదామనే అంతదూరం పోతున్నాను. ఇక్కడుంటే, ఆమెను చూడాలనే కోర్కెను అణచుకోలేను. ఎన్నడూ, ఎవ్వరితోనూ చిన్నమాట పడని నేను తిరిగి అవమానాన్నెదుర్కోలేను. మరచిపోగలిగితే అదృష్టవంతుణ్ణి."
    రావుకు చాలా జాలి కలిగింది. ప్రతి చిన్న విషయానికి మనసారా కదిలిపోయే స్వభావం కేశవది. ఈ సంఘటన అతని మనసులోంచి త్వరలో చెదిరిపోతే బాగుండునని కోరుకున్నాడు.
    "రాత్రి ట్రెయిన్ లో వెళతానన్నయ్యా!"
    "పిన్ని?"
    "ముఖ్యంగా అది చెప్పడానికే వచ్చాను. నేనక్కడ కొంత స్థిరపడేదాకా అమ్మ నీదగ్గరుంటుంది."
    "పిన్ని కొంతకాలం నా దగ్గరుండటం నా అదృష్టం. కాని దీనికంతకూ పిన్ని ఒప్పుకుందా?"
    "ఒక్క నన్ను విడిచి ఉండటానికి తప్ప, మరిదేనికీ అభ్యంతరం లేదమ్మకు. కొద్దిరోజుల్లోనే నేను వచ్చి తీసికెళ్తానని చెప్పాక కష్టంమీద ఇక్కడుండటానికి ఒప్పుకుంది."
    రావు భారంగా నిట్టూర్చాడు. కేశవ అతనికి పినతల్లి కొడుకైనా, స్వంత తమ్ముడి కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడతడు దూరమవుతున్నాడంటే ఎంతో బాధగా ఉంది.
    రావు తల్లి చనిపోయి ఆరేళ్ళవుతుంది. తల్లి చనిపోయిన రెండు సంవత్సరాలకే తండ్రి కూడా మరణించాడు. అప్పటినుండి పినతల్లి సత్యవతీదేవే అతనికి అయినవాళ్ళలో మిగిలింది. ఆవిడ తన దగ్గర ఉండటానికి ఒప్పుకోవటం చాలా సంతోషం కలిగించింది రావుకు. "ట్రెయిన్ ఎన్ని గంటలకు?"
    "ఎనిమిదిన్నరా ఆ ప్రాంతాలకు."
    "సరే. అయితే, నేనూ ఇప్పుడే నీతోవచ్చి పిన్నిని ఇక్కడికి తీసుకొస్తాను."
    "నీ హాస్పిటల్..."
    "ఒక్కరోజుకి ఫరవాలేదులే!"
    అప్పటికప్పుడు కేశవతో బయలుదేరాడు రావు.


                                       8


    "మీకోసం నిన్న ఎంతసేపో ఎదురుచూసి విసిగిపోయాను. మొన్నంతా మీకోసం కాచుకుని కాచుకొని అలిసిపోయాను.
    "మొన్న నాకు అత్యవసరమైన పనుండి రాలేకపోయాను. నిన్న నాకు అనివార్యమైన పని ఉండి రాలేకపోయాను."
    "కొంపదీసి మీపనీ నాపనిలాంటిదే నేవిఁటీ?"
    "ఎంతమాత్రం కాదు."
    శోభ పకపక నవ్వింది. "నాపనేమిఁటో మీకెలా తెలుసు?"
    "మీ మాటలలో దొర్లిన 'కొంపదీసి' అన్న పదమూ, కళ్ళలో కదిలిన అసహనభావమూ చెప్పేశాయిలెండి. పెళ్ళివారు వచ్చారా?"
    సిగ్గుతో శోభ ముఖం కందిపోయింది. తలదించుకొంది.

 Previous Page Next Page