Previous Page Next Page 
ఆత్మబలి పేజి 10


    "నా ఊహ కరెక్టే నన్నమాట! ఇంతకూ ఏం జరిగిందండీ! తాంబూలాలు పుచ్చేసుకున్నారా?"
    "ఆ!"
    "ఆహా! పెళ్ళికొడుకు బాగున్నాడా?"
    మీకంటే బాగున్నాడు."
    "రామ! రామ! నాతో పోలికేవిఁటండీ! మీకు ప్రమాణం నేనా?"
    శోభ కోపం నటిస్తూ, కనుబొమ్మలు ముడిచి "ఏవిఁటండీ ఈ వేళాకోళాలు?" అంది.
    "వేళాకోళం నాదా? ఏం జరిగిందో చెప్పకుండా వేళాకోళంలోకి దింపింది మీరుకాదూ!"
    "చెప్పడానికేముందీ! ఇకమీద నాకు సంబంధాలు తేవద్దని అన్నయ్యతో చెప్పేశాను. అంతే జరిగింది."
    "గుడ్! అంటే మీకు కావల్సిన సంబంధం మీ దృష్టిలోనే ఉందన్నమాట! ఆ అదృష్టవంతుడెవరో తెలుసుకోవచ్చా?"
    "అదృష్టవంతుడనే అనుకుంటున్నారా?"
    "నిస్సందేహంగా! ఈ అందాలరాశిని, విద్యావతిని, చురుకుతనం, చిలిపితనం తొణికిసలాడే చైతన్యమూర్తిని చేపట్టగలగటం ఎంతటి అదృష్టం? ఇంతకూ ఎవరా భాగ్యశాలి?" శోభ పెదవులు కదిలి మాటలు బయటకు రాలేకపోయాయి. నల్లని కాటుక కళ్ళలో దోబూచులాడిన మెరుపులు పచ్చని చెక్కిళ్ళలో రాగరేఖల్ని ప్రకాశమానం చేశాయి. ఆ మోహనమూర్తిని చూస్తూ కూర్చున్నాడు రావు.
    "నేను చెప్పక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది." అంది శోభ మెల్లిగా.
    "మీకివాళ వేరేపనులు లేకపోతే, మా ఇంటికొకసారి రాగలరా?" మృదుస్వరాన అడిగాడు రావు.
    "మీరు పిలిస్తే ఎందుకు రానూ?" ఆప్యాయంగా సమాధానమిచ్చింది శోభ.
    షెడ్ లోంచి కారు బయటకు తీశాడు రావు. శోభ వెనుకసీట్లో కూర్చుంది. తన ప్రక్కన కూర్చోమని అడగబోయి, ఆగిపోయాడు రావు.
    విశాలమైన డాబా ఇల్లు. ఇంటిముందు రకరకాల పూలమొక్కలు నిండిన తోట. ఆ ఇంటిని చూసి ఎంతో ఆనందించింది శోభ. ఏదో మధురభావన ఆమెకు గిలిగింతలు పెట్టింది.
    "మీ తోట బాగుంది." అంది.
    "నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు మెడ్రాస్ లో ఉండేవాణ్ని. అక్కడ కూడా మంచి తోట పెంచాను. మీక్కూడా తోట ఇష్టమైనందుకు చాలా సంతోషంగా ఉంది."
    శోభ ముఖంలోకి చూసి కొంటెగా నవ్వాడు రావు. అతని భావం అర్థమయి తలవంచుకుని నవ్వింది శోభ. తోటలో తను తయారుచేయించిన లాన్ లో కుర్చీలు వేయించాడు రావు. కాఫీలు తెప్పించి ఒక కప్పు శోభ కందించి, తానొకటి అందుకున్నాడు.
    కాఫీ త్రాగుతూ "మీకు చిన్నపిల్లలంటే ఇష్టమేనా?" అన్నాడు.
    "పెద్దగా ఇష్టం లేదు. మా పిన్నికి ఆరుగురు పిల్లలు. మా అన్నయ్య కిద్దరు పిల్లలు. ఊహ తెలిసినప్పటినుండీ చిన్నపిల్లల చాకిరితో, గొడవతో విసిగిపోయాను. పెళ్ళయ్యాక నాలుగయిదు సంవత్సరాల వరకూ పిల్ల లొద్దనుకుంటున్నాను."
    రావు ముఖం పాలిపోయింది. అతని చేతిలో కాఫీ కప్పు వణికింది. అంతలో సర్దుకుని, గంభీరంగా "వితంతు వివాహాన్ని గురించి కానీ, పురుషుని పునర్వివాహాన్ని గురించి కానీ మీ అభిప్రాయమేవిఁటీ?" అన్నాడు.
    "భార్యను కోల్పోయిన పురుషుడు భర్తను కోల్పోయిన స్త్రీని చేసుకుంటే సమంజసంగా ఉంటుంది. అలా కాక తానొకసారి సంసార సౌఖ్యాలన్నీ అనుభవించి, కన్యను వివాహమాడాలనుకోవటం అన్యాయం. జీవితాన్ని కొంత చూడటం వల్ల ఉత్సాహం చాలావరకు చల్లారిపోయిన అతనితో నవయవ్వనం పరవళ్ళు తొక్కే కన్నెపిల్ల ఏం సుఖపడగలదు?"
    రావు ముఖం గంభీరంగా మారిపోయింది. అతని ముఖంలోకి చూసిన శోభ కలవరపడుతూ "నా అభిప్రాయాలు మీకు నచ్చినట్లు లేవు కదూ!" అంది.
    "బాగుంది! ఎవరి అభిప్రాయాలు వారివి."
    అతి గంభీరంగా అన్నాడు రావు. అతని ముఖంమీది చిలిపి చిరునవ్వు మాయమయింది. ఆ ముఖం చూసిన శోభ మనసు గాభరాపడిపోయింది. ఆ గాంభీర్యాన్ని ఎలా చెదరగొట్టాలో అర్థం కాలేదు.
    "నేను మాట్లాడిన మాటలకు క్షమించండి." బేలగా అంది.
    "ఛ! క్షమాపణల ప్రసక్తి ఏముంది?" అదే గాంభీర్యంతో అన్నాడు. కొన్ని క్షణాలు భారమైన నిశ్శబ్దంలో గడిచిపోయాయి. ఇంతలో ఆయా చెయ్యి పుచ్చుకొని ఆరేళ్ళపిల్ల అక్కడికి వచ్చింది. వస్తూనే "డాడీ!" అంటూ రావుని చుట్టేసుకుంది. రావు ఆ పాప నెత్తుకుని నివ్వెరపోయి నిలబడిన శోభతో "నా కూతురు ఆశ" అన్నాడు.
    శోభకు క్షణకాలం చైతన్యం నశించినట్లయింది.
    "మీకు శ్రీమతి లేదన్నా..మీ శ్రీమతి..."
    "క్షమించండి. నా శ్రీమతి ఆశ మూడవ ఏటనే చనిపోయింది. అందుకనే నాకు శ్రీమతి లేదని చెప్పాను. ఆనాటి నుండి ఆశే నా జీవితానికి ఆశగా బ్రతుకుతున్నాను."
    "నమస్తే టీచర్!" ఆశ చిన్నారి చేతులు జోడించింది.
    ఆ సంబోధనకు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఇద్దరికీ ఆ సంబోధన సరిదిద్దాలనిపించింది. ఇద్దరికీ ఏం చెప్పాలో తోచలేదు. శోభ యాంత్రికంగా చేతులు జోడించింది.
    "ఆశా! టీచర్ ను వాళ్ళ ఇంటి దగ్గర దింపివద్దామా!" అన్నాడు రావు.
    "ఓయస్. రేపు వస్తారా టీచర్?" ఆశ ముద్దుగా అడిగింది.
    శోభ సమాధానం చెప్పలేక తలవంచుకుంది. రావు ఆశ చెయ్యి పట్టుకుని గేటువైపుకి నడిపిస్తూ "రండి, మీ ఇంటిదగ్గర దింపుతాను." అన్నాడు.
    "అక్కర్లేదు. నేను వెళ్ళగలను" గొణిగింది శోభ.
    "కాదు. ఇంత పొద్దుబోయి ఒంటరిగా వెళ్ళొద్దు. రండి."
    అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ప్రతిమాటా గంభీరంగా ఉంది. అతనితో అల్లరి వేళాకోళాలు చేసే శోభ ఇప్పుడతని ముఖం చూస్తూ 'అవును-కాదు' అని అనలేకపోతుంది. కారు నడుపుతూ స్థిరస్వరాన అన్నాడు రావు.

 Previous Page Next Page