Previous Page Next Page 
ఆత్మబలి పేజి 8


    "పిల్ల నచ్చితే చాలట!"
    శోభ తలవంచుకుంది. ఇప్పుడన్నగారి కేమని సమాధానం చెప్పాలి? రావు మనసులో మెదిలాడు. అతనిలో తనను చేపట్టేంత ఔదార్యం ఉందా? రాక రాక వచ్చిన ఈ అనుకూలమైన సంబంధాన్ని కాలదన్నుకుంటే, ఈ జన్మలో తనకిక పెళ్ళవుతుందా? కాకపోతేనేం? తన మనసులో రావు తిష్ట వేసుకు కూర్చున్నాడు. మరొకరితో తను సుఖపడగలదా? అలాగని రావునే ఆరాధిస్తూ జీవితాంతం అవివాహితగా గడపగలిగే మనోనిబ్బరం తనకుందా?
    ఏదీ నిశ్చయించుకోలేకపోయింది శోభ.
    "సాయంత్రం త్వరగా వస్తావు కదూ!"
    ఆలోచిస్తున్న శోభను హెచ్చరించాడు ప్రభాకరం. తల ఊపింది శోభ. ఆఫీసులో కూడా ఆలోచిస్తూనే ఉంది.
    ఏదీ తేల్చుకోలేకపోయింది. 'పోనీ చూసినంతమాత్రంలో ఏమవుతుంది? పెళ్ళి స్థిరపడటానికి ఇంకా చాలా కావాలి కదా! ఈ లోపుగా తనొక నిశ్చయానికి రావచ్చు' అనుకుంది.
    నేరుగా ఇంటికి వచ్చి స్నానం చేసి మిల్లుచీర కట్టుకుంది. తన పెళ్ళిచీర తియ్యబోయిన పార్వతిమీద విసుక్కొంది. ఏవో గిల్టు నగలు పెట్టుకోమన్న కామాక్షమ్మమీద విసుక్కుంది.
    పెళ్ళివారు వచ్చారు. ప్రభాకరం సంభ్రమంగా ఎదురెళ్ళాడు. శోభకు చాలా చికాకుగా ఉంది. ఎవరిమీదో, ఎందుకో తెలియని కసి.
    "శోభా! కాఫీ తీసుకురామ్మా!" ఎన్నడూ లేనంత ప్రేమగా పిలిచాడు ప్రభాకరం. ట్రేలో కాఫీ కప్పు లుంచుకుని తీసికెళ్ళింది.
    శోభ ట్రే బల్లమీదుంచి దూరంగా చాపమీద కూర్చుని వచ్చినవారిని నిర్భయంగా చూసింది. వాళ్ళూ శోభనే చూస్తున్నారు.
    యాభై యేళ్ళున్న ఒక ముసలాయన, ఒక నడివయసావిడ, ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ యిద్దరిలో పెళ్ళికొడుకెవరో అర్థం కాలేదు శోభకు. అదేదో కథలోలాగా, ఒకరు నచ్చటం, మరొకరు పెళ్ళికొడుకు కావటం జరగదుకద! తన ఆలోచనకు లోలోనే నవ్వుకొంది. ఆ ప్రమాదం లేదు. తనకు నచ్చేవాళ్ళక్కడెవరూ లేరు.
    ఆ ఇద్దరు యువకులనూ చూసింది. ఒకతను సాధారణమైన ధోవతిలో ఉన్నాడు. ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరొకతను ఫుల్ సూట్ లో ఉన్నాడు. నల్లద్దాల కళ్ళజోడు వల్ల కళ్ళు తెలియటం లేదు. ముక్కు బాగానే ఉంది. పళ్ళు బాగా ఎత్తు. వేషాన్ని బట్టి పెళ్ళికొడుకు అతనేనేమో? ధోవతి కట్టుకున్న యువకుడు తెలివైనవాడులా ఉన్నాడు. శోభ అనుమానం కనిపెట్టి, ఫుల్ సూట్ లో ఉన్న యువకుడి భుజం తట్టి "మౌనంగా కూర్చున్నావేమిటోయ్! ఏదైనా పలకరించు" అన్నాడు.
    శోభ అనుమానమే నిజమయింది.
    ఫుల్ సూట్ లో ఉన్న యువకుడు వయ్యారంగా కదిలి "పో!" అన్నాడు పళ్ళు కనిపించేలా నవ్వి.
    శోభకు ఒళ్ళంతా జలదరించింది. సాయంత్రం ఆరుగంటల వేళ అతను ధరించిన నల్లద్దాల కళ్ళజోడు వల్ల అతని కళ్ళలో కదిలే భావాలు తెలియటం లేదు. ఉండబట్టలేక "మీరు అన్నివేళలా నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుంటారా?" అంది. ఆ ప్రశ్నకూ ఆ చొరవకూ అందరూ గతుక్కుమన్నారు.
    ఆ పెద్దావిడ తడబడింది. ముసలాయన ఏదో అనబోయి ఆగిపోయాడు. ప్రభాకరం కోపంగా చెల్లెలివంక చూశాడు. ధోవతి కట్టుకున్న యువకుడు కొంచెం ఆగి, గొంతు సర్దుకుని, "నాలుగేళ్ళ క్రిందట ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక కంటికి చూపు కొంచెం మందగించింది. అప్పటినుండీ ఎప్పుడూ గాగుల్స్ వాడుతున్నాడు" అన్నాడు.
    శోభకు వంక దొరికింది. చివాలున లేచిపోయింది. గుండెల నుంచి పెద్ద బరువు దింపినట్లయి మంచంమీద వాలిపోయి హాయిగా నవ్వుకుంది.
    చాలాసేపటికి ప్రభాకరం శోభ దగ్గరకొచ్చాడు.
    "క్షమించు శోభా! నాక్కూడా ఈ సంగతి ముందు తెలీదు." బ్రతిమాలుకుంటున్నట్లు అన్నాడు.
    "ఫర్వాలేదన్నయ్యా! నీ తప్పేముందీ?" నవ్వుతూ అంది శోభ.
    శోభ నవ్వు ముఖం చూసేసరికి ప్రభాకరానికి ధైర్యం వచ్చింది.
    "ఆలోచించు శోభా! ఒక కన్నే కాస్త కనపడదు. దృష్టికి లోపం లేదుగదా! అన్నీ ఉన్న సంబంధం...."
    మధ్యలోనే అడ్డు తగిలింది శోభ. "నిజమే అన్నయ్యా! నాకూ ఏ చెముడో, ఏ సొట్టో ఉంటే, కనీసం అందవికారి అయితే అలాగే సరిపెట్టుకుందును. నీకు పుణ్యముంటుందన్నయ్యా! ఇంక మీద నాకు సంబంధాలు తేకు. నా పెళ్ళి నేనే చేసుకుంటాను."
    "నువ్వే చేసుకుంటావా?..అంటే...?" ఆశ్చర్యమూ, అనుమానమూ మేళవించి అడిగాడు ప్రభాకర్.
    "అంటే ఏం లేదు. నా పెళ్ళి దానంతట అది అయితే అవుతుంది. లేకపోతే ఇలాగే ఉండిపోతాను; ఉండిపోగలను."
    ఒక నిర్ణయానికి వచ్చేసింది శోభ.
    తలవంచుకుని వెళ్ళిపోయాడు ప్రభాకరం.


                                                                  7


    వేళకాని వేళలో వచ్చిన కేశవనుచూసి ఆశ్చర్యపోయాడు రావు.
    "కూర్చో కేశవా! ఇలా హాస్పిటల్ కు వచ్చావేం? ఇంటికి రాక."
    "నేను వెళ్ళిపోతున్నానన్నయ్యా! చెప్పడానికి వచ్చాను."
    తల వంచుకొని అన్నాడు కేశవ.
    రావు ఆశ్చర్యానికి అంతులేదు.
    "వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకు? చదువు...."
    "చదువు మానేస్తున్నాను. వ్యాపారం ప్రారంభించబోతున్నాను. హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ గూడ్స్ బిజినెస్ ప్రారంభిస్తాను."
    "ఇదేం పిచ్చి? వ్యాపారానికి పెట్టుబడి?"
    "ఆస్తి అమ్మేస్తాను."
    "నీకు నిజంగా మతిపోయింది. చదువు మానేస్తావా? ఉన్న ఆస్తి కొంచెమూ అమ్మేసి వ్యాపారంలో దిగుతావా? లాభమే వస్తుందని నమ్మకమేవిఁటి?"
    "వ్యాపారంలో బాగా అనుభవమున్న మాఁవయ్య సహాయం కోరతాను. ఆపైన నా అదృష్టం!"
    రావు అతనివంక వింతగా చూశాడు.

 Previous Page Next Page